ధ్యాన యోగవర్ణన
పరమేశ్వరా! భోగాన్నీ మోక్షాన్నీ ఇచ్చే శక్తి యోగానికుంటుంది. యోగులు ధ్యానం ద్వారా పరమాత్మను పొందగలరు. యోగానికీ ధ్యానానికీ గమ్యమైనవాడు పరమాత్మయే. అట్టి యోగాన్ని తత్త్వసారంలో భాగంగా మీకు వినిపిస్తాను. ఇది సమస్త పాపనాశకరం. దీనిని యోగి ఇటువంటి భావనతో సంకల్పంతో ప్రారంభిస్తాడు. ఇలా:-
నేను విష్ణువును. నేనే అందరికీ ఈశ్వరుడను. నేనే అనంతుడను. “షడూర్మ. రహితుడను నేనే. నేను వాసుదేవుడను. నేనే జగన్నాథుడను. బ్రహ్మరూపమూ నాదే. సమస్త ప్రాణుల శరీరాలలోనుండు ఆత్మనూ, సర్వదేహ విముక్తుడైన పరమాత్మనూ నేనే.
షదూర్మ – శోకమోహొ జరా మృత్యూ క్షుత్పిపాసే షదూర్మయః
అని శబ్ద కల్పద్రుమంలో చెప్పబడింది. శోకం, మోహం, ముసలితనం, మరణం, ఆకలి, దప్పిక అనే ఆరు ఊర్ములు మనిషిని బాధిస్తాయి. యోగిని బాధించలేవు.
క్షరానికీ (ప్రపంచం) అక్షరానికీ (చేతన) అతీతుడను, శరీరధర్మరహితుడను, ఇంద్రియాలకు లొంగని అతీంద్రియుడను, హోతను, ద్రష్టను, శ్రోతను, ఘ్రాత (గంధాన్ని గ్రహించు వాడు)నూ నేనే.
అందరి మనసులలో నేనుంటాను గాని నాకు మనసు లేదు. విజ్ఞానినీ జ్ఞాన స్వరూపాన్నీ నేనే. దృగ్రూపుడను నేనే. ప్రాణులలో ప్రాణస్వరూపుడను, అహంకారాది రహితుడను, అహంకార జన్య వికారాల నుండి కూడ ముక్తుడను నేనే.
ఈ జగత్తుకి సాక్షినీ, నియంతనూ నేనే. పరమానంద స్వరూపమూ నాదే. జగత్తు యొక్క జాగ్రత్, స్వప్న, సుషుప్త్యవస్థలకు సాక్షీభూతుడనైన నాకు ఏ అవస్థలూ వుండవు. తురీయ బ్రహ్మనూ విధాతనూ నేనే. దృగ్రూప పరమాత్మనూ నేనే. (సమస్త ప్రపంచానికీ ద్రష్టం, దృశ్యం, దృష్టి అనేవి ఉంటాయి. ఈ మూడూ పరమాత్మే. ఆయనే దృగ్రూపుడు) నిర్గుణ, ముక్త, బుద్ధ, శుద్ధ, ప్రబుద్ధ, అజర, సర్వవ్యాపి, సత్యస్వరూప, శివస్వరూప పరమాత్మను నేనే”.
ఈ ప్రకారం విద్వాంసుడైన యోగి పరమాత్మను పూర్తిగా తెలుసుకొని, తానే పరమాత్మననే ధ్యానంలోకి సంపూర్ణంగా నిష్క్రమించి, ఆయన సారూప్యాన్ని పొందుతాడు. ఇదే ధ్యానయోగము. సువ్రతులలో ఉత్తముడవగు శంకరదేవా! నీవు మాత్రమే నిజమైన సంపూర్ణ ధ్యానయోగివి కాగలిగావు. ఇకపై ఈ ధ్యాన యోగమును పఠించిన వారికి చింతన, మననాలను చేసేవారికీ విష్ణులోకం ప్రాప్తిస్తుంది.”
పదకొండవ అధ్యాయం సంపూర్ణం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹