Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – అరవై ఏడవ అధ్యాయము

ఉపాసనా ఖండము రెండవ భాగము

దూర్వామహాత్మ్యం

అప్పుడు గణములు ఇంకా యిలా అన్నారు ”ఓరాజా! ఈవిధంగా కౌండిన్యపత్నియైన ఆశ్రయ తనకు కలిగిన సందేహ నివారణకై భర్తయైన కౌండిన్య ముని ఆదేశానుసారం అతడు యిచ్చిన దూర్వాంకురాన్ని తీసుకుని దానిఎత్తు బంగారాన్ని దేవేంద్రుని వద్ద నుంచి అర్ధిద్దామని ఇంద్రునివద్దకు చేరుకున్నది. దేవతల ప్రభువైన ఇంద్రునితో ఇలా అన్నది.

” నా భర్తయైన కౌండిన్యముని ఆదేశాన్ననుసరించి సరిగ్గా ఈ దూర్వాంకురం సమంగా తూగగల బంగారాన్ని నీనుంచి అర్ధించి తీసుకువెళ్ళగోరి వచ్చాను.”

”ఓ మాతా! నీభర్త దూర్వాంకురం ఎత్తు బంగారానికై పంపించినట్లయితే వారి అభీష్టానుసారమే నాశక్తికొలది యిచ్చి పంపిస్తాను.” అని దూతను పిలిచి అతడితో ఆ మునిపత్నిని కుబేరునివద్దకు తీసుకువెళ్ళి ఈమెకు దూర్వాంకురమునకు సరిపోయినంత బరువుగల బంగారాన్ని నేను యిమ్మన్నానని నాఆదేశంగా చెప్పి ఇప్పించు” అంటూ ఆదేశించాడు.

“ఓ రాజా! దేవేంద్రుని ఆజ్ఞను అనుసరించి ఆ దూత ఆమెను కుబేరునివద్దకు తీసుకువెళ్ళి ఇంద్రుని ఆదేశాన్ని వివరించాడు. ఆ కుబేరుడు అందుకు ఎంతో ఆశ్చర్యపడి ”మునిదంపతులు, దేవతల ప్రభువైన ఇంద్రుడు ఈవిధంగా ఇంత కొంచెం బంగారాన్ని ఎందుకు కోరారు? దూర్వాంకురానికి ఎంతబంగారం తూగుతుంది? అతిస్వల్పమైన బంగారం కోసం ఎంతశ్రమతీసుకున్నారు!” అనుకున్నాడు. ఆ దూతలు ”ఓ కుబేరా! ఆమె కేవలం అంతఎత్తు బంగారాన్నే కోరింది. ఆమె పతివ్రతయైన కారణంచేత భర్తమాటను జవదాటదు!” అన్నారు.

అప్పుడు కంసాలి వద్ద ఉండేటటువంటి చిన్నిత్రాసును తెప్పించి దానిలో ఒకవైపు బంగారాన్నీ రెండోవైపు దూర్వాంకురమునూ ఉంచగా దూర్వాంకురమే ఎక్కువ తూగింది. ఇంకా మిగిలిఉన్న బంగారాన్నంతటినీ, ఆ తరువాత కోశాగారంలోని బంగారాన్నంతటినీ వేయించాడు కుబేరుడు. ఐనా అవి అన్నీకూడా దూర్వాంకురం ఎత్తు బంగారంతో సమంగా తూగలేదు! అప్పుడు కోశాగారంలో ఉన్న ద్రవ్యాన్నంతటిని పర్వతంలా కుప్పగా త్రాసులో పోయించాడు. ఐనా అవేవీ దూర్వాంకురముయొక్క బరువుకు సరితూగలేదు. అప్పుడు తన భార్యనుకూడా అందులోకి ఎక్కమనినాడు. చివరికి తనతోపాటూ అలకాపురిలోని ఐశ్వర్యా న్నంతటినీ త్రాసులో పెట్టినా దూర్వాంకురం పైకి ఎంతమాత్రమూ లేవలేదు.

ఈ వృత్తాంతాన్ని విన్న ఇంద్రుడు స్వయంగా ఐరావతాన్ని అధిరోహించి వచ్చి తన యావత్ ద్రవ్యాన్నీ వేసి చివరకు తానూ అధిరోహించినా ఆ త్రాసు పైకిలేవలేదు. అప్పుడు ఇంద్రుడు సిగ్గుతో తలదించుకుని చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఇంద్రుడు హరిహరు లను సైతం స్మరించి వారినికూడా ఘటారోహణం చేయించాడు. ఇంతచేసినా దూర్వాంకురం పైకిలేవలేదు.

అప్పుడు వారందరూ త్రాసు దిగి దేవతాగణములు తమవెంటరాగా, కౌండిన్యముని ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ మునికి భక్తిశ్రద్ధలతో నమస్కరించి, దిగ్భ్రమనుంచి ఇంకా తేరుకొనక పోవటంచేత సంభ్రమంగా యిలా అన్నారు.

“ఓ మునిసత్తమా? నీ యొక్క దివ్యసందర్శనభాగ్యం చేతనే మా సకల పాపాలూ నశించాయి. మా పూర్వపుణ్యవశముననే మాకు నీవద్ద శుభం ప్రాప్తించునుగాక! మహానుభావా! మీరు తమ భార్యచేత పంపిన దూర్వాంకురము యొక్క మహిమను మేమందరమూ కనులారా చూశాము! మూడులోకాలు సైతం దూర్వాంకురం యొక్క బరువుకు సరితూగలేదు! పైగా అది నీచేత గజాననుడికి కడుభక్తితో సమర్పించబడటంచేత దాని మహిమ అనంతమైంది.

గజాననుడికి ఏకాంతభక్తి సలిపేవారి మహిమను యదార్ధంగా తెలుసుకోవడం ఎవరితరమూకాదు!” అంటూ ఆ దేవతా గణాలు ముందుగా గజాననుణ్ణి అర్చించి, ఆతరువాత భార్యాసమేతంగా ఆ కౌండిన్యమునిని పూజించి, అతడిని అనేకరకాల స్తుతించి గానం చేశారు.

“ఓ మునిపుంగవా! అష్టదిక్పాలకులూ,త్రిమూర్తులూ, సిద్ధ, విద్యా ధర, గంధర్వ, కింపురుషాదులకు సైతం నీ మహిమ తెలుసుకోవడం అన్నది అలవికానిపని!” అంటూ భక్తజనసులభుడైన గజాననుని, ఆతని భక్తుడైన కౌండిన్యునీ కీర్తించి వారి సెలవు గైకొని తమతమ నెలవులకు వెళ్ళిపోయారు.

అప్పుడు మునిపత్నియైన ఆశ్రయకూడా, దూర్వాంకుర మహాత్మ్యాన్ని స్వయంగా తెలుసుకున్నవటంచేత తన భర్తృవాక్యముపట్ల యెనలేని గురి కుదిరినదై సర్వదేవతావంద్యుడైన ఆ కరివదనుడిని అనేక దూర్వాంకు రములతో కడు భక్తిశ్రద్ధలతో పూజించింది.

తన భర్తయైన కౌండిన్యుని చరణకమలాలపై వ్రాలి “ఓనాధా! దుర్మతినై అత్యంత ప్రతిభావంతమైన తమ సత్యవాక్కుపట్ల విశ్వాసం లేనిదాననై ఎంతో అపరాధంకావించాను. కాని అత్యంత కరుణాంతరంగులైన మీరు నాలో వివేకాన్ని మేలుకొలిపి తగిన అనుభవాన్ని గరపి నా కళ్ళు తెరిపించారు! కనుక అజ్ఞానకృతమైన నా అపరాధాన్ని క్షమించండి! మిమ్మల్ని శరణువేడుతున్నాను!” అంటూ ప్రార్ధించంగా ఆ ముని ఆమెను ఊరడించి స్వాంతన వచనాలతో ఓదార్చాడు.

ఆ మర్నాడు ఉదయము ప్రాతఃకాలాన్నే ఆ దంపతులిద్దరూ దూర్వాంకురములను భక్తితో సేకరించి భక్తజనవత్సలుడైన విఘ్నేశుని శ్రద్ధగా అర్చించారు. అదిమొదలు వారు ఇరువురూ అనన్యభక్తితో ప్రాతఃసాయంకాల అర్చనలలో గణేశుని క్రమం తప్పక దూర్వాంకురములతో అర్చించి, గణేశానుగ్రహానికి పాత్రులై తరించారు.

అప్పుడు దూతలిలా అన్నారు. “ఓరాజా! అత్యంత మహిమోపేత మైన దూర్వామహాత్యాన్ని పూర్తిగా వర్ణించడం బ్రహ్మరుద్రాదులకు కూడా శక్యముగానిపని! త్రిలోకాలలోని ఐశ్వర్యము కూడా దూర్వాపత్రంతో సమానంగా తులతూగలేదు! ”దూర్వా” అన్న నామోచ్ఛారణచేతనే సకల పాపములూ నశిస్తాయి.

దూర్వాంకురాన్ని స్మరించటం ఆ గజాననుణ్ణి స్మరించటమే అవుతుంది! ఓరాజా! నీకై చింతామణి క్షేత్రంయొక్క మహిమనూ, దూర్వాంకుర మహాత్మ్యమును వివరించాము. దీనిని వినటం, కీర్తించటం, ధ్యానించటంవలన సర్వకామ్యసిద్ధి, ముక్తి రెండూ లభిస్తాయి! ఈ కారణం చేతనే ఆ ఛండాలికీ, గానుగకు కట్టివేయ బడిన ఎద్దుకూ, కంచర గాడిదకూ కూడా గణేశుని దివ్యానుగ్రహ ప్రభావం చేత దివ్య విమానములు పంపించబడ్డాయి.

ఆ ఎద్దు, కంచరగాడిదల ముఖములనుండి దూర్వాపత్రములు ఆ వినాయకుని పైనబడినాయి. ఆ ఛండాలి తన చలిబాధ తీర్చుకో గోరి దూర్వాంకురములు వెంటతెచ్చుకొనగా ప్రబలమైన గాలివీచి, కొన్ని దుర్వాంకురములు ఆమె చేతినున్న దుర్వాపత్రములు విఘ్నేశునిపై పడేసింది. దూర్వాంకుర అర్చన విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్ర మైనందువల్ల ఆ ముగ్గురి కల్మషాన్నీ తొలగించి, వారిని పాపరహితు లనుగా చేసి వారిపై తన దివ్యానుగ్రహాన్ని వర్షించి తన నిజలోకానికి తీసుకువెళ్ళాడు. దూర్వాగంధం సోకగానే గజాననుడు సంతుష్టుడౌతాడు. ఇక భక్తిపురస్సరంగా ఆతడి మస్తకమున దూర్వాంకుర సమర్పణచేస్తే వేరుగా చెప్పాలా?” అంటూ ముగించారు.

ఈ వృత్తాంతాన్ని వినిపిస్తూన్న బ్రహ్మ యిలా కొనసాగించాడు. “ఆ విధంగా దూతలవల్ల దూర్వామహాత్మ్యాన్ని విన్న రాజు సపరివారంగా స్నానసంధ్యాదులొనర్చి, భక్తజనమందారుడైన విఘ్నపతిని దూర్వాంకురము లతో భక్తిప్రపత్తులతో పూజించాడు. ఆ పుణ్యప్రభావం చేత వారందరూ దివ్యమైన పుణ్యశరీరాలను ధరించి, అమితమైన తేజస్సుతో ప్రకాశిస్తూ దివ్యమైన ఆభరణాదులను ధరించి దివ్యవిమానారూఢులై వైనాయక లోకాన్ని చేరారు.

అప్పుడు పురజనులు సైతం అదేవిధంగాచేసి ఐహిక భోగాలను ఆ తరువాత గణేశధామాన్ని పొందారు. కనుక ఓరాజా! గణేశుని నిజభక్తులైన వారు ఆ దేవదేవుని దూర్వాంకురములతో తప్పక పూజించాలి! అలా దూర్వార్చన చేస్తున్న భక్తులను చూసినప్పటికీ సకలపాపములూ తొలగి పరిశుద్ధులౌతారు.

పెక్కు దూర్వాంకురములు లభించనట్లైతే కనీసం ఒక్క దూర్వాంకురాన్నైనాసరే సమర్పించి పూజించాలి! దానివల్ల అట్టిపూజ కోటిరెట్లు ఫలవంతమౌతుంది. ఓ రాజా! ఈరకంగా దూర్వామహాత్యాన్ని నీకు వివరించాను.

ఈ దూర్వామహత్మ్యన్ని వినటంవల్ల కూడా సర్వపాపక్షయ మౌతుంది. ఇది దుష్టులకు వినిపించరాదు. ప్రియుడైన సచ్చీలుడైన కుమారునికి శ్రేయస్సును గోరి వినిపించవచ్చు.”

అప్పుడు ఇంద్రుడిలా అన్నాడు. “ఇలా బ్రహ్మ నుంచి అత్యుత్తమమైన ఈ ఆఖ్యానాన్ని విని కృతవీర్యుడు చాలా సంతోషించి బ్రహ్మను అనేక విధముల కీర్తించి తన స్వస్థానానికి ఆయనవద్ద సెలవుపుచ్చుకుని ఆశ్చర్యచకితుడై వెడలిపోయాడు.”

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ‘దూర్వామహాత్మ్యం’ అనే అరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం..

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment