ప్రమేహ రోగ నిదానం
ప్రమేహ శబ్దానికి మోతీలాల్ బనారసీదాస్ ప్రకాశకులు ప్రచురించిన గరుడ పురాణంలో డయాబిటిస్ అనే అర్థం ఈయబడింది. ఈ గ్రంథంలో చక్కెరవ్యాధి అని కూడా వాడడం జరిగింది.
ప్రమేహ లేదా చక్కెర వ్యాధిలో ఇరవై రకాలున్నాయి. వీటిలో పది కఫ దోషం వల్ల, ఆరు పిత్త ప్రకోపం వల్ల నాలుగు వాత భేదం వల్ల వస్తాయి. కొవ్వు, మూత్రం, శ్లేష్మం వీటికి మూలాలౌతాయి. మూత్ర విసర్జన బట్టి రోగం పేరు ఉంటుంది.
మలం వేడిగావుండి మూత్రం చింతపండు రంగులో యేలాం చేప వాసన వేస్తుంది. – (హరిద్రమేహ)
ఎరుపు వాకతో పసుపు పచ్చరంగు మూత్రం. -(మంజిష్ఠమేహ)
మాంసం వాసనతో ఎఱ్ఱటి లవణాలతో ఎఱ్ఱటి రంగులోనే మూత్రం. – (రక్తమేహ)
తఱచుగా పడుతూ కొవ్వుతో కలసి జారుతూ కొవ్వు రంగులోనే మూత్రం. – (వసామేహ)
మూలగతో కలిసి పడుతూ అదే రంగులో వుండే మూత్రం. – (మజ్జమేహ)
ధారాపాతంగా పడుతూ జిగటగా వుండే చీముతో కలిసిజారే మూత్రం. – (హస్తిమేహ)
మధుమేహ రోగి మూత్రం తేనె రంగులో వుంటుంది. ఈ మేహం రెండు రకాలు. ధాతువులు తగ్గుదల వల్ల ప్రకోపించిన సర్వవాయు (వాత)దోషం వల్ల మూత్ర మార్గం నిరోధింపబడుతుంది. రోగలక్షణాలు కొన్నాళ్ళు పుష్కలంగా కనిపించడం కొన్నాళ్లు అసలు కనిపించకపోవడం, మరల కొన్నాళ్ళకు కనిపించడం అనగా బయటపడడం జరుగుతుంటుంది. దీనికి కారణం మాత్రం కనిపింపదు. కానీ రోగం మాత్రం ప్రమాదకరస్థాయిని చేరుకుంటుంది..
ప్రమేహ వ్యాధులన్నీ, నిర్లక్ష్యం చేస్తే మధుమేహంగా పరిణమిస్తాయి. మధుమేహం అంటేనే పూర్తిగా కుదరనిదని సూచన. ప్రమేహంలో ఏ విభాగంలోనైనా విసర్జనాలు. తేనెలాగుండి తీపి వాసన వస్తుంటే మధుమేహం వచ్చేసిందని భావించవచ్చు.
కఫ దోష జనిత మేహ వ్యాధుల లక్షణాలలో ముందుగా అజీర్ణం, అరుచి, ఆహార నిరాసక్తత, వాంతులు, ఎప్పుడూ నిద్రవస్తున్నట్లే మగతగా వుండడం, దగ్గు, పడిశం బయట పడతాయి. అదే పిత్త జన్యమైతే మూత్రకోశంలోనూ దానికి కాస్త పైనా పీకుతున్నట్లుండడం, వృషణాలలో ఉబ్బు, వాపు, జ్వరం, శరీరమంతా మండు తున్నట్లుండుట, దప్పిక, పుల్ల త్రేన్పులు, మూర్ఛ, మలద్వారము జారినట్లుండుట అనే లక్షణాలు బయటపడతాయి.
వాత దోషజన్యమైన మేహంలో ఈ క్రింది లక్షణాలుంటాయి. ఉదావర్తం (గుద స్థానభ్రంశం) కంపము, గుండెనొప్పి ఘాటైన రుచులకోసం వెంపర్లాట, నిద్రలేమి, పడిశం, దగ్గు, బయటికి తేలకుండా వుండే పుండ్ల ద్వారా పదిరకాల ముదిరిన ప్రమేహాలను ఈ పేర్లతో గుర్తించారు. శరావిక, కచ్ఛపిక, జ్వాలిని, వినత, అలజి, మసూరిక, సర్షపిక, శ్రీ పుత్రిణి, విదారిక, విద్రధి.
ఈ రోగానికి కఫదోషంతో బాటు అపసవ్యమైన ఆహారం మూలకారణం. మరో కారణం సారాయి. మూత్రాశయంలో చేరిన హానికారక కఫం ముందుగా శరీరంలో జరిగే నిత్యకార్యక్రమాలకు అవరోధాలు కలిగిస్తుంది. చెమట, మాంసం, కొవ్వు, ద్రవాలు, రసాలు అన్నీ చెడడం మొదలుకాగానే ”ప్రమేహం” పుట్టుకొస్తుంది.
కఫం క్షీణం కాగానే వాయువు మూత్ర సహిత పిత్తాన్నీ రకాన్నీ, ధాతువులనూ వస్తి భాగంలోకి గొనివచ్చి సర్వనాశనాన్ని సృష్టిస్తుంది. దీనివల్లనే సాధ్య, అసాధ్య నివారణలు గల చక్కెర వ్యాధులన్నీ ఏర్పడుతున్నాయి. మనిషి శరీరానికి చక్కెర చాలా అవసరం. కాని అది అదుపులో నున్నంత కాలమే శరీరానికి ఉపయోగపడుతుంది. కఫం, వాతం, పిత్తం సమపాళ్ళలో నున్నంతకాలం చక్కెర అద్భుతంగా పనిచేస్తుంది.
కూర్చునే ఆసనంలోనే అడ్డదిడ్డంగా శయనించే అలవాటున్న వారికి చక్కెర వ్యాధి వస్తుంది.
ఈ వ్యాధిలో మరికొన్ని పేర్లు, లక్షణాలు చూద్దాం.
స్వచ్ఛంగా చల్లగా, వాసన లేకుండా అధికంగా, నీటివలెనుండు మూత్రం. -(ఉదకమేహ)
తీపి వాసనతో, తేనెలాగాని, చెఱకు రసంవలె గానీ జారిపడు అధికమూత్రం. -(ఇక్షుమేహ)
చిక్కగా పరిగంజివలె జారు మూత్రం. – (సాంద్రమేహ)
మద్యం వలె పారదర్శకంగా జారుతూ చివరలో మాత్రం ముద్దగా పడే మూత్రం. – (సురామే)
ఉడికిన అన్నం ముద్ద రంగులో మరీ తెల్లగా జారే అధిక మూత్రం విసర్జన సమయంలో ఒళ్ళంతటా గగుర్పాటు. – (షిష్టమేహ)
మూత్రంతో బాటు అధిక పరిమాణంలో వీర్యం కూడా పడుట, వీర్యం రంగు మూత్రం. – (శుక్రమేహ)
మూత్రంతో బాటు ఇసుకరేణువుల వంటి అణువులు జారుట. – (సిక్తమేహ)
చల్లటి, తీపి వాసనతో జారు అధికమూత్రం. – (శితమేహ)
నెమ్మదిగా ఆగుతూ ఆగుతూ జారే మూత్రం. – (శనైర్మేహ)
జిగటగా, ఉమ్మివలె, ముక్కలుగా జారే మూత్రం. – (లాలామేహ)
అన్నివిధాల లవణజలాన్ని పోలిన మూత్రం. – (క్షారమేహ)
అన్నివిధాల నీలంగా వుండే మూత్రం. – (నీలమేహ)
అన్ని విధాల నల్లగా వుండే మూత్రం. – (కాలమేహ)
ఇదివఱకు చెప్పబడిన చక్కెర పుండ్లపేర్లలోనే పైనున్న మూత్రం లాగే లక్షణాలు నిక్షిప్తమై వుంటాయి. అవే కాక పిత్త దోషం వల్ల అకస్మాత్తుగా ఏర్పడునవి కొన్ని. కొవ్వు ఎక్కువైనా కూడా పుండ్లు పుట్టుకురావచ్చు. మూత్రం ఎఱ్ఱగానో, చింతపండు కడిగిన నీటిరంగులోనో వచ్చినంత మాత్రాన చక్కెరవ్యాధి సోకిందని నిశ్చయానికి రాలేము. మిగతా లక్షణాలేవీ లేకపోతే ఆ వ్యక్తికి రక్తపిత్తరోగం తగిలిందని అర్థం చేసుకోవాలి.
అతిస్వేదం, కాలుసేతుల దుర్వాసన, బద్ధకం, అంగాలు జారిపోయినట్లుండుట, నిరంతరం పడుకోవాలనే కోరిక, తిండి యాపమీరుట, ఛాతీలో, కన్నుల్లో నాలుక చివర, చెవులలో సన్నని మంటలు రేగుట, పెదవులు బిరుసెక్కుట, తలవెంట్రుకలు, గోళ్ళు దళసరిగా, అతిగా పెరుగుట, చల్లని పదార్థాలనే తినాలనో తాగాలనో అనిపించుట, గొంతు, నోరు బీటలు వేసినట్లనిపించుట, అరికాళ్ళు, అరచేతులు మండుట ఇవన్నీ ప్రమేహ లక్షణాలే. రోగి విసర్జించిన మూత్రానికి చీమలుపట్టుట ఒక ప్రధానసూచన.
నూట ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹