Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – ఎనభై నాల్గవ అధ్యాయము

ఉపాసనా ఖండము రెండవ భాగము

కామ దహనం

“ఓ వ్యాసమునీంద్రా!ఆ విధంగా మన్మధుడు సింహశార్దూలాది క్రూర జంతువులతో కూడి, నానావృక్షములతోనూ, లతలతోనూ దట్టంగా అల్లుకున్నట్టి శంకరుని తపఃస్థానాన్ని చూసి తానుకూడా ఒక మాయావాటికను నిర్మించాడు. అందులో మధురమైన జలాలతో నిండిన సరోవరాలతోనూ, దివ్యమైన సుమసౌరభాన్ని ఒక క్రోసెడు దూరం వరకు వెదజల్లే నానా పుష్పవృక్షాలతోనూ, మామిడి, పనస, అరటి, ఖర్జూరము వంటి ఫలవృక్షాలతోనూ ఉన్న ఒక సుందర వనాన్ని నిర్మించాడు.

ఆ పుష్పముల దివ్యసుగంధం ఘోర తపోనిష్ఠలో వున్న శంకరుని నాసికాపుటా లలో దూరింది! సూర్యోదయ కాలాన మనోహరమైన జలమును, అనేక ఫలపుష్పాలతో ఒప్పే ఆ మదనునిచే నిర్మితమైన కామోద్యానమును చూడగానే శివుని మనస్సు చలించింది.

తన తపోవనాన్ని అలా పేలవంగా ఉన్నందుకు నిందించాడు. అనుకోకుండా ఈ విధంగా అకస్మాత్తుగా దేహభావాన్ని పొందిన శంకరుడు ”ఈ వికల్పానికి కారణమేమిటా?” అని యోచించాడు.

“ఇలా నా తపస్సుకు విఘ్నం కల్గించటానికి సాహసించిన వాడెవ్వరు? ఈ మన్మోహనకరమైన అరణ్యం ఎవరిచే నిర్మించబడింది? ఎవడికి యిటువంటి పోగాలము దాపురించింది?” అనుకుంటూ శంకరుడు క్రోధపరవశుడైనాడు. కోపంతో ముడివడిన కనుబొమ్మలతోను, ఎఱ్ఱబారిన విశాలనేత్రములతోనూ ఉన్న శంకరుడి రౌద్రరూపానికి భీతిల్లిన మన్మధుడు భయంతో వణికిపోతూ, తనని కాపాడేందుకై ఇంద్రాదులను స్మరించినా వారెవరూ రాలేదు! మిగతా దేవతలంతా తమతమ దివ్యవిమానాలను అధిరోహించి స్వర్గంలోనుండి వీక్షించ సాగారు.

“భయంతో కృంగి కృశించిన, మన్మధుడు శంకరుడి కంటబడ్డాడు! ఆగ్రహోదగ్రుడై పరమశివుడు అతడిని భస్మీకరించతలచి మూడోకన్ను తెరవగా, సకలలోకాలూ భయంతో కంపించాయి. అంతరిక్షాన ఉన్న దేవతలు మన్మధుని చంపవద్దు ”మాజహి!” అంటూ అరిచేలోగానే మన్మధుడిని భస్మం గావించాడు.

అప్పుడు భిల్లయువతి రూపంలోవున్న పార్వతి తన అంజలియొగ్గి భక్తితో ఇలా”ఓ శంకరా! నీ ఈ మూడోకన్నునుంచి వెలువడే క్రోధాగ్నిజ్వాల క్షణంలో ముల్లోకాలనూ భస్మీపటలం కావించగలదు! అందుచేత ఆ దారుణమైన క్రోధాగ్నిని ఉపసంహరించవలసింది!

బ్రహ్మయొక్క వరాలను పొందిన తారకుడనే రాక్షసుడు మూడులోకాలనూ తన వరగర్వంచేత వశపరచుకున్నాడు. స్వాధ్యాయము, యజ్ఞయాగాదికాలు అన్నీ నశించాయి. దేవతలంతా తమ నెలవులు వీడి స్థానభ్రష్టులైనారు. లోకపాలనకై సమాధి స్థితుడవైన నీకు దేహభావం కల్పించుటకు దేవతలు శీఘ్రముగా మన్మధుని పిలిచి పంపారు. శ్రేష్టాపరాధంవలన మన్మధుడు భస్మమైనాడు.

“ఓ దేవా! నీ శరణుపొందిన మమ్ము రక్షించు! ముల్లోకాలలోనూ శరణాగతులను రక్షించేవాడవన్న కీర్తి కలిగినవాడవు! ఓ దేవా! దీనులైన శరణార్థులైన, దేవతల అపరాధాన్ని క్షమించు!” అంటూ వేడిన భిల్లి యొక్క వాక్యములు విని క్రోధాగ్నిని ఉపసంహరించి చిరునవ్వు మోముతో యిలా అభయప్రదానం చేశాడు.

“ఓ ప్రియురాలా! లెమ్ములెమ్ము! నీవు పూనుకొని దేవతా రక్షణను చేశావు. నా పాదములపైబడి వేడినట్టి నీవాక్యంచేతా, నీయందలి అనురాగంచేతా వీరందరినీ కాపాడాను!” అంటూ ఆమెను ఆలింగనం చేసుకొని తన తొడపై కూర్చుండ పెట్టుకున్నాడు. అనంతరం వారిరువురూ వృషభ వాహనాన్ని అధిరోహించి కైలాసానికి వెళ్ళారు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని ”కామదహనం” అనే ఎనభై నాల్గవ అధ్యాయం సంపూర్ణం..

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment