ఉపాసనా ఖండము రెండవ భాగము
సంకష్టచతుర్థీ వ్రతోపాఖ్యానం మొదటి భాగము
పూర్వము శ్రీకృష్ణపుత్రుడైన ప్రద్యుమ్నుడు తన కుమారుని జాడ కానరాక చింతాజలధిలో మునిగిఉండగా అతని తల్లియైన రుక్మిణీదేవి అతనికి ఇలా సలహాయిచ్చింది.
‘నాయనా! పూర్వం నీవు ఆరురోజుల వయసుగల బాలకుడవై ఉండగా శంబరాసురుడు నిన్ను నా పొత్తిళ్ళలోంచి అపహరించాడు. అప్పుడు నీ వియోగదుఃఖముచేత నాహృదయం ఎంతగానో తల్లడిల్లింది. ఇతరులు పిల్లలను చూసినప్పుడల్లా ”నాపిల్లవాడుకూడా యింతే వయసు లో వుండేవాడు కదా” అని అనిపించి గుండెల్ని పిండివేసినంత బాధ కలిగేది. ఇలా చాలాకాలం గడిచింది.
ఒకసారి భగవత్కృపా విశేషం చేత లోమశుడనే ముని రావటం తటస్థించింది. ఆయన నాపై దయపూని నాకు మనోభీష్టం నెరవేరడానికై ”సంకష్టచతుర్థీవ్రతాన్ని” ఉపదేశించాడు.
దానిని నేను శ్రద్ధాభక్తులతో నాలుగు పర్యాయములు ఆచరించాను. అప్పుడు ఆ దేవదేవుని అనుగ్రహంవల్ల నీవు శంబరాసురుణ్ణి వధించి తిరిగివచ్చావు! కనుక కుమారా! నీవుకూడ ఆ వ్రతాన్ని ఆచరించు! అలా చేసినట్లైతే నీవు తప్పక నీ కుమారునిజాడ తెలుసుకొనగలవు!”
బ్రహ్మ ఇలా చెబుతున్నాడు. ”ఓరాజా! అప్పుడు ప్రద్యుమ్నుడు కూడా గణనాధునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ వ్రతాన్ని ఆచరించాడు. అప్పుడు గణేశుని అనుగ్రహంవలన తన కుమారుడు బాణాసురునియొక్క అంతఃపురంలో బందీగా ఉన్నట్లు తెలుసుకోగలిగాడు.
ఈ విషయాన్ని త్రైలోక్యసంచారియైన నారదునివద్ద తెలుసుకొని, బాణాసురునికి పరమ శివుని అండదండలున్నాయి గనుక అతడిని జయించటం చాలాకష్టమని గ్రహించి శ్రీకృష్ణుడు ఆ కార్యసిద్ధికని ఉద్ధవుని సలహామేరకు ఈ వ్రతాన్ని ఆచరించాడు.
ఫలితంగా భీకరసమరంలో బాణాసురుని సునాయాసంగా జయించి బాణుని కుమార్తెయైన ఉషాసమేతంగా అనిరుద్ధుని తిరిగి తీసుకుని వచ్చాడు. ‘ఓ రాజా! పూర్వం సృష్టిరచనను చేయగోరి నేనుకూడా ఈ వ్రతాన్ని ఆచరించి ఆ గణేశానుగ్రహంచేతనే నానావిధ సృష్టినీ నిర్విఘ్నంగా సమర్ధవంతంగా చేయగలిగాను.
అంతేకాదు అనేక పర్యాయాలు ” దేవతలు, అసురులూ కూడా తమకు సంభవించిన విఘ్నముల ఉప శాంతికై ఈ వ్రతాన్ని ఆచరించారు. కనుక ఆపదలలోనూ, కష్టకాలము నందూ వాటి శాంతికి ఈ వ్రతాన్ని చేయాలి! ఈ వ్రతానికి ధీటైన సర్వసిద్ధికర వ్రతమింకొకటి ఎక్కడా కనపడదు.
ఈ వ్రతముతో సమానమైన తపస్సుగాని, విద్యగాని, దానముగాని ఏమీలేదు. ఓ రాజా! ఈ కధ నంతటిని విని రెండుచేతులనూ జోడించి హృదయకమలంలో భక్తజనమందారుడైన విఘ్నహరుడిని స్మరిస్తూ మౌనంగా బ్రాహ్మణులు భుజించగా మిగిలిన శేషాన్ని బంధుజనంతో భుజించాలి! ఇలా నిష్టగాచేస్తే కొద్దినెలల్లోనే సిద్ధి తప్పక కలుగుతుంది! వేరే ఏ వ్రతమూ, నోము, కామ్యకర్మాకూడా ఇంత శీఘ్రంగా సిద్ధించదు! ఈ పరమ ప్రభావవంతమైన పవిత్రమైన వ్రతవిధానం అత్యంత గోప్యంగా ఉంచాలి.
శ్రద్ధాళువులు కానివారికీ, నాస్తికులకూ భక్తిలేనివారికీ చెప్పరాదు. భక్తిగలవారైన కుమారులకు, శిష్యులకు, సాధువర్తనగలవారికి మాత్రమే చెప్పవచ్చు! ఇందులో ఉపదేశించిన ప్రకారం ఆచరిస్తే తప్పక సకల కార్యసిద్ధి కలుగుతుంది! పురుషులైనా, స్త్రీలైనా ఉత్కృష్టమైన మహత్కార్యాలను చేయదలచినప్పుడు ఆ కార్యసిద్ధికై ఈ వ్రతాన్ని చేయాలి! అలా చేసినట్లైతే తమతమ మనోభీష్టములను అవశ్యం పొందగలరు!” వారికి విఘ్నహరుని అనుగ్రహంచేత లోటేవుండదు!
”ఓ మహర్షులారా! ఈ విధంగా ఆరాజు చతురాననుడి వద్దనుండి చతుర్థీవ్రత విధానాన్ని పూర్తిగావిని, సమస్త దుఃఖశాంతి కొరకూ అత్యంత ప్రీతితో ఈ వ్రతాన్ని ఆచరించి వ్రత ప్రభావంచేత శత్రువులనందరినీ జయించి, దారాపుత్రులతో నిష్కంటకంగా రాజ్యభోగాలననుభవించాడు” అంటూ సూతమహర్షి ముగించాడు.
ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండములోని ”చతుర్థీ వ్రతోపాఖ్యానం” అనే డెబ్బయ్యవ అధ్యాయం సంపూర్ణం..
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹