ఉపాసనా ఖండము మొదటి భాగము
చంద్రాంగదోపాఖ్యానం
పర్వతరాజైన హిమవంతుడు తన కుమార్తెయైన గిరిజతో ఇలా అన్నాడు..
“అమ్మాయీ! పార్వతీ! నలుడేకాక యింకా చంద్రాంగదుడనే రాజు చేతా, యింకా అతని భార్య ఇందుమతిచేతా కూడా ఈ గణేశవ్రతం అనుష్టించబడింది. ఆ విశేషాన్ని చెబుతాను విను!”
మాళవదేశంలో కర్ణనగరమనే పట్టణం ఉన్నది. ఆ దేశాన్ని అప్లైశ్వర్యసంపన్నుడూ, సకలశాస్త్రార్ధ తత్వజ్ఞుడూ, యజ్ఞయాగాది క్రతువులు చేసిన ధార్మికుడూ, దాత, వేదవేదాంగ పారంగతుడైన చంద్రాంగదుడనే మహారాజు పరిపాలించాడు.
సకలైశ్వర్యాలతోనూ వైభవంగా అలరారే ఆ రాజు కొలువుకూటం స్వర్గాధిపతియైన ఇంద్రుడి సభను మరపించేదిగా ఉండేది. ఆ రాజుకు ఇందుమతి అన్న పేరుగల సర్వాంగసుందరియైన మహాపతివ్రత ధర్మపత్నిగా ఉండేది. ఆమె దేవతాతిథి పూజాతత్పరురాలూ, ధర్మశీలీ, అత్తమామలను సేవించేదీయైన సుగుణాలరాశిగా ఉండేది.
ఆ చంద్రాంగద మహారాజుకు వేట అంటే చాలా మక్కువగా ఉండేది. ”హింసాయుతమైన వేటను విడనాడండి మహారాజా!” అంటూ మంత్రులు ఆయనకు ఎంతగానో హితవుచెప్పారు. ఇలావుండగా ఒకనాడు అతడు వేటకై కొంత పరివారాన్ని వెంటగొని, నల్లటి చొక్కా, నల్లటి తలపాగా, కండువా మొదలైనవి ధరించి, ఖడ్గాన్నీ, ధనుస్సునూ చేతబూని అశ్వారూఢుడై వెళ్ళాడు!
ఆ అరణ్యంలో అనేక క్రూరమృగాలను వేటాడి, వాటిని నగరికి పంపుతూ, అశ్వాన్ని అధిరోహించి అరణ్యంలో తిరుగుతూ కొందరు రాక్షసుల కంటబడ్డాడు. భీకరాకారులైన ఆ రాక్షసులు గుహలవంటి నోళ్ళుకలిగి, అతిభయంకరంగా కన్పించారు. వారిని చూడగానే భీతావహులైన సేన నలుదిక్కులకు పారిపోయారు. మన్మధుడో, నలకూబరుడో అన్నంత అందంగావున్న ఆ చంద్రాంగదుణ్ణి చూసి మోహించిన ఒక రాక్షస వనిత ముద్దుపెట్టుకొంది.
ఆతడి వెంటనున్న సేనల్ని కకావికలు చేస్తూ, ఆ రాజును వెంబడించింది. ఎలాగో ఆమె బారినుంచి తప్పించుకున్న చంద్రాంగదుడు ఆమెవెంట తరుముతూ రాగా, దారిలోవున్న ఒక సరోవరంలోపడి మునిగిపోయాడు! అప్పుడు ఆ సరస్సులోంచి నాగకన్యకలు బైటికివచ్చి, ఆ రాజును తమవెంట పాతాళానికి తీసుకెళ్ళి, అతడిని నానాలంకారములతోనూ అలంకరించి, అతడిని యిలా ప్రశ్నించారు.
‘నీవెవరవు? ఎక్కడినుంచి వచ్చావు? ఎవరి కుమారుడవు?’ అన్న వారి మాటలకు ఆరాజు యిలా బదులిచ్చాడు.. “ఓ నాగకన్యకలారా! నేను హేమాంగదుడి కుమారుడను! నా పేరు చంద్రాంగదుడు! మాది మాళవదేశం. అందులోని కర్ణనగరం నా నివాస స్థలం! వేటకని వచ్చిన నేను ఒక క్రూరరక్కసి బారినుంచి తప్పించుకొని వస్తూ ఈ జలాశయంలో ప్రవేశించాను. మీవల్ల ఇక్కడికి కొని తేబడ్డాను!
ఇదీ నా చరిత్ర! వేటకని వచ్చిన నా పరివారమంతా రాక్షసి పాలబడ్డారు. నేను మాత్రం ఈ సరోవర జలాలలో ప్రవేశించటంవల్ల బ్రతికాను!” రాజుయొక్క పై వచనాలను విన్న నాగకన్యలు యిలా అన్నారు.
“ఓ రాజా! నీవు మమ్మల్ని వరించి మాకు భర్తవు నీకు సకల సుఖభోగాలనూ సమకూరుస్తాము! మాతో భోగము నరులకు దుర్లభం!” ఆ మాటలకు తన చెవులను రెండుచేతులా మూసుకుంటూ రాజిలా బదులు చెప్పాడు.
“ఓ తల్లులారా! నేను ఏకపత్నీవ్రతుడను! ఆ వ్రతాన్ని నేను యిప్పుడె వీడగలను? మేము సోమవంశానికి చెందిన సుక్షత్రీయులం! మా వంశీయులు పరద్రవ్యాన్నీ, పరదారలనూ కలలోనైనా ఆశించనివారు. పరద్రోహ, పరనిందలు మాచే సర్వదా వర్జితములు.
సౌమ్యత, సాధుత్వం, సుస్వభావమూ, యజ్ఞ, దాన, తపోవ్రతాదులందు అనురక్తి – ఇవి మాకు వెన్నతో పెట్టిన విద్యలు! శరణాగతుడైన వానిని తప్పక రక్షించాలన్న నియమమూ, నిషిద్ధకర కర్మలను వర్ణించాలన్న నియమమూ కల వారము! విధివత్తుగా చేయాల్సిన కర్మలను ఏమరుపాటుగా తప్పక ఆచరించే నియమపరులం! ఎటువంటి వారికైనా అతిధిసత్కారమనేది ముఖ్యనియమం! కాబట్టి మీకు ఆదరణీయులం!
ఆ మాటలు విన్న నాగకన్యకలు క్రోధపరవశులై తమను తిరస్కరించిన చంద్రాంగదుడిని ”నీకు స్వ-స్త్రీవియోగము కలుగుగాక!” అని శపించి అతడిని కారాగృహబద్ధుణ్ణి చేశారు.
ఈ కధ ఇలా ఉండగా, ఓపార్వతీ! చంద్రాంగదుడిని వెంబడిస్తూ తరుముకు వచ్చిన ఆ రక్కసి అతడివెంట తానూ ఆ జలాశయంలోకి దూకి, దానిలోని నీటిని యావత్తూ త్రాగివేసి, జలచరాలనన్నింటినీ భక్షించి ఆ రాజు జాడ తెలియక ఎంతో అసహనంగా వెతకసాగింది.
‘ఓ పార్వతీ! జరిగిన ఈ వృత్తాంతాన్నంతటనీ పారిపోయి నగరును చేరుకున్న సైనికులు మహారాణియైన ఇందుమతికి చెప్పారు. రాజు సరోవరంలో బడినాడన్న వార్త చెవినబడగానే ఆమె భరింపలేని దుఃఖంతో మూర్ఛిల్లింది! కొద్దిసేపటికి శైత్యోపచారములచేత తేరుకుని భర్త ఎడ బాటును తట్టుకొనలేక గుండెలనూ, నెత్తినీ మోదుకుంటూ దుఃఖించ సాగింది!
“ఓ ! పరిపూర్ణ యవ్వనంలో ఉన్న నన్ను వీడి, దేవతాతిధి పూజారులనైన నా కంటికే కనిపించకుండా, పతివ్రతనైన నన్ను వీడి ఎక్కడికి వెళ్ళావు? రాజోచితమైన షడ్రసోపేతమైన భోజనాన్ని వీడి ఏమి భుజిస్తున్నావోకదా? బంగారు హంసతూలికా తల్పం వీడి ఎక్కడ నిద్రిస్తున్నావో కదా!
సుగంధతైలాదికాలతో అభ్యంగనంచేసే నీవు ఇప్పుడు ఎలా స్నానంచేస్తున్నావో? నీవు లేని ఈ రాజ్యానికీ, ప్రజలకూ దిక్కెవ్వరు? వారంతా యిప్పుడు అనాధలైనారే? ఇక వీరిని పాలించగలవారెవ్వరు? నీవు లేని నాకు సర్వం శూన్యంగా జీవితమే అంధకారబంధురంగా తోస్తోంది! కులస్త్రీలను రక్షించటానికి, పోషించటానికి, ఇహపరసుఖాలకూ భర్తయేకదా జీవనాధారం!” అంటూ అనేకవిధాలుగా విలపిస్తూ తన ఆభరణాలన్నీ విసర్జించి, దుఃఖంతో, బాధతో మూర్ఛిల్లింది!
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ”చంద్రాంగదోపాఖ్యానం” అనే యాబైమూడవ అధ్యాయం సంపూర్ణం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹