ప్రాయశ్చిత్తం, చాంద్రాయణం, మరికొన్ని వ్రతాలు, పంచగవ్య విధానం
పాపాలకు ఫలితం నరకప్రాప్తే అయినా కొన్ని పాపాలకు పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకొని ఇంకెన్నడూ ఏపాపమూ చేయకుండా వుంటే నరకవాసం తప్పవచ్చు. తగ్గవచ్చు. ఆ ప్రాయశ్చిత్తాలను చెప్తాను.ఈగ, జలకణం, స్త్రీ, నేలనుండి ఊరుజలం, అగ్ని, పిల్లి, ముంగిస ఇవి ప్రాయశ్చిత్తానికి సంబంధించినంతవఱకూ పవిత్రంగా పరిగణింపబడతాయి.
ఉచ్ఛిష్టము అనగా నైవేద్యం పెట్టకుండా పాత్రలోని సిద్ధాన్నమును కొంత తొలగించగా మిగిలిన అన్నమును తిన్నవారు ఒక పగలు, ఒక రాత్రి ఉపవాసం చేసి పంచగవ్య ప్రాశ్నం చేస్తే శుద్ధులవుతారు.
బ్రాహ్మణోచ్ఛిష్టమును వేరొక బ్రాహ్మణుడు తింటే అతడు స్నాన, జప, ఏకాహ ఉపవాసం చేయాలి. తలవెండ్రుక అశుద్ధి. అది లోనికి వెళితే వెంటనే వాంతి చేసుకోవాలి. ఒక చేతిలో ఏదైనా పదార్థాన్ని పెట్టుకొని రెండవ చేతితో తినుట, వేళ్ళను నాకుట అపవిత్ర కార్యములు, ఈ పని చేసిన వారు వెంటనే నీరుత్రాగి స్నానం చేయాలి. అలా చేయలేకపోతే ఒక పగలు, ఒక రాత్రి ఉపవాసముండి పోవాలి. ఒకరు త్రాగగా చిన్న పాత్రలో మిగిలిన నీటిని గాని ఎడమచేతిలో నున్న నీటిని గానీ త్రాగుట మదిరాపాన మంతటి మహాపాపము.పగలు స్నానం చేయని వారే శూద్రులని అనుకున్నాము కదా! వీరు కాక రోజుల తరబడి స్నానం చేయని వారిని పంచములనే వారు. ఈ శూద్రులుగాని పంచములుగాని బ్రాహ్మణ గృహంలో ప్రవేశిస్తే ఆ గృహస్థు క్రమంగా ప్రాజాపత్య, చాంద్రాయణ వ్రతాలను చేయాలి. వారు పొరపాటున భోజనం కూడా చేస్తే ఆ గృహస్థు అర్ధకృతవ్రతాన్ని ఆచరించాలి.
ఆనాడు భోజనం చేసిన ఇతర బ్రాహ్మణులు కృచ్ఛవ్రతంలో చతుర్థాంశమును చేయాలి. (స్నానము చేయని మనిషి ఎవరైనా వారి శరీరంలో నుంచి వచ్చే సూక్ష్మక్రిమి వ్యాపకత్వం వల్ల అనారోగ్య కారకులవుతారు. కృచ్ఛవ్రతం వల్ల ఆ క్రిములు నశిస్తాయి).అజ్ఞాన వశాన చండాలుని (ఈ చండాలురనునది ఒక కులమో వర్ణమో కాదు. మృగాలను వేటాడి తినేవారు, కుక్కలనూ, మద్యమాంసాలనూ విక్రయించేవారిని పురాతన కాలంలో చండాలురనేవారు. వీరు సంఘబహిష్కృతులై పొలిమేరల్లోనో అడవుల్లోనో వుండేవారు. ఊరిలో కులవృత్తి చేయక న్యాయానికీ ధర్మానికీ తలవంచని ద్విజులను కూడా సంఘం బహిష్కరించగా వారు పోయి కొన్నాళ్ళకు చండాలురయే వారు. ఇది అప్పట్లో వర్ణమూ కాదు. తరువాత కులమూ కాదు.) చేత నీయబడిన అన్నమును తిన్న బ్రాహ్మణుడైతే సంపూర్ణ(ఐందవ) చాంద్రాయణ వ్రతాన్ని చేస్తే గాని శుద్ధుడు కానేరడు. క్షత్రియుడైతే ఆరురోజులూ, వైశ్యుడైతే రెండురోజులూ సొంతప వ్రతాన్ని చేసుకోవాలి.
మద్యాదులచే అశుద్ధమైన పాత్రలోని నీటిని త్రాగిన బ్రాహ్మణుడు కృష్ణపాద వ్రతాన్ని గావించి శుద్ధుడు కాగలడు. పిడుగు, అగ్నిప్రమాదం, పెనుగాలి వంటి ఉపద్రవాల కారణంగా బ్రాహ్మణుడు అంత్యజునింటిలో నివసించవలసివస్తే ఆయన పరిస్థితులు చక్కబడగానే మూడు కృచ్ఛాలనూ మూడు చాంద్రాయణ వ్రతాలను చేయాలి. శూద్ర, శ్వాస స్పర్శచే దూషితమైన అన్నమును భుజించినవారికి ప్రాయశ్చిత్తంగా ఏకదినరాత్రోపవాసము, పంచగవ్య ప్రాశ్నయూ విధించబడ్డాయి. వర్ణ బహిష్కృతుని బ్రాహ్మణుడు స్పృశిస్తే అతడు అయిదు రాత్రులుపవాసం చేయాలి. నిరంతరం పారే నీటినీ, బాలురను, గాలిచే నెగురగొట్టబడిన ధూళిని, స్త్రీలను, వృద్ధులను బ్రాహ్మణులు మడిలోనున్నపుడు తగిలినా దోషము లేదు. స్త్రీముఖము, పక్షులచే జారవిడువబడిన పండ్లు, కడుపుతో నున్న ఆవు నుండి బయటికి వస్తున్న దూడ, జంతువులను వేటాడుతున్న కుక్క నిత్య పవిత్రాలు.
నీటిలో గాని నేల తవ్వకంలో గాని లభించిన వస్తువులు పవిత్రాలు, ధార్మిక కృత్యంలో నున్న బ్రాహ్మణునికి ఎవరి కాలైనా తగిలితే ఆ అశుద్ధి ఆచమనం ద్వారా నశిస్తుంది. కంచుపాత్ర మద్యం కాని వస్తువు కారణంగా అపవిత్రమైతే పవిత్ర భస్మంతో తోమి కడిగితే పనుకొస్తుంది. మూత్రం, మద్యాలతో అపవిత్రమైన పాత్రను అగ్నిలో వేస్తేగాని పనికిరాదు. ఆవు, శూద్రులు, కుక్కలు ముట్టుకున్న పాత్రలను పవిత్ర భస్మంతో పదిమార్లు తోమి కడిగి మళ్ళా వాడుకోవచ్చు. శూద్రుడు వాడిన పాత్రలోని భోజనాన్ని బ్రాహ్మణుడు తింటే మూడు పగుళ్ళు ఉపవాసం చేసి పంచగవ్యాలను త్రాగాలి. ఉచ్చిష్టాన్నీ, స్నానం చేయనివానినీ, కుక్కనూ తాను మడిలో వుండగా తాకిన బ్రాహ్మణుడు కూడా మూడు పగళ్ళుపవసించి పంచగవ్యపానం చేయాలి.
రజస్వలను ముట్టుకుంటే ఒక రాత్రి ఉపవసించి పంచగవ్యప్రాశ్నం చేయాలి. మజ్జిగతోట, పెరుగు, పాలు, గంజి, కృసరాన్నం వీటిని శూద్రుని నుండి కూడా గ్రహింపవచ్చును. తేనెను ఎవరినుండైనా తీసుకొనవచ్చును. మద్యపానం చేసే బ్రాహ్మణునికి నిష్కృతిలేదు. కొంతమంది అగ్నికంటే నెక్కువ వేడిమిని గలిగి సల సల కాగుతున్న మద్యాన్ని తాగితే శుద్ధి కలుగవచ్చని అంటారు. సూతక గృహాలలో అనగా జననం లేదా మృతి కలిగి శుద్ధి కాని ఇంట్లో బ్రాహ్మణుడు భోజనం చేస్తే అయిదు వందలమార్లు, క్షత్రియుడు చేస్తే మూడువందల మార్లు గాయత్రిజపం చేయాలి. సూతక గృహం నుండి వచ్చిన పాత్రలో నీరు త్రాగినా ఇదే ప్రాయశ్చిత్తం. సూతక గృహాలలో శుద్ధి వర్ణక్రమంలో పది, పన్నెండు, పదిహేను, ముప్పది రోజుల తరువాత కలుగుతుంది.
యుద్ధంలో రాజు, యజ్ఞదీక్షలో బ్రాహ్మణుడు పరదేశంలో సర్వవర్ణులు మరణించినట్లు తెలియగానే స్నానం చేస్తే వెంటనే శుద్ధి అవుతుంది. ఒకనెలలోపల మరణించిన శిశువు గలవారు స్నానం చేయగానే శుద్ధులైపోతారు. అవివాహిత కన్య, వడుగు ఇంకా కాని మగవాడు మూడేళ్ళ ఆడపిల్ల, పళ్ళూడి ఇంకారాని మగపిల్లాడు మృతిచెందితే ఆ ఇంట్లో మూడు రాత్రుల దాకా అశుచి వుంటుంది. గర్భస్రావానికీ అంతే అశుచి. బాలెంతలకు పదిరోజుల అశుచి వుంటుంది. దీక్షాకాలంలో, వివాహం నిశ్చయమైన ఇళ్ళలో ఏం జరిగినా సూతకముండదు. శుద్ధి అవసరం లేదు. సూతక గృహాల్లో కూడా అగ్నిహోత్రం (ఆవాహనం) వేదపఠన, పాఠనాలూ, వైశ్వదేవం, యజ్ఞాది ధార్మిక కృత్యాలు జరుగుతున్న భాగానికి అశుచి అంటదు. అశుద్ధ గృహంలో భోజనం చేసిన బ్రాహ్మణుడు మూడు రాత్రులుపవసించిన శుద్ధుడు కాగలడు. ఏ వర్ణం వారైనా స్త్రీ రజస్వలయైనపుడు ఒకరినొకరు ముట్టు కోవలసివుంటుంది. అట్టి సందర్భాలలో బ్రాహ్మణి, మూడు రాత్రుల, రాణి రెండు రాత్రుల వైశ్యిని ఏకరాత్ర ఉపవాసాల తరువాత శుద్ధులవుతారు. శూద్ర స్త్రీ వెంటనే స్నానం చేసి శుద్ధురాలు కావచ్చు..
కుక్క, నక్క, కోతి నూతిలో పడిపోతే ఆ నీరు త్రాగిన అగ్రవర్ణాలవారు క్రమంగా మూడు, రెండు, ఒక దినాల ఉపవాసం తరువాతే శుద్ధులవుతారు. ఎముక, తోలు, ఎలుక లాంటివి నూతితో పడివుంటే వాటినీ, వాటితోబాటు కొంత నీటినీ బయటికి తోడి పంచగవ్యాలను నూతిలో తగు మాత్రంగా పోసి శుద్ధిచేయాలి. తటాక, పుష్కరిణ్యాదుల జలాలు దూషితమైతే ఆ వస్తువును తొలగించి ఆరుకడవల నీటిని ఆ ప్రాంతం నుండి తీసి పారేసి, భస్మమును అంతటా జల్లి పంచగవ్యాలను పొయ్యాలి. రజస్వల విషయంలో ముప్పది కుండల నీటిని తోడి పారబోయాలి. నిషిద్ధ స్త్రీ సంగమం, గోమాంస భక్షణం, మద్యసేవనం వంటి మహాపాతకములను చేసి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న చాతుర్వర్ణ్యులు క్రమంగా చాంద్రాయణ, ప్రాజాపత్య, తపన, పంచదినోపవాస వ్రతాలు చేస్తే కొంత పాపశాంతి తరువాత గోదానం, అన్నదానం చేస్తే మరికొంత పాపదగ్ధము కలుగవచ్చు.
పశువును కట్టడి చేయడానికని దాని ముందరి కాళ్ళకు బంధం వేయడం మహాపాపం. ఇదేకాక ఇక ఏవిధమైన హింస వల్ల ఏ పశువు మరణించినా ఆ మనిషికి పాపం గట్టిగానే తగులుకుంటుంది. అతడు కృచ్ఛపాదవ్రతం చేసి జీవితాంతమూ పశువులను ప్రాణప్రదంగా కాపాడుకుంటే ఆ పాపం దగ్ధమైపోతుంది. ఆవు ఎముకను గాని కొమ్మును గాని విరిచినా చర్మంపై రక్తం కారేటట్టు కొట్టినా, తోకను కోసినా అంటుకునే పాపం సామాన్యమైనది కాదు. అది పదిహేను రోజులపాటు ”యావాక” (బార్లీ) పానకమును మాత్రమే త్రాగుతూ బతికితేనే పోతుంది. ఇతర జంతువులను ఈ విధంగా హింసిస్తే దానికి ప్రాయశ్చిత్తం కృచ్ఛవ్రతం. తొలిరోజు ఏకభుక్తం. మలిరోజు నక్తవ్రతం. మరునాడు అయాచిత వ్రతం ఈ మూడిటినీ కలిపి పాదకృచ్ఛవ్రతమంటారు. దీనికి రెట్టింపు ప్రాజాపత్యవ్రతమైతే, దానికొకరోజును కలిపి ఆనాడు కటిక ఉపవాసం చేయడం కృచ్ఛవ్రతమవుతుంది. దీనిని మహాసాంతపనవ్రతమని కూడా అంటారు.
మూడురోజుల పాటు వేడి నీటిని మాత్రమే తీసుకుంటూ, తరువాత మూడు రోజులు వేడి పాలు మాత్రమే త్రావుతూ మరొక మూడురోజులు వేడి నేతిని మాత్రమే ప్రాశ్నిస్తూ చేసే ఉపవాస వ్రతానికి తప్తకృచ్ఛవ్రతమని పేరు. ఇది సమస్త పాపాలను హరించగలదు. పన్నెండు రోజుల పాటు నీటిని మాత్రమే త్రాగుతూ చేస్తే ఉపవాసవ్రతం పరాకవ్రతం. ఇది సర్వపాప శుక్ల పాడ్యమి నాడు కొంచెం (గ్రాసం పరిమాణం) అన్నం తిని రోజుకొక గింజ పెంచుకుంటూ పోయి పున్నమి దాకా అలాగే చేసి మరునాటి నుండి ఒక్కొక్క కంటని అమావాస్య నాడు ఏమీ తినకుండా వుండడం చాంద్రాయణ వ్రతం. ఈ నెలరోజులలోనూ రోజులో ఒక్కమారే తినాలి. ప్రశస్తమైన పంచగవ్యమెలా వస్తుందంటే బంగారు రంగున్న ఆవు యొక్క పాలు, తెల్లావు పేడ, రాగింగు ఆవు మూత్రం, నీలవర్ణ ధేనువు యొక్క నెయ్యి, నల్లావు పెరుగులకు కుశోదకమును కలిపితే ప్రశస్తమైన పంచగవ్యం తయారవుతుంది. ఇందులో మూత్రం ఎనిమిది మాసాలు, పేడ నాలుగు, పాలు పన్నెండు, పెరుగు పది, నెయ్యి అయిదు మాసాల పరిమాణంలో వుండాలి. ఇది సర్వమల వినాశకం.
నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹