Skip to content Skip to footer

శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – అరవై తొమ్మిదవ అధ్యాయము

ఉపాసనా ఖండము రెండవ భాగము

మొదటి భాగము సంకష్ట చతుర్థీవ్రతము

శూరసేనుడు అడుగుతున్నాడు:-“బ్రహ్మదేవునిచేత కృతవీర్యునకు సర్వసిద్ధులూ అనుగ్రహించగల ఏ సంకష్టచతుర్థీవ్రతం చెప్పబడిందో దానిని నాకు సవిస్తరంగా ఉపదేశించండి బ్రహ్మన్!”

ఇంద్రుడు “సత్యలోకంలో సుఖంగా ఆసీనుడైన చతుర్ముఖ బ్రహ్మను కృతవీర్యుని తండ్రి సాష్టాంగనమస్కారంతో శరణుపొంది ఈ విధంగా ప్రశ్నించాడు

“ఓ దేవదేవా! జగత్తుకు సృష్టివిధాతా! ఆశ్రయించినవారికి బాధలను నివారణచేసే దేవా! నా హృదయంలో గాఢంగా నెలకొనివున్న సందేహాన్ని అడుగుతున్నాను. దయచేసి దానికి సమాధానం ప్రసాదించండి! ఆపదలచే కొట్టుమిట్టాడుతూవున్న మానవులకు, చింతలూ, దుఃఖాలూ సమస్యలతో గల్లంతు కాబడ్డ హృదయంగల ఆర్తులకూ, ఆప్తుల వియోగంతో, దగ్గరమిత్రుల చిరకాల వేర్పాటుతో బాధపడుతూన్న మానవులకు వారి సంకటములను నివారించే ఉపాయమేది?

ధన దారిద్య్రంతో బాధపడే దురదృష్టవంతులకు సంపదలనిచ్చి సౌభాగ్యమూ, మంచి సంతతినీ యిచ్చి, సకల సంకటములను నశింపచేసే ఉపాయం మానవులకు ఏమికలదో ఉపదేశించండి దయతో!”

బ్రహ్మదేవుడు చెబుతున్నాడు:-

“ఓ రాజా! నీవడిగినది చెబుతున్నాను! శ్రద్ధగా విను! మానవులకు సకల సిద్ధులనూ ప్రసాదించేదీ కేవలం ఈ వ్రతాన్ని అనుష్ఠించిన మాత్రంచేతనే కోరినవాటినన్నిటినీ ప్రసాదించగలట్టి సర్వసిద్ధిప్రదమైన “సంకష్టగణపతివ్రతాన్ని” నీకు ఉపదేశిస్తున్నాను.

బ్రహ్మముహూర్తంలోనే స్నానముచేసి శుచియై తెల్లనువ్వులూ మంత్రేషధులూ సంపాదించుకొని ప్రాణాయామ, ధ్యానసహితంగా విఘ్న హరుడగు గణపతిని ధ్యానించి వ్రతసంకల్పం చేసుకోవాలి! ఆపైన పరమభక్తితో గణేశభగవానుని ఆగమశాస్త్ర విధానపూర్వకమైన మంత్రములతో యధావిధిగా పూజించాలి! ముఖ్యంగా ఈ వ్రతాన్ని కృష్ణపక్షంలో చవితినాడు రాత్రిపూట చంద్రుడుదయించేవేళ ఆచరించాలి!”

రాజు యిలా ప్రశ్నించాడు: “ఓ బ్రహ్మన్ ! దేవదేవుడైన గజాననుని ఏవిధంగా పూజించాలి? ఈ వ్రతాన్ని ఆచరించవలసిన క్రమం మరికొంత వివరంగా అర్ధమయ్యేలాగ ఉపదేశించండి నాయందు దయతో!” బ్రహ్మదేవుడు చెబుతున్నాడు: “ఉదయమే లేచి కాలకృత్యాలనూ నిత్యకర్మలూ పూర్తిచేసుకొని సాయంకాలం చంద్రోదయమయ్యే సమయం దాకా నిరీక్షించాలి! సరిగ్గా చంద్రోదయ సమయానికి ముందే శుచియైన ప్రదేశంలో పవిత్రమైన గోమయంతో అలికి పూజావేదికను నిర్మించు కోవాలి!

సుద్ద, పసుపుకుంకుమలతో ముగ్గులు పెట్టి అలంకరించిన ఆ పూజావేదికపైన గణేశునికి పీఠం ఏర్పాటుచేయాలి! దానిపై ధాన్యమును గాని బియ్యమునుగాని పోసి పట్టువస్త్రము కప్పి అక్షతలతోనూ పుష్పములతోనూ పూజావిధానం ప్రకారం కలశస్థాపనచేసి కలశపూజను చేయాలి! ఆ కలశంలో యధాశక్తి పంచరత్నములు, పంచవల్లవములు, సువర్ణముతో కలిసిన పరిశుద్ధ జలాన్ని నింపాలి! బంగారం లభించకపోతే శుద్ధమైన వెండిగాని, దానికీ శక్తిలేకపోతే రూపాయి నాణెంగాని వేసి కలశం పైన నూతనవస్త్రం, టెంకాయ, పల్లవములతో, తెల్లని పట్టువస్త్రంతో శిఖరాన్ని పెట్టి ఆ కలశంక్రింద బియ్యంపై ఆగమశాస్త్ర విధానం ప్రకారం గణేశయంత్రాన్ని నిర్మించాలి!

ఆ మహాగణపతి యంత్రంపైన గణేశుని మూర్తిని బంగారుతోగాని, వెండితోగాని సర్వలక్షణ సమన్వితమైన విగ్రహాన్ని స్థాపించాలి! ఆ విధంగా ”ఏకదంతుడు, మహాకాయుడు, కరిగించిన బంగారువంటి శరీరవన్నె కలిగిన విశాలాక్షుడు, మండుతున్న అగ్నిహోత్రంవంటి తేజోవంతమైన నేత్రములు గలవాడిని, పూర్ణకుంభంవంటి లంబోదరము కలిగి ఒకే దంతముతో మూషికవాహనుడైన గణపతిదేవుని మూర్తిని, శేషుడు యజ్ఞోపవీతంగా కల్గిన, దేవతలు చామరములతో సేవిస్తున్న గజాననుని” ధ్యానించాలి!

అలా మనోమయమైన గణేశమూర్తిని తన భావనలోనే దర్శిస్తూ ”ఓ దేవదేవేశా!దయచేయండి! నా సంకటములను నివారించుము. కృపతో నా వ్రతసమాప్తి అయ్యేదాకా ఈ పీఠమున ఆసీనుడవుకమ్ము! ఇదిగో ఆసనము, ఆవాహనము, అర్ఘ్యపాద్యములు సమర్పిస్తున్నాను!” అంటూ “సహస్రశీర్షాపురుష” అన్న పురుషసూక్తమంత్రంతో ఆవాహన చేయాలి..

గణాధీశా! నీకు నమస్కారం! సర్వసిద్ధిప్రదాయకా! ఆసనము స్వీకరించి నా సంకటములను నివారించు.

“పురుష ఏవేదగ్ం సర్వం”

అన్న మంత్రంతో ఆసనం సమర్పించాలి!

ఓ ఉమాపుత్రుడా! నమస్తే నమస్తే! కుడుములు భక్ష్యములు ప్రీతితో ఆరగించుస్వామీ! అర్ఘ్యపాద్యములు స్వీకరించి నా సంకటములు నివారించు.

“ఏతావానస్య మహిమా”

అని పాద్యము

ఓ లంబోదరా! నమస్తే నమస్తే! నవరత్నములు ఫలములతో కూడిన అర్ఘ్యమును స్వీకరించి దయతో నా సంకటములను నివారించు.

“తిపాదూర్ధ్వః ఉదైపురుషః”

మంత్రంతో అర్ఘ్యము సమర్పించాలి.

గంగాజలముతో పవిత్రం చేయబడిన, సర్వతీర్ధములలో సేకరించిన ఆచమనీయమును స్వీకరించు! దయతో నా సంకటములను నివారించు.

“తస్మాత్ విరాడజాయత”

అన్న మంత్రంతో ఆచమనం చేయాలి.

పంచామృతములైన పాలు, పెరుగు, తేనే, నేయి, చక్కెర కలిపిన పంచామృతములను స్వీకరించు గణేశప్రభూ! నా సంకటములను నివారించు అని.

“యత్పురుషేణ హవిష”

అన్న మంత్రంతో పంచామృతస్నానం సమర్పించాలి.

నర్మద, చంద్రభాగా, గంగానదీ జలముల స్నానమును ఔపచారిక స్నానంగా సమర్పించాలి.

“సప్తాశ్వాసన్ పరిధయః”

అన్న మంత్రంతో శుద్ధోదకస్నానం సమర్పించాలి!

ఓ గజాననా! నాచే సమర్పితమైన ఈ నూతన వస్త్రములు చాపును స్వీకరించి నా సంకటములను నివారింపుము! అని చెప్పి

“తం యజ్ఞం బర్హిషి ప్రొక్షన్”

అని వస్త్రయుగ్మం సమర్పించాలి.

ఓ వినాయకుడా! నమస్కారం! పరశుధారీ దయతో ఈ యజ్ఞోపవీతాన్ని స్వీకరించి నా సంకటములను నివారించు!

“తస్మాద్య సర్వహతః”

అని యజ్ఞోపవీతం సమర్పించాలి.

ఈశపుత్రా నమోనమః! మూషికవాహనా నమస్తే! దయతో నేను సమర్పించు చందనం స్వీకరించి ఈ శీతలోపచారముతో నా సంకటములను నివారించు.

“తస్మాద్యజ్జా సర్వహుతః”

అను మంత్రముతో – చందనం సమర్పించాలి!

పవిత్రమైన ధాన్యంతో క్రొత్తగా తయారుచేయబడిన అక్షతలను సమర్పిస్తూ నేయి, కుంకుమలతో కలిపిన అక్షతలను, సంపెంగ, మల్లె, దర్భలు, పారిజాతము వంటి అనేక పుష్పాలను.

”తస్మాదశ్వా అజాయత”

అన్న మంత్రంతో పుష్పాక్షతలను సమర్పించాలి!

లంబోదర, మహాకాయ, ధూమకేతుడా! సుగంధ పరిమళ భూయిష్టమైన ఈ చందన, సాంబ్రాణి ధూపమును స్వీకరించి నా సంకటములను నివారించు!

“యత్పురుషం వ్యదధుః”

అన్న మంత్రంతో ధూపం సమర్పించాలి!

విఘ్నాంధకార వినాశకుడా! దేవతాధిపా! దేవదేవా! ఈ దీపాన్ని సమర్పిస్తున్నాను. ఈ సంకటములనుండి దారిచూపి నా కష్టములను నివారించు! అని

“బ్రాహ్మణోస్య ముఖమాసీత్”

అన్న మంత్రంతో దీపం సమర్పించాలి!

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment