Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – ఎనభై మూడవ అధ్యాయము

ఉపాసనా ఖండము రెండవ భాగము

తారకోపాఖ్యానం

అనంతరం వ్యాసమునీంద్రుడు చతురాననుని ఇలా ప్రశ్నించాడు. “ఓ చతురాననా! జమదగ్నినందనుడైన పరశురాముడు అద్భుతమైన తన తపస్సును ఎక్కడ ఎలా ఆచరించాడో, చివరకు గణేశుని ఎలా ప్రసన్నుని చేసుకోగలిగాడో ఆ వృత్తాంతమును నాకు విస్తారంగా చెప్ప వలసింది!”

అప్పుడు చతురాస్యుడిలా చెప్పాడు “ఓ వ్యాసమునీంద్రా! పరశువును సాధించుకున్న ఆ రాముడు తన తపశ్చర్యను మయూరేశ్వరంలో చేశాడు. మయూరేశ్వరుడు ఈ క్షేత్రానికధిపతి! ఈ మయూరేశ్వరం లోనే ఆతడు కమలాసురుడనే రాక్షసునికూడా వధించాడు. అక్కడే మయూరాన్ని వాహనంగా అధిష్టించాడు. ఆ కార్యం దిగ్విజయంగా పూర్తిచేసుకుని దేవతాగణములచేత మునులచేతా కొనియాడబడినాడు.

ఆ మయూర క్షేత్రంలోనే అనుష్ఠానంచేసి రేణుకాతనయుడు గణేశానుగ్రహాన్నీ తద్వారా పరశువునూ ఆయుధంగానూ పొందాడు. ఆనాటినుంచీ ఆతడు ”పరశు రాము”డన్న పేరుతో ఖ్యాతిగాంచాడు.

ఈ విషయమై నీకో ఇతిహాసాన్ని చెబుతాను విను! పూర్వం తారకుడనే మహాబలసంపన్నుడైన రాక్షసుడుండేవాడు. వాడు రెండువేల దివ్య సంవత్సరాలు ఘోరతపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై “ఓ! నీకు దేవర్షి, యక్ష, గంధర్వ జాతులవల్ల కాని, సర్పములు వల్లకాని, రాక్షసులవల్లగాని వారి శస్త్రాస్త్రములవల్లగాని మృత్యువు లేకుండుగాక!” అంటూ వరాన్నిచ్చాడు.

ఇలా బ్రహ్మనుండి పొందిన వరముచేత గర్వితుడై ఆ తారకుడు మూడులోకాలవారినీ పీడించ సాగాడు. సాధువులను వేదాధ్యయనపరులను, తపోనిష్టాగరిష్టులైన మహర్షులను వేధించసాగాడు. వారిని తన కారాగృహములో బంధించి హింసించసాగాడు. పాతాళ, నాగలోకాలనూ, మర్త్యలోకాన్నీ బలంతో స్వాధీనంచేసుకుని స్వర్గలోకానికి కూడా దాడికివెళ్ళాడు. వాడికి భయపడి శచీపతి మొదలైన దేవతలు స్వర్గంనుండి పారిపోయి హిమ వత్పర్వత గుహలలో తలదాచుకున్నారు.

ఆ తారకుడికి భీతిల్లి సర్వత్రా యజ్ఞయాగాదులు, దేవతాపూజలు నిలిపివేశారు. ఆ తారకుడు సైతం అహంకరించి “నేనే బ్రాహ్మణులకు అర్చనీయుడిని! నేనే పూజనీయుడను! సకల జనములచేత నమస్కరింప బడతగినవాణ్ణి! ఇంకెవరినైనా పూజించినా, అర్చించినా అలా అర్చించి పూజించినవారు దండింపబడతారు!” అంటూ సకల లోకాలలోనూ ప్రకటింపచేశాడు.

అప్పట్నుంచీ అంతటా జనులు స్వాధ్యాయాన్ని, యజ్ఞయాగాదికాలను వర్ణించి, వ్యర్ధులైపోయారు.కులధర్మములన్నీ విచ్ఛిన్నమైనాయి. సాంప్రదాయాన్ని వదలుకోలేని సదాచారపరాయణులు, మునులు, సాధు వులు పర్వత గుహలలో దాగికొని యిలా దేవతాప్రార్ధనలు చేయసాగారు.

‘ఓ శంకరా! భక్తవశంకరా! ఈ ఘోరరాక్షసుడివల్ల ఈ బాధలేమిటి ప్రభూ? వీడు యిలా విచ్చలవిడిగా అడ్డూ ఆపూ లేకుండా ప్రాణికోటిని క్షోభింపచేస్తున్నా చూస్తూ ఊరుకున్నావేమి స్వామీ! నీకన్నా మరిమాకు దిక్కెవరు? ఎవరిని మేము శరణువేడము? నీకు మాపై సంహారేచ్ఛ కలిగితే అలాగేకానీ! లేదా సర్వులనూ పీడిస్తున్న ఈ తారకుడిని సంహరించి వాడి పీడనుండి మాకు విముక్తి కలిగించు!” అంటూ దేవతా గణాలు ఆర్తితో ప్రార్ధిస్తూ దుష్కరమైనట్టి ఘోరతపస్సును చేయసాగారు.

కేవలము గాలినే భక్షిస్తూ తపస్సు చేస్తూండగా, ఆ తారకుడు మళ్ళీ వారిపై విజృంభించి అమరావతిపై దండెత్తి ఇంద్రపదాన్ని ఆక్రమించాడు. బ్రహ్మలోకం పైకి దండెత్తివెళ్ళి బ్రహ్మనూ చావమోదాడు. వైకుంఠానికి దాడికెళ్ళగా శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలోకి నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు కైలాసం పైకికూడా దండెత్తగా శంకరుడు సైతం కైలాసంవీడి గుహాంతరములో తలదాచుకున్నాడు.

దిక్పాలకులు దిగ్గజములు కూడా స్థానభ్రష్టులై పర్వతగుహల నాశ్రయించారు. వారి స్థానాలలో దైత్యులను నియమించాడు తారకాసురుడు! భూమండలాన్ని యావత్తూ నిష్కంటకంగా పరిపాలించ సాగాడు. ఇంద్రాది సకలదేవతలు గంభీరంగా గుహలలో నుండే ఉమానాథుని స్తుతించసాగారు.

దేవతాగణములు శివస్తుతి :

“ఓ గిరిజారమణా! భూమ్యాకాశములూ, సూర్యచంద్రులు, ఆపస్సు అగ్ని, వాయువు, యజమానుడు అనే ఎనిమిది రూపాల్లో విస్తరించిన అష్టమూర్తి స్వరూపుడవు!

స్థావరజంగమాత్మకమైన ఈ జగత్తునకు సృష్టి స్థితి లయకర్తపూ నీవే! ఓ పరాత్పరా! భక్తపరాధీనుడవు, భక్తార్తిహరుడవన్న నీ చిరకీర్తి అపహసించబడరాదు! కనుక నీవే పూనుకొని ఈ దుష్టదానవుడి వినాశం కావించు! మా ఆర్తిని తొలగించు. దుఃఖంతో వికలచిత్తులమైన మాకు స్వస్థచిత్తాన్ని కలిగేలా మమ్ములను రక్షించు! అన్యధాశరణం నాస్తి! త్వమేవ శరణం మమ!” అంటూ పరిపరి విధాల ప్రార్ధించినా ఫలితం లేకపోవటంతో తమ ఎదుటే ఉన్న మూలప్రకృతి స్వరూపిణియైన జగన్మాతతో తమ కష్టాలను విన్నవించుకున్నారు.

దేవీస్తుతి :-

“ఓ జగన్మాతా! భక్త ఆపన్నివారిణీ! జ్ఞానప్రదాయినీ! భవతారిణీ! ఈ దుష్టతారకుని బారినుండి మమ్ములను కాపాడు! దేవతలపాలిట శాపంవలే సంప్రాప్తమైన ఈ పీడాకారునివల్ల పదభ్రష్టులమై అరణ్యాల పాలయ్యాము.

ఓకరుణామయీ! జగజ్జననీ! త్రైలోక్యరక్షాకరీ! శర్వాణీ! చిత్కళారూపిణీ! నీకు నమస్కారము! బ్రహ్మాది దేవతలచే నిత్యం కొనియాడబడే దానవు! వేదాలకు సైతం కనుగొనజాలని ఉన్నతస్థితి యందుండే ఓ ఈశ్వర ప్రియపత్నీ! దివ్యమంగళరూపిణివీ అసుర సంహారిణివీ నీవే దయతో పూనుకొని జగత్తుకు అభయాన్ననుగ్రహించు. జగత్కళ్యాణాన్ని చేయి.” అంటూ చేసిన దేవతల ప్రార్ధనను ఆలకించి జగన్మాతయైన పరాశక్తి యిలా పలికింది!

“ఓ దేవతలారా! ఈ విషయమై ఆకాశవాణి చెప్పినది నేనెరుగుదును. మీకు భక్తార్తిహరుడైన శంకరుడే సుఖాన్ని కలుగజేయగలడు! ప్రస్తుతం విరాగియై యోగంలో నిర్వికల్పసమాధిస్థితుడై ఉన్నాడు. మన మందరమూ ఆయన సన్నిధికి తరలి వెళదామురండి!” అంటూ ఆ జగన్మాత పరమసుందరమైనట్టి ”భిల్లి” వేషమును దాల్చింది! శంకరుడినే మోహింప చేయదలచి, పరమ సుందరరూపాన్ని దాల్చిన ఆ శర్వాణి అందానికి అప్సరసలు సిగ్గుచెందారు.

ఓ వ్యాసమునీంద్రా! ఈ విధంగా దేవతలందరూ ఆ జగన్మాతతో కలిసి శివసన్నిధిని చేరుకున్నారు. నిశ్చలంగా స్థాణువై పరబ్రహ్మను ధ్యానిస్తున్న యోగీశ్వరుడైన శంకరుడిని చూచారు. అప్పుడా దేవతలనుద్దేశించి దేవి ఇలా అంది..

“ఓ దేవతలారా! దేహాతీతస్థితిలో నిర్వికల్ప సమాధిస్థితుడై ఉన్న ఈ శంకరుడికి దేహభావం కల్గిస్తేనే మీకార్యం నెరవేరుతుంది. అందుకు గాను మీకో ఉపాయం చెబుతాను!

పంచశరుడైన మన్మధుడిని ముందుగా మీరు ఆశ్రయించండి! ఆతని శరముతో కొట్టబడి వికల్పం చెందితేనే శివుడు దేహభావాన్ని పొందుతాడు. అప్పుడే మీకార్యం నెరవేరుతుంది!” అనగానే దేవతలు వెంటనే మనస్సులో మన్మధుణ్ణి స్మరించారు.

“ఓ మన్మధా! ఈ సృష్టినంతటినీ నిర్విఘ్నంగా నడిపిస్తున్నది నీవే! నీవే ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నావు! నీయొక్క ప్రభావంచేతనే స్త్రీలు, కామినులు బలవత్తరులౌతున్నారు. నీవులేనిదే స్థావరజంగమాత్మక మైన ఈ జగత్తంతా వృధా! కనుక నీవే మాకార్యాన్ని నెరవేర్పగల సమర్ధుడవు! దేవకార్యాన్ని నీవే పూనుకొని నిర్వహించు!” అంటూ ప్రార్ధించారు.

“ఓ దేవతలారా! నావద్ద ఈకార్యాన్ని సాధించటానికీ ఏరకమైన సాధనాసంపత్తీ లేదు! ఐనప్పటికీ ”మీ అనుగ్రహంమేరకు, నాశరీరం ఉన్నంతవరకూ మీకార్యసాధనకై పాటుపడతాను. పుష్పధనుస్సు, మరాళములనే నారి, స్త్రీల క్రీగంటిచూపులనే బాణాలతో శంకరునేకాదు సమస్త దేవతలనీకూడా వసంతుని సహాయంగా గైకొనిసర్వమునూ జయింపగలను.”

అంటూ ఓ వ్యాసమునీంద్రా! ఈ రకంగా శంకరుని మోహింప జేయ సంకల్పించిన మన్మధుడు దేవతాకార్యసిద్ధికై శంకరుడు తపస్సు చేసు కుంటున్న తపోవనాన్ని చేరుకున్నాడు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని ”తారకోపాఖ్యానం” అనే ఎనభై మూడవ అధ్యాయం సంపూర్ణం..

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment