ఉపాసనా ఖండము రెండవ భాగము
చతుర్థీవ్రత మహాత్మ్యం
దేవేంద్రుడు ఆ తరువాతి కథాక్రమాన్ని శూరసేనుడితో యిలా చెప్ప సాగాడు : ”ఓ శూరసేనమహారాజా! అప్పుడు కార్యవీర్యుడు లోకగురువైన దత్తాత్రేయుడు ఉపదేశించిన రీతిలో నిరహారుడై, కేవలము వాయువును మాత్రం భక్షిస్తూ నిశ్చలమైన మనస్సుతో, తదేకదీక్షతో గజాననుని ధ్యానం చేస్తూ స్థాణువులా నిలచి తపస్సు ఒనరించాడు.
ఆ ఘోరమైన తపస్సుకి అమిత ప్రసన్నుడైన గజాననుడు ఆతడు తపస్సుచేస్తున్న ప్రదేశానికి ఎదురుగా ఉన్న తటాకములోనుండి ఆవిర్భ వించాడు. ఎఱ్ఱటి పగడపు వర్ణములో ప్రత్యక్షమైన ఆ భక్తాభీష్టప్రదుడైన కరివదనుడు మేఘ గంభీర స్వరముతో యిలా పలికాడు.
“ఓ బాల కఠోరమైన నీ నియమనిష్టలకు సంతుష్టుడనైనాను. ఘోరమైన క్రూరమృగాలు విచ్చలవిడిగా చరించే ఈ ఘోరారణ్యంలో పన్నెండు సంవత్సరాల కాలం అఖండమైన తపోనిష్టనుపూని నన్ను అనన్య భక్తితో ధ్యానించావు! కనుక సంతుష్టుడనై నీకు వరములివ్వదలచి వచ్చాను. నీ మనోభీష్టాన్ని తప్పక నెరవేర్చగలను. నీ మనోవాంఛితాన్ని కోరుకో!
ఈ మాటలకు గాఢమైన ధ్యానసమాధిలో నిష్టుడైవున్న కార్తవీర్యుడు దేహభావాన్ని పొంది గజాననుని చరణ కమలాలకు సాష్టాంగవందన మాచరించి, సిద్ధసాధ్య దేవతాగణాలు తమతమ దివ్యవిమానాలలోంచి విను చుండగా యిలా పలికాడు.
“ఓ దేవా! మంగళప్రదములైన నీ పాదపద్మములయందు నిరూఢ మైన భక్తిని నాకనుగ్రహించు! నాకింకే యితర కోరికాలేదు! ఐనప్పటికీ నీ ఆదేశంమేరకు నా తలితండ్రులు సంతోషంకోసం ఒకటి కోరదలిచాను. అదేమిటంటే సర్వులకూ ఆహ్లాదం కలిగించేటటువంటి దేహసౌందర్యాన్ని నాకు అనుగ్రహించు!” అని వేడుకొనగా గజాననుడు తన మాయా విభవముచేత సూక్ష్మరూపాన్నిదాల్చి కార్తవీర్యుని ఉదరంలో ప్రవేశించాడు. ఏ క్షణాన్నైతే విఘ్నేశ్వరుడు కార్తవీర్యుని శరీరంలోకి ప్రవేశించాడో అప్పుడే ఆ బాలకుడు దివ్యదేహాన్ని దాల్చాడు. అతనికి వేయిబాహువులు సంప్రాప్త మైనాయి. చక్కటి పాదద్వయం కూడా అమరింది. పర్వతాకారుడై నిలచిన ఆ కార్తవీర్యుని పైన దేవతలు, దేవఋషులు పుష్పవర్షాన్ని కురిపించారు.
గంధర్వులు తమ అద్భుతగానంతోనూ, అప్సరసలు తమ మంజుల నాట్యంతోనూ గజాననుని, కార్తవీర్యుడిని అలరించారు. సహస్రబాహువులతో అనంతమైన బలసమన్వితుడైన కార్తవీర్యుడు దిక్కులన్నీ పిక్కటిల్లేలా సింహగర్జనం చేశాడు!
ఆ ధ్వనికి సమస్త దేశాల రాజులూ భీతిచెంది గడగడా వణికారు! ఒక్కసారిగా అయిదువందల బాణాలను యుద్ధభూమిలో సంధించి చేసింది!వదలగల సామర్ధ్యం అతడిని శత్రుదుర్భేద్యుడిగా, అపరాజితుడిగా అప్పుడు బ్రహ్మాది దేవతలు తమ దివ్యవిమానాలనుంచి దిగి ”ఓయీ! కేవలం నిన్ను స్మరించినంతమాత్రాన్నే దేవతలకు నష్టవస్తుప్రాప్తి కల్గుతుంది! సర్వలోకాలలోని ప్రజల హృదయాలలోగల బాధను తొలగించగల సామర్ధ్యం నీకు సంప్రాప్తిస్తుంది!
ఈ కల్పాంతంవరకూ మూడులోకాలలోనూ చిరకీర్తివై వర్ధిల్లగలవు! శరణువేడిన వారికి అభయప్రదాతవై, శత్రువులకు సింహస్వప్నమువై అజరామరమైన ఘనకీర్తి గడించగలవు!” అంటూ ఆతడిని దీవించి తమతమ లోకాలకు వెళ్ళిపోయారు!
అప్పుడు సమస్త దేశాల ప్రభువులు అతడిని చక్రవర్తిగా అంగీకరించి అనేక అమూల్య వస్తువులను కానుకలుగా సమర్పించారు. ఆ తరువాత కార్తవీర్యుడు ఒక మహాప్రాసాదాన్ని నిర్మించి, అక్కడ పగడపు వినాయకమూర్తిని స్థాపించి సకల బ్రాహ్మణలోకమూ వేదఘోషలు సల్పు తుండగా ఆ మూర్తికి ”ప్రవాళగణపతి” అన్న నామకరణంచేసి, ఆ కార్యక్రమంలో పాల్గొన్న విప్రోత్తములకు అనేక గ్రామాలను బహూకరించి వారి ఆశీర్వచనాన్ని పొందాడు.
ఆనాటినుంచి ఆ క్షేత్రము ప్రవాళక్షేత్రమన్న పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రమున సలిపే తపశ్చర్య సకల సిద్ధులను ప్రసాదించ గలదు. ఈ క్షేత్రంలోనే సహస్రఫణుడైన ఆదిశేషుడు భూభారమును మ్రోయగల సామర్ధ్యంకోసమని తపస్సుచేసి గణేశానుగ్రహం వల్ల అనేక వరాలనుపొందాడు. అక్కడే సర్వజ్ఞత్వాన్నీ, వేయిశిరస్సులనూ, నవ నాగులలో ఆధిక్యమునూ సర్వులలో శ్రేష్టత్వాన్నీ పొందాడు.
ఆ క్షేత్రములో తనకు లభించిన ఇష్టసిద్ధిచేత సంతుష్టుడైన శేషుడు కూడా ఒక గణేశమూర్తిని స్థాపించి ఆ మూర్తికి ”ధరణీధరుడు” అన్న నామం ఉంచాడు. ఈ ధరణీధరమూర్తిని స్మరించేవారికి సర్వకామ్య సిద్ధి కలుగుతుంది!
ఆ తరువాత కార్తవీర్యుడు తన సామంతులనందరిని రావించి, వారిని యధోచితంగా గౌరవించి బ్రాహ్మణులకు భూరిగా సమస్త దానాలనూచేసి అందరి ఆశీస్సులనూ పొంది తన తలిదండ్రులను దర్శించటానికై తన సహస్ర బాహువులతోనూ పురమునకు తరలివెళ్ళాడు! అతడిని చూచిన ఆతని తలిదండ్రులు, పురజనులు అమిత సంతోషం పొందారు. అప్పుడా కార్తవీర్యుడికి సకల బ్రాహ్మణాశీర్వచనం లభించింది!
అప్పుడు ఇంద్రుడిలా అన్నాడు “ఓ శూరసేనమహారాజా! సంకష్ట చతుర్థీవ్రతమహిమను నీకోరికమేరకు వర్ణించి చెప్పాను. ఈ వ్రతం కృతవీర్యునికి సంతానప్రాప్తి నిమిత్తమై ఈ భూలోకానికి తేబడింది. దీని ఫలితాన్ని ఇదివరలో దేవతాగణములు, చంద్రసేనుడు మొదలైన రాజులు అనుభవించారు.
ఈ వ్రతం అతిపావనమైనది. కేవలం ఈ వ్రతాన్ని స్మరించినంతమాత్రాన్నే సకలసిద్ధులూ సంప్రాప్తమౌతాయి!
ఈ వ్రత ప్రభావంచేత రావణుడు సర్వమూ ఎరిగినవాడైనాడు. ఈ వ్రతం యొక్క ప్రభావంచేతనే పాండవులు తాము కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందారు!
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ”చతుర్థీవ్రత మహాత్మ్యం” అనే డెబ్భై మూడవ అధ్యాయం.సంపూర్ణం..
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹