Skip to content Skip to footer

🌹🌹🌹 గరుడ పురాణం 🌹🌹🌹 – పద్నాల్గవ అధ్యాయం

మృత్యుంజయ మంత్ర జప మహిమ

సూతమహర్షి శౌనకాదులకు ప్రసాదిస్తున్న ప్రవచనం ఇలా కొనసాగింది.

“మునులారా! గరుత్మంతుడు కశ్యప మహర్షికి ఉపదేశించిన మృత్యుంజయ మంత్రాదిక విషయాలను వినండి. ఇవి సాధకుని గొప్పగా ఉద్దరిస్తాయి. పుణ్యప్రదానం చేస్తాయి. ఈ మృత్యుంజయ పూజలోనే సర్వదేవమయ పూజ వున్నదని విజ్ఞులు చెప్తారు.

‘ఓం జుం సః’ అనే మూడక్షరాల మంత్రం మృత్యుంజయ మంత్రం. ఇది మృత్యువునూ దారిద్ర్యాన్ని మర్దించే మంత్రం. శివ, విష్ణు, సూర్యాది దేవతలంతా దీన్ని పఠించే వారి పట్ల ప్రసన్నులౌతారు. ‘ఓం జుం సః’ అనే ఈ మహామంత్రాన్ని అమృతేశ నామంతో కూడా వ్యవహరిస్తారు. ఈ మంత్రాన్ని జపించేవారి పాపాలన్నీ నశిస్తాయి. మృత్యువు వలె బాధించు కష్టాలన్నీ దూరమవుతాయి.

ఈ మంత్రాన్ని నూరుమార్లు అనితర ధ్యాన తత్పరతతో జపిస్తే వేదాధ్యయనం వల్ల వచ్చే సుకృతం, యజ్ఞఫలం, తీర్థ స్నాన దాన పుణ్యం లభిస్తాయి. మూడు సంధ్యలలోనూ నూట యెనిమిదేసి మార్లు ఈ మంత్రాన్ని జపించేవారికి అలా జపిస్తున్నంత కాలం మృత్యువు దూరంగానే వుంటుంది. కఠినాతి కఠినములైన విఘ్న బాధలన్నీ తొలగిపోతాయి. శత్రువులపై విజయం లభిస్తుంది.

భగవానుడైన మృత్యుంజయుడు లేదా అమృతేశ్వరుడు శ్వేతకమలంపై కూర్చుని వుంటాడు. ఆయన చతుర్భుజుడు ఒక చేతిని అభయముద్రలో మరొక చేతిని వరద ముద్రలో వుంచి మిగతా రెండు చేతులలో అమృతభాండాన్ని పెట్టుకొని నిత్యం మనను శారీరక మానసిక ప్రాణాంతక బాధల నుండి రక్షించడానికి సిద్ధంగా, సర్వసన్నద్ధుడై వుంటాడు ఈ అమృతేశ్వర దేవుడు. ఆయన వామాంకస్థితయై అమృతభాషిణి అమృతాదేవి నిత్యమూ కొలువుంటుంది. ఆమెను ధ్యానించాలి. ఆమె ఒక చేతిలో కలశాన్నీ మరొక చేతిలో కమలాన్నీ ధరించి వుంటుంది. కలశం కుడిచేతిలో వుండాలి.

ఓం జుం సః అనే ఈ మంత్రం పరమశక్తిప్రదాయకం, అతులిత శాంతిదాయకం కూడ. అమృతాదేవీ సహిత అమృతేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఈ మహా మంత్రాన్ని మూడు సంధ్యలలో జపిస్తూ అలా రోజుకి ఎనిమిదివేల మార్లు ఒక నెలదాకా చేయగలిగిన వారికి జర, మృత్యు, మహావ్యాధి బాధలుండవు. శత్రువులపై స్పష్టమైన శాశ్వతమైన విజయాన్ని సాధించగలుగుతారు. మహాశాంతినీ పొందగలుగుతారు.

అమృతేశ్వర భగవానుని పూజలో కూడా ఆవాహన, స్థాపన, రోదన (ప్రతిష్ఠ), సన్నిధానం, నివేశనం, పాద్యం, ఆచమన, స్నానం, అర్ఘ్యం, మాల, అనులేపనం, దీపము, వస్త్రం, ఆభూషణాలు, నైవేద్యం, పానం, వీవనలు, ముద్రాప్రదర్శన, మంత్రజపం, ధ్యానం, దక్షిణ, ఆహుతి, స్తుతి, వాద్య గీత నృత్యాలు, న్యాసయోగ ప్రదక్షిణలు, సాష్టాంగ ప్రణతి, మంత్ర శయ్య, వందనాది ఉపచారాలన్నీ వుంటాయి. పూజానంతరము దీక్షా విసర్జన చేయాలి.

ఋషులారా! ఈ సందర్భంలోనే పరమాత్మ షడంగ పూజనుపదేశించాడు. అది ఇలా వుంటుంది.

సాధకుడు ప్రారంభంలో దేవునికి అర్ఘ్యమిచ్చే పాత్రను పూజించి అస్త్ర మంత్రాన్నుచ్చ రించాలి. అనగా కుడిచేతితో ఎడమచేతిపై శబ్దంచేస్తూ ‘ఫట్’ అనే మంత్రాన్ని చదవాలి. తరువాత కవచమంత్రం (హుం) తో శోధనచేసి అమృతకరణ క్రియను పూర్తి చేయాలి. అప్పుడు ఆధారశక్తి మున్నగువాటిని పూజించి ప్రాణాయామం, ఆసనోపవేశనం, దేహశుద్ధి కావించి అమృతేశ భగవానుని ధ్యానించాలి.

తరువాత తన ఆత్మను దేవ స్వరూపంగా స్వీకరిస్తూ (అహం బ్రహ్మాస్మి అని మననం చేసుకుంటూ) అంగన్యాస, కరన్యాసం చేసి సాధకుడు తన హృదయ కమలస్థితుడైన జ్యోతిర్మయ ఆత్మదేవుని పూజించాలి. (అంటే కన్నులు సగం మూసి అమృతేశ మంత్రాన్ని పఠిస్తూ తన బొమముడిలోనే జ్యోతిశ్చక్రాన్ని చూడగలగాలి).

అనంతరం దేవునిమూర్తిపైగాని, యజ్ఞ వేదిపై చిత్రింపబడిన దేవునికి గాని సుందరపుష్పాలను సమర్పించాలి. ఆధారశక్తిని పూజించడం ద్వారా ద్వారం వద్దనుండు దేవతలు ఆవాహన చేయబడి పూజింపబడాలి. అందుకే ముందుగా ఆధారశక్తి పూజన ముంటుంది. ఆ పై దేవప్రతిష్ఠా, పరివార సమేతంగా ఆ దేవుని ఆరాధించడం జరుగుతాయి. పరివారంతో బాటు ఆయుధాలనూ, ధర్మాన్నీ కూడా పూజిస్తే దేవతలు సంతోషిస్తారు. ఇంద్రాదిదేవతలనూ వేదాలనూ ఏ వ్రతంలో పూజించినా భుక్తి, ముక్తి లభిస్తాయి. కాబట్టి ఈ షడంగ పూజను విద్వాంసులు విధించారు.

దేవమండలాన్ని పూజించడానికి ముందే మాతృక, గణదేవత, నంది, గంగలనూ దేవస్థానం కుడిభాగంలో మహాకాలునీ, యముననూ పూజించాలి. పూజలో ప్రతిదశలోనూ ఓం అమృతేశ్వర భైరవాయ నమః, ఓం జుం హం సః సూర్యాయ నమః అంటూనే వుండాలి.

అలాగే శివ, కృష్ణ, బ్రహ్మ, చండిక, సరస్వతి, మహాలక్ష్మి దేవతలను కూడా వారి నామాలకు ముందు ‘ఓం’ కారమును, చివర నమః ను(దానికి ముందు ‘య’ లేక ‘యై’) నూ పెట్టి పూజించాలి.

గమనిక :- గురు ముఖతః నేర్చుకొని చెయ్యవలసిన మంత్రం ఇది అని గమనించగలరు

పద్నాల్గవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment