రక్త, పిత్త, కాస, శ్వాస, హిక్కా, రాజయక్ష్మ, రోగ నిదానాలు – రెండవ భాగము
పడుకుని వుంటే ఊపిరాడదు. కూర్చుంటే కాస్త నయం. నిలబడితే బాగా ఊపిరాడుతుంది. దీనివల్ల రాత్రిళ్లు కాళరాత్రులవుతాయి. తల పైకెత్తితే నుదురంతటా చెమట్లు పట్టి కణతల వద్ద నొప్పి పుడుతుంది. ఊపిరి తీయడం కోసం అవస్థ పడుతున్న రోగి వణకుతుంటాడు. వేడిగా ఏదైనా తాగాలనుకుంటాడు. ఇది తమక దశ.
బలమైన అంగాలు కలవారిలో ఈ రుగ్మతను చికిత్స ద్వారా కుదర్చవచ్చును. తీక్ష్యమైన జ్వరం, కంపనం వున్నవారిని చలవద్వారా రోగముక్తులను చేయలేము.
మహాశ్వాస రోగంలో బాధితులకు ఊపిరందదు. దానికై గట్టిగా ప్రయత్నిస్తే సర్వాంగాలూ బద్ధలైనంత నొప్పి పుట్టుకొస్తుంది. చెమటలు పడతాయి. తెలివి తప్పుతుంటుంది. నడుముకి లోపలంతా మండుతుంటుంది. కళ్ళుపైకెత్తి చూడలేరు. అవి గిరగిర తిరిగిపోతున్నట్లు అనిపిస్తాయి. ఒక కన్ను బాగా ఎఱ్ఱబడిపోతుంది. మలబద్ధక ముంటుంది.
నోరంతా పొడిగా వుంటుంది. అతి వాగుడు, పలవరింతలు, తెలివితప్పుట ఒక దాని వెంట నొకటి వస్తుంటాయి. ముఖం పాలిపోతుంది. లేపి కూర్చోబెడితే శ్వాస తీసుకున్నపుడు శబ్దాలు వస్తుంటాయి. అవి ఎద్దు అంకెల్లా వుంటాయి.
తరువాతి దశలో రోగికి స్పర్శ కూడా తెలియదు. కనులలో ముఖంలో ఏదీ అర్థం. కానపుడు కలిగే గాబరా కనిపిస్తుంది. మలమూత్రాలు ఆగిపోతాయి. మాట పడిపోతుంది.
ఊర్ధ్వ శ్వాసరోగికి నిశ్వాసం ఉండదు. ఊపిరి పీలుస్తున్నట్టే వుంటాడు. అదీ లోపలికి గాలి వెళుతున్నట్టే వుంటుంది. పైకి రాదు. కణతలు, తల తీవ్రమైన నొప్పికి లోనవుతాయి. గొంతు తడారిపోతుంది. నోరు, చెవులు కఫాన్నీ చీమునీ కలిగి నిండిపోయినట్లుంటాయి. వాయు ప్రకోపం వల్ల రోగి అటూ ఇటూ ఏదో, ఎటో తెలియనట్లుగా తిరుగుతుంటాడు. సంధులు నొప్పెడుతున్నాయని మూలుగుతాడు. అరుస్తాడు. కాని ధ్వని బయటకు రాదు. ఈ బాధలన్నిటినీ రోగాన్ని కుదర్చడం ద్వారా తొలగించవచ్చు. అదీ మరీ ముదిరిపోకుండా వుంటేనే, ఈ రోగం శీఘ్ర ప్రాణాంతకం.
హిక్కా ముందుగా ”గాలి ఆకలి” (ఊపిరాడక గట్టిగా ప్రయత్నించి నీరసం తెచ్చుకోవడం) తో సోకుతుంది. ఇందులో భక్ష్యోద్భవ, క్షుద్ర, యమలా, మహతీ, గంభీరా అనే రకాలున్నాయి. మొదటి రకం తొందర తొందరగా గట్టి, ఘాటు పదార్థాలను ముందూ వెనకా చూసుకోకుండా మేసెయ్యడం వల్ల వస్తుంది. ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి వాతం ఆందోళితంగా వున్నపుడు నోట్లోకి త్రోయబడే గట్టి తిండి ద్రవాలు దీనికి ఉత్పాదకాలు. వాయువు రెచ్చగొట్టబడగానే చిన్నచిన్న ధ్వనులు వస్తాయి. రోగి ఏ కాస్త
(హిక్కా అంటే వెక్కిళ్లు)
కష్టించినా వాతం ప్రకోపించి క్షుద్ర హిక్కా వస్తుంది. బోరయెముక నుండి పుట్టే ఈ రోగంలో కొన్నాళ్ళు దాకా వ్యాప్తి, తీవ్రతా వుండవు. తరువాతి రకమైన యమలా జంటలలో కనిపిస్తుంది. అది కూడా తీవ్రంగా వుండదు.
అయితే ఈ దశలో ముఖం వణుకుతుంటుంది. తల, మెడ తిరుగుతుంటాయి. ఇది ముదిరితే తెలివిలేని వాగుడు, వాంతులు, విరేచనాలు, కనుగ్రుడ్లు తిరుగుట, కళ్ళు తేలవేయుట, ఆవులింతలు ఇవన్నీ గోచరిస్తాయి. ఇవన్నీ ఎక్కువ కాలం పాటు వుంటే రోగం ముదురుతోందని గ్రహించాలి.
మహతీ వెక్కిళ్ళలో అన్నీ తీవ్రంగానే ఉంటాయి. కనుబొమ్మలు క్రిందికి జారిపోతాయి. కణతలు లోతుకి పోతాయి, కళ్ళు చెవులకి దగ్గరగా జరుగుతుంటాయి. ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోతుంది. మాటలో స్పష్టత పోతుంది. జ్ఞాపకశక్తి నశిస్తుంది. తెలివి తప్పిపోతుంది, సంధులన్నీ విడిపోతాయి. వెన్నెముక వంగిపోతుంది.
గంభీర అంటేనే తీవ్రత. ఇది నడుము, నాభిలలో మొదలవుతుంది. తీవ్రమైన నొప్పి, పెద్ద ధ్వనులు, పరమహింస, మిక్కిలి బలం (అంటే మందుకి లొంగకపోవడం). దీని లక్షణాలు. పెద్దపెద్ద ఆవులింతలూ, అంగాల కుదుపూ వుంటాయి. జాగ్రత్తగా, ఓపిగ్గా చికిత్స చేస్తే దీన్ని రూపుమాపవచ్చు.
హిక్కా క్షయలు ప్రాణాంతకాలు, ఇతర (ఈ అధ్యాయంలో వున్న) రోగాలు కూడా బలహీనుల, త్రాగుబోతుల, అతి తిండిపోతుల, వృద్ధుల, అతి నీరస జీవుల, మలబద్ధక రోగుల విషయంలో ఒక రోజు నిర్లక్ష్యం చేసినా ప్రాణాంతకాలు అవుతాయి.
రాజయక్ష్మ, క్షయ రోగాలలో తొలి జబ్బు పాతరోజుల్లో నక్షత్రాలకీ, చంద్రునికీ, రాజులకీ, బ్రాహ్మణులకీ ఎక్కువగా సోకేది కాబట్టి దానికాపేరు పెట్టబడింది. దీనికే క్షయ నీ రోగ అని శోష అనీ కూడా పేర్లున్నాయి. దీనికి కారణాలు..
1) సాహసం అనగా తెగింపు, అతి వ్యాయామం, అతి బలం
2) వేగ సంరోధం అనగా మలమూత్రాలను బలవంతంగా అణచిపెట్టుట
3) శుక్రజ స్నేహ సంక్షయం అంటే వీర్యాన్ని, శక్తినీ, బలాన్నీ వృథా చేయడం
4) అన్నపాన విధి త్యాగం అనగా ఒక నియమమూ, అదుపూ లేకుండా తినడం త్రాగడం.
పైన చెప్పిన కారణాల వల్ల వాతం ప్రకోపిస్తుంది. పిత్తం చెదరిపోతుంది. అనవసరాలూ హానికరాలునైన పదార్థాలు గడ్డకట్టిపోయి కఫం ఉద్రేకానికి లోనై అది నాళాలలో పేరుకుపోతుంది. సంధులలో చేరుతుంది. కాలువలను అడ్డుతుంది. అపుడు ఈ రోగం కవాటాలను మూసిగాని, వాచేలా చేసి గాని నరాలను చెడగొడు తుంది. ఆపుడు గుండె దానిప్రక్క క్రింది భాగాల్లో తీవ్రమైన నొప్పి పుడుతుంది.
ఈ రోగ లక్షణాలు (వచ్చిందని సంకేతాలు) పడిశం, ఉష్ణోగ్రత పెరుగుదల, చొంగ కారుట, నోటిలో తీపి రుచి, శరీరం నున్నబడుట, తిండి సహించకపోవుట, నడవాలనే తీవ్రవాంఛ తినాలనే గట్టి కోరిక, ఆ రెండూ చేయలేకపోవడం, స్వచ్ఛతలో అతివ్యగ్రత, ఎంత శుభ్రంగా వున్నదైనా అపరిశుభ్రంగా వుందని అరవడం, తన భోజనపాత్రలో తాగే వాటిలో లేని ఈగలను, తలవెండ్రుకలను గడ్డి పరకలను ఉన్నాయని అనుమానించి ఏరుతుండడం, వెక్కిళ్ళు, అశాంతి, వాంతులు, ఎంత రుచికరమైనవి పెట్టినా బాగులేవనడం.
ఈ రోగిలో కొన్ని సందర్భాల్లో శరీరమంతటా కనులతో సహా తెల్లటి మెరుపు రంగు వచ్చి చేరుతుంది. నాలుక, బాహువు తీవ్రంగా నొప్పెడతాయి. స్త్రీ సుఖం కావాలని పిస్తుంది. మద్యమాంసాలూ కావాలనిపిస్తుంది. తీరా వాటిని చూస్తే చిరాకు కలుగుతుంది. విచిత్రమైన కలలు వస్తుంటాయి.
నిర్మానుష్య గ్రామాలూ, ఎండిన చెరువులు, దొరువులు, చాలా కాంతివంతమైన తోకచుక్కలు, చెట్లతో సహా తగలబడిపోతున్న అడవులు, తనపైకి ఉరుకుతున్న ఊసరవెల్లులు, పాములు, కోతులు, పక్షులు ఇలాటివన్నీ కలలోకి వస్తుంటాయి.
గోళ్ళూ, ఎముకలూ, జుట్టూ అసహజమైన వేగంతో పెరిగిపోతుంటాయి. శ్వాసకోశానికి సంబంధించి ఈ రోగరాజంలో పదకొండు రుగ్మతలు బయట పడతాయి. పడిశము, శ్వాసకృచ్ఛము, దగ్గు, గొంతు నీరసించుట, తలనొప్పి, అన్నద్వేషం, ఎగవూపిరి, అంగముల్లో అతి నీరసం (చీపురుపుల్లల వలె అయిపోవుట) వాంతులు, జ్వరం, ఛాతీనొప్పి – ఇవి వచ్చిన తరువాత గొంతులో భరించలేని బాధ, ఉమ్ములో చీము, నెత్తురు, అంగాలు నొక్కుకుపోతున్న బాధ కలుగుతాయి.
వాత ప్రకోపంవల్ల తల, కణతలు అంగాలు నొప్పెడతాయి. అన్నీ ఒత్తిడికి లోనౌతాయి. గొంతు నొక్కుకుపోతున్నట్లుంటుంది. పిత్త ప్రకోపం వల్ల భుజాలలో మంట, అరికాళ్ళలో, చేతుల్లో మంట, నులుగడుపు, నెత్తుటి వాంతులు, మలంలో దారుణ దుర్వాసన, నోటి దగ్గర దుర్వాసన, జ్వరం, పేలాపన వస్తాయి. కఫం ప్రకోపిస్తే అరుచి, వాంతులు, సగం శరీరం బరువెక్కిన భీతి కలుగుతాయి.
నోటినుండి చొంగకారుట, జలుబు, అజీర్ణం, శ్వాసకృచ్ఛం, గొంతు బొంగురు కూడా కఫం వల్లనే వస్తాయి. జీర్ణకోశం సరిగా పనిచేయకపోవడం వల్ల మామూలుగా స్రవించే ద్రవాలు పెరిగి కఫం రసాలు అతిగా ఊరి నిలవైపోయి నిల్చిపోయి అన్ని నాళాలపై పూతలా ఏర్పడి వాటి ద్వారాలను మూసేస్తాయి. అప్పుడు శరీరంలో ధాతునిర్మాణం ఆగిపోయి మొత్తం అంతటా మంటలు చెలరేగుతున్నట్లుండి మతి చెదరిపోతుంది.
మరికొన్ని దారుణ బాధలు కూడా వుంటాయి. క్షయరోగి తీసుకునే ఆహారం హానికర ఆమ్లాలతో తడిసిపోయి ఇతర ద్రవాలతో కలిసి ఎందుకూ పనికిరాకుండా పోతుంది. అతనికి బలం చేకూరదు. రసాలేవీ అతని శరీరంలో రక్తాన్నుత్పత్తి చేయవు. దాంతో రోగి క్షీణించి పోయి కాళ్ళూ చేతులూ చీపురు పుల్లల్లాగా అయిపోతాయి.
ఈ చీపురుపుల్ల లక్షణం కనిపించే లోపల ఎన్ని రుగ్మతలు బయటపడినా మందుల ద్వారా చికిత్స ద్వారా రోగాన్ని కుదర్చవచ్చు.
దేహంలో జఠరాదిరసాలు పాడైతే కొవ్వు చేరక మనిషి నీరసించిపోతాడు. గొంతు బొంగురు వచ్చి గొంతు బలహీనమై బొంగురువోయి వణుకుతుంది.
వాత ప్రకోపంలో శరీర కాంతి నాశనమగుట, నునుపు పోవుట, వెచ్చదనం. మాయమగుట జరిగి గొంతుభాగం బార్లీగింజ రూపంలో రంగులోకి వచ్చేస్తుంది. కఫ ప్రకోపానికి ఈ జబ్బులో ఒక వింతైన గురక, గొంతులో నిరంతరం జిగటగా చీము కదులుతుండడం సూచనలు.
పిత్త ప్రకోపం వున్న క్షయ రోగికి గొంతు, తాలువు మండుతున్నట్లుంటాయి. కఫ లక్షణాలైన తలతిప్పు, కనులముందు చీకటి తెరలు కూడా. కనిపించవచ్చు.ఏది ఏమైనా కాళ్లు చేతులు చీపురు పుల్లలవలె కాక ముందైతే చికిత్స చేయవచ్చు.
నూట పదిహేనవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹