మూత్ర ఘాత నిదానం
సుశ్రూతా! వస్తి, వస్తిశిరం, మేడ్రం, కటి, వృషణములు, గుదము – ఈ ఆరు శరీరభాగాలూ ఒకదానికొకటి సంబంధితములై, ముడిపడియుంటాయి. మూత్రకోశం క్రిందికి వంగి వున్నా ఎప్పుడూ నిండుగానే వుంటుంది. దానిలోకి ఎన్నో చిన్న చిన్న నాళాలు ద్రవాలను తెచ్చి నిరంతరం ఒంపుతునే వుంటాయి. ఈ ద్రవాలలో త్రిదోషాలు ప్రవేశిస్తే ఇరవై రకాల రోగాలొస్తాయి.
మూత్రఘాతం (మూత్రం తొక్కిపట్టబడుట) మధుమేహం పైన చెప్ప ఆరు విశిష్ట భాగాలలో దేనికి సోకినా అన్నీ చెడతాయి. వాతరోగమైతే మూత్రం తక్కువగా వస్తుంది. గాని పోస్తున్నంతసేపూ లింగభాగం నొప్పెడుతునే వుంటుంది. పిత్త దోషమైతే పచ్చగా వచ్చే మూత్రం లింగనాళాన్ని మండిస్తుంది. పోస్తున్నంతసేపూ మంటగానే వుంటుంది. కఫప్రకోపంలో మూత్రం ఎఱ్ఱగా వుంటుంది. లింగం బరువెక్కినట్టుంటుంది. వాపు వుంటుంది.
త్రిదోషాలూ కలిపి వుంటే మూత్రం మెరుపుతో కూడిన పసుపు రంగులో జారుతుంది. వాయువు మూత్రకోశ ద్వారాన్ని తిప్పి వైచి ఎండిపోయేలా చేస్తుంది. పిత్త, కఫాలూ, వీర్యమూ మూత్రంతో కలిసి ఒక గట్టి ముద్దలాగ ఏర్పడతాయి. ఇది గోరోచనంలా వుంటుంది. అశ్మరీ లేదా గోరోజనమను పేరు గల భయంకర రోగంలో కఫ ప్రకోపానిదే ప్రధానపాత్ర. మొదట్లో కనిపించే లక్షణాలు మూత్రకోశం వాపు, ఆ ప్రాంతమంతటా భరింపలేనినొప్పి.
మూత్రం దానికోశంలోనే నిరోధింపబడడంతో మూత్ర విసర్జనం యాతన పూరితమవుతుంది. జ్వరం, ఆహారం పట్ల విరక్తి కలుగుతాయి. బొడ్డు భాగంలో వెనుకవైపూ మూత్రాశయంలోనూ నొప్పులు పెరుగుతాయి. మూత్రం పడినపుడు స్వచ్ఛంగా ముత్యం రంగులోనే వుంటుంది. కాని గొప్ప నొప్పి పుడుతుంది.
ఎప్పటికీ రావటం లేదని బలవంతాన పోస్తే రక్తం, మాంసం బయటికి వచ్చి మరీ ఎక్కువ నొప్పి వస్తుంది. వాతజదోషం వుంటే రోగి పళ్ళు పటపట కొరుకుతుంటాడు, కుదుపుకీ లోనౌతాడు. మూత్రం తఱచుగా చుక్కలు చుక్కలుగా పడుతుంది. మలం వాయు సహితమై పడుతుంటుంది. పిత్తదోషం వల్ల మూత్రాశయంలో మంట పుడుతున్నట్లుంటుంది. ఉడకబెడుతున్నట్లు వేడిగా వుంటుంది.
కఫ దోషం వుంటే అది బరువెక్కిపోయి చల్లగా తగులుతుంది. గోరోజనం చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనిని నిర్మూలించడం సులభమే.
ఇంకా మూత్రానికి సంబంధించి శుక్రాశ్మరి, శర్కర, వాతవస్తి, వాతష్టిల, వాతష్టిల,, వాత కుండలిక, ఉష్ణవాత, మూత్రక్షయ, మూత్రసాద అను పేర్లు గల రోగాలుకూడా ఉన్నాయి. వీటిలో కొన్ని వీర్య సంబంధమైనవి. వీటిని కుదర్చడం సాధ్యమే.
నూట ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹