రక్త, పిత్త,కాస, శ్వాస, హిక్కా, రాజయక్ష్మ రోగ నిదానాలు – మొదటి భాగము
రక్తపిత్త రోగంలో పిత్తం రక్తాన్ని కలుషితం చేస్తుంది. పిత్తం ఆందోళన చెందడానికి ప్రధానకారణం విపరీతమైన, బలమైన తిండి (ఉదా|| కొద్రవ, ఉద్దాలకాది ధాన్యాలు) మిక్కిలి వేడి, పుల్లని, కారపు, ఘాటైన ఇతర చిక్కటి వాసనలు, రుచులుగల పదార్థాలను తినుట వల్ల పిత్తం పాడవుతుంది.
ఈ రోగంలో శరీరం నుండి బయటికి వచ్చే ద్రవాలూ, రసాలూ ఎఱ్ఱగా రక్తపు వాసననే కలిగియుండడం వల్ల ఈ రోగానికి ఆయుర్వేదంలో రక్త పిత్త రోగమని పేరు పెట్టబడింది. ఈ ద్రవాలూ, రసాలూ, రక్త నాళాల్లోంచి, కాలేయం నుండీ, క్లోమం ద్వారానూ స్రవిస్తాయి.
ఈ జ్వరం చేసే రక్త స్రావక దురాక్రమణ. చాలా లక్షణాల ద్వారా సూచించబడుతుంది. తల బరువు, ఆకలి లేకపోవడం, చల్లని వస్తువులు తినాలనిపించడం, దృష్టి పొగలు గ్రమ్మడం, పుల్లవాసనలతో వాంతులు, అసహ్యత, వెక్కుళ్ళు, ఊపిరందకపోవడం, తల తిరగడం, గ్లాని, ఎఱ్ఱరంగుని భరించ లేకపోవటం, జ్వరం తగ్గినపుడల్లా, నోటిలోంచి చేపల వాసన రావడం, కనులలో ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ ఛాయలు ఏర్పడడం, బయట కనిపించే రంగులలో తేడా తెలియకపోవడం, పిచ్చెక్కిపోయినట్లు కలలు రావడం ఈ లక్షణాలు.
తారుమారైన, కలుషితమైన రక్తం శరీరంపైకి ప్రవహించినపుడు ముక్కు కన్ను, నోరు, చెవుల ద్వారానూ, క్రిందికి వచ్చినప్పుడు లింగ, యోని, గుడాల ద్వారానూ బయటికి వస్తుంది. శరీరమంతటా వున్న రోమకూపాల నుండి కూడా చిమ్ముతుంది.
ఈ రోగ చికిత్సలో రక్తాన్ని నిరోధించడం కంటే ప్రక్షాళన చేయడమే మంచిది. కఫం ఉన్నచోట ప్రక్షాళన చికిత్స ద్వారా మొత్తం శరీరమంతా స్వచ్ఛమై పోతుంది. వగరైన తియ్యనైన ఓషధుల ద్వారా కఫమును ఉత్పత్తి చేయవచ్చును. పులుపు, ఘాటు, వగరు గల మందులలో కఫాన్ని ఉత్పత్తి చేసే వాటిని కూడ వాడవచ్చును.
రక్తస్రావం శరీరపు క్రింది భాగాలలో వుంటే రోగి పరిస్థితి ప్రమాదకరంగా వుంటే మంగకాయను వాడాలి. ముందు కొంచెంగా పిత్త పీడక ఔషధాన్ని కూడా వాడితే రోగికి బలం చేకూరుతుంది. అటువంటి రోగికి వగరుగా, తియ్యగా వుండే పదార్థాలను తినిపించడం అవసరం. అయితే పాడైపోయిన పిత్తంతో బాటు వాత, కఫ దోషాలు కూడా కలిసి వున్న రోగిని కాపాడడం అసాధ్యం. ఊర్ధ్వకాయంలో అత్యధిక రక్తస్రావం కలిగిన వారిని ప్రక్షాళించినా ప్రయోజన ముండదు. అసలు ప్రక్షాళనే జరుగదు.
రక్త పిత్త రోగుల్లో ప్రతిలోమ (పైకి) రక్తస్రావమున్న వారికి మంగకాయ (నక్స్వ మికా), ప్రక్షాళన మాత్రమే చికిత్స మార్గములు. అన్ని శారీరక ద్రవాలూ పాడయినపుడు మంగకాయ చికిత్స ఒక్కటే అనుసరింపబడాలి. సాధారణంగా ఈ రోగులకు తొలిరోజు నుండే తీవ్రస్థాయికి చెందిన బాధలు బయటపడుతుంటాయి. కాబట్టి రోగం కచ్చితంగా కుదురుతుందని మాత్రం చెప్పలేము.
కాస (దగ్గు) లోపల్లోపల వేగంగా వ్యాపించే రోగానికి సంకేతం. ఇది వాత, పిత్త, కఫ దోషాలతో బాటు శరీరంలోపల చేయబడిన గాయాల వల్ల లోనికి పోయిన ద్రవ్యాలవల్ల కూడా సోకుతుంది. వాత దోషం వల్ల తీవ్రంగానూ క్రమంగా ఇతరాలలో కాస్త తక్కువ గానూ దగ్గు కనిపిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే శరీరం పూర్తిగా వేగంగా పాడవుతుంది. ఈ రోగం సోకిందనడానికి గొంతు దురద, మంట, అన్నద్వేషం సంకేతాలు.
వాతదోషం వల్ల వచ్చే దగ్గు రుగ్మతలో గొంతు నోరులు బీటలు వేసినట్లవుతాయి. చెవి పొరలు పొడిదేరిపోతాయి. శరీరం లోపల వుండే వాయువులు పైకెగసి ఛాతీలోకి దూసుకుపోయి కంఠనాళమును ఒత్తుతుంటాయి. అన్ని అంగాలలోకి ఆ వాయువు దూరడంతో ఒళ్ళంతా బూరటిల్లినట్టుంటుంది. కనుగ్రుడ్డు పైకి ఉబికి వచ్చినట్లుంటాయి.
గొంతులోంచి ఇనుప రేకులను విరిచిన ధ్వని వస్తుంది. ఛాతీ, పక్కలు, తల, తొడలు నొప్పెడతాయి. ఉద్రేకము, మూర్ఛ వస్తాయి. రోగి మాట్లాడలేక పోతుంటాడు. పొడిదగ్గు బాధిస్తుంది. దగ్గినపుడు శరీరమంతా విపరీతంగా నొప్పి పుడుతుంది. ఆ దగ్గు ధ్వని పెద్దదిగా వుంటుంది. ఒళ్ళంతా గగుర్పాటులకు లోనవు తుంది. అతి కష్టం మీద ఎంతో కొంత పొడి కఫాన్ని ఉమ్మితే కాస్త తేలికగా అనిపిస్తుంది.
పిత్త ద్రవ ప్రకోపం వల్ల వచ్చే దగ్గుకి ఈ లక్షణాలుంటాయి. కళ్ళు పచ్చబడతాయి. నోరు చేదుగా వుంటుంది. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. తల తిప్పుతుంది. వాంతిలో రక్తం పడుతుంది. దాహం వుంటుంది. గొంతు పెగలదు. చూపు మబ్బేసినట్లుంటుంది. మత్తు ఆవరిస్తుంది.
దగ్గినపుడు గొంతుపై అగ్నివృత్తాలు కనిపించి, పోతుంటాయి. కఫదోషం వల్ల వచ్చే ఛాతినొప్పి, తలనొప్పి, తిమ్మిరి, గుండె బరువు వుంటాయి. గొంతునిరంతరం కఫం ముద్దలతో గరగరమంటూనే వుంటుంది. ముక్కు దిబ్బడ, వాంతి వస్తున్నట్లుండడం, తిండి అంటే చిరాకు, ఒళ్ళు గగుర్పాటు కలుగుతాయి.
పోరాటాలలో వ్యాయామాలలో అజాగ్రత్తగా, శక్తికి మించి పాల్గొంటే ఛాతి లోపలి భాగంలో గాయాలై వాత, పిత్త, కఫాలు మూడూ ప్రకోపిస్తాయి. కఫం రక్తంతో కలసి ముడులు కడుతుంది. అది పసుపు పచ్చ లేదా మలిన రంగులో వుంటుంది. రోగి దగ్గుతూ కఫాన్ని ఉమ్ముతున్నపుడు ఛాతీ విరిగిపోతుందేమో అన్నంత బాధ కలుగుతుంది.
శరీరమంతా సూదులతో పొడుస్తున్నట్లుంటుంది. తరువాత బల్లెంతో పొడుస్తున్నట్లుంటుంది.
మోచేతుల, మోకాళ్ళ (సంధుల) నొప్పులు, జ్వరపు వేడితో బాటు పెరుగుతుంటాయి. దాహం, ఊపిరాడక ఆయాసపడుతుండడం, గొంతు క్షీణించడం, వణుకు, పావురం వలె గుడగుడ ధ్వనులు, ఉమ్మినా వాంతి చేసుకున్నా బోలెడు కఫం రావడం, జ్వరం కాస్త ముదిరితే మూత్రంలో రక్తం పోవడం, వెన్నునొప్పి ఇవన్నీ వుంటాయి. ఇవన్నీ క్షతకాస లక్షణాలు. ఈ దశలో వాతం ప్రకోపించి శరీర ధాతువులన్నీ తీవ్రంగా దెబ్బతింటే రాజయక్ష్మ జ్వరం ప్రవేశిస్తుంది.
అప్పుడు రోగి దగ్గినపుడు పడే కఫం ఆకుపచ్చగా, పసుపుపచ్చగా, ఎఱ్ఱని చారలతో నిండి బహిర్భూమి సందర్భంలోని దుర్వాసన వేస్తుంటుంది. చీము కూడా పడుతుంటుంది. నిద్ర పోవడానికి ఎంత ప్రయత్నించినా నొప్పి వల్ల కుదరదు. గుండెను ఎవరో మూకుడులో పెట్టి వేయిస్తున్నట్లుంటుంది. అకస్మాత్తుగా వేడిగా ఒకమారు చల్లటిదొక మారు తినాలని పిస్తుంది. ఎంత తిన్నా చాలదనిపిస్తుంది. నీరసం ఎక్కువవుతుంది.
ఉన్నట్టుండి ముఖం కాంతివంతంగా, గాజువలె నున్నగా అవుతుంది. కనులలో మెరుపు కనబడుతుంది. అయినా రోగబాధలన్నీ పెరుగుతుంటాయి. బలహీనులను ఈ జ్వరం పూర్తిగా వంచివేస్తుంది. బలవంతులలో గాయాల వల్ల వచ్చిన దగ్గు అయితే చికిత్స ప్రారంభ దశలో వుండగానే తగ్గిపోతుంది. జాగ్రత్తగా చికిత్స చేస్తే వృద్ధులను కూడా తొలిదశలలోనైతే రోగవిముక్తులను చేయవచ్చు. దగ్గు, మండాగ్ని, క్షయ, కడుపులో తిప్పు, వాంతి మున్నగు రోగలక్షణాలు కనబడగానే నిర్లక్ష్యం చేయకుండా చికిత్సకుని సంప్రదించాలి. లేకుంటే అవి చాలా వేగం ముదిరి పోతాయి.
శ్వాస నిరోధక రోగం దగ్గు బాగా ముదిరితే వస్తుంది. శరీరంలోని ద్రవాలను ఉద్రిక్తపఱచడం వల్ల కూడా ఇది రావచ్చు. ఆమాతిసారం (చీము విరేచనం) వమనం, పచ్చకామెర్లు, ధూళి అసహ్యత, పొగ, గాలి తెరలలో చిక్కుకొనుట, మంచు కరిగిన నీరు, విషతుల్యరసాలు, సంధులపై హింస్రకదాడులు కూడా శ్వాస నిరోధక జ్వరాలను కలిగిస్తాయి. ఇందులో క్షుద్రక, తమక, ఛిన్న, మహా, ఊర్ధ్వ అని ఐదు రకాలున్నాయి. కఫం పేరుకుపోవడం వల్ల గాలికి అడ్డంకి ఏర్పడుతుంది.
శరీరంలో నిరంతరం పరిభ్రమించే వాయువులు ఒకచోట నిరోధింపబడితే చుట్టూ తిరుగుతూ మెత్తటి ప్రధాన కణజాలాలపై నాళాలపై గుండెపై, బలమైన ఒత్తిడిని కలుగజేసి ఆయా భాగాలను పాడు చేస్తాయి. నడుము లోపలి అంగాలను కూడా ప్రభావితం చేస్తాయి.
ఈ రుగ్మతలో కనిపించే తొలి బాధలు ఛాతీలో నొప్పి, శ్వాసలో తేడా, మలబద్ధకం, కణతల వద్ద పగుళ్ళు వేస్తున్నంత నొప్పి, అతిగా తినడం వల్ల ఆయాసం. లోలోన ఉద్రేకించిన వాయువులు శ్వాసనాళాలలో వెనుకకూ ముందుకూ పరుగిడుతూ కఫాన్ని రెచ్చగొడతాయి.
దానివల్ల కలిగే శ్వాసలో శ్రమను, క్షుద్ర శ్వాస రుగ్మత అంటారు. అది తలను, మెడను, గుండెను పిడికిట బట్టి వాటి పక్కలలో అతి నొప్పిని కలిగిస్తుంది. గొంతులో పిల్లికూతలు, వెక్కిళ్ళు, పడిశము, ముక్కు వాపు వస్తాయి. కఫం పైకి పోయినపుడు ఒళ్ళంతా నొప్పెడుతుంది. కాని అది పోగానే కాసింతసేపు ఊపిరాడుతుంది.
ఇంకా ఉంది
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹