Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నూట ముప్పయ్యవ అధ్యాయం

నాడీ వ్రణాది రోగాల చికిత్స

నరం మీద లేచిన కురుపుని నాడీవ్రణమంటారు. దీనికి శస్త్రచికిత్స అవసరమైనపుడు వెనుకాడరాదు. సాధారణంగా గుగ్గిలం, త్రికుట, త్రిఫలాలను సమానపాళ్ళలో తీసుకొని శుద్ధిచేసి సిద్ధం చేసుకొని వుంచిన నేతితో కలిపి దాని సహాయంతో నాడిలో లేచిన వికృతవణాలపై, శూలపై,భగందరమను రోగం పైవిజయాన్ని సాధించవచ్చును. నిర్గుండకీ రసాన్ని శుద్ధతైలంతో కలిపి పూస్తే నాడీ దోషాలూ, వ్రణాలూ దూరమౌతాయి. పామాయను రోగానికిఈ మందును త్రాగించి కాని, అంజనం చేసి పూసి గాని, ముక్కుపొడుంగా చేసి పీల్చడం ద్వారా గాని చేసే గొప్ప గుణం కనిపిస్తుంది.

మూడుపాళ్ళు గుగ్గిలం, అయిదుపాళ్ళ త్రిఫల, ఒక పాలు నల్ల తులసాకులను కలిపి తయారుచేసిన గుటికలను సరైన మోతాదులో వాడితే కురుపులు, గుల్మాలు, మొలలు, భగందరాలు తగ్గుతాయి. శిశ్న సంబంధిత సుఖ రోగానికి (ప్రస్తుత భాషలో సిఫలిస్) పఠోల, నింబ, భూనింబ, గుడూచిల మిశ్రమంతో కషాయం చేసి దానిలో గుగ్గిల, ఖదిరలను కలిపి త్రాగించాలి. ఈ రోగంలో నేర్పడు పొక్కులకూ,మచ్చలకూ నల్లగా మాడేదాకా పెనం మీద కాల్చిన త్రిఫలను బూడిద చేసి తేనెలో కలిపి పూస్తే గుణం కనిపిస్తుంది. అలాగే మందు నెయ్యిని త్రిఫల, నింబ, భూనింబ, కరంజ, ఖదిరల కషాయాన్ని ఆవిరిచేయగా మిగిలిన పొరకు చేర్చి ఉపయోగిస్తే ఈ శిశ్న రోగం వేగంగా తగ్గుతుంది.ఎముక పగులు వేసినపుడు ఆచోటును బాగా కడిగి మన్ను, సున్నాలతో పట్టీ వేసి దర్భ గడ్డితో చుట్టాలి. మినుము, నెయ్యి, పాలు ఎక్కువగా ఆహారంగా పెట్టాలి. జింజెల్లీ గింజలతో చేసిన చారును తాగిస్తుండాలి. నిర్మాణాత్మక గుణాలున్న వాటినే తినిపించాలి.

ఎముక విరిగినవారు కొన్నాళ్ళపాటు వెల్లుల్లి, వేచిన బియ్యం లేదా ఇతర ధాన్యాలను కడిగిన నీటిలోపంచదారను వేసి వేడిచేసి ఆవిరిపోగా అడుగున మిగిలినశేషము తింటూ ఉండాలి. దీనివల్ల ఎముక మిక్కిలి వేగంగా అతుక్కుంటుంది. అశ్వత్థ, త్రిఫల, వ్యోశలను సమపాళ్ళలో కలిపి ముద్దజేసి దానికి సమాన పరిమాణంలో గుగ్గిలాన్ని కలిపి మరల ముద్దను తయారుచేసి ఎముకలు కలిసే చోట్ల, బాధిత స్థలాల్లో రాస్తే అస్థిబాధలన్నీ తగ్గిపోతాయి. కుష్టురోగాలన్నిటికీ వాంతి మందులు, క్షాళకాలు, రక్తమును పిండదాలు అత్యవసరం. ఆ తరువాత తగిన మిశ్రమాలను గాయాలపై గాని కురుపులపై గాని రాస్తుండాలి. వచ,వాస, పటోల, వేపబెరడు, ప్రియంగుల కషాయాన్ని తేనెతో కలిపి త్రాగించాలి. అది వాయువు నదుపులోకి తెచ్చి నిర్మాణాత్మకంగా పనిచేస్తుంది.

క్షాళణాదులను త్రివృత, దంతి, త్రిఫల మిశ్రమాలతో చేయవచ్చు. మనశ్శిల, మిరియాలు, మందుకై శుద్ధిచేసిన నూనెతో కలిపి రాస్తే కుష్టు తగ్గవచ్చు. మైరో బాలన్లను అయిదు రకాలనూ అన్నంతో బెల్లం పాకంతో కలిపి తింటే శీఘ్రమే గుణం కనిపిస్తుంది. విడంగ, నాగబాల, కుశ, నిశ, సింధుత, సర పాలను నీటిలో వేసి ఒక గంట తరువాత వడగట్టి ఆ ముద్దను గోమూత్రంతో కలిపి రాస్తే గుండ్రటి క్రిమి నశిస్తుంది. మనశ్శిల, విడంగ, వాగుజి, సర్జప, కరంజిలను గోమూత్రంలో కలిపి ముద్ద జేసి రాస్తే కుష్టు నశించి శరీరం సూర్యుని వలె మెరుస్తుంది. ఆరగ్వధాకులను పిండిచేసి ఆర్నాలతో కలిపి ముద్దగా చేసి పూస్తే గుండ్రటి (బద్దె పురుగు, కిట్టిమ, కుష్టు, సొరియాసిస్ నశిస్తాయి. వేడిపాలలో వాగుజి వేసుకొని తాగితే కుష్టు తగ్గుతుంది. జింజెల్లీ విత్తనాలు, నెయ్యి, త్రిఫల, తేనె, పంచదార, భల్లాట, వ్యాశ సమపాళ్ళలో కలిపి స్వీకరిస్తే శృంగార సామర్ధ్యం పెరుగుతుంది. అంతేకాక శరీరంలో కుష్టు అణువులు చేరివుంటే అవి నశిస్తాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నాడీ వ్రణం, మొల, మలద్వారంలో కురుపులు, కుష్టు, చక్కెరవ్యాధి ఇవన్నీ విడంగ, త్రిఫల, కృష్ణలను పొడిగా చేసి తేనెతో కలుపుకొని తాగితే కుదిరిపోతాయి. ఇది మంచి లేహ్యం.

మామిడి, ఖదిర మొలకలను ఒక కుండలో పెట్టి బూడిద మిగిలేదాకా వేడి చేసి అక్షరసం, తేనెతో, ధాత్రిరసంతో కలిపి తాగితే కుష్టుపోతుంది. నిశ, ఉసిరికలను అభయారిష్టతో కలిపి ఒక నెలపాటు తింటే కుష్టుకుదిరిపోతుంది. అలాగే భల్లాటక తైలాన్ని తాగినా, ఖదిర జలాన్ని కొన్ని పోషక పానీయాలతో కలిపి తాగినా కుష్టు దూరమవుతుంది. కుష్టు రాక్షసుని పాలిటి ఇంద్రుని వజ్రాయుధంం లాటి మందొకటుంది. మందు కోసం ప్రత్యేకించి తయారుచేసిన (భావన) నేతిని వాచ, గుడూచి, త్రిఫల, పట్ల, కరంజక, నింబ, అశన, కృష్ణ వేత్ర కషాయంతో కలిపితే వచ్చే మందు కుష్టుని కుదుర్చుటయే కాదు. జీవితంలో మరెప్పుడూ రాకుండా చేస్తుంది. పైగా ఆయువును కూడా పెంచుతుంది. దుర్వాగడ్డి నుండి రసం తీసిదానిని దానికి నాలుగింతల పరిమాణం గల నూనెతో కలిపి వేడి చేసి చల్లార్చి శరీరాన్ని దానితో మర్దించుకొని కొంతసేపు అలాగే వుండి తరువాత స్నానం చేసెడివారికి ఏ చర్మవ్యాధులూ వుండవు. దురదలూ, కురుపులూ దరిచేరవు.

అదే విధంగా మందు నూనెలో ద్రుమ బెరడు, అర్క, కుత్త, లవణ, చిత్రక, గందీరికలను వేసి, వేచి, తీసినదానికి గోమూత్రాన్ని కలిపి వినియోగిస్తే కుష్ఠరోగం, ఇతర, అంతర బొడిపెలూ మాడిపోతాయి. ధాత్రి, నింబఫల, చిత్రకాలను పొడిచేసి గోమూత్రంలో ముంచి ఒంటికి రాస్తే దురదలుండవు. ఆమ్ల పిత్త (ప్రస్తుత భాషలో ఎసిడిటీ) మును నిర్మూలించడానికి వాస, అమృత, పర్పటిక, నింబ, భూనింబ, మార్కర, త్రిఫల, కులస్థులను కలిపి కషాయం చేసి తేనెతో కలిపి వాడాలి.అలాగే త్రిఫల, పటోల, తిక్త కషాయానికి పంచదారనూ యష్టిమధునూ కలిపి తీసుకుంటే జ్వరం, ఆమ్లపిత్తం, వాంతులు తగ్గుతాయి. వాస, తిక్త, పిప్పలి లేదా గుడ కూష్మాండాలతో నేతిని కలిపి వండిన లేహ్యం అలాగే పిప్పలి, తేనె ముద్ద కూడా ఆమ్ల పిత్తాన్ని తగ్గిస్తాయి.

పిప్పలి, పథ్య,బెల్లాలను ముద్దగా చేసి వాడితే కఫదోషాలూ, అజీర్ణమూ నిమ్మళిస్తాయి. జీలకఱ్ఱ, ధన్యాకాలను కలిపి బాగా నూరి ఒక ప్రస్థనేతిలో వేయించి స్వీకరిస్తే కఫ, పిత్త దోషాలూ, అన్నద్వేషం, జీర్ణక్రియలో తేడాలూ నశిస్తాయి. వాంతులు తగ్గుతాయి. పిప్పలి, అమృత, భూనింబ, వాసకారిష్ట, పర్పర, ఖదిరారిష్టలు కలిపిన కషాయం మిక్కిలి నొప్పులనూ, జ్వరాన్నీ, (ఎఱ్ఱ) కురుపులనూ తగ్గిస్తుంది. త్రిఫల, త్రివర్తలను పొడిచేసి నేతితో కలిపి వేడి చేసి చల్లార్చి తింటే శరీరంలోపలిభాగాలు క్షాళితములవుతాయి. అక్కి అనే దద్దు రోగంతో బాటు జ్వరం కూడా పోతుంది. అష్టక – క్వాథ మనే కషాయం సర్వతీవ్ర చర్మ రోగి నివారిణి. దీనిని ఖదిర, మూడు రకాల ఫల(త్రిఫల) అరిష్ట, పటాల, అమృత, వాసకాలను కలిపి తయారుచేస్తారు. విసర్ప, కుష్ఠ, విస్ఫోట వంటి మొండి రోగాలకు కూడా ఉద్వాసన చెప్పగలిగే గొప్ప ఔషధమిది.

కాపాలకుష్ఠ అనే రోగానికీ, దానివల్ల వచ్చే దురదకీ గుంజపండ్లను నూనెతో కలిపి వేయించి భృంగరాజరసంతో కలిపి చేసిన మందు బాగా పనిచేస్తుంది. జలగర్దభ రోగం పటాల, నీలిమందులను కలిపి రాస్తే నశిస్తుంది. కేశవర్ధకమూ, కేశసౌందర్య వర్ధకమూ కూడా ఆయుర్వేదంలో ఉంది. మామిడి టెంకలను చితగొట్టి ముద్దచేసి దానిని త్రిఫల, నీల, భృంగరాజక, లౌహచూర్ణ, కాంజికలతో కలిపి వేడి చేసి చల్లార్చి తలకి రాసుకుంటే పండిపోయిన జుట్టు మరల నల్లబడుతుంది. క్షీరి, ఈశ, అర్క ఆకులను పిండి వాటి రసాన్ని రెండు ప్రస్థల పరిమాణంలోనూ, ఒక పళం మధుకాన్నీ పన్నెండు పసరల (పసరు కాదు)తో సిద్ధం చేసి నూనె(కుడవ) తో కలిపి వండి తలకి రాస్తే వయసు మీరడం వల్ల తెల్లబడిన వెంట్రుకలు మరల నల్లబడతాయి. తల నెరవడం కనిపించగానే ఈ మందుని వాడితే ఇక జుట్లు తెల్లబడదు.త్రిఫలను నోట్లో వేసుకుని పుక్కిలించి ఉమ్మితే ముఖం మీది అవాంఛిత రోమాలు రాలిపోతాయి.గొంతు, దంతరుగ్మాతలు లోధ్ర, త్రిఫల, చిత్రకలను బాగా చితగొట్టి తేనెతో రంగరించి ఆ ముద్దను వీలైనంతసేపు నోటిలో ఉంచుకుంటే తగ్గుతాయి. పటోల, నింబ, జంబీర, ఆమ్ర, మాలతుల చిగుళ్ళతో మొగ్గలతో పంచపల్లవ కషాయాన్ని తయారుచేసి నోటిలో రాసుకుంటే అందులోని రోగాలన్నీ తగ్గుతాయి.

లశున, ఆర్ద్రక, శిగ్రు, పారులి, మూలక, కడలీ రసాలను కలిపి గోరువెచ్చగా జేసి ఒక చుక్కను చెవిలో వేస్తే కర్ణ సమస్యలన్నీ తీరిపోతాయి. లాడి కారు వ్యాధి సంక్రమించి, తీవ్రవేదనతో, గింగురు ధ్వనితో బాధపడుతున్న వారికి గెడ్డ ఉప్పును మెత్తగా నూరి స్నుహి ఆకుల రసాన్ని దానికి కలిపి గోరు వెచ్చగా చేసి వాడితే ఫలితముంటుంది. తీవ్రమైన కర్ణశోధకు జాతి ఆకుల రసాన్ని నూనెతో కలిపి ఉడికించి చల్లార్చి వెచ్చగా వుండగా వాడితే తగ్గిపోతుంది. చెవిపోటు పెడుతున్నవారికి సొంఠి, లేదా ఆవనూనెను వెచ్చగా చేసి చెవిలో పోస్తే ఉపశమనం కలుగుతుంది. పంచమూలి రసాలతో చిత్రక, హరీతకి, బెల్లం, నెయ్యిలను పాలలో ఉడికించి చల్లార్చితే దానికి షడంగయూషమని పేరు. ఇది పడిశానికి బ్రహ్మాండమైన మందు.. కంటివాపు ధాత్రి రసాన్ని కంటిలో వేస్తే తగ్గుతుంది. కంటికి పైన శిగ్రు, దర్వి, రసాంజన, తేనెలో కరిగించిన ఉప్పుగడ్డలను ముద్దగా చేసి పూస్తే కంటి బాధలు చాలా వఱకు నశిస్తాయి.

అలాగే హరిద్రభస్మం, దారు సింధుత్త (త), రసాంజన, గైరికల ముద్ద కూడా కంటి రుగ్మతలను పోగొడుతుంది. అభయ, త్రిఫలలను నేతిలో వేచి నీటిలో ముంచి కంటి చుట్టూ రాస్తే మంచి ఫలిత ముంటుంది. శొంఠిని వేపాకులతో కలిపి బాగా పొడి చేసి ఉప్పురేణువును కంటి చుట్టూ రాస్తే చిన్న పగుళ్ళు, దురద, నొప్పి వంటి కంటి ఇబ్బందులు నశిస్తాయి. అభయ అనే ఓషధినీ, దానికి రెండింతల అక్షనూ దానికి రెండింతలు అమృతనీ కలిపి బాగా మరిగించి ఆపై చల్లార్చి కషాయం చేసి తేనె, నెయ్యిలతో కలిపి అవలేహాన్ని తయారుచేసి వుంచుకోవాలి. దీనిని కనులు లాగినపుడు, కన్ను నొప్పెట్టినపుడు తింటే ఆ బాధలు తగ్గుతాయి. చందనం వత్తులు, త్రిఫల, పూగపలాశ, తరు మూలకాలను పొడిచేసి నీళ్ళలో కలిపి కరిగించి కంటికి రాస్తే అవి చీకట్లు కమ్మడం ఆగుతుంది. మిరియాల పొడిని పెరుగుతో కలిపి తింటే రేచీకటి తగ్గుతుంది. త్రిఫల చూర్ణాన్ని పాలలో వేసి మరిగించి కషాయం చేసి వడకట్టి రాత్రి నేతితో కలిపి తింటే కంటి చూపు మెరుగవుతుంది.

పిప్పలి, త్రిఫల, ద్రాక్ష, లౌహచూర్ణ, సైంధవ లవణాలను భృంగరాజ రసంలో పోసి ముద్దచేసి అంజనంగా తయారుచేయాలి. దీనిని ఘటికాంజనమంటారు. దీనిని కంటికి పెడితే అంధత, త్రిదోషజన్యతిమిరత, దురద మున్నగు నేత్ర సంబంధిత రోగాలన్నీ నశిస్తాయి. త్రికటు, త్రిఫల, సైంధవ లవణం, రుచిక, శంఖనాభి, మాలతిపూవు, వేపాకులు, రసాంజన, భృంగరాజాలను బాగా చూర్ణం చేసి దానిని నెయ్యి, పాలు, తేనెలలో వేసి చిలికి తయారు చేసిన వటి అను మందు సర్వనేత్ర పీడలనూ పారద్రోలి కనులు మిసమిసలాడేలా చేస్తుంది. ఎరండజడాన్ని కాల్చి ఆ మసిని మజ్జిగ తేటతో కలిపి నుదుటికి రాసినా ముచుకుంద పుష్పరసాన్ని రాసినా తలనొప్పి తగ్గిపోతుంది. శతమూలి, ఎరండమూలం, చక్ర, వ్యాఘ్ర లను ఒక్కొక్క పళం తీసుకుని వాయు, కఫ దోషాలూ బొడ్డు పైకి గల భాగాల్లో తిమ్ముర్లు, నొప్పులు తగ్గుతాయి. భుజస్తంభ (భుజాల్లో కదలిక ఆగిపోవుట) రోగానికి లవణ, విశ్వ, బెల్లాలను గానీ పిప్పలి, గడ్డ ఉప్పులను గానీ ముద్ద జేసి రాస్తే ఫలితముంటుంది. సూర్యావర్తమను పేరుగల పార్శ్వ నొప్పులకు (తలకూడా) నస్యమును పీల్చాలి.. దశమూల మందులను నేతితో కలిపి నస్యమును చేసి పీల్చాలి.

నూట ముప్పయ్యవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment