తిథి, వార, నక్షత్రాది వ్రతాలు
చైత్ర శుద్ధ త్రయోదశిని కామదేవ త్రయోదశి అంటారు. ఈ రోజున తెల్లకమలం మున్నగు పూలతో రతి, ప్రీతియుక్తుడు, మణి విభూషితుడు, శోక విదూరకుడునగు మన్మథుని పూజించాలి. ఈ వ్రతం పేరు మదన త్రయోదశి. ఇది సుఖసంతోషాలనిస్తుంది.
ప్రతిమాసంలోనూ రెండు చతుర్దశులలోను రెండు అష్టమి దినాల్లోనూ ఉపవాసం చేసి పరమశివుని పూజించాలి. ఇది ముక్తిప్రదాయకం. ఈ వ్రతానికి శివాష్టమీ చతుర్దశి వ్రతమని పేరు.
ధామవ్రతం కార్తికమాసంలో ఏవో మూడు రాత్రులపాటు ఉపవాసముండి చేసే వ్రతం. దీని చివర్లో ఒక భవనాన్ని దానంచేయాలి. ఈ వ్రతాన్ని చేసిన వారికి సూర్యలోకం ప్రాప్తిస్తుంది.
వారవ్రతం లోనైతే ప్రతిరోజూ సూర్యుని పూజించి ఆయన పేరుకి ఆ వారం (దినం) పేరుని జోడించి సంకల్పం చెప్పుకోవాలి. ఈ వారంరోజులూ నక్తవ్రతాన్ని పాటించాలి. ఈ వ్రతంచేసిన వారికి సర్వఫలప్రాప్తి కలుగుతుంది.
మన మాసాలపేర్లు నక్షత్రాల ననుసరించి పెట్టబడ్డాయి కదా! ఆ నక్షత్రం ఆ నెలలో పున్నంతో యోగిస్తే ఆ రోజున ఈ నక్షత్ర వ్రతమును మొదలెట్టాలి. కార్తిక మాసంలో కృత్తిక నక్షత్రం పూర్ణిమ నాడు పడినరోజు ఈ వ్రతానికి సర్వప్రశస్తం.
ఆ రోజు కేశవుని యథాశక్తి అలవాటైన పద్ధతిలో పూజించి నాలుగు నెలలపాటు వరుసగా అనగా కార్తిక, మార్గశిర, పుష్య, మాఘ మాసాలలో నేతితో హవనాలు చేసి బియ్యం, నువ్వులు కలిపిన అన్నాన్ని (కృసరాన్న, కృశరాన్న) ఉప్మా వలె వండి నైవేద్యం పెట్టాలి.
ఆషాఢ నాలుగునెలల్లో పాయసాన్ని నివేదించి బ్రాహ్మణులకు పాయసంతో భోజనాన్ని పెట్టాలి. పంచగవ్యాలనే ప్రాశిస్తూ జలస్నానాలు చేస్తూ క్రమం తప్పకుండా నైవేద్యాలు పెడుతూ మరో నాలుగు నెలలూ ఇలాగే చేసి సంవత్సరాంతమున భగవంతుని విశేషరూపంతో పూజించి ఇలా ప్రార్థించాలి.
నమో నమస్తే చ్యుత సంక్ష యో స్తు ||
పాపస్య వృద్ధిం సముపైతు పుణ్యం |
ఐశ్వర్య విత్తాది సదా క్షయం మే |
తథాస్తు మే సంతతి రక్షయైవ ||
యథాచ్యుత త్వం పరతః పరస్మాత్ ||
స బ్రహ్మభూతః పరతః పరస్మాత్ ||
తథాచ్యుతం మే కురు వంఛితం సదా ||
మయా కృతం పాప హరా ప్రమేయ ||
అచ్యుతానంత గోవింద ప్రసీద యదభీప్సితం ||
తదక్షయమమేయాత్మన్ కురుష్వ పురుషోత్తమ ||
ఈ మాస నక్షత్ర వ్రతాన్ని ఏడేళ్ళపాటు చేయాలి. అలా చేసిన వారికి ఆయువు, లక్ష్మి, సద్గతి ప్రాప్తిస్తాయి.
స్వచ్ఛ హృదయులై ఉపవాస సహితంగా ఒక సంవత్సర పర్యంతం యథాక్రమంగా ఏకాదశి, అష్టమి, చతుర్దశి, సప్తమి తిథుల్లో విష్ణు, దుర్గ, శివ, సూర్య పూజలను గావించిన వారికి అన్ని నిర్మల అభిలాషలూ తీరుతాయి.
దేహాంతంలో దేవలోక ప్రాప్తి ఉంటుంది. వ్రత కాలంలో ఏకభుక్తంగాని, నక్తవ్రతం గాని, ఆయాచితంగాని, ఉపవాసం గాని పాటించాలి. పైన చెప్పిన దేవతలందరినీ శాకాదులతో పూజిస్తే భోగం, మోక్షం రెండూ అబ్బుతాయి.
పాడ్యమినాడు కుబేర, అగ్ని, నాసత్య, దస్ర నామక దేవతలనూ, విదియ నాడు. లక్ష్మినీ, యమధర్మరాజునూ, పంచమినాడు పార్వతీదేవిని నాగ గణాలనూ పూజించాలి. అలాగే షష్ఠినాడు కార్తికేయుని సప్తమినాడు సూర్యదేవునీ, అష్టమి నాడు దుర్గనీ, నవమినాడు మాతృకలనూ తక్షకునీ పూజించాలి.
అదేవిధంగా దశమి నాడు ఇంద్రునీ, కుబేరునీ, ఏకాదశినాడు సప్తర్షులనూ, ద్వాదశి నాడు హరినీ, త్రయోదశినాడు మన్మథునీ, చతుర్దశినాడు మహేశ్వరునీ, పూర్ణిమనాడు బ్రహ్మనీ, అమావాస్యనాడు పితృదేవతలనూ పూజించాలి.
నూట నాల్గవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹