స్త్రీ వ్యాధి చికిత్స గ్రహదోషనివారణ, ఋతుచర్య పథ్యకారక, సర్వౌషధాలు
స్త్రీలకు వచ్చే ప్రత్యేక యోని వ్యాపద్ వ్యాధుల్లో చాలా వఱకు వాయువునదుపులోకి తెస్తే తగ్గిపోతాయి. వచ, ఉపకుంచిక, జాతి, వాసక, గట్టి ఉప్పు, అజాజి, యవక్షార, చిత్రకాల మిశ్రమాన్ని నేతిలో వేయించి ఆ పొడిని నీటిలో కరిగించాలి. దానికి కొంచెం పంచదారను కలిపి తీసుకుంటే తొడలమధ్య నొప్పి, చుట్టూ వున్న నొప్పి, గుండెదడ, మొలలు, ప్లీహవ్యాకోచం తగ్గుతాయి. బదరీ పత్రాలతో చేసిన ముద్దను రాస్తే అక్కడి పగుళ్ళు, రేగిన గాయాలు మానిపోతాయి. లోధ్ర, తుంబీఫల ముద్ద జననేంద్రియాన్ని, దాని కండరాలను ఆరోగ్యంగా గట్టిగా వుంచుతుంది.
మందుకోసం శుద్ది చేయబడిన నేతిలో పంచపల్లవాలనూ, యష్టి, అర్క, మాలతి పూలనూ వేసి ఎండలో వేడిచేసి వాడితే లుకేరియా (లుకోరియా) తగ్గుతుంది. జపా కుసుమాలనూ, కాంజికలనూ, ఒకప్రస్థ జ్యోతిష్మతి దళాలతనూ దుర్వాతోనూ కలిపి ముద్దగా చేసి నీటితో కలిపి తాగినా, అలాగే చిత్రక, ధాత్రి భస్మ, అంజన, అభయా లను పంచదారతో కలిపి ముద్ద చేసి నీటిలో కలిపి త్రాగినా అధికరక్తస్రావం వుండదు. లక్ష్మణోషధాన్ని నస్యంగా వాడినా, పాలతో కలిపి తాగినా గర్భధారణలో సమస్యలుండవు. అశ్వగంధాన్ని నేతితోనూ, అర్ధాడకం పాలతోనూ కలిపి గాని, వ్యాశ, కేసరాలను నేతితో కలిపి గాని స్వీకరిస్తే గర్భధారణలో ఏ ఇబ్బందీ వుండదు.
గర్భిణికి అనవసరమైన నొప్పులూ, వ్యాకోచాలూ ఉంటే కుశ, కాశ, ఉరుబుక, గోక్షురక వేళ్ళను పంచదారతో కలిపి పాలలో పోసి బాగా మరిగించి చల్లార్చి త్రాగిస్తే ఆ రుగ్మతలన్నీ నశిస్తాయి. కొంతమందికి పురుడు వచ్చిన వెంటనే గుండె, తల, మూత్ర కోశాదులలో నొప్పి పుడుతుంది. దానిని అర్కండమంటారు. పులిసిన యవక్షారమును గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే అర్కండ అదృశ్యమవుతుంది. దశమూల మందుల కషాయాన్ని నేతితో కలిపి వాడినా అదేఫలితం. చనుబాలు వృద్ధి చెందడానికి శాలి బియ్యపు పొడిని పాలతో కలిపి తాగాలి.అలాగే విదారి పూలను కార్పాస వేళ్ళతో కలిపి రసంతీసుకొని తాగినా అదే ఫలితం. ముద్దతో చేసిన చారు స్త్రీ యొక్క పాలను శుద్ధి చేస్తుంది. వృద్ధి కూడా చేస్తుంది.
బిడ్డకు కుశ, వచ, అభయ, బ్రాహ్మి, మధూక తేనె, నెయ్యిలతో చేసిన అవలేహాన్ని ఇస్తున్న కొద్దీ రంగు, ఎత్తు. కాంతి అన్నీ పెరుగుతుంటాయి. బిడ్డకు వాంతులు, దగ్గు, జ్వరం వుంటే లౌహ, ముస్తక, అతివిశ మిశ్రమాన్ని పట్టాలి. విరేచనాలవుతుంటే ముస్త, శొంఠి, విశ, అరుణ, కుటజ మిశ్రమాన్ని పట్టాలి. ఎక్కిళ్ళూ, వాంతులూ వుంటే వ్యోశ, మాతులుంగ, తేనెల మిశ్రమాన్నివ్వాలి. కుష్ఠ అణువులు గోచరిస్తే ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా కుశ, ఇంద్రాయవ, సిద్ధార్థ, నిశ, దూర్వల మిశ్రమాన్నివ్వాలి. బిడ్డకు మహాముండినిక (మహాశ్రావణిక) ఉదీచ్యాల క్వాథంతో స్నానం చేయిస్తే గ్రహదోషాలన్నీ దూరమవుతాయి. గ్రహదోషం పొడసూపగానే ముందుగా సప్తవర్ణి, పసుపు, చందనాలను దేహానికి పూయాలి. శంఖ, కమలగట్ట, రుద్రాక్ష, వచ, లౌహాది రక్షలను కట్టాలి. ఈ క్రింది మంత్రం ద్వారా శాంతి చేయించాలి..
ఓం కం టం గం గం వైనతేయాయనమః
ఓం హోం హోం హః
అని చదువుతూ శరీరాన్ని నిమురుతూ బలులిస్తే అరిష్ట గ్రహాలు వదలి పోతాయి. బలి ప్రదానవేళ
ఓం హ్రీం బాలగ్రహాద్ బలిం గృష్ణాత బాలం ముంజత స్వాహా
అనే మంత్రాన్ని ఉచ్చరించాలి. చరకసంహితలో శిరీషో విషఘ్నానాం అని కనిపిస్తుంది. బియ్యం కడిగిన నీళ్ళలో శిరీష మూలాన్ని పిండి కషాయం చేసి త్రాగితే విషం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అలాగే తెల్లపూల వర్షభూ లేదా పునర్నవ రసం కూడా మనిషిని పాముకాటు విష ప్రభావం నుండి కాపాడుతుంది.
నూకలు, గృహధూమం (ఇంటిమసి) నిశ అనే గడ్డ ఉప్పు, పెరుగు, నెయ్యి, తేనె కలిపి ముద్ద చేసి నీటితో త్రాగితే విషం విరిగిపోతుంది. ఆరోగ్యానికీ, ముసలి తనంలో కూడా శక్తి పెరగడానికీ ఒక ఓషధి వుంది. అదే ఆరు ఋతువులలోనూ, వర్షర్తువుతో మొదలుపెట్టి అభయను గడ్డఉప్పు, పంచదార,సొంటి కణ, తేనె, బెల్లంలతో కలిపి రోజూ త్రాగితే బలం తగ్గదు. అనారోగ్యం ఆవరించదు.
జ్వరం పడిలేచినవారు ఒక వంతు ఈ అభయను గాని, రెండు వంతులు విభీటకను గానీ, నాలుగొంతులు ధాత్రిని గాని తేనె, నెయ్యిలతో కలిపి కొన్నాళ్ళపాటు తీసుకుంటే మిక్కిలి వేగం కోలుకోవడమే కాక కొన్నేళ్ళకు సరిపడా బలాన్ని పొందుతారు. అశ్వగంధ కషాయాన్ని పాలతో నేతితో కలిపి తీసుకుంటే దేహబాధలన్నీ నశిస్తాయి. బలం కూడా వస్తుంది. మండూకపర్ణి, విదారి రసాలను కలిపి దానిలో తిల, ధాత్రి, భృంగరాజలను వేసుకొని త్రాగితే నూరేళ్ళయినా సరే ఏ జబ్బూ లేకుండా, రాకుండా బ్రతకవచ్చు. త్రికటు, త్రిఫల, వహ్ని, గుడూచి, శతావరి, విడంగ, “లౌహచూర్ణాలను కలిపి ముద్ద జేసి తేనెతో రంగరించి స్వీకరిస్తే, సర్వరోగాలూ పోతాయి. త్రిఫల, కణ, సొంటి, గుడూచి, శతావరి, విడంగ, భృంగరాజల మిశ్రమాన్ని శుద్ధిచేసి రోజూ తీసుకుంటే ఆయువుతోపాటు అన్నిశక్తులూ పెరుగుతాయి. విదారి భస్మాన్ని తేనె, నెయ్యిలతో కలిపి తింటే శృంగార సామర్ధ్యం పెరుగుతుంది.
జబ్బులతో పనిలేకుండా ప్రతిమనిషి తీసుకోవలసిన జాగ్రత్తలు, సేవలు, ఔషధాలు ఇలా వుంటాయి.అతి సర్వత్ర వర్జయేత్ అనేది ప్రధాన జాగ్రత్త. శరీర మర్దన, నూనె పట్టించుట, ఔషధ నశ్యసేవన, క్షాళక ప్రయోగాలు, ఎప్పుడో అరుదుగా వమనక స్వీకరణ వీటిని పంచకర్మలంటారు. రోజూ కాకున్నా వీటిని క్రమం తప్పకుండా చేయించుకోవాలి.ఒక ఏడాదిలో ఆరు ఋతువులుంటాయి కదా! ఒక్కొక్క ఋతువు రెండేసి నెలలుంటుంది. ఆరోగ్యంగా వుండదలచుకున్నవారు ఋతువుని బట్టి ప్రవర్తనను మలచుకోవాలి.శిశిర, వసంతరువుల్లో శృంగారంలో పాల్గొనే సందర్భాలను రాత్రులలో పెంచవచ్చు.
అప్పుడు కూడా పగటి నిద్ర కూడదు. వర్ష ఋతువులో కూడా పగటి నిద్రను పూర్తిగా త్యజించాలి. హేమంతఋతువు (ఈ శబ్దం సరికాదని పెద్దలంటారు.) లో శరీరాన్ని వేడిగా కాచుకుంటూ వుండాలి. తేనెను స్వీకరిస్తుండాలి. పాలనూ, పాల పదార్థాలనూ ఎక్కువగా వాడాలి. గ్రీష్మఋతువులో మంచినీళ్ళను గాని మరి దేనిని గాని అతి శీతలంగా పుచ్చుకొనరాదు. కృత్రిమ శీతలత్వమేవిధంగా చూసినా మెదడుకు గాని శరీరానికి గాని మంచిది కాదు. శరత్కాలపు వెన్నెలలో నిద్రించడం గాని ఎక్కువసేపుండడం గాని చేయరాదు. వేప, అతసి, కుసుంభ, శిగ్రు, ఆవ, జ్యోతిష్మతి, మూలక వీటినుండి తీసి శుద్ధి. చేసిన నూనెలు క్రిమిసంహారకాలు, చక్కెరవ్యాధి నిరోధకాలు, వాత-కఫ ప్రకోపాల వల్ల వచ్చే తలనొప్పికి నాశకాలు.
దాడిమ, ఆమలకి, కొల, కరమర్ద, ప్రియాలక, జంబీర, నాగరంగ, ఆమ్రాతక, కపిత్థక ఓషధులు పథ్యంగా మంచివి, పిత్త వర్ధకాలు, వాయు నిరోధకాలే గాని ”కఫ ప్రకోపకాలు”. ఎటువంటి వాంతులకైనా మందుగా జల, జీమూతక, ఇక్ష్వాకు, కుటజ, కృతబంధన, ధామార్గవలను వాడవచ్చును. ప్రొద్దుటి వేళలో వమనం చేయించడానికి మదన, ఇంద్రాయణ, వచలను ఉపయోగించాలి. పిత్తం ప్రకోపించినపుడు త్రివృతం ప్రక్షాళకంగా పనికి వస్తుంది. కడుపు బాగా కడిగివేయడానికి నాగర, త్రివృతలను గెడ్డ ఉప్పుతో, పంచదారతో, తేనెతో కలిపి తీసుకోవాలి. హరీతకి, విడంగాలను గోమూత్రంతో కలిపి వేసుకున్నా ఇదే ఫలితముంటుంది. ఎరండ నుండి తీసిన నూనెను దానికి రెండింతల త్రిఫల కషాయంతో కలిపి తీసుకుంటే కూడా కడుపు కడుక్కుపోతుంది. ఒక పాలు పథ్య, రెండు పాళ్ళు అక్ష, నాలుగు పాళ్ళు ధాత్రిలను కలిపి శతావరి రసంతో శుద్ధిచేసి తీసుకుంటే అన్ని రకాల నొప్పులూ తగ్గుతాయి.
నూట ముప్పై ఒకటవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹