Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – డెబ్భై ఒకటవ అధ్యాయము

ఉపాసనా ఖండము రెండవ భాగము

సంకష్టచతుర్థీ వ్రతోపాఖ్యానం రెండవ భాగము

“ఓ చతురాననా! అనంత శుభఫలప్రదమైనట్టి ఈ సంకష్ట చతుర్థీ వ్రతానికి ఉద్యాపనను ఎలాచేయాలి? ఆ వివరం విస్తరించి చెప్పు. లోకోపకారార్ధమే నీవంటివారు ఈ దివ్యకార్యములు నిర్వహిస్తారుకదా! అందుచేత లోకకళ్యాణంకూడా జరుగుతుంది!” అన్న సూతముని వాక్కులను విన్న బ్రహ్మ యిలా బదులుచెప్పాడు.

“ఓ మునీంద్రా! ఈ చతుర్థీ వ్రతానికి ఉద్యాపనమును చైత్ర, శ్రావణ, ఆశ్వయుజ మాసాలలో ఎప్పుడైనా చేయవచ్చును. వ్రతంయొక్క పూర్తిఫలం పొందే నిమిత్తమే ఈ ఉద్యాపనం చేయాలి! పూజను ఇంతకు ముందు చెప్పిన విధంగానే ఆచరించాలి! ”సర్వతోభద్ర మంటపమును” నానా వర్ణములతోనూ నిర్మించి దానిపై కలశమును స్ధాపించాలి! ఆ కలశాన్ని వస్త్రముచేత, ఆభరణములతోనూ అలంకరించి ఆ తరువాత గణపతి యొక్క మూర్తిని స్థాపించాలి.

షోడశోపచారములతో ఆ గణేశుని మూర్తిని పూజించి తరువాత చతుర్థీ తిథికి, దేవతకు, చంద్రునకు ఇంతకుముందే చెప్పబడినరీతిలో అర్హ్యము నివ్వాలి! ఆ తరువాత నానావిధమైన ఉపహార ములతో మహానివేదనచేసి గణపతిని సంతృప్తుని గావించి ఆచార్యుని ఋత్వికులను సంభావించి వారి ఆధ్వర్యంలో ”గణానాంత్వా” అనే వైదిక మంత్రముతోగాని, మూలమంత్రముతోగాని వెయ్యి లేదా పదివేలు లేదా నూట ఎనిమిదిసార్లు హోమం చెయ్యాలి!

ఆ తరువాత పూర్ణాహుతిని చేసి ”వసోర్ధార”ను కూడా నిర్వర్తించాక హోమాన్ని పరిసమాప్తిచేయాలి! వేదవిదులైన సద్విపులకు షడ్రసోపేతమైన భోజనం పెట్టి వారిని చందన, వస్త్ర, తాంబూలాదులతో సత్కరించాలి! అనంతరం ఆచార్యుని పూజించి వారికి వస్త్రాలంకారాలను యిచ్చి ఫలములతో వాయనమివ్వాలి!

పాయసంతో నిండిన పాత్రను ఎఱ్ఱటి వస్త్రంతో అలంకరించి, దానిపైన బంగారు గణేశమూర్తిని ఉంచి దక్షిణతో కలిపియివ్వాలి! ఈ వ్రతం సంపూర్తికావడానికి కుంచెడు నువ్వులనుకూడా ఇచ్చి, ఆ తరువాత దూడతోకూడిన కపిలగోవుకు సకలమైన అలంకారములూ చేసి ఆచార్యునకు అర్పించాలి! ఆ తరువాత బ్రాహ్మణులు, గణేశుడు తృప్తినొందుగాక అనిచెప్పి క్షమాపణ వేడుకోవాలి!

ఈ విధంగా వ్రతోద్యాపన చేయటంవలన అశ్వమేధక్రతువు చేసి నంతటి ఫలం లభిస్తుంది!” అంటూ వివరాలన్నీ చెప్పి కృతవీర్యునితో అతడి తండ్రి యిలా అన్నాడు.

“నాయనా! లోకోపకారార్ధమై ఈ వ్రతవిధానాన్నంతటినీ బ్రహ్మ నాకు వివరించి చెప్పాడు! ఆ విశేషములన్నీ నీకు తెలిపాను! సంతానాన్ని కోరినవాడవు గనుక ఈ వ్రతాన్ని యధావిధిగా ఆచరించు!” అంటూ స్వప్నంలోనే తన కుమారుని ఆశీర్వదించి అదృశ్యుడైనాడు.

అప్పుడా కృతవీర్యుడు తనకు తండ్రి స్వప్నంలో ఉపదేశించిన రీతిగా ఈ వ్రతాన్ని అనుష్టించాడు. ముందుగా సిద్ధి, బుద్ధులతో కూడినట్టి గజాననుని బంగారు ప్రతిమను చేయించి, దానిని పూవులతో నిర్మింప బడిన ఒక పుష్పమంటపంలో ఉంచి పురాణపఠనం, శాస్త్ర చర్చలు, గాన నృత్యాదికములలో సకల వాదిత్ర ధ్వనులు మారుమ్రోగగా, సకల వైభవ ములతో మహోత్సవాలు నిర్వహించి, తాను గణేశమంత్రాన్ని అమిత శ్రద్ధాభక్తులతో జపించి, విధివత్తుగా హోమముచేసి ఆ తరువాత, బ్రాహ్మ ణులకు అన్నసమారాధనను జరిపి, వారినికూడా సంతుష్టులను చేసి సత్సంతాన ప్రాప్తికై వారి ఆశీస్సులను బడసినాడు.

ఈ రకంగా తపోనిష్టులైన సద్విపుల ఆశీఃఫలంగా ఆతడి భార్య స్వల్పకాలంలోనే గర్భం ధరించింది. శుభసమయంలో సకల శుభలక్షణోపేతుడైనట్టి కుమారుడిని ప్రసవించింది. ఆ సమయంలో రాజు అనేకములైన దానధర్మాలను చేశాడు.

ఆ తరువాత రాజు కుమారునికి సకాలంలో శాస్త్రోక్తరీతిని ఉపనయనాదికాలు, సంస్కారములూ జరిపి, విద్యావంతుడూ జ్ఞానసంప న్నుడైన ఆతనికి రాజ్యపట్టాభిషేకం జరిపాడు. ఆ కృతవీర్యుడు ఇహ లోకంలో అనంతమైన భోగభాగ్యాలను అనుభవించి, చివరకు గణేశాను గ్రహంచేత గణేశపదమును పొందాడు. అతని పుణ్యమువలన ఋత్విక్కులు, పండితులు, ప్రజలు అందరూ సద్గతిని పొందారు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ”సంకష్ట చతుర్థీ వ్రతోద్యాపనం” అనే డెబ్భై ఒకటవ అధ్యాయం.సంపూర్ణం..

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment