ఉపాసనా ఖండము మొదటి భాగము
ఇందుమతీ – నారద సంవాదం
గిరిరాజనందినియైన పార్వతి తండ్రియైన హిమవంతుని తిరిగి యిలా ప్రశ్నించింది.
“ఓ తండ్రీ! మహారాణియైన ఇందుమతి ఆ విషాద వార్తకు నిర్ఘాంతపోయి మూర్ఛిల్లిన తరువాత ఏం జరిగిందో, ఆ రాజ్య ప్రజలేమి చేశారో ఆ వివరాన్నంతటినీ దయతో నాకు తెలియచేయి!”
“అమ్మాయీ! అప్పుడు కొందరు ప్రజలు ముందుగా తెప్పరిల్లి తమ కన్నీళ్ళు తుడుచుకొని ఆ మహారాణి వద్దకు వచ్చి ఆమెను ఇలా ఊరడించారు. ‘ఓ దేవీ! నీవు దుఃఖింపవద్దు! నీకింకా పసితనం వీడని పుత్రుడున్నాడుకదా! వాడియందు నీ ఆపేక్ష ఉంచుకో! ఐనా మరణించిన వ్యక్తి ప్రేతాత్మను బంధువుల కన్నీళ్ళు కాల్చివేస్తాయి!
అందుచేత నీ భర్తయొక్క శ్రేయస్సును ఆపేక్షించి, దుఃఖాన్ని విరమించుకొని నీ భర్తకు ఉత్తరగతులను చేకూర్చుకో!ఎందుకంటే, ఎంతటివారైనా ఏనాటికైనాసరే జన్మించిన ప్రతీవారూ మరణించకా తప్పదు.జీర్ణమైన వస్త్రాన్ని వీడి, మనమెలా కొత్తవస్త్రాన్ని ధరిస్తామో, అలానే ప్రతీ జీవుడూకూడా తన పాతబడ్డ దేహాన్ని వీడి, మరో నూతన దేహాన్ని ధరిస్తూంటాడు!
అన్నిటికన్నా అమితంగా ఆశ్చర్యంగొలిపే విషయమేమంటే ఇలా మానవులు నిరంతరం మృత్యుముఖంలో ఉండి, మరణధర్మము కలవారై ఉండికూడా, అలా మరణించినవారిని గురించి దుఃఖిస్తారు. ప్రతి జీవికీ దేహధారణా, దేహం నుంచి విముక్తీ అత్యంత సహజమైనవి!
దైవసంకల్పానుసారమే ఈ చరాచర జగత్తంతా వర్తిస్తుందన్న నిత్యసత్యాన్ని విస్మరించి, సర్వమూ తానేనన్న అహంకారంతో, భ్రాంతుడై జీవి చరిస్తుంటాడు. కేవలం భగవదనుగ్రహమే ప్రమాదములైన వీటినుంచి ఈ అజ్ఞానపు అంధకారంనుండీ అతడిని ఉద్దరించగలది! కనుక నీవు అశాశ్వతమైన వాటికై దుఃఖశోకాలను వీడు! మహారాజు పుణ్యశీలి! ధర్మవంతుడు గనుక శాశ్వతముక్తిని పొందియున్నాడు!
మానవుడిచ్చట ఒనర్చిన పుణ్యకర్మలు అతడికి స్వర్గవాసమును తాత్కాలికంగా కల్గించినా, ఆ పుణ్యమంతా అతడనుభవించాక తిరిగి భూలోకంలో జన్మించక తప్పదు! ఇక్కడికి ఒక్క మహాత్ముడైన ఋషి వచ్చివున్నాడు. ఆయననడిగి మనం సందేహం నివృత్తిచేసుకొని నీ కర్తవ్య బోధను కూడా ఉపదేశంగా పొందుదాము!
ఆ తరువాత జరగవల్సిన కార్యక్రమాలు నెరవేర్చవచ్చు!” అంటూ ఊరడించారు. ఆతరువాత జరిగిన కథని హిమవంతుడిలా చెప్పాడు.
“ఓ పార్వతీ! ఈవిధంగా ప్రజానీకంచేత మహారాణి ఊరడించబడి క్షణకాలం ధైర్యం తెచ్చుకొని కన్నీళ్లు తుడుచుకొని ప్రజానీకాన్నందరినీ పంపించివేసి, తన సౌభాగ్యచిహ్నాలను వదలి, క్రమంగా కృశించసాగింది. ఇట్లా భర్తృవియోగానికై అనుక్షణం దుఃఖిస్తూ, నిట్టూర్పులు విడుస్తూ నామమాత్రంగా తాను రాజుకు ప్రతినిధియై, పరిపాలన నిర్వహించ సాగింది. ఈ రీతిగా పన్నెండు సంవత్సరాలు గడిచాయి.
ఒకనాడు యాదృచ్ఛికంగా అక్కడికి నారదమహర్షి విచ్చేశాడు. ఆ ఇందుమతి దుఃఖిస్తూ తన భర్త వియోగాన్ని గురించీ, అందుకు తాను పడిన పరితాపా న్నంతటినీ ఆ మహర్షికి వివరించింది. అప్పుడు ఆ నారద మునీంద్రుడు ఆమె దుఃఖకారణం తెలుసుకొని ఆమెను ఉత్సాహపరుస్తూ ఇలా అన్నాడు.
“ఓ ఇందుమతీ! నీభర్త ఒకానొకచోట జీవించియే ఉన్నాడు. కనుక నీవు మంగళకరమైన ఆభరణాలను ధరించి, సుమంగళిగా సుశోభితురాలవై ఉండు!” అని ఆమెకు ధైర్యం చెప్పాడు.
“ఓ పార్వతీ! ఆ రాణి ఇందుమతి మహర్షి వాక్కులను విశ్వసించి తన ఆభరణాలన్నింటినీ తెప్పించి సంతోషంతో వాటిని తిరిగి అలంక రించుకుంది. భూసురులైన బ్రాహ్మణోత్తములను పిలిపించి వారికి శక్తి కొలది దానాదులను చేసి తృప్తులను కావించింది. ఆతరువాత దేవముని యైన నారదునికి నమస్కరించి, తన భర్తను తిరిగిపొందే ఉపాయాన్ని తెలుపమని ఇలా ప్రార్ధించింది.
‘ఓ మహర్షీ! నా భర్త ఎచ్చట ఉన్నాడు, ఎలా ఉన్నాడు? ఏ ఉపాయంవల్ల అతడి దర్శనం, సమాగమం నాకు కల్గుతుంది? నన్ను అనుగ్రహించి అందుకు అనువైన వ్రతముగాని, దానముగాని, తపస్సుగాని ఎంతటి దుష్కరమైనదైనాసరే నాకు తెలియచేయండి! దాన్ని నిర్వహించి భగవదనుగ్రహాన్ని పొంది తిరిగి నా భర్తను చేరుకుంటాను.’ అంటూ వేడగా, ఆ నారదమహర్షి ఆమెతో ఇలా అన్నాడు.
“ఓ సాధ్వీమణీ! ఇందుమతీ! నీ మనోభీష్టాన్ని పొందటానికై నీకొక వ్రతాన్ని ఉపదేశిస్తాను! దాన్ని అనుష్టించటంవల్ల నీ కోరికలీడేరి నీభర్తను తిరిగి పొందగలవు! ఆ వ్రతవిధానం ఎలాంటిదంటే శ్రావణశుద్ధ చతుర్ధి నాడు ఆ వ్రతాన్ని ప్రారంభించాలి! ఆ రోజు ఉదయాన్నే నదీతీరానికి వెళ్ళి సమంత్రకంగా స్నానాదులను పూర్తిచేసుకొని గణేశవ్రతాన్ని చేస్తాను. అనుకొని సంకల్పించుకోవాలి.
అనంతరం తెల్లటి వస్త్రాలను ధరించి, మట్టితో నాలుగు బాహువులతోకూడిన వినాయకుడి మూర్తిని తయారు చేసి నిశ్చలబుద్ధితో, షోడశోపచారములతో ఆ మూర్తిని పూజించాలి. విష్య అన్నాన్ని మాత్రం ఏకభుక్తంగా భుజించాలి. లేదా శక్తివుంటే ఉపవాసమైనా చేయవచ్చు!
ఈవిధంగా ఒక మాసంరోజులు అనగా భాద్రపద శుద్ధ చవితివరకూ నిష్టగా వ్రతంచేసిన తరువాత, ఆనాడు సంగీత నృత్యాదికములతో, బ్రాహ్మణ భోజనములతో, బీదలకు అన్న సమారాధన చేయాలి. ఈవిధంగా ఆచరించినట్లయితే ఓ మహారాణీ! నీవు నీభర్తను తిరిగి కలుసుకొన గలుగుతావు. నీభర్త సజీవుడే! పాతాళంలో నాగకన్యకలచేత బంధితుడై ఉన్నాడు. నేను చెప్పినదంతా నిజమేసుమా!
ఇందులో అక్షరంకూడా అసత్యంలేదు. నీవు ఆ రకంగా ఆచరించి శుభాన్ని పొందు! అంటూ ఆశీర్వదించి ఆముని వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకు శ్రావణ శుద్ధ చతుర్ధితిథిరాగా మహారాణియైన ఇందుమతి నారదముని చెప్పిన ప్రకారం మట్టితో గణేశమూర్తిని తయారుచేసి యధావిధిగా పూజించి, దివ్యగంధంతోనూ, దివ్యపుష్పాలతోనూ, నానావిధ నైవేద్యాలతోనూ, ఫలములూ, బంగారమూ మొదలైన దక్షిణలతోనూ, నీరాజన మంత్రపుష్ప, ప్రదక్షిణ, సాష్టాంగనమస్కారాలను చేసి, ఆ వరదగణేశుని సంతృప్తిపరచింది.
ఆ తరువాత సంగీత నృత్యాలతోనూ, బ్రాహ్మణ భోజనంతోనూ ఆ దేవదేవుని సంతోషపరచి, తాను ఒక గ్లాసు పాలు మాత్రము ఆహారంగా తీసుకొని, ఉత్తమమైన ఈ వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించింది. ఓ పార్వతీ! ఈవిధంగా ఆ ఇందుమతి నారద వాక్యానుసారం శ్రావణ శుద్ధ చతుర్ధినుంచి భాద్రపద శుద్ధ చతుర్థివరకూ భక్తిశ్రద్ధలతో ఆచరించింది.
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండమున ‘ఇందుమతీ – నారద సంవాదం’ అనే యాబై నాల్గవ అధ్యాయం సంపూర్ణం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹