Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – నలబై రెండవఅధ్యాయము

ఉపాసనా ఖండము మొదటి భాగము

యుద్ద వర్ణనం

“ఓ కమలసంభవా! కలాధరుడనే ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాక ఆదైత్యుడైన త్రిపురుడు ఆ చింతామణి గణేశుని మూర్తిని ఎలా తెచ్చిచ్చాడు? ఆ వివరం నాకు తెలియజేయి! భక్తాభీష్టప్రదుడైన గజాననుని లీలల్ని ఎంతగా విన్నా తనివితీరటంలేదు!” అన్న వ్యాసుని వచనాలకు బ్రహ్మ మనోహరంగా చిరునవ్వులు చిందిస్తూ!

“ఓ కృష్ణద్వైపాయనా! అనంతరం ఆ త్రిపురుడు ఏమిచేశాడో ఆ వివరాన్నంతా చెబుతాను. సావధానమనస్కుడవై విను!”

“అలా కుడిచేత ఉత్తేజితుడైన త్రిపురుడు మందరాద్రి పైన ఉన్న శంకరుడి వద్దకు తన దూతల్ని ఇరువురిని ఈ సందేశంతో పంపించాడు. ”నీవద్ద అత్యంత శుభకరమూ, సకలార్ధప్రదమూ యైన చింతామణి గణేశుని మూర్తి ఉన్నదట! దాన్ని మా దైత్యరాజైన త్రిపురునికి సామపూర్వకంగా సమర్పించు!

అంతేకాదు త్రైలోక్య ప్రభువైన ఆతని వద్దకు ముల్లోకాలలోనూ శ్రేష్టములైన వస్తువులన్నీ చేరాయి. నీ శ్రేయస్సును కోరుకునేవాడవైతే వెంటనే మాకది తెచ్చివ్వు! లేదా నీవు మా దైత్యేంద్రుని ఆగ్రహజ్వాలలకు గురికాగలవు!’

ఆ మాటలు విన్న శంకరుడు భగ్గున మండిపడ్డాడు. ‘ఓ దూత లారా! కేవలం మీరు దూతలైనందుననే బ్రతికిపోయారు. లేకపోతే ఈపాటికి మీరూ మన్మధుడిలా నా క్రోధాగ్నికి ఆహుతై భస్మీభూతులయ్యేవారు! మీ ప్రభువు నాకొక గడ్డిపోచతో సమానం! అతనితో నాకేమి ప్రసక్తి? మృత్యువును కోరుకునేటట్లయితే నాతో తలపడమనండి!

‘ ప్రళయ కాలాగ్నిని తుమ్మెద ఆర్పలేనట్లు, మూషికం మేరువును క్రింద పడతోయలేనట్లు మీరాజు యింకా వెయ్యి జన్మలెత్తినాసరే ఆ గణేశ మూర్తిని నావద్దనుండి పొందటం అసాధ్యం! ఈ మాటని వెళ్ళి మీ ప్రభువుకు చెప్పండి!”

“ఓ వ్యాసమునీంద్రా! శంకరుని ఈ ప్రతివచనాలను త్రిపురుని దూతలు ఆఘమేఘాల మీద అతడివద్దకు వినిపించారు! వాక్యార్ధములను గ్రహించటంలో ప్రవీణుడైన త్రిపురుడు అగ్గిమీద గుగ్గిలంలా మండి పోయాడు ఈ ప్రత్యుత్తరాన్ని విని! అంతే! తన సర్వ సేనల్నీ యుద్ధానికి సమాయత్తపరిచాడు. చతురంగబలాలనూ వెంట తీసుకొని మందర పర్వతం వద్దకు శివునిపై యుద్ధానికి తరలివెళ్ళాడు.

సకల శస్త్రాస్త్ర సమన్వితులైన సేనలతో కామగమనం గల తన మూడు పురాలనూ అధిరోహించి మనోవేగంతో శంకరుడిపైకి తలపడటానికే నిశ్చయించుకొని దీపంవద్దకువెళ్ళే శలభంలా వెళ్ళాడు.

రత్న కిరీటాన్ని, ఖడ్గఖేటకాలనూ, ధనుర్బాణాలను ధరించి, హరుని మనస్సునే భయంతో కంపింప చేసేలా సింహగర్జనలను చేస్తూ తాను బయలుదేరి వెళ్ళాడు. ఆ అపురూప సంగ్రామాన్ని కనులారా తిలకించాలని దేవతలు ఉవ్విళ్ళూరసాగారు. త్రిపురుడు యుద్ధసన్నద్ధుడై వచ్చాడన్న వార్తను విన్న శంకరుడు గజాననుని అర్చించి ప్రదక్షిణ నమస్కారాదులను సమర్పించి క్రోధాగ్నిజ్వాలలను నేత్రాలలోంచి కక్కుతూ బైలుదేరాడు.

ఆ సేనా వాహిని పద ఘట్టనలకు భూమి యావత్తూ అదిరింది! పైకి ధూళిలేచి నా పరభేదాలు తెలియని స్థితిలో యిరుసేనలూ సంకుల సమరానికి దిగారు! అలా జరిగిన భీకర సంగ్రామంలో తెగిపడ్డ ఏనుగులు, గుఱ్ఱాల తలలతోనూ, పారుతున్న రక్తం ఏరులై ప్రవహించింది. ఆ రక్తప్రవాహంలో కొట్టుకొనిపోయే శిరస్సులూ, మొండెములను చూసిన శంకరుడు రోషపరవశుడై ఒక పెట్టున ఆ రాక్షసునిపైకి ఉరికాడు.

ఆ త్రిపురుడు కూడా తన పురముల నధిరోహించి శివునెదుర్కోగా ఇరు సైన్యాలలోని ప్రధానులూ ఒకరితో నొకరు ద్వంద్వ యుద్ధానికి పూనుకున్నారు. శస్త్రాస్త్రాలతోనూ, పెరికిన చెట్లతోనూ ఒకరినొకరు మోదుకోసాగారు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని “యుద్ధవర్ణనం” అనే నలబై రెండవ అధ్యాయం సంపూర్ణం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment