Skip to content Skip to footer

శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 -యాబై ఒకటవ అధ్యాయము – 2

ఉపాసనా ఖండము మొదటి భాగము

కర్దమోపాఖ్యానము

ఓ స్కందా! పూర్వం మహాపరాక్రమవంతుడైన కర్దముడనే రాజు యావద్భూమండలాన్నీ పరిపాలించేవాడు. ధర్మబద్ధమైన అతని పరిపాలన లో ప్రజలు చిరకాలం సంతుష్టులై గడిపారు! ఆతని గుణగణాలకు మెచ్చిన దేవతలు అదృశ్యరూపంలో అతని కొలువుకూటంలో ఉండేవారు.

ఒకనాడు మహాతప స్సంపన్నుడూ, త్రికాలవేదీయైన భృగుమహర్షి అతని గృహమునకు వచ్చాడు! తన సింహాసనం నుండి దిగ్గునలేచి ఆ మహర్షిని సాదరంగా ఆహ్వానించి ఉచితాసనాసీనుణ్ణి చేసి పూజించి, భోజన మిడి, ఆ తరువాత స్వస్థచిత్తుడైన ఆ మహర్షిని యిలా ప్రశ్నించాడు

“ఓ మహర్షీ! తాము త్రికాలవేదులు! మిమ్మల్ని ఒకచిన్న విష యమై ప్రశ్నిస్తాను. దయతో ఆ వివరం తెలియజేయండి!” పూర్వజన్మలో నేనెవడను? ఏ పుణ్యం చేయటంవల్ల ఇలా నిష్కంటకంగా ఈ మహసామ్రాజ్యం ఏలగల్గుతున్నాను?

ఇదివరలోగాని, ఇకముందుగాని ఇట్టి వైభవాన్ని మరెవ్వరూ పొందలేరు. దేవతలచేతా గంధర్వులచేతా కూడా పూజనీయుడు సాక్షాత్తూ యక్షుల అధిపతియైన అలకానగరాధిపతి కుబేరుని మించిన సిరిసంపదలతో తులతూగుతున్నాను!

మూడు లోకాలలోనూ సర్వశ్రేష్టవస్తువులన్నీ నా చెంతనే ఉన్నాయి! కనుక ఓ మహర్షీ! ఏ పుణ్యప్రభావంగా నాకివన్నీ సంప్రాప్తించాయో ఆ వివరం దయతోసెలవియ్యండి! ఓ పుణ్యమూర్తీ! దాని వివరం చెబితే తిరిగి అలాంటి పుణ్యకర్మనే చేస్తాను!”

ఆ మాటలకు మందస్మిత వదనుడైన భృగువిలా అన్నాడు. “ఓ రాజా! నీవడిగిన వివరాన్ని దివ్యదృష్టితో గ్రహించి తెలియజేస్తాను!

కర్దముని పూర్వజన్మ చరిత్ర

“ఓ కర్దమా! నీవు పూర్వజన్మలో ఒక దుర్బల క్షత్రీయుడవై జన్మించావు! కుటుంబపోషణమే గగనమై అనేక కర్మలు చేసేవాడివి! ఐతే ఎన్నివిధాల శ్రమించినా నీ ఆర్జన సరిపోయేదేకాదు! దానికితోడు భార్యా పుత్రులుకూడా నిన్ను అనేక నిష్ఠూరాలాడుతూ అనేకరకాల బాధించే వారు. ఆ బాధనుండి దూరమవటానికి ఎవరికీ తెలియరాని ఘోరారణ్యంలోకి వెళ్ళావు! ఆ అరణ్యంలో అటూయిటూ తిరిగి చిట్టచివరకు ‘సౌభరి’ అనే ఋషిని దర్శించావు! ఆయన సిద్ధాసనంలో కూర్చుని అనేక మునులచేత సేవించబడుతూ దుఃఖనివారణకరమైన మహావిద్యను ఉపదేశిస్తూండగా వారిని దర్శించి, భక్తితో సాష్టాంగ దండప్రణామాన్ని ఆచరించావు!

అప్పుడాముని నిన్ను ఆదరంతో ఉచితాసీనుణ్ణి చేసాడు. ఒక శుభతరుణంలో ఆ సౌభరినిలా ప్రశ్నించావు.

“ఓస్వామీ! భార్యాబిడ్డల నిరసన వాక్యాలచే తీవ్రంగా నొచ్చి, ఈ సంసారకూపంలో చిక్కుకొని అమితమైన క్లేశాన్ని అనుభవిస్తున్నాను. సుఖదుఃఖాలనే ద్వంద్వాలతో తీవ్రంగా పీడించబడుతున్న నాకు, ఈ సంసార సాగరాన్ని తరింపచేసే ఉపాయాన్ని సెలవియ్యండి!”

“నాయనా! స్కందా! ఆ కర్ణముని మాటలకు విచలితుడైన మహర్షి ఆతడి బాధానివారణకై యోచించసాగాడు! కొంతతడవైనాక ఆ క్షత్రీయుణ్ణి చేరబిలిచి ఈవిధంగా ఉపదేశించాడు

“ఓరాజా! నీయొక్క సకల దుఃఖాలనూ పోగొట్టి, సమస్త శుభాలనూ ప్రసాదించగల మహోత్కృష్టమైన వ్రతమొకటున్నది! దానిని “వరదగణేశవ్రత”మని అంటారు. ఈ వ్రతాన్ని అనుష్టించి పూర్వం నాలుగు వర్ణాలవారూ, (బ్రహ్మ, క్షత్రీయ, వైశ్య, శూద్రులు), ఋషులూ కూడా సమస్త దుఃఖాలనుండి విముక్తులై సర్వసిద్ధులనూ పొందారు! ఈ వ్రతం చతుర్విధ పురుషార్ధాలను నిస్సంశయంగా యిస్తుంది!”

సౌభరిఋషియొక్క మాటలు ఆ క్షత్రియుని హృదయంపై పన్నీటి జల్లులా కురిసాయి! ఆ మాటలకు అతడి అంతరంగమంతా చంద్రుడిని చూసిన కడలిలా సంతోషంతో ఉప్పొంగింది! అతడు సౌభరిమహర్షి నిలా ప్రశ్నించాడు..

“ఓమహర్షీ! ఆ గణేశుడెవరు? ఎట్టివాడు? అతని మహిమలేంటివి ? అతడు ఏయే లీలలను చేశాడు? అతడెలా ఆవిర్భవించాడు? ఆ వివరాన్నంతటినీ నాకు దయతో తెలియజేయవలసింది!”

అప్పుడా సౌభరిమహర్షి తన ప్రశాంత మృదుభాషణను యిలా కొనసాగించాడు.

“నిర్వికారము, శోకరహితము, ఆదిమధ్యాంత రహితము, జ్ఞాన స్వరూపమైన ఏ పరబ్రహ్మతత్వం వేదాలచేత వర్ణించబడుతున్నదో, అట్టి పరబ్రహ్మస్వరూపమే గజాననుడని వేదవిదులు చెబుతారు!

ఆయననుండే ఆదిలో ప్రణవనాదం ఓంకారంగా ఉద్భవించింది! సకలజగత్తూ, వేదాలూ ఆయననుండే ఉద్భవించాయి! అతడే ఈ యావద్రహ్మాండమంతా వ్యాపించినవాడు! సృష్టిచేయగోరిన చతురాస్యుడెవరికై నూరుసంవత్సరాలు ఘోరమైన దివ్యతపస్సు ఆచరించాడో, సకల ఉపచారములతో ఎవరిని పూజించి, సిద్ధిబుద్ధియనే తన కుమార్తెలను సమర్పించాడో, ఎవరివల్ల ఆ బ్రహ్మ ఏకాక్షరీ విద్యను పొందాడో ఆ ఘనుడు విఘ్నేశుడైన గజాననుడే! ఆ ఏకాక్షరీ మంత్రప్రభావంచేతనే బ్రహ్మ ఈ యావత్ సృష్టికార్యాన్నీ గణేశానుగ్రహంవల్ల నిర్వహించగలిగాడు.

అలాగే షడక్షర మంత్రముద్వారా విష్ణువుచే జపించబడి, ఆరాధింపబడ్డవాడూ, తన అనుగ్రహాన్ని కురిపించి లోకపాలనశక్తిని విష్ణువుకు ప్రసాదించినదీ ఆ భక్తవత్సలుడే!

కనుక విశ్వమే రూపమైనట్టివాడూ, అనాదినిలయుడూ, కారణాలకే కారణమైనవాడూ ఐన ఆ గజాననుని ఆరాధించి, ఓరాజా! నీవూ సఫలీ కృతుడవు కావలసింది! ఆయన అనుగ్రహాన్ని పొందిననాడు సకలమూ నీకు సులభసాధ్యమౌతుంది! నీవు సకల దుఃఖాలనుండీ విముక్తుడవు అవుతావు!”

అప్పుడు ఆరాజు మహర్షితో తనకా వ్రతవిధానాన్ని, ఆచరించ టానికి అనువైన సమయాన్ని తెలియజేయమని శ్రద్ధగా కోరాడు! అప్పుడు సౌభరిమహర్షి చిరునవ్వు చిందిస్తూ ప్రసన్నంగా యిలా తెలియజేసాడు.

“ఓరాజా! ఈ వరదగణేశ వ్రతాన్ని శ్రావణశుద్ధ చవితినాడు ఆరంభించాలి! అక్కడినుంచి భాద్రపదశుద్ధ చవితివరకూ చేయాలి! ప్రతి దినమూ ఒక నూతనమైన పార్ధివగణేశమూర్తిని నిర్మించి షోడశోపచారాల తోనూ పూజించాలి! వ్రతాంతములో బ్రాహ్మణభోజనాన్ని దక్షిణపూర్వకంగా సమర్పించాలి! నీవు గనుక ఈవిధంగా శ్రద్ధతో ఆచరించినట్లైతే నీకు సర్వ దుఃఖశాంతి అవటమేకాక నీయొక్క సకలాభీష్టాలూ తప్పక నెరవేరతాయి!

“ఓ కర్దముడా! నీవీరీతిగా పలికిన సౌభరిమహర్షి స్వాదువచనాలని ఆలకించి, శ్రద్ధగా ఆయన ఆశ్రమంలోనే ఈ వరదగణేశవ్రతాన్ని నిర్వ హించావు! అలా నీచేత వ్రతం పరిపూర్తి చేయబడగానే గణేశానుగ్రహం చేత దాసదాసీ జనంతోనూ, వేదఘోషలతో ప్రతిధ్వనించే, గోధన, సంపద లతో కూడిన ఒక సుందరమైనభవనం ఏర్పడింది! నీ సంతానంకూడా అందులో దివ్యవస్త్రాలంకార భూషితులై ఉండటాన్ని చూచావు! నీభార్య ఈ విశేషాన్ని అంతటినీ చూసి నీకై నిరీక్షించసాగింది. నీవు మునివద్ద అనుజ్ఞ తీసుకొని యింటికి తిరిగి చేరుకున్నావు!

నీ భార్యచేత పంపబడిన సేవకులు నీకు ఎదురువచ్చి స్వాగతం పలుకుతూ అమితోత్సాహముతో యింటికి తీసుకువెళ్ళారు. నీవు ఆ గణేశుని ప్రభావానికి అత్యంత ఆశ్చర్యచకితుడవై, ఇదంతా ఆయన అనుగ్రహమేనని భావించావు! ఆ వ్రతాన్ని ఆనాడు ఆచరించినందువల్లనే యిప్పుడిలా ఘనకీర్తి వహించిన మహారాజువైనావు!”

అంటూ భృగుమహర్షి తాను దివ్యదృష్టి ద్వారా దర్శించిన కర్దముడి పూర్వజన్మ వృత్తాంతాన్ని అతడికి వివరించాడు. అప్పుడు ఆనందంతో పులకాంకితుడైన కర్దముడు తిరిగి అదేవిధంగా ఘనంగా వరదగణేశుని వ్రతాన్ని అనుష్టించి, ఆ వ్రత ప్రభావంవల్ల జ్ఞానవైరాగ్య సంపన్నుడై, ఇహంలో సర్వసౌఖ్యాలనూ అనుభవించి, తన కుమారులకు పట్టంకట్టి, పునరావృత్తిరహితమైన గణేశలోకానికి చేరుకున్నాడు.

‘ఓస్కందా! ఈ వ్రతం సర్వార్ధసాధకమైనది. దీనితో సాటియైన వ్రతంగానీ, దానంకానీ మరొకటిలేదు! కనుక నీకు వెంటనే దీన్ని అనుష్టించు! దీన్ని గతంలో అనేకమంది దేవతలు, గంధర్వులు, మానవులు కూడా చేసారు! నలుడు, ఇందుమతి, చంద్రాంగదుడు మొదలైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి, తమ ఇష్టార్థములను పొంది, చివరకు గణేశపదాన్ని పొందారు!’ అంటూ పరమశివుడు అనుగ్రహించాడు.

“కనుక ఓపార్వతీ! నీవూ నీభర్తతో సాన్నిధ్యాన్ని కోరావు. అందుకై ఉత్తమవ్రతాన్ని ఉపదేశించమని కోరావు కనుక, ఆ వ్రతాన్ని ఇతిహాసంతో, కూడా ఉపదేశించాను. నీవు మనసా ఆ వరదుడినే ధ్యానిస్తూ, ఈ వ్రతాన్ని నిష్టతో ఆచరించితే నీ మనోభీష్టాన్ని అవశ్యం పొందగలవు! అమ్మా! నీయందుగల ప్రేమచేత ఈ వ్రతాన్ని చెప్పాను. ఇది ఇతరు లెవ్వరికీ ప్రకటించకు! పరమ గోపనీయమైనదీ మహత్తర ఫలప్రదమైనదీ ఈ వరదగణేశ వ్రతము!” అన్నాడు హిమవంతుడు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ‘వరదగణేశ వ్రతవిధానం’ అనే యాబై ఒకటవ అధ్యాయం సంపూర్ణం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment