Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నూట పద్నాల్గవ అధ్యాయం

జ్వర నిదానం

జ్వరాలలో చాలా రకాలే ఉన్నాయి. కొన్నిటి పేర్లు ఇలా వుంటాయి. ఇవి శివుని కంటిమంట నుండి పుట్టినవని అంటారు. రోగపతి, పాప్మ, మృత్యురాజ, అశన, అంతక, ఓజో౬ శన, మోహమయ, సంతాపాత్మ, సంతాప, అపచారజ జ్వరాలు ఎక్కువగా బాధిస్తాయి.

ఏనుగు కొచ్చే జ్వరాన్ని పాకలమనీ, గుఱ్ఱానికొచ్చేదాన్ని అభితాపమనీ, కుక్కకైతే అలర్కమనీ అంటారు. మేఘాలకీ, నీటికీ, మందులకీ, నేలకీ కూడా జ్వరాలొస్తాయి. వాటి పేర్లు క్రమంగా ఇంద్రమదం, నీలిక, జ్యోతి, ఊషర.

కఫజ్వర లక్షణాలు :-

గుండెగాబరా, వాంతి, దగ్గు, చలి, వాపు, కఫం ద్వారా వచ్చే జ్వరలక్షణాలు. తరువాత ఒళ్ళు నొప్పులు వుంటాయి. చికిత్స ఆలస్యమైనా సరైన మందు పడకపోయినా ఈ బాధలు రోజురోజుకీ పెరిగిపోతుంటాయి. ఏ సమయంలో ఏ లక్షణం ఎక్కువవుతోందో చూసి మందువెయ్యాలి. ఉపశయ (ఎక్కువ కావడం) అనుపశయ (కాకపోవడం) ములను బట్టి రోగాలే మారుతుంటాయి.

అనగా మందు, విహారం, అన్నం, దేశకాలాదులలో మార్పు ఒక మనిషికి సుఖాన్ని కలిగిస్తే అది ఉపశయం. వీటిలో నేదైనా ఒక వ్యక్తి సుఖాన్ని హరిస్తే లేదా హాని కలిగిస్తే అది అనుపశయం.

అరుచి, అజీర్ణం, స్తంభనం, బద్ధకం, గుండెలో మంట, విపాకం, నిద్ర వస్తున్నట్లు ఉడడం, చొంగ కారడం, గుండె బరువెక్కడం, ఆకలి వేయకపోవడం బిరుసుగా తగలడం, ఒళ్ళు పాలిపోవడం, ఒళ్ళు బరువెక్కడం, మూత్రం మాటి మాటికీ రావడం, శరీరకాంతి తగ్గడం, ఇవన్నీ ఆమ (కఫంలో ఒక) జ్వర లక్షణాలు.

ఆకలి మందగించడం, ఒళ్ళు తేలిపోతున్నట్లుండడం, సామాన్య జ్వరలక్షణాలు. జ్వరంలో వాత, పిత్త, కఫ రోగాల మూడు లక్షణాలు కనిపిస్తే దానిని పరిపక్వ అష్టాహ మంటారు. రెండింటి లక్షణాలుంటే ద్వంద్వజమంటారు.

వాత- పిత్త- జ్వరలక్షణాలు:-

తలనొప్పి, మూర్ఛ, వాంతులు, ఒళ్ళు వేడెక్కడం, మోహం, గొంతు బలహీనంగా వుండడం, ముఖం డోక్కుపోవడం, అరుచి, ఒంట్లో ప్రతి భాగంలో విరగదీసినంత నొప్పి, అనిద్ర, చిత్తభ్రమ, రోమాంచం, చలి ఇవన్నీ వాత, పిత్త జ్వరం తగిలిన శరీరంలో కనిపించే లక్షణాలు.

కఫ-వాత జనిత జ్వరానికి ఉష్ణోగ్రత పెద్దగా వుండదు. తలనొప్పి, అరుచి (అంటే నాలుకకి ఏదైనా చేదుగా గానీ రుచి హీనంగా గాని తగలడం) సంధులలో నొప్పి, మాటి మాటికీ రావడం, ఊపిరి భారం కావడం, దగ్గు, ముఖం పాలిపోవటం, చలి, పగటిపూట కూడా కనులు చీకట్లు కమ్మడం, నిద్రపట్టకపోవడం ఇవన్నీ వుంటాయి.

బయట వేడిగా వున్నా చలివేస్తున్నట్లు అనిపించడం, ఒళ్ళు కొయ్యబారి నట్లుండడం, చెమట, దాహం, మంట, దగ్గు, శ్లేష్మ పిత్తాల జోరు, మూర్ఛ, అనాసక్తి, బద్ధకం, నోరు చేదుగా అనిపించడం, ఇవన్నీ శ్లేష్మ పిత్త జన్యమైన జ్వరాన్ని సూచిస్తాయి.

వాత- పిత్త- శ్లేష్మ అన్ని లక్షణాలూ కనిపిస్తే సర్వజ (సన్నిపాత) జ్వరంగా భావించాలి. దానికైతే ఈ లక్షణాలన్నీ ఒక్కొక్క మారు ఒక్కొక్కటిగా బయల్పడుతుంటాయి. సన్నిపాతంలో చలి, పగటి మహానిద్ర, రాత్రి నిద్రలేమి గాని దినరాత్రులు మొత్తంగా నిద్ర గాని వుంటాయి. ఆ నిద్రలేమి సమయంలో రోగి పాటలు పాడతాడు. నాట్యం చేస్తాడు. లేదా హాస్యాలాడతాడు.

అతని సామాన్య స్థితి పోలిక లేనంతగా మారిపోతుంది. కనులు మలినమవుతాయి. అశ్రువులను వర్షిస్తాయి. కనుల చివరలు ఎఱ్ఱబడతాయి. పూర్తిగా మూతబడవు. శరీరంలో పిక్కలు, పక్కలు, తల సంధులతో సహా ప్రతి ఎముక నొప్పెడు తుంది. చిత్త భ్రమకూడా ఉంటుంది. రెండు చెవుల నుండీ శబ్దాలు, హోరు వస్తుంటాయి. పోటు కూడా వుంటుంది. నాలిక కొంత ఎఱ్ఱగా, కొంత నల్లగా వుండి దురదేస్తుంటుంది. తడి ఆరిపోతూ పొడిగా వుంటుంది. ఎముకలు, సంధులు సడలిపోయినట్లుగా వుంటాయి.

రోగి నోటినుండి రక్త పిత్త మిశ్రితమైన ఉమ్మి పడుతుంటుంది. తట్టుకోలేనంత దాహం వేస్తుంటుంది. కోష్ట (పొట్ట) ప్రదేశాలన్నీ నల్లగా ఎఱ్ఱగా అయిపోతాయి. గుండ్రటి దద్దుర్లు పొట్టపై ఏర్పడతాయి. గుండెలో బాధ కలుగుతుంది. అన్ని ద్వారాల నుండీ అత్యధికం గానో, అత్యల్పంగానో విసర్జనాలు వస్తుంటాయి. ముఖంలో జిడ్డు, నీరసం, హీనస్వరం, తేజస్సు మందగించడం, ప్రలాపం పుట్టుకొస్తాయి. ఈ జ్వరం బయటపడ కుండా లోపల్లో పలే శరీరంలో పెరుగుతుంటుంది.

గొంతునుండి గురక, కంఠం నుండి అవ్యక్త శబ్దాలు, శరీరాన్ని కదపాలనే కోరిక నశించడం అనే లక్షణాలు కనిపిస్తే రోగవ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరిపోయిందని అర్థం. దానిని బలవీర్య – వినాశక అభిన్యాస – సన్నిపాత జ్వరంగా వ్యవహరిస్తారు.

ఈ సన్నిపాత జ్వరం యొక్క వాయు వికారం వల్ల గొంతులో అడ్డు ఏర్పడి పిత్తంలోపలి భాగంలో నొప్పి పుట్టుకొచ్చి నాసికాదులు కారుతుంటాయి. కళ్ళు పచ్చబడతాయి. మూడు రకాల జ్వరమూ ఒకేసారి తగిలినపుడు శరీరంలోని అగ్నితత్త్వం నశించిపోవడం మొదలౌతుంది. అది పూర్తిగా నశిస్తే మాత్రం రోగం మానడం అసాధ్యం.

ఈ సన్నిపాత జ్వరానికి మరోరూపం కూడా ఉంటుంది. పిత్తం వేరైపోయినట్లుం టుంది. పొట్టలో మంట పుడుతుంది. జ్వరం రాకముందే ఒక విధమైన గాబరా వుంటుంది. వాత -పిత్త ప్రవృత్తులు శరీరంలో పెరుగుతుంటే ఈ జ్వరం కమ్ముతుంది. చలీ, వేడీ రెండూ వుంటాయి. వాటినుండి రక్షింపబడడం మిక్కిలి కష్టం, శీత ప్రభావం వల్ల నోటినుండి కఫం వస్తుంటుంది. నోరు ఎండిపోతుంది. పిత్తం పనితగ్గడం వల్ల మూర్ఛ, మదం, దాహం ఏర్పడతాయి. బద్ధకం, కదలలేనితనం వచ్చి పుల్లవాంతులవుతాయి.

ఆగంతు జ్వరలక్షణాలు:-

బాహిర కారణాల ద్వారా తగిలే ఈ తాత్కాలిక జ్వరం దెబ్బ తగలడం వల్ల కానీ, సంయోగం వల్ల కానీ, శాపం లేదా రక్తం తగలడం వల్ల గానీ చిల్లంగి దిష్టి వంటి ప్రయోగాల వల్ల గానీ వచ్చే జ్వరాన్ని ఆగంతు జ్వరం అంటారు. వీటిలో మొదటిది అభిఘాతజం అనబడుతుంది.

కాలిన గాయాల వల్ల గాని ఒళ్ళు చురికిపోవడం వల్ల గానీ వచ్చేది అభిఘాతజ జ్వరం. అత్యధిక శ్రమ వల్ల వచ్చే జ్వరంలో వాతం రక్తాన్ని పాడుచేస్తుంది. చర్మం పేలిపోయినట్లవుతుంది. ఒళ్ళు నొప్పులు వాపులు వుండి ఉష్ణత పెరుగుతుంది.

దుష్ట గ్రహపీడ, మత్తు పదార్థాలు, విషాలు, కోపం, భయం, దుఃఖం, ప్రేమ కూడా జ్వరాన్ని కలిగిస్తాయి. ఇది సామాన్య జ్వరంలాగే వుంటుంది కానీ తెరలు తెరలుగా వచ్చే నవ్వూ, ఏడుపూ దీని ఉదృతిని తెలియజేస్తాయి.

మత్తుమందులనీ, పొగనీ పీల్చడం వల్ల వచ్చే జ్వరానికి స్పృహతప్పుట, తలనొప్పి, వాంతులు, తుమ్ములు లక్షణాలు. విషం వల్ల వచ్చే జ్వరంలో తెలివి తప్పుట, విరేచనాలు, కనులు చీకట్లు కమ్ముట, చర్మం రంగు మారుట, మంట, తలతిరుగుట, కనిపిస్తాయి. కోపం వల్ల వచ్చే జ్వరంలో ప్రత్యేకంగా వణుకు, దడ, తలనొప్పి పుట్టుకొస్తాయి.

క్రోధ జ్వరంలో లేదా భయ జ్వరంలోనైతే ఆగకుండా వెలువడే వాగుడు ప్రత్యేక లక్షణం.. ప్రేమ, కామం వల్ల జ్వరం వచ్చినపుడు మత్తుగా వుంటుంది. ఏం తిన్నా రుచి తెలియదు. ఒళ్ళంతా మండుతున్నట్లుంటుంది. సిగ్గుగా వుంటుంది, నిద్రపట్టదు, బుజ్జ సరిగా పనిచేయదు, ధైర్యం పోతుంది.

గ్రహదోష జ్వరంలో సన్నిపాత లక్షణాలు కనిపిస్తాయి. అదనంగా వాయుసమస్య, జీర్ణసమస్య ఉంటాయి. శాప, రక్త జ్వరాల్లో అన్ని బాధలూ భరించలేనంతగా వస్తూ పోతుంటాయి. మంత్రోచ్చాటన జరుగుతున్నపుడల్లా రోగులు ఎగిరెగిరిపడుతుంటారు. శరీరం పగుళ్ళు వేస్తుంటుంది. మత్తు ఆవహిస్తుంది. ప్రతిభాగం మండుతున్నట్లుగా వుంటుంది. మూర్ఛవస్తుంది. ఉష్ణోగ్రత రోజు రోజుకీ పెరిగిపోతుంటుంది.

జ్వరాలలో ఎనిమిది రకాలుంటాయి. ముందుగా శారీరక, మానసిక విధాలుగా వాటిని విభజించారు. అలాగే మంద, తీవ్ర, అంతర, బాహ్య, ప్రాకృత, వైకృత, కుదిరేవి. కుదరనివి, పక్వాలు, అపక్వాలు. వీటిలో మొదటివి శారీరకం. రెండోవి మానసికం.

కఫ, వాత, మిశ్రిత రోగాలలో చలి, వణుకు వుంటాయి. పిత్తలోపం వుంటే ఒళ్ళంతా మంటలు పుడుతున్న బాధ వుంటుంది. మూడింటి సన్నిపాతమూ వుంటే ఒక మారు చలీ ఒకమారు వేడీ బాధిస్తాయి. (ఈ వేడినే ఉడుకు అంటారు) ఈ జ్వరం లో జ్వరమైతే (ఆంతరమైతే) అన్ని బాధలు లోపలే వుండి మలబద్ధకం కూడా పుట్టుకొస్తుంది. బాహిర జ్వరానికి ప్రత్యేక లక్షణం విరేచనాలు. ఈ జ్వరాలను కుదర్చవచ్చును.

ప్రాకృత, వాత, వర్షాకాల జ్వరాన్నీ, వైకృత వర్షకాల జ్వరాన్నీ కుదుర్చుట దాదాపు అసాధ్యం.

ఆకురాలు కాలంలో పిత్తదోషంవల్ల వచ్చేది ప్రాకృత జ్వరం, వాత, కఫ దోషం వల్ల వచ్చేది వైకృతం. కాలంలో కఫదోష జ్వరాన్ని ప్రాకృతమనీ ఇతరాలని వైకృతమనీ అంటారు. వైకృతరోగాలేవీ కుదిరేరోగాలు కావు (జ్వరాలు మాత్రం) వాత దోషం వల్ల వానల కాలంలో వచ్చే జ్వరానికి పిత్త, కఫాలు కూడా లోనవుతాయి. ఆకురాలు కాలంలో పాడయిన పిత్తం కఫాన్ని కలుపుకొని జ్వరాన్నేర్పాటు చేస్తుంది.

ఈ జ్వరాలకు లంఖణం మంచి నిరోధక మార్గమే. వసంతంలో వన్నె చెడిన కఫం వాతంతో కలిసి తెచ్చే జ్వరాలుంటాయి. పిత్త దోషం కూడా కలుస్తుంది. బలంగా వున్న మనుష్యులు జ్వరాన్ని మందులనే ఆయుధాలతో జయిస్తారు కానీ జన్మతః బలహీనులను జ్వరం బలిగొంటుంది. మలబద్ధకం వల్ల వచ్చేదీ, మూడు దోషాలు కలిపివుండేదీ ఆమజ్వరం.

జఠరాగ్ని మందం, అతిమూత్రం, జీర్ణమండల వ్యవస్థ మందగించడం (ఆకలి నశించడం) దీని లక్షణాలు.

పచ్యమాన జ్వరలక్షణాలు ఉష్ణోగ్రతతో సహా దాహం, వాగుడు, పలవరింతలు అన్నీ తక్కువ కాలంలోనే పెరిగిపోవడం, ఊపిరి తీవ్రంగా వేగవంతమవుతుంది. తల తిరుగుతుంది. నీళ్ళ విరేచనాలవుతాయి. నొప్పులుంటాయి. జీర్ణకోశాన్ని ఖాళీగా వుంచితే ఆమల వ్యర్థాలు పోతాయి కాబట్టి ఈ జ్వరానికి వారం రోజుల ఉపవాసాన్ని (లంఖణాలని) గట్టిగా సూచించవచ్చును. జఠర రసాల్లో లోపాలను బట్టి అయిదు రకాల జ్వరాలను పోల్చవచ్చును.

సంతత, సతత, అన్యెద్యు, త్రిత్యక, చతుర్థక సప్తధాతువులలోనూ, మలమూత్ర కోశాలలోనూ, నాళాలలోనూ పేరుకుపోయిన జ్వరం ఏడు, పది లేదా పన్నెండు రోజుల్లో వాత, పిత్త, కఫ దోషాలతో బాటు తగ్గించబడవచ్చు. తగ్గుతుంది కూడా. తగ్గకపోతే మాత్రం ప్రాణాపాయమే. ఇలా అగ్నివేశుడన్నాడు. పదునాల్గు, తొమ్మిది, పదకొండు రోజులని హారితుడన్నాడు..

శుభ్రత, పరిశుభ్రత, అపరిశుభ్రతల ప్రభావం కూడా దోషనివారణకు పట్టే కాలంపై ప్రభావాన్ని చూపుతాయి. అలాగే ఒళ్ళు బరువుకూడా. దోషం పూర్తిగా మందులు, ఆహారపు మార్పుల వల్ల,నశించాకనే జ్వరం కూడా తగ్గిపోతుంది. జ్వరం తగ్గుతున్న కొద్దీ బాధితుల మలమూత్ర విసర్జన ప్రక్రియలు మెరుగు పడుతుంటాయి. అలాగే ముఖంలో తేటదనం, మెరుపు, శరీరంలో చురుకుదనం కూడా పెరుగు తుంటాయి.

శరీరగత ద్రవాల విషమత సాధారణంగా సతత జ్వరానికి కారణమవు తుంది. ఇది మొదట్లో వచ్చిపోతుంటుంది. పోయింది కదాని ఆలసిస్తే పీకపట్టుకుంది. రాత్రిళ్ళు ఎక్కువగా బాధపెడుతుంది. అన్యెద్యు జ్వరం సంధ్య (పగటికీ, రాత్రికీ మధ్య) లో ఎక్కువ ఉగ్రమవుతుంది. ఇందుల మాంస పుష్టిగల శారీరక ప్రదేశాలు ప్రభావితమవుతాయి. తలనొప్పి ఎక్కువగా వుంటే ఇది పిత్తవాత దోషమనీ (త్రిక) వెన్నునొప్పిగా వుంటే అది కఫ,పిత్త, దోష జనితమని గ్రహించాలి. వాత, కఫ దోష జనితమైన జ్వరంలో వీపంతా నొప్పెడుతుంది. ఈ జ్వరం ఒకరోజు మధ్యలో పూర్తిగా ఆగిపోతుంది. మరల ఒకరోజు తరువాత మొదలవుతుంది.

చతుర్థక జ్వరానికి కొవ్వు, మూలుగ, ఎముకలు గురవుతాయి. మూలుగుకు మాత్రమే అంటే దోషం రోజులో రెండు మార్లు విజృంభిస్తుంది. కఫ దోషముంటే మోకాళ్ళు నొప్పెడుతాయి. తొడనొప్పీ వుంటుంది. వాత దోషముంటే తల నొప్పి కూడా వుంటుంది. ఈ చతుర్థక విపర్యయజ్వరం సరైన మందుపడితే నాలుగవ రోజు కల్లా తగ్గుముఖం పడుతుంది.

ద్రవాలు ఊరడంలో తేడా గలవారు వారం పాటు లంఖణాలు చెయ్యాలి. ఆయితే ఈ జ్వరదోషాలు మెదడులోనికి ప్రవేశిస్తే మాత్రం దానిని ఆపడం అసాధ్యం.

జ్వరం దోష ప్రవేశానికి సంకేతం రోగం శరీర ద్రవాలతో కలిసి నెమ్మదిగా ప్రవహిస్తూ రక్తనాళాలను కలుషితం చేసి వ్యాపిస్తుంది. మందు ప్రవేశించని మనిషి బలహీనుడవుతున్న కొద్దీ రోగం తీవ్రతరమై విషపు స్థాయిని చేరుకొంటుంది. కాబట్టి జ్వరం కనబడినా ”అదే పోతుందిలే” అనుకొని ఒక లంఖణం చేసేసి ఊరుకోకూడదు.

విషమ, సతత జ్వరాలు దేహ రసాలలోకి ప్రవేశించి ఆగగానే కొన్ని లక్షణాలు బయటపడతాయి. అవి సముద్ర ప్రయాణం తొలిసారి చేసే వారికి వచ్చే రుగ్మతలను పోలివుంటాయి. తరువాత ఒళ్ళు బరువు, నిస్త్రాణ, కాలుసేతులను పొడుస్తున్నట్టుగా నొప్పులు, ఆవులింతలు, అరుచి, వాంతి వస్తున్నట్లుండడం, శ్వాసలో శ్రమ. జ్వరం రక్తంలో చేరితే మరిన్ని లక్షణాలు బయటపడతాయి. అవి ఉమ్మితే రక్తం పడడం, తీవ్ర పిపాస, చర్మంపై వేడి పగుళ్ళు, ఎఱ్ఱమచ్చలు, మంట, తల తిరుగుడు, మత్తు, అతి పలవరింతలు.

జ్వరం మాంసంలోనే వుంటే దాహం, అలసట, అపనమ్మకం. లోపలంతా మండుతున్నట్టుండడం, కళ్ళు తిరగడం, చీకట్లు కమ్మడం, దుర్వాసన, అంగాలలో వణకు కనిపిస్తాయి. జ్వరం కొవ్వులోనికి చేరినప్పుడు చెమట, అతిపిపాస, వాంతులు, పుల్లవాసన, చిరాకు వుంటాయి. ఇక జ్వరము ఎముకలలోనికి దూరినపుడు కనిపించే లక్షణాలు తెలివితప్పడం, పలవరింతలు, అలసట, అరుచి, ఆకలి బాగా మందగించుట, ఎముకలలో నొప్పి, జ్వరం వీర్యంలోనికి ప్రవేశిస్తే చీకట్లు కమ్ముతాయి. సంధులు వీడిపోతున్న ట్లవుతాయి. లింగం మొద్దుబారిపోతుంది. వీర్యం కారితే మరణమే సంభవిస్తుంది.

రస, రక్త, మాంస, మేద, అస్తి, మజ్జ, శుక్ర అనేవి సప్తధాతువులు..

ఈ అయిదు రకాల చతుర్ధక విపర్యయ జ్వరాలనూ వాటి దశలు పెరిగేకొద్దీ తగ్గించడం కష్టమవుతూ వుంటుంది. ప్రలేపక రకానికి చెందిన జ్వరానికి లక్షణాలు స్పృహ తప్పుట, పలవరింతలు, చలి, వేడి తగ్గిపోవడం, అంగాలన్నీ బరువెక్కడం, శరీర మంతటా కఫం ఒక పొరలాగా ఏర్పడినట్లు భయం కలగడం.

అంగ బలాక ( అంగాల బలాన్ని తినివేయు) జ్వరంలో ఉష్ణోగ్రత పడిపోవడం, ఒళ్ళంతా గరుకుగా కొయ్యబారినట్టుండడం, నడక కష్టం కావడం, అంగాలు తిమ్మిరెక్కడం, నిరంతరం కఫం బయటికి వస్తుండడం జరుగుతాయి. ఈ సమయంలో శరీరం నుండి స్రవించే ద్రవం చింతపండు ముక్కల రంగులో వుంటే దానిని హారిద్రక జ్వరమంటారు.

ఈ పసుపు పచ్చ జ్వరం ప్రాణాంతకమే. రాత్రిజ్వర లేదా పౌర్వరాత్రిక జ్వరంలో మూడు రకాల దోషాలుంటాయి. రోగి బలహీనుడైపోతాడు. ఇది రాత్రి మాత్రమే కాస్తుంటుంది. పగటి వేళ ఇది కనబడకనే పోవడానికి కారణం కఫంలో తేమపోగా వాతం పొడిగా అయిపోవడం.

కఫము, పిత్తమూ రోగి మొండెంలో చెడినపుడు శరీరంలో పైభాగాలన్ని వెచ్చగా, వేడిగా తగులుతుండగా బొడ్డు కింద అన్ని భాగాలూ మంచు ముద్దల్లా తగుల్తాయి.

శరీర ద్రవాల్లో రసాల్లో, రక్తనాళాల్లో వున్న జ్వరాన్ని చికిత్స ద్వారా తరిమేయ వచ్చును. కొవ్వులో మాంసంలో చేరిన జ్వరాన్ని మాన్పవచ్చు. ఎముకల్లో మూలుగలో దూరిన జ్వరం తగ్గదు. (అస్థిగతరోగం) ఇందులో అపస్మారకం, కోపదారి తనం ప్రధాన లక్షణాలు.

జ్వరం తగ్గినట్లు ఎలా తెలుస్తుందంటే రోగికి శరీరం తేలికైనట్లుంటుంది. అలసట తీరుతుంది. ఉష్ణోగ్రత వుండదు. కనులు తేటగా వుంటాయి. చిన్న చిన్న చెమరింపులుండి వెంటనే ఆరిపోతుంటాయి. నోరు ఎగుడు దిగుడుగా వున్నట్లని పిస్తుంది. ఏదైనా తినాలని పిస్తుంది. మనసు ప్రశాంతంగా వుంటుంది. తుమ్ములు వస్తాయి. తుమ్మినపుడల్లా హాయిగా వుంటుంది. బుఱ్ఱ గోక్కోవాలనిపిస్తుంటుంది.

నూట పద్నాల్గవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment