Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – నలబై తొమ్మిదవ అధ్యాయము

ఉపాసనా ఖండము మొదటి భాగము

గణేశ పార్థివ పూజా విధానం

గిరినందనయైన పార్వతీదేవి తన తండ్రిని ఇలా ప్రశ్నించింది.

“ఓ జనకా! ఆ గజాననుడు ఎట్టివాడు? అతని ఉపాసనా విధానమెట్టిది? ఆ గణేశుని అనుగ్రహవిశేషం వలన తిరిగి నా నాధుని పొందగలనా? ఈ పవిత్ర ఉపాసనను తెలపటం వల్ల మానవులకు కూడా అమిత ప్రయోజనం చేకూరుతుంది! కనుక ఆ వివరం నాకు తెలియ జేయి!” ఈ మాటలకు ఆనంద భాష్పములు జాలువారగా, భక్తితో అతని కంఠము గాద్గదికమైంది. ప్రేమతో ఆమె తల నిమురుతూ హిమవంతు డిలా అన్నాడు.

“అమ్మా! ఈ గణేశ ఉపాసన అతిగోపనీయమైనది. ఇది మహా ప్రభావవంతమైనది కూడాను! లోకకళ్యాణార్ధం ఈ వ్రతవిధానాన్ని తెలియజేస్తాను. సావధానమనస్కురాలవై విను.

బ్రాహ్మీముహూర్తంలోనే ఈ ఉపాసన చేయగోరేవారు నిద్ర మేల్కొ నాలి! ఆతరువాత కాలకృత్యాదులను విధివత్తుగా పూర్తిచేసుకుని, దంత ధావనం, మలాపకర్షణస్నానం, మంత్రస్నానం ఆచరించి ముఖమున తిలకాన్ని ధరించాలి! శుచిగా ఆరవేసిన మడివస్త్రములను ధరించి ఏకాగ్ర చిత్తంతో సుఖాసనంపై కూర్చుని నిత్యకర్మలైన సంధ్యాదికాలు నిర్వర్తించు కోవాలి! రాళ్లు, రప్పలు లేని ఒండ్రుమట్టిని నీటితో తడిపి ముద్దగా చేసి మర్దించాలి!

ఆ పరిశుద్ధమైన బంకమట్టితో సర్వావయవ సంపూర్ణుడైన గణేశుని ప్రతిమను తయారుచేయాలి. నాలుగు చేతులతో పరశువు మొదలైన ఆయుధాలు ధరించిన దివ్యమంగళమూర్తిని అలా తయారు చేశాక ఒకపీఠంపై ఉంచి చేతులను చక్కగా కడుక్కోవాలి!

పవిత్రోదకాన్ని స్నానమునకు సమకూర్చాలి! గంధము, ఎఱ్ఱటి అక్షతలు, ఎఱ్ఱటి పుష్పాలు, ధూపం వేసేందుకు గుగ్గిలము, మూడు, ఐదు, ఏడు పత్రాలుగల శ్వేత దూర్వాంకురాలు సంపాదించుకోవాలి! ఆవునేతితో దీపానికి ఏర్పాటుచేయాలి! ఇక నైవేద్యానికి గజాననునికి అత్యంత ప్రీతికరములైన ఉండ్రాళ్ళును, అప్పాలు, లడ్డూలు, పరమాన్నము, సన్నబియ్యపు వరిఅన్నము సమస్త ఆధరువులతోనూ సిద్ధపరచాలి! సుగంధ చూర్ణయుక్తమైన తాంబూలమును, నేరేడు, మామిడి, పనస, ద్రాక్ష, అరటి మొదలైన ఫలములు సమకూర్చుకోవాలి! కొబ్బరికాయ మొదలైన పూజాద్రవ్యాలను బంగారుపళ్ళెములో హారతికర్పూరం తోసహా సిద్ధ పరుచుకోవాలి.

ఏకాంత స్థలంలో దర్భాసనమూ, దానిపైన లేడిచర్మము పరచుకొని సుఖాసనంలో కూర్చున్నాక, భూతశుద్ధిని చేసి ప్రాణాయామాదికములు విగ్రహానికి ప్రాణప్రతిష్టచేసి దిగ్బంధన చేయాలి.

చేసి గణేశ ఆ తరువాత గజాననుని శ్రద్ధాపూర్వకంగా నమస్కరించి, అంతర్బహిరాత్రుకా న్యాసములు చేసుకోవాలి! సన్నిధిముద్రతో గణాధిపుని ఆవాహనంచేసి మంత్రాన్ని బీజాక్షర సహితంగా, అంగన్యాస కరన్యాసములతో తనపై న్యాసం చేసుకుని, పూజాద్రవ్యాలన్నింటినీ శుద్ధిచేసుకుని గణేశుని ఈవిధంగా ధ్యానించాలి!

ఏకదంతముతోనూ, చేటలవంటి విశాలమైన చెవులతోనూ, గజ వదనముతో, నాలుగు బాహువులలోనూ పాశము, అంకుశము, పరశువు మొదలైన ఆయుధములు ధరించినవాడిగనూ, మెడలో ఎఱ్ఱటివర్ణంగల పుష్పముల మాల (మందారపూలు) ధరించినవాడిగనూ, భక్తులకు అనుగ్రహాన్ని వర్షించే వరదునిగా, సిద్ధి బుద్ధి ప్రసాదించువాడూ, ధర్మార్ధ కామమోక్షాలనే నాలుగు పురుషార్ధములు ఇచ్చేవాడూ, బ్రహ్మ, ఇంద్ర రుద్రాది, విష్ణుదేవతలందరి చేతా, నారదాది దేవర్షులచేతా, స్తుతింపబడే వాడైనట్టి గజాననుని దివ్యమంగళమూర్తిని ధ్యానించాలి!

ఆ తరువాత అతడిని షోడశోపచారములచేత భక్తిశ్రద్ధలతో పూజించి, నీరాజన మంత్రపుష్పములను సదక్షిణకంగా సమర్పించాక, అపరాధ క్షమాపణను వేడి నానా స్తోత్రములచేతా గణపతిని స్తుతించి, సాష్టాంగ నమస్కారముచేసి ఆ తరువాత యధాశక్తిగా సర్వసిద్ధిప్రదాయక మైన గణేశుని మంత్రజపము చేయాలి!

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని ”గణేశ పార్ధివపూజా విధానం” అనే నలబై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment