ఉపాసనా ఖండము రెండవ భాగము
శేషోపాఖ్యానము మూడవ భాగము
ఈ విధంగా కశ్యపుడు నానావిధ రూపములతో వర్ధిల్లిన సమస్త సృష్టినీ చూచి ఆనందించి విధివత్తుగా వారికి మంత్రోపదేశాన్ని సిద్ధ సాధ్య ఋణ ధన అర్వణములు పరీక్షించి వారివారి అర్హతల ప్రకారం కొందరికి షోడశాక్షరీ మంత్రమును, మరికొందరకు అష్టాక్షరీ మంత్రమును, ఒకర్తెకు ఏకాక్షరీ మంత్రమును, మరొకర్తెకు షడక్షరీ మంత్రము, ఇంకొందరకు ద్వాదశాక్షరీ ఇలాక్రమంగా యధార్హము అధికార అర్హతలనుబట్టి వారివారికి మంత్రములను ఉపదేశించాడు.
అలా ఉపదేశించిన కశ్యపమహాముని వారితో “పుత్రులారా! నేనిచ్చిన ఈ మంత్రములను శ్రద్ధాభక్తులతో జపించుడు! మీకు అఖిలా ధారుడగు పరమాత్మయైన గజాననుడు సాక్షాత్కరించగలడు!” అని వారికి ఆజ్ఞాపించాడు. ఆప్రకారమే వారందరూ తమతమ ఉపదేశములను బట్టి వారికిచ్చిన మంత్రములను అనన్యభక్తితో జపించారు. అలా వేయి సంవత్సరాలు గడచినవి.
అంతట వారికి అనుగ్రహమూర్తియైన గజాననుడు సాక్షాత్కరించి వారందరికీ ప్రత్యక్షముగా ఎవరెవరు తనను ఏయే ధ్యానమూర్తిరూపంలో భావించి ధ్యానించారో ఏ మంత్రపురస్సరంగా జపించారో, సరిగ్గా అదే ప్రకారంగా వివిధ గణపతుల రూపంలో వారందరికీ నానారూపములతో సాక్షాత్కరించి అనుగ్రహించాడు.
కొందరిముందర రక్తవర్ణముతో షడ్భుజములతో ప్రత్యక్షముగా కొందరికి శశివర్ణముతో చతుర్భుజుడై విఘ్నహరుడుగా ప్రకాశించాడు. మరికొందరిముందు నీలమేఘఛాయతో ఎనిమిది మహాభుజములు దివ్యాయుధములూ ధరించి సాక్షాత్కరించగా మరికొందరు సహస్ర నేత్రములతో సహస్రసూర్యతేజస్సును మించిన ప్రకాశంతోనూ, మరి కొందరికి బాలగణపతిగా శిశురూపంలో, ఇంకొందరు యువకునిగా యవ్వనరూపంలోనూ, మరికొందరకు వృద్ధుడై జ్ఞానస్వరూపునిగానూ, మరికొందరికి పన్నెండు భుజములు కలిగి, ధూమ్రవర్ణంతో బ్రహ్మతేజస్సు తో ప్రకాశించాడు.
ఇంకొందరి ముందర పద్దెనిమిది భుజాలలో అష్టాదశ ఆయుధాలు ధరించి కోటిసూర్య సమప్రభతో వెలిగాడు. మరికొందరికి సింహ వాహనారూఢుడై అనేక గజవక్త్రములతో మహాకాయుడై తేజోరూపి గా దర్శనమిస్తే ఇంకొందరికి మూషికవాహనుడై అనేక శిరస్సులతో సాక్షాత్కరించాడు.
ఈ విధంగా వారందరికీ నానావిధ రూపములలో అనేకధా వారి వారి సంకల్పం ప్రకారం మంత్రస్వరూప అనుసారంగా విధివత్తుగా సాక్షాత్కరించిన గణపతిదేవునికి భక్తితో గద్గదకంఠులై మిక్కిలి ప్రేమతో యిలా స్తుతించారు.
సర్వులూ ఉవాచ :-
ఈ విధంగా అనేక రూపాలలో సాక్షాత్కరించిన గణపతిని నానా విధములుగా స్తుతించారు వారు.
“ఓ నిర్గుణ పరమాత్మా! అనంతశక్తి స్వరూపుడా! అనేక జీవ ఆత్మస్వరూపుడా! అప్రమేయ గుణస్వరూపుడా! నీకివే మా నమోవాకములు! అనంతమూ నిర్గుణమూ అపరిమితమూ అయి భేదరహితమైన అనాద్యంతమౌ నీ పరబ్రహ్మ స్వరూపమునకు, సదా గణేశదేవునకు నమోనమో భజింతము గాక!”
“ఎవరినుంచి ఈ సమస్త విశ్వమూ సమస్త చరాచర జీవస్వరూపములు సృష్టికర్తయగు పద్మసంభవుడూ, విశ్వదేవతలు, అష్టదిక్పాలకులూ ఉద్భవించారో అట్టి విశ్వరక్షకుడు సమస్త సృష్టికర్తయైన నీకిదే నమో వాకములు.”
“సమస్త సృష్టిరూపమగు ఇంద్రాది సర్వదేవతలు, దైత్యసంఘములు మనుష్య కీటక పశుగణములు ఇలా సమస్త రూపములూ ధరించిన గణేశభగవానుడా! నీకిదే నమస్కారము.”
“ఓ అంతరాత్మస్వరూపుడా! అంతర్యామీ। ఎవరినుండి ఈ అగ్ని హోత్రము, ఆకాశము, భూమి, జలము, సప్తసముద్రాలూ, చంద్రాది గ్రహనక్షత్రములు, వాయువు, ఆకాశము, స్వర్ణమూ, సమస్త స్థావర జంగమాత్మకమైన వృక్షసంఘములూ ఈ సృష్టిస్వరూపం ధరించి ఆవిర్భ వించాయో అట్టి భగవంతుడైన గణేశునకు నమోనమో నమస్కారం!”
“ఎవరినుండి యక్ష, దానవ, కిన్నర, సిద్ధ, చారణ, వారణ, అశ్వ, మృగ, పక్షిసంఘములు జన్మించాయో అట్టి సృష్టికర్త, అంతరాత్మ స్వరూపుడూ, పరమాత్ముడైన గణేశదేవునికి నమోనమో నమస్కారములు సమర్పించి భజింతుముగాక”
“ఎవరివల్ల మాకీ బుద్ధి, అజ్ఞానమును నశింపచేసే ఈ జ్ఞానమూ మోక్షమును కోరవలెననే ఈ వివేకము కల్గినవో అట్టి ఆత్మప్రచోదకునకు పరబ్రహ్మమూర్తి విఘ్నవినాశకునకు గణేశునకు సమస్త కార్యసిద్ధి ప్రదాతయైన గణపతికి నమస్కారం! హెచ్చుగా మా నమస్కారం”
“భక్తులకు సంపదలను, సంతోషములను, కోరిన కోరికలను తీర్చే వరప్రదునకు, విఘ్ననివారణకు, సమస్త కార్యసిద్ధి అనుగ్రహించే దేవదేవేశ! గణేశా! నీకిదే శరణు శరణు
“ఎవరినుండి పుత్రకళత్ర సంపద, భోగము, సమస్త సౌఖ్యములు కోరిన కోరికలన్నీ అనుగ్రహించబడుతున్నాయో అట్టి ఏకమూర్తియగు అనేక స్వరూపుడు, భక్తి విద్యాప్రదునకు సర్వేశ్వరునకు ఇవే మా నమస్సులు!”
“మాలోని శోకమోహములు, కోరికలు ఎక్కడనుండి కలుగుతున్నాయో వాటిని నివారించే జ్ఞానము, ముముక్షుత్వము, వివేకమును తిరిగి మాకు ఎవరు ప్రసాదిస్తున్నారో అట్టి గణేశదేవునకు నమోనమో నమస్కారము!”
“ఏ పరమాత్ముని అనంతశక్తిచేత ఆదిశేషుడు భూమిని మోయగల శక్తిమంతుడయ్యాడో, అనేక రూపములు ధరించి అనేక విధములుగా స్వర్ణ, పాతాళ, బ్రహ్మలోకాలలో సాక్షాత్కరించిన నానారూపధరుడగు గణేశస్వామికి నమోనమో నమస్కారము.”
“ఏ భగవంతుని స్తుతించలేక వేదములే మాట పెగలక, మూగ పోయినవో మనస్సుకు సహితం అందని పరబ్రహ్మరూపియగు బ్రహ్మ తత్త్వముగా “నేతినేతి” అని వర్ణించలేకపోయాయో, చిత్, నత్, ఆనంద స్వరూపమునకు, పరబ్రహ్మ స్వరూపునకు, సదా గణేశస్వరూపునకు నమస్కారము! నమోనమోనమః”
ఈ విధంగా సమస్త గణములూ సమస్త స్వరూపుడగు గణేశ భగవానునకు నానా రూపములైన వాక్కులతో స్తుతించి, భక్తిభావంతో పులకించి తరించారు!
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని ‘కశ్యపోపాఖ్యానం’ అనే 91 వ అధ్యాయం.సంపూర్ణం..
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹