ఉపాసనా ఖండము రెండవ భాగము
తారకవధోపాఖ్యానం వరదగణపతి పూజావిధానం:
అప్పుడు శివుడిలా అన్నాడు “ఓ కుమారా! నీవు కోరినట్టుగా సకల పాపక్షయకరము, సర్వసిద్ధికరమైన”వరదగణపతివ్రతం” గురించి నీకు తెలియజేస్తాను! ఈ వ్రతాన్ని శ్రావణమాసములోని శుక్ల చతుర్ధి నాడు ఆరంభించాలి! ఆ ప్రతవిధాన మెలాంటిదంటే ఆనాడు ఉదయాన్నే నువ్వులపిండితో నలుగు పెట్టుకొని అభ్యంగన స్నానం చేయాలి.
ఆ తరువాత నిత్య నైమిత్తికకర్మలను నెరవేర్చి, కోపాన్ని దరిజేరనీయకుండా సంయమనం పాటించాలి.
ఒక నలుచదరమైన ప్రదేశాన్ని గోమయంతో అలికి పరిశుద్ధంచేసి అక్కడ ఒక మంటపాన్ని నిర్మించి, దానికి నాలుగువైపులా అరటిస్థంభాలను అమర్చి ఆ మంటపాన్ని పుష్పమాలలతోనూ, మామిడి ఆకుల తోరణాలతోనూ, అద్దములనూ, చామరములనూ సమకూర్చి అలంకరించాలి.
ఆ మంటపం మధ్యగా శ్రీగంధంతో ఒక అష్టదళపద్మాన్ని గీసి దానిపై ధాన్యాన్ని పోయాలి! దాని పైన వస్త్రద్వయాలపై అమర్చినట్టి ఒక కలశాన్ని స్థాపించాలి! ఆచార్యుని అనుజ్ఞ తీసుకొని, పూజాద్రవ్యాలను శుద్ధిచేసుకొని ఆ తరువాత గజాననుని మూర్తికి ప్రాణప్రతిష్టచేసి, షోడశోప చారములతో పూజించాలి! ఆ గజాననుని ప్రతిమ వెండితోగాని బంగారుదిగాని వినియోగించాలి!
నైవేద్యానికై ఇరవైఒక్క రకాల పిండివంటల్ని తయారుచేయాలి. ఆ తరువాత అరవైఒక్క ముద్రల్ని (బంగారువికాని లేదా వెండివికాని) దక్షిణగా యివ్వాలి! తెలుపువి లేదా పచ్చటివి ఇరవైఒక్క దూర్వాంకురాలను సమర్పించాలి! ఇలా సమంత్రకంగా పూజావిధి యావత్తూ ముగిసిన తరువాత మంత్రపుష్పాన్ని సమర్పించి, ఇరవై ఒక్కమంది బ్రాహ్మణులను పూజించి వారికి అన్నసమారాధనం చేయాలి! ఇరవైఒక్క విధములైన దానాలనూ చేయాలి!
ఆ తరువాత గజాననునికి అపరాధ క్షమాపణ చెప్పి సాష్టాంగ నమస్కారంచేసి “వ్రతం సంపూర్ణ ఫలప్రదమౌనుగాక” అంటూ వేడుకొని, పార్ధివగణేశపూజను యధావిధిగా ఈ గణేశుని మూర్తికి సమర్పించి, ఆ కధాశ్రవణం చేయాలి! విఘ్నహరుడైనట్టి గజవదనుని హృదయంలో ధ్యానిస్తూ మౌనంగా భుజించాలి.
ఈ విధంగా ఒక మాసం రోజులు అంటే శ్రావణశుక్ల చతుర్ధినుండి భాద్రపద శుక్ల చతుర్ధివరకూ చేయాలి! చివరినాడైన భాద్రపద శుక్ల చతుర్దినాడు పూర్వం చెప్పినమాదిరి గానే విఘ్నేశ్వరుని పూజించి, వినాయకచవితి ఉత్సవాన్ని గావించాలి!
ఆ రాత్రి జాగరణచేసి నృత్యగీతాది నాట్యయుతమైన సపర్యలను వినాయకునికి సమర్పించాలి! గణేశపురాణాన్ని, అందుగల ఉపాఖ్యానము లను శ్రద్ధగా ఆలకించి గజాననుని సహస్రనామాలతో పూజించాలి!
ఆ మర్నాడైన ఋషిపంచమినాడు ప్రాతఃకాలాన్నే సంధ్యావందనాది కములు ముగించుకొని గజాననుని యధావిధిగా పూజించాలి! ఆ తరువాత వందమంది లేదా కనీసం ఇరవైఒక్కమంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనాదికములు ఏర్పాటుచేసి వారిని గౌరవించాలి!
అన బంగారు లేదా రజతమైన మూర్తిని బ్రాహ్మణునకు దానంచేయాలి. మృత్తికతో చేసినట్టి మూర్తినిమాత్రం మంగళ వాయిద్యాలతో ఊరేగింపచేసి తటాకంలోగాని, నదిలోగాని నిమజ్జనం చేయాలి!
ఓ షడాననా! ఈ వరదగణపతీ వ్రతాన్ని ఒక పర్యాయం శ్రద్ధాభక్తులతో ఆచరించితే తమయొక్క సకలాభీష్టాలనూ సిద్ధింపచేసుకున్నవారై అంత్యమున గణేశధామాన్ని పొందగలరు.
ఓ స్కందా! ఇదివరలో సృష్టి ఆరంభంలో చతుర్ముఖుడీ వ్రతాన్ని సల్పి సృష్టిరచనా సామర్ధ్యాన్ని అనుగ్రహంగా పొందాడు అలాగే లోకపాలకుడైనట్టి విష్ణువు ఈ వ్రత అనుష్టానంవల్లనే పాలనశక్తిని పొందాడు.
అంతేకాదు స్వేచ్ఛగా అవతారాలెత్తే శక్తిని ఈ గణేశషడక్షరీ మంత్రానుష్టానంవల్ల పొందగలిగాడు. అంతెందుకు నిత్యం అష్టాక్షరీ మహామంత్రాన్ని అనుష్టించే నేనుకూడా ఈ గణేశ షడక్షరీ మంత్రం వలననే జగత్రయాన్ని లయం చెందించ గల్గుతున్నాను.
అంతేకాదు సర్వసిద్ధిప్రద మైనట్టి ఈ వ్రతాన్ని యక్ష గంధర్వ కిన్నర కింపురుషులూ, రాక్షసులూ కూడా తమతమ అభీష్టప్రాప్తికై అనుష్టించారు. నాయనా! నీవు కూడా ఇట్టి విశేషఫలప్రదమైనట్టి వ్రతాన్ని ఆచరించి యుద్ధములో జయప్రాప్తినీ ముల్లోకాలలోనూ అంతులేని ఖ్యాతినీ పొందు!” అంటూ ఓ వ్యాసమునీంద్రా! ఒకానొక శుభముహూర్తంలో శంకరుడు తన కుమారునికి గణేశమంత్రదీక్షను అనుగ్రహించాడు.
స్కందుడు వరదుడిని ఆరాధించుట :
అనంతరం ప్రశాంతమైనట్టి తపోవనికి తరలిపోయి అక్కడ ఒంటి కాలిమీద నిలబడి స్కందుడు ఘోరమైన తపస్సును ఆచరించి, శివుడు చెప్పిన విధానంలో వరదగణేశ వ్రతాన్నికూడా చేశాడు.
అప్పుడు ఆ వ్రతప్రభావంవల్లా, మంత్రానుష్టానంచేత సంతుష్టు డైన గజాననుడు యోగిజనులకు సైతం దుర్లభమైన తన దివ్యరూపం తో స్కందునికి సాక్షాత్కరించాడు.
చతుర్భుజుడై, నుదుట చంద్రకళతో, దివ్యమైన రత్నఖచిత కిరీటాన్ని ధరించి, కుండలముల శోభతో చెక్కిళ్ళు కాంతులీనుతుండగా పరశువు, అంకుశము, పాశము, దంతములను తన నాలుగు హస్తాలలోనూ ధరించి కంఠమున ముత్యాలహారాలతో ఒప్పుతూ, నాగయజ్ఞోపవీతాన్ని ధరించి, దివ్యాలంకారములనూ దేవతావస్త్రాలతోనూ భూషితుడై, దివ్యగంధాను లేపనం గావించుకుని, కోటిసూర్య సమానతేజుడై ఆ గజాననుడు భాసించాడు.
ఆ దివ్యదర్శనానికి చకితుడైన స్కందుడు ”ఇదియేమి విపరీతమా?” అనుకొని తను నిత్యం భక్తితో ఆరాధించే దేవతాస్వరూపియేనా ఇతడు? అనుకొని ధైర్యం కూడగట్టుకొని ”ఓయీ! నీవెవరవు? నీపేరేమి?” అంటూ ప్రశ్నించాడు.
అప్పుడా గజాననుడు చిరునవ్వు తళుక్కుమని మెరవగా ఇలా అన్నాడు. “ఓ స్కందా! అహర్నిశలూ నీవు ఎవరి అనుగ్రహాన్ని ఆపేక్షించి అత్యంత నిష్ఠతో ఏకాగ్రచిత్తుడవై ధ్యానిస్తున్నావో ఆ మంత్రమూర్తిని నేనే! నీ తపస్సుకు చాలా సంతుష్టుడైనాను. నీకభీష్టప్రదానం చేయడానికి స్వయంగా యిలా అనుగ్రహించాను! నీ అభీష్టాలను వేడుకో! వాటి నన్నిటినీ తప్పక తీర్చగలను!” అంటూ ఉరుము ఉరిమినట్లుగా పలికాడు భక్తానుగ్రహ మూర్తియైన గజాననుడు!
“ఓ దేవదేవా! నీ ఈ దివ్యస్వరూపాన్ని హరిహరబ్రహ్మాదులుగాని, ఇంద్రాదిదేవతలుగాని, వేయినాల్కలుగల ఆదిశేషుడుగాని కనుగొనలేరు. అట్టి నీ దివ్యమంగళరూపాన్ని అనుగ్రహంతో నాకు దర్శనమిచ్చావు. నీ దర్శనమాత్రంచేతనే నా సకలాభీష్టసిద్ధి అయింది. ఐనా మీ ఆజ్ఞానుసారం వరమును అర్థిస్తాను. అదేమంటే యుద్ధంలో నాకెన్నడూ పరాజయ మన్నది లేకుండా అనుగ్రహించు! ఎన్నటికీ నీ పాదపద్మములపై విస్మృతి కలుగకుండుగాక! నేను స్మరించినంతనే నాకు సాక్షాత్కరించు!
దేవతలలోకెల్లా శ్రేష్ఠత్వాన్ని ప్రసాదించు! లక్ష్యరూపంతో నాకిక్కడ సాక్షాత్కరించావు గనుక “లక్ష్య వినాయకుడన్న” పేరిట యిట వెలసి భక్తుల పాలిట కల్పవృక్షముపై అనుగ్రహించు!”
ఆ మాటలకు విఘ్నేశుడు “తథాస్తు” (అట్లే అగుగాక) అంటూ ఆ దేవసేనాని కోరిన సకలవరాలనూ ప్రసాదించి, వాటితోపాటూ తన వాహనమైనట్టి మయూరాన్ని అతడికి బహూకరించాడు. అది మొదలుగా స్కందుడికి మయూరధ్వజుడన్న ఖ్యాతి గలిగింది! ఇంకా ఆ వినాయ కుడిలా అన్నాడు.
” తారకాది రాక్షసులు నీచే వధింపబడతారు! నీ వాక్యానుసారమే నేను ఈ క్షేత్రములో లక్ష్య వినాయకుడన్న పేరుతో భక్తవరదుడనై వెలసియుంటాను!” అంటూ అంతర్ధానం చెందాడు.
అప్పుడు స్కందుడు బ్రాహ్మణ ఆశీర్వచనాలతోనూ వేదమంత్ర పురస్సరంగానూ మహామూర్తిని స్థాపించి ఆ మూర్తికి లక్షవినాయకుడని నామకరణం చేశాడు. లక్షసంఖ్యలో మోదుకము (ఉండ్రాళ్ళనూ) దూర్వాంకురములను సమర్పించి పుష్పాలతో ఆ మూర్తిని అర్చించాడు. లక్షమంది విప్రులకు భోజనం ఏర్పాటుచేసి ఆ తరువాత గణేశునికి . స్తుతులను ప్రణామాలను సమర్పించి మయూరవాహనారూఢుడై కైలాసం లోని శివుని సన్నిధికి వెళ్ళి ఆతడికి జరిగిన యావద్వృత్తాంతమునూ వివరించాడు.
అప్పుడు దేవర్షులంతా స్కందుడిని దేవసైన్యాధ్యక్షునిగా పట్టాభి షిక్తుని గావించారు. గజాననుని స్మరించుకొని, శివుని ఆశీస్సులను పొంది, తారకాసురునిపై యుద్ధానికి వెళ్ళి అతడిపై లక్షసంవత్సరాలు ఘోరమైన పోరుసల్పి ఆతడిని వధించాడు.
ఈ మహత్తర విజయానికి అతడిని మహర్షులు, దేవతలు సిద్ధ సాధ్య యక్షకిన్నర కింపురుషాది గంధర్వగణాలు అతడిని వేనోళ్ళ కీర్తించారు. సమస్త లోకాలలోనూ యధాపూర్వకంగా దేవతాపితృకార్యాలు జరుగసాగాయి.
“ఓ వ్యాసమునీంద్రా! గజాననునియొక్క మహాప్రభావ మంతటిది! వ్రతప్రభావాన్ని కూడా నీకు నిరూపించి చెప్పాను. ముప్ఫైమూడుకోట్ల దేవతలచేతా వధింపబడని ఆ తారకుడు, ఆ గజాన నుని వ్రతప్రభావంచేత స్కందునిచే సంహరించబడ్డాడు. అందువల్లనే ఇంద్రాది దేవతలకు కూడా పూజ్యుడైనాడు షణ్ముఖుడు!” అన్న చతుర్ముఖునితో వ్యాసుడిలా ప్రశ్నించాడు.
“ఓ చతురాననా! స్కందుడు సమాధినిష్టుడై ఏస్థానంలో తపస్సును ఆచరించాడు? ఆ వివరం నాకు చెప్పవలసింది!” అనగానే బ్రహ్మ యిలా అన్నాడు.
“ఓ వ్యాసమునీంద్రా! స్కందుడు ఘృష్టేశ్వరుడు వెలిసిన ప్రదేశంలో అనుష్టానం చేశాడు! అక్కడే లక్షవినాయకుడు ప్రసిద్ధమై వెలిశాడు. ఘృసుృణేశ్వరుడు అనేరాజు పాలించిన నగరం అక్కడికి పశ్చిమాన ఉంది. అందుకనే ఆ నగరానికి ఘృష్టేశ్వరనగరమన్న పేరు కల్గింది.”
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని ”తారకవధ” అనే ఎనభై ఏడవ అధ్యాయం సంపూర్ణం..
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹