ఉపాసనా ఖండము రెండవ భాగము
దూర్వామహాత్మ్యం
ఆ తరువాత కౌండిన్యుడు తన పత్నియైన ఆశ్రయతో దూర్వా మహాత్మ్యగాధను యిలా కొనసాగించాడు.
“ఓ ప్రియపత్నీ! ఒకనాడు గజాననుడు సుఖాసీనుడైవుండగా త్రైలోక్యసంచారీ బ్రహ్మమానసపుత్రుడైన నారదమహర్షి ఆయనను దర్శించి సాష్టాంగ దండప్రణామంచేసి, ‘ఓదేవా! తమ దర్శనవిశేషంచేత నాజన్మ సార్ధకమైంది. అనేక జన్మార్జిత పుణ్యఫలంవల్లకాని తమదర్శనం కలుగదు!’ అంటూ వినయంతో అంజలిఘటించి నిలిచాడు.
అప్పుడు భక్తవత్సలుడైన గజాననుడు ఎంతో ఆదరంతో నారదుని చేయిపట్టుకుని ఆతడిని ఉచితాసనంపై కూర్చుండపెట్టాడు. నారదుడా ప్రేమకు ఆనందపరవశుడై గజాననునితో యిలా అన్నాడు.
‘ఓ దేవా! నాకు మార్గమధ్యంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం తటస్థించింది. దానిని తమకు విన్నవించాలన్న కుతూహలంతో వచ్చాను. అది చెప్పి వెళతాను!’అప్పుడు భక్తజనమందారుడైన గణేశుడు చిరునవ్వుతో ‘ఆ వివరం చెప్పి వెళ్ళమని’ అనుజ్ఞనిచ్చాడు. అందుకు నారదుడిలా చెప్పసాగాడు..
“ఓ ప్రభూ! మిథిలానగరాన్ని జనకుడు అనేరాజు ప్రజారంజకంగా ప్రజలను తన కన్నబిడ్డలకన్న మిన్నగా ప్రేమిస్తూ పాలిస్తున్నాడు. అతడు సకల శుభగుణోపేతుడవటమేకాక గొప్పదాత! నిత్యం అడిగినవారికి లేదనకుండా దానమివ్వటమేకాక నిరతాన్నదానంతో ప్రజల ఆకలికూడా తీర్చే గుణవంతుడు. దేవతలను, బ్రాహ్మణులను అనునిత్యం పూజిస్తూ ధర్మబద్ధుడై జీవిస్తున్నాడు. ఆ కారణంచేతనే కాబోలు లేక తమ అనుగ్రహ విశేషం వల్లనో ఇంతగా ద్రవ్యమును వెచ్చిస్తున్నా ఆతడి సంపద తరగక బహుముఖంగా పెరుగుతూనే ఉన్నది.
ఈ ఆశ్చర్యాన్నంతటినీ ఆతడి గృహానికి స్వయంగా వెళ్ళిచూచాను! అతడు బ్రహ్మజ్ఞానాభిమానంతో నన్ను కొంచెం అపహసించాడు. అతడిని అభినందిస్తూ యిలా అన్నాను.
‘ఓ రాజా! నీవు ధన్యుడవయ్యావు! నీకు అక్షయమైన సంపదలను సర్వసమృద్ధినీ ఆ గజాననుడే నీభక్తికి ప్రతిఫలంగా అనుగ్రహిస్తు న్నాడు!’ నా మాటలు విన్న జనకుడు గర్వంతో యిలా అన్నాడు. ”నేనే ముల్లోకాలకూ ప్రభువును! మహాదాతను! భోగిని! సర్వరక్షకుడను నేనే! నాకన్నా యితర మార్గమేమీ ముల్లోకాలలోనూ లేదు! సర్వమూ నా ప్రమేయం వల్లనే జరుగుతున్నది. కర్త, కార్యము, కరణమూ యివన్నీ కూడా నేనే!” అంటూన్న ఆ గర్విష్టితో కినుకవహించి ఆగ్రహంతో యిలా అన్నాను
”ఓ రాజా! ఈ జగత్కర్త, భర్త, హర్తా ఈ మూడూకూడా ఆ ఈశ్వరుడే! ఇంకెవరూ ఆ పనిని నిర్వర్తించజాలరు! నీవే సత్కార్యములన్నీ చేస్తున్నానంటున్నావే? దంభముతో నీ గొప్పతనాన్ని చాటుకునే నిమిత్తమే వాటిని చేస్తున్నట్లు స్పష్టమైంది. నీ పొరపాటు నీకర్ధమయ్యేరోజు అతి సమీపంలోనే ఉన్నది!” అని అక్కడినుండి మీ సన్నిధికి వచ్చాను” అంటూ నారదుడు విఘ్నేశ్వరునికి భక్తితో నమస్కరించి సెలవుపుచ్చుకున్నాడు. అక్కడినుండి నారదుడు విష్ణుదర్శనార్ధమై వైకుంఠం చేరుకున్నాడు.
“ఓ ఆశ్రయా ! నారదమహర్షి అలా సెలవుతీసుకున్నాక గజాననుడు రాజభక్తిని పరీక్షించటానికై మిథిలానగరాన్ని చేరుకున్నాడు. శరీరమంతా వ్రణాలు రసిఓడుతూ శరీరంపై ఈగలు ముసురుతూండగా చిరిగిన, మాసినవస్త్రం ధరించి ఓ బీదబ్రాహ్మణ వేషధారియై పడుతూ, లేస్తూ రాజమందిరం వద్దకు చేరాడు మాయారూపంలో ఆ గజాననుడు! ద్వారం వద్దనున్న ద్వారపాలకులతో “ఓ దూతలారా! అతిధియై ఒక బ్రాహ్మణుడు వచ్చాడని మీ రాజుతో తెలపండి.
కడువృద్ధుణ్ణి. బాగా ఆకలిగొని ఉన్నాను. మృష్టాన్న భోజనాన్ని మాత్రమే ఆశించివచ్చాను” అన్నాడు. దూతలీవార్తను జనక మహారాజుకు ఎరిగించగానే ”ఓ దూతలారా! ఆ వృద్ధుణ్ణి వెంటనే లోనికి తీసుకురండి!” అని ఆజ్ఞాపించాడు. దూతలు కూడా అతడిని వెంటనే ప్రవేశపెట్టారు. ఆరాజు దూరాన్నుంచే మలినదేహంతో వంటిమీద వ్రణాలతోనూ వాటినుండి స్రవిస్తూన్న నెత్తుటిపై మూగే ఈగలతో జుగుప్సా కరంగా ఉన్న ఆ వృద్ధుడిని చూసి”ఆహా! నన్ను పరీక్షించటానికి ఈశ్వరుడేమైనా ఈ రూపందాల్చి వచ్చాడో ఏమో? ఏదేమైనప్పటికీ ఈతడి క్షుద్బాధను తొలగించి మనస్సు ను సమాధానపరుస్తాను!” అనుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు రాజుదగ్గరకు వచ్చి
“ఓ రాజా! చంద్రునికాంతివంటి తెల్లనిదైన నీ కీర్తిచంద్రికనిగూర్చి విని నీ సన్నిధికి వచ్చాను! చిరకాలంనుండి ఆకలిబాధతో తల్లడిల్లుతున్నాను. కనుక నాకు కడుపునిండా భోజనం పెట్టు! అలాగాని చేస్తివా నీకు నూరుయాగాలు చేసినంతటి పుణ్యం వస్తుంది!” అన్నాడు.
ఈ కధనంతా చెబుతున్న కౌండిన్యుడిలా అన్నాడు: ”ఓఆశ్రయా!ఆ జనకమహారాజు బ్రాహ్మణుని పలుకులువిని కూడా వెంటబెట్టుకొని తన మందిరంలోకి తీసుకువెళ్ళి ఆతడికి సకల రుచులతో కూడిన భోజనం పెట్టించగా అదంతా ఒక గడ్డిపరకలా తినేశాడు ఆ మాయా రూపి! ఇంకా ఆకలిగావున్నదంటే ఒక పర్వతమంత అన్నపురాశిని పండించి పెట్టాడు. అదంతాకూడా ఒక ముద్దను తిన్నట్లుగా మ్రింగేశాడు.
ఈ విధంగా పదివేలమందికి సిద్ధంచేసిన ఆహారపదార్ధాలన్నీ తినేసి ”యింకా అన్నంకావాలి!’ అనగానే గాడిపొయ్యలు త్రవ్వించి యింకా అన్నం వండించి వడ్డింపచేశాడు. వండింది వండినట్లుగా వడ్డించినా అదంతా ఖాళీచేసేయసాగాడు. అప్పుడు ప్రజలంతా రాజువద్దకు వెళ్ళి ”ప్రభూ! వీడెవరో రాక్షసునిలా ఉన్నాడు.
వీనికెందుకింత ఆహారం పెడతారు? ఇటువంటి రాక్షసులకు భోజనం పెట్టడంవల్ల ఏమీ ప్రయో జనంలేదు! వీడు ముల్లోకాలూ మ్రింగించినా తృప్తిచెందునా?” అన్నారు. ఉన్నబియ్యం అన్నీ నిండుకున్నవి! ధాన్యమైనాసరే కడుపునిండేందుకు తెచ్చి యివ్వమన్నాడు! అప్పుడు ప్రజలందరి యిళ్ళలోనివీ, గ్రామాల లోనూ పల్లెలలోని ధాన్యపురాశులన్నీ కూడా తెచ్చిపెట్టారు. అవి అన్నీకూడా భక్షించినా అతడికి తృప్తి కలుగలేదు! అప్పుడు దూతలు రాజసన్నిధికి వెళ్ళి ”ప్రభూ! ఇంక ధాన్యముకూడా ఎక్కడాలేదు!” అని చెప్పగా జనకుడామాటలు విని తలవంచుకుని సిగ్గుపడ్డాడు.
ఆ బ్రాహ్మణుడు ”ఓ రాజా! నాస్తితేస్తు!” అనిపలికి గ్రామములో యింటింటికీ భిక్షాటనకై వెళ్ళగా ”ఓ బ్రాహ్మణోత్తమా! మా ఇళ్ళలోని సమస్త ధాన్యమునూ రాజు ఎప్పుడో తీసుకెళ్ళిపోయాడు నీకిప్పుడు అన్నం పెట్టుట ఎలాగ? కనుక వేరేచోటుకి వెళ్ళు!’ అనసాగారు అప్పుడా మాయాబ్రాహ్మణుడు “ఓ జనులారా! జనకమహారాజు నిరతాన్నప్రదాత అన్న కీర్తివిని తృప్తిని పొందగోరి వచ్చాను. ఆ తృప్తి కలుగకుండా ఎక్కడికి వెళ్ళగలను!” అనగానే మారుమాట్లాడలేక ప్రజలు మౌనం వహించారు. ఆ మాయాబ్రాహ్మణుడు అలా తిరుగుతూ విరోచన, త్రిరోచనులు యింటిలో ప్రవేశించాడు. ఆ ఇంట్లో ఏరకమైన వస్తుసామాగ్రి, పాత్రలు కనుపించ లేదు..
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ”దూర్వామహాత్మ్యం” అనే అరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం..
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹