Skip to content Skip to footer

శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – ఎనభై ఐదవ అధ్యాయము

ఉపాసనా ఖండము రెండవ భాగము

స్కందోత్పత్యుపాఖ్యానం మొదటి భాగము

అలా ఆ శివపార్వతులు కైలాసానికి వృషభారూఢులై చేరుకున్న తరువాత “ఓ వ్యాసమునీంద్రా! ఆ భిల్లయువతి వేషంలోవున్న పార్వతి మదనతాపం చెందసాగింది! నీటిలోంచి ఒడ్డునపడిన చేపలా తీవ్ర విరహ బాధకు లోనయింది. శీతోపచారములుగాని, చందనం, పచ్చకర్పూరం మొదలైన లేపనాలేమీ ఆమెకు ఉపశమనాన్ని కల్గించలేకపోయాయి. పైగా అవి ఆమె తాపాన్ని మరింతగా పెంచాయి. ఇలా ఎంతోకాలము గడిచిన తరువాత శల్యావశిష్టయై కృశించింది. అప్పుడు ఆమె ఒకనాడు. శంభుని సన్నిధికి చేరి యిలా అన్నది.

“ఓ ప్రభూ! నీవెందుకనో ఈ మధ్యన నాపై శీతకన్ను వేశావు! సూర్యకిరణాలు సోకనిదే కమలం వికసించజాలనట్లు, నీ కరస్పర్శ సోకని నామేను పొందే విరహం యింతింత అని వర్ణింపనలవి కాకుండా వున్నది! ఎన్ని ఉపచారాలు చేసినా మదనాగ్నిచే కలిగే తాపం శాంతించటంలేదు. దీనికేదైనా ప్రతిక్రియను సల్పి నా బాధను నివారించు!” అంటూ “ఈ మన్మధుడు నీచే భస్మీభూతుడైనా నన్ను నిలువనీయకున్నాడు స్వామీ!

నీ దయ, నీప్రేమా మాత్రమే నాకిక శరణ్యం” అంటూ క్రీగంట చూస్తూ తలవాల్చకుని నిలుచుని నర్మగర్భంగా పలికిన శర్వాణి మాటలు విన్న ఆ మదనాంతకుడైన శంకరుడు చిరునవ్వుతో ఆమె చేయందుకుని తన అక్కున చేర్చుకుని మదనునిచే వశీకృతుడై ఆమెను పర్యంకముపై పరుండపెట్టాడు. మదనప్రేరితుడైన ఆ శివుడు ఉమామనోహరుడై, పార్వతీప్రియుడై యధేచ్ఛగా రమించాడు.

అలా శివుని మూడోకంటిచే భస్మీకృతుడైనా దైవకార్యమైనట్టి శివ పార్వతుల సమాగమాన్ని ఏర్పాటుచేయటంలో కృతకృతుడైయ్యాడు రతీ పతియైన మన్మధుడు. ఇక భిల్లయువతిగా పార్వతి ఆమెపతి ఒకరిలో ఒకరు లయమై, శుత్రీలయల్లా, పాలూ తేనెల్లా కలిసిపోయి సృష్టికే ఒక వినూత్నశోభను చేకూర్చారు. ఇలా దాదాపు అరవైవేల సంవత్సరాలు గడిచిపోయాయి! ఈ లోగా తారకాసురునిచేత స్థానభ్రష్టులైన దేవతలంతా. మన్మధునికి కార్యసిద్ధియైన విషయం విని కైలాసం చేరుకున్నారు. ఐనప్పటికి ఏకాంతంలో ఉన్నట్టి ఆ ఉమాశంకరులు ఏకాంతానికి భంగం చేయటానికి ఎవరూ సాహసం చేయలేకపోయారు.

మూకీ భావంతో తలలుదించుకుని తారకాసురుని భీతిచేత తిరిగి పర్వతగుహలకు వెళ్ళిపోయి తమ తలదాచుకున్నారు.”ఆహా! ఈ దుష్టరాక్షసుని పీడ మనకు ఎప్పటికి విరగడవుతుందో కదా! ఈ శంకరుడు తిరిగి మనకు ఎన్నటికి స్వస్థతను ప్రసాదిస్తాడోకదా!” అనుకుని వాపోతూ చింతాక్రాంతులై వుండగా, దేవగురువైన బృహస్పతి వారికి యిలా హితోక్తులను పలికాడు..

“ఓ దేవతలారా! దీనికి ఒక్కటే మార్గంవున్నది. రూపాంతరం చెందటంలో ప్రసిద్ధుడైనట్టి అగ్నిని శంకరునివద్దకు పంపించండి. ఆతడే శంకరుని ప్రబోధించగల సమర్ధుడు. అప్పుడు మీకార్యం నెరవేరు తుంది.”ఆ మాటలు విన్న దేవతాగణముల హృదయాలపై పన్నీటి జల్లు కురిసినట్లయింది! వారంతా అగ్నిహోత్రుని ఆహ్వానించి యిలా స్తోత్రం చేశారు.

“ఓ అగ్నిభట్టారకా!యజ్ఞయాగాది క్రతువులకూ, సమస్తమైనట్టి సంస్కారములకూ ఆధారమైనట్టి పరమపావనుడవు నీవే దేవతలమైన మాకు ఆహారాన్ని ఆహుతులరూపంలో గ్రహించి అందించే వాహకుడవు. కనుకనే దేవతలకు ముఖమైనావు!బడబాగ్ని, దావానలాగ్ని ఇవన్నీ నీకు రూపాంతరాలే!పంచాగ్నివిద్యద్వారా ఉపాసించబడేవాడవు నీవే! సూర్యాంతర్వర్తిపై సముద్రములలోని జలాన్ని ఆవిరిచేసి మేఘాలుగా మార్చినా, జఠరాగ్నివై ప్రాణులుతిన్న ఆహారాన్ని జీర్ణింపచేసినా, ప్రాణాగ్ని స్వరూపివిగా జీవులకు శరీరంలో ప్రాణాలు నిలుచుటకు ఆధారుడవైనా, చివరకు నచికేతసాగ్నిగా శరీరాలను నీలో దగ్ధమొనర్చి వారిలోని పంచ భూతాలనూ వేటికవిగా విడిపోవటానికి దోహదకారుడవైనా కామాగ్నిగా సృష్టికి ఆధారభూతమైన మైధునక్రియకు ప్రోద్బలంచేసి జీవులకు తిరిగి శరీరాలు ధరించేందుకు కారణమైనట్టి అ గణిత గుణములుకల మహా మహిమోపేతుడవు నీవే! నీకివే మా ప్రణామాలు!

నీవే మూడులోకాలకూ మేలుకలిగే కార్యాన్ని నిర్వహించగల్గిన సమర్ధుడవు! ఈ తారకాసురుని బాధ మాకు విరగడ కావాలంటే శివుడు ఉమా పరిష్వంగంనుండి వెలుపలికి వచ్చేలా ప్రబోధించాలి! నీవు మారువేషంలో కైలాసానికి వెళ్ళి భిక్షను యాచించవలసింది! అలాగనుక చేసినట్లైతే జగత్కళ్యాణము, దేవకార్యమూ సిద్ధిస్తాయి. కనుక వేగిర వెళ్ళి ఈ కార్యసాధనకై పూనుకో వలసింది!” అంటూ అర్ధించిన దేవతల అభ్యర్ధనను మన్నించి, అగ్ని దేవుడు కాషాయాంబరమును ధరించి యతివేషాన్ని దాల్చాడు. నేరుగా పార్వతీపరమేశ్వరులుండే తావునకువెళ్ళి ద్వారం వద్ద నిలచి చిన్నగా “భిక్షాందేహి!” అంటూ ముమ్మారు అర్థించాడు.

శివపార్వతులిద్దరూ ఆ శబ్దం విని ఆశ్చర్యచకితులై ఈ భిక్షకునికి ఇవ్వదగినది తమవద్ద ఏమున్నదా అని యోచించారు. అప్పుడు శివుడు ఉమా యిరువురు వెంటనే వస్త్రధారులవ్వగా భిక్షకై ఉమాదేవియొక్క దోసిలిలో భవుడు తన వీర్యాన్నుంచాడు. ఆ పార్వతి దాన్ని ధరించుటకు ఆశక్తురాలై, శివుని భావాన్ని గ్రహించి ఆమె ఆ వీర్యాన్ని భిక్షుకునికి యిచ్చింది.

“ఓ భిక్షుకా! ఇది భూపతనమైతే మూడులోకాలనూ దహిస్తుంది సుమా!” అంటూ హెచ్చరించి లోనికి వెళ్ళిపోయింది. అప్పుడు అగ్నిక్రింద ఉంచజాలక శాపభయంచేత ఆ హరవీర్యాన్ని మ్రింగాడు. సిగ్గు పడుతూ లోపల భరింపరాని తాపం చెందుతూ ఒక సూర్యోదయకాలంలో సూర్యుడు తులారాశిలో ఉన్న సమయాన ఆ శివతేజస్సును శౌచ కృత్యాలు నిర్వహించే సమయంలో ”శివతేజస్సును ఆతడి జటాజూటం నుండి వెలువడ్డ అతడి ప్రియురాలైన గంగమాత్రమే భరించగలదు” అనుకుని గంగానదీజలములలో విడిచాడు.

అదే సమయానికి స్నానార్ధమై కృత్తికలు ఆ గంగకి వచ్చారు. ఆ ఆరుగురూ ఆ శివతేజాన్ని పానంచేశారు. వివస్త్రలవటంచేత స్నానం పూర్తయ్యాక అగ్ని దూరంగా వెళ్ళేదాకా ఆగి తమ వస్త్రాలను ధరించి నిజగృహాలను చేరారు. వారి భర్తలు వారి ముఖాలు దేదీప్యమానంగా వెలుగుతున్న వారి ముఖాలను చూసి తమ దివ్యదృష్టిద్వారా వారు గర్భిణులని గ్రహించారు. ”మీ ముఖాలను చూడటమే పాపం” అంటూ ఆ కృత్తికలను తమ యిళ్ళనుండి వెళ్లగొట్టారు. అప్పుడు ఆ కృత్తికలు ఆరుగురూ తిరిగి గంగాతీరం చేరుకుని అక్కడి గంగాతీరంలో వున్న రెల్లు దుబ్బులలో తమ గర్భములను జారవిడిచి శుచిస్నానం ఆచరించి తమ యింటికి వెళ్ళిపోయారు.

కుమారస్వామి జననం :-

అలా కృత్తికలు వెళ్ళిపోయిన తరువాత ఆ ఆరుగర్భాలు ఒకటిగా కూడి అందులోంచి ఆరుముఖాలు పన్నెండుచేతులు కలిగినట్టి అందమైన బాలుడు ఉద్భవించాడు. అతడు హుంకారం చేసినంత మాత్రాననే ఆకాశంలోంచి చుక్కలు రాలిపడ్డాయి. పాతాళము మొదలుగాగల పద్నాలుగు లోకాలూ కంపించాయి. ప్రచండమైన వాయువు వీచగా చెట్లన్నీ పెకలించబడ్డాయి. సహస్రకిరణుడైన సూర్యభగవానుడు సైతం మంచుతో కప్పబడ్డాడు.

అప్పుడు నారదమహర్షి ఆకాశమార్గంలో శంకరుని దర్శించుకునే నిమిత్తం వెళుతూ, మార్గమధ్యంలో దివ్యకాంతితో శోభిల్లుతూవున్న అమిత పరాక్రమోపేతుడైన ఆ బాలుని చూచి దివ్యదృష్టితో అతని వివరం తెలుసుకున్నాడు. కైలాసానికి వెళ్ళి అక్కడఉన్న పార్వతీపరమేశ్వరులకు ఈ వృత్తాంతాన్ని తెలియజేసాడు.

సకల లోకాలలోనివారూ ఆ దివ్య బాలుడు శివాత్మజుడని ఎరిగి సంతుష్టులైనారు. దేవతలు దేవదుందుభులు మ్రోగించారు. అప్సరసలు నాట్యమాడారు! గంధర్వులు తమ దివ్యగానాన్ని ఆలపించారు.

అప్పుడు నారదుడు జగన్మాతయైన పార్వతీదేవి నుద్దేశించి యిలాఅన్నాడు.

“జగన్మాతా! నేనీ కైలాసానికి వస్తూ మార్గమధ్యంలో నీ కుమారుణ్ణి చూశాను. ఆరు శిరస్సులతో పన్నెండు బాహువులను కలిగి కోటిసూర్యులకు సమానమైన కాంతితో ప్రకాశిస్తూన్నాడు! అతణ్ణి నీవుగాని గంగాతీరంలో విడిచావా ఏమి?

కోటిమన్మధులను మించిన దివ్యసౌందర్యంతో కేవలం హుంకారం మాత్రం చేతనే బ్రహ్మాండాన్ని గడగడలాడించినట్టి ఆ సుందర బాలకుడిపై నీకీ కాఠిన్యం ఏలతల్లీ?” అంటూ నారదుడు అంతర్హితుడయ్యాడు. అప్పుడు గిరిరాజనందనయైన పార్వతి ఎంతో ఆత్రంగా తన కుమారుని చెంతకు పయనమై వెళ్ళింది.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని ‘స్కందోత్పత్యుపాఖ్యానం’ అనే ఎనభై ఐదవ అధ్యాయం సంపూర్ణం..

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment