ఉపాసనా ఖండము మొదటి భాగము
వరదాఖ్యానం
బ్రహ్మ ఆ తరువాతి కధను ఇలా కొనసాగించాడు:-
‘ఓ వ్యాసమునీంద్రా! అలా అనుష్టానానికని వెళ్ళిన గృత్సమదుడు. తపమాచరించటానికి తగిన ప్రదేశాన్ని అన్వేషిస్తూ అరణ్యాలగుండా వెళ్ళ సాగాడు. ఒకచోట పుష్పకమనే అతి రమణీయమైన వనాన్ని కనుగొన్నాడు.
అనేక వృక్షాలతోటీ, లతలతోటి శోభితమై, గలగలా ప్రవహించే సెలయేళ్ళతో, అతి ప్రశాంతంగా ఉన్న ఆ వనంలో ప్రవేశించి ఆ ప్రదేశంలో విహరించే దేవతాగణాల అనుమతిని పొంది, అక్కడ నివాస మేర్పరుచుకుని, కాలి బొటనవ్రేలి పైన నిలచి అనన్యమైన ఏకాగ్రభక్తితో తన శ్వాసను సైతం నిరోధించి, కేవలం వాయువును భక్షిస్తూ అలా వేయిసంవత్సరాల కాలం ఘోరమైన తపస్సును ఆచరించాడు. ఆ తపస్సు యొక్క తీవ్రతకు తపోగ్నిజ్వాలలు వెలువడి దేవతలను తపింపచేశాయి!
అలా మరికొంతకాలం ‘రాలిన ఒక్కో ఆకునూ ఆహారంగా స్వీకరిస్తూ’ ధృఢప్రయత్నంతో ధ్యానంచేస్తూండగా మరో పదిహేనువేల సంవత్సరాలు గడిచాయి!అటువంటి దారుణమైన తపస్సును చూసి అతడిని అనుగ్రహించని వినాయకుడు తేజోరూపంగా ఆవిర్భవించాడు! లేగదూడ పిలుపు విన్న గోమాతలా, అలా గృత్సమదుని సన్నిధికి గజాననుడు చేరుకున్నాడు.
తన కిరణాలతో దిగంతాలలోని చీకట్లను పారద్రోలే సూర్యునిలా, అద్భుతమైన తేజఃపుంజముతో అతని ఎదుట ప్రత్యక్ష మయ్యాడు. ఆ దివ్యమైన రూపం ఎలావున్నదంటే చేటల వంటి చెవులు చలిస్తూండగా, మదించిన ఏనుగులా, ఏకదంతాన్ని ధరించి, తొండమును విలాసంగా ఇటు అటూ విసరుతూ, శిరస్సున చంద్రకళను ధరించి, కంఠాన పద్మముల మాలతో, చేతిలో తామరతూడును ధరించి, సింహవాహనారూఢుడైన ఆ స్వామి పదిచేతులతోనూ కుంకుమ, అంగరు, కస్తూరి కలిపిన గంధముతో పూయబడిన దివ్యదేహంతో, సర్పయజ్ఞోపవీతాన్ని దాల్చి, సిద్ధి, బుద్ధి అనే భార్యలు చెరోప్రక్కగా ఉండగా, ఇది అని నిర్వచించలేని అనిర్వాచ్య స్వరూపుడై ఉండి కూడా భక్తకోటులను అనుగ్రహించేందుకై లీలగా సగుణ స్వరూపమును దాల్చి ఆ గృత్సమదుని ఎదుట సాక్షాత్కరించాడు!
అప్పుడు అపారమైన తపస్సుతో వెలిగే ఆ ముని తేజస్సు, గణేశుని ఎదుట వెలాతెలా పోయింది! ఆ దర్శనానికి దిగ్భ్రమచెందిన గృత్సమదుడు భయచకితుడై ఇది ఏదో విఘ్నం కాబోలునని మూర్ఛిల్లాడు! అప్పుడు తేరుకొని – మనస్సులోనే గణేశుడిని యిలా ప్రార్ధించసాగాడు.
“ఓ దేవదేవుడవైన విఘ్నేశా! నా తపస్సుకి ఇట్టి విఘ్నం ఎలా కలిగింది? నన్ను ఈ మహా విఘ్నమునుండి వెంటనే రక్షించు! ఏకారణం చేత నా తపస్సుకిట్టి మహాదుఃఖము సంప్రాప్తించింది? నిన్ను వినా ఇంకెవరిని శరణుకోరను? ‘నీవు మా పంక్తిలో కూర్చొనేందుకూ, పూజా !’ అర్హుడవు కావు అంటూ అత్రి మహాముని తిరస్కారంతో పలికిన మాట ముల్లులా నా హృదయంలో గుచ్చుకుని బాధిస్తున్నది! ఈ సంకటం నుంచి ఇక గడిచి గట్టెక్కేదెలాగు?”
‘ఓ వ్యాసమునీంద్రా! ఇలా మనస్సులో పరిపరివిధాల తర్కించ కుంటూ వ్యధచెందుతున్న గృత్సమదునితో సర్వజ్ఞుడైన గజాననుడిలా అన్నాడు.
“నాయనా! నీవు నా భక్తులందరిలోకీ అగ్రస్థానంలో వున్నావు. నిన్ననుగ్రహించదలచి వచ్చిన నీ ఇష్టదైవాన్ని, వరమీయవచ్చిన వేల్పును గజాననుడిని నేనేనయ్యా! ఎంతో తపోనిష్టాగరిష్టులైన సనకాదులకు సైతం దర్శన దుర్లభమైన ఈ నా స్వరూపాన్ని నీయందుగల ప్రత్యేక అనుగ్రహంగా కనబరిచాను! కనుక నీవు సకలమైనట్టి భయ సంకోచాలనూ వీడి నీ మనోభీష్టాన్ని తెలుపు! నీవు కేవలం పాదాంగుష్ఠముపై నిలచి చేసిన తపస్సు నాకెంతో సంతోషాన్నిచ్చింది!”
ఓ కృష్ణద్వైపాయనా! ఆ గణేశుని అనుగ్రహ వచనాలను విన్న గత్సమదుడు సంతుష్టాంతరంగుడై, సంతోషంతో పులకాంకితుడై, భక్తిమీర సాష్టాంగ నమస్కారమును ఆచరించి ఆ వరదగజాననుడితో ఇలా అన్నాడు..”ఓ పరమానుగ్రహమూర్తీ! వరదవిఘ్నేశా! నీ అమోఘ సాక్షాత్కారం చేత నాజన్మ, నాతపస్సు, నియమాలు సఫలమైనాయి! అఖండమైన ఆనందమే స్వరూపమైనవాడవు! పరబ్రహ్మవు! నిరాకారుడవు! అలార్ధమై స్వరూపం ధరించి భక్తావళిని అనుగ్రహించే ప్రేమైకమూర్తివి!” అంటూ గొంతు గద్గదమవగా, భావాతిరేకంతో ఆనందపరవశుడై ‘చిదానంద ఘనుడు, వేదశాస్త్రాలచేత కనుగొనబడేవాడు ఐన పరమాత్మ నేడు నాకు సాక్షాత్కరించాడు!
ఇక నేనేమి కోరుకోనా?’ అంటూ మరింత భక్తి పెల్లుబికి రాగా ఆనందభాష్పాలు కన్నులనుంచి జాలువారగా “ఓ కరుణాసింధో! నీఅనుగ్రహం అపారమైనది! భవసాగరాన్ని తరింపచేయటానికితారకుడివి! ఐనాప్రభూ! ఎనభైనాల్గు లక్షల జీవ రాసులలో మనుష్యుడు ముఖ్యుడు! అందులోని చతుర్వర్ణాలలోనూ బ్రాహ్మణజన్మ, బ్రాహ్మణులలోనూ జ్ఞానులు, వారిలోనూ అనుష్ఠాన పరులూ అట్టి అనుష్టానపరులలో బ్రహ్మవేత్తలూ శ్రేష్టులు! అందుచే ఓ పరమేశ్వరా! అట్టి బ్రహ్మజ్ఞానాన్ని నాకు అనుగ్రహించు! నీయందు ధృఢభక్తినీ, ఎన్నటికీ మరువని అనన్యచిత్తాన్నీ నాకు ప్రసాదించు!! నిన్ను ఆరాధించే భక్తులలోకెల్లా. నాకు శ్రేష్టత్వాన్ని యివ్వు!
ముల్లోకాలలో అందరిచేతా కొనియాడబడే ప్రఖ్యాతినీ, నమస్కార యోగ్యతను నాకు కలుగజేయి! ఈ తపోభూమి పుష్పకమనే పేర ప్రఖ్యాతమవుగాక! ఓదేవా! నీవిక్కడనే అనుగ్రహమూర్తివై వెలసి సదా నీ భక్తుల మనోభీష్టాలను నెరవేర్చు! ఈ పుష్పకపురము నేటినుండీ నీపేర గణేశపురమని ప్రసిద్ధిచెందుగాక!అంటూ పునః పునః సాష్టాంగ నమస్కారములు చేశాడు!
అప్పుడు దరహాసంచిందే మోముతో ఆ విఘ్నపతి యిలా వరమిచ్చాడు… “ఓ మునిశ్రేష్టా! నా అనుగ్రహం పొందిన భక్తులకు ఈ ముల్లోకాలలోనూ అసాధ్యమేమీలేదు! ఓ బ్రాహ్మణోత్తమా! నీ మనోభీష్టము యధాతధంగా తప్పక నెరవేరగలదు! దుర్లభతరమైన బ్రాహ్మణత్వాన్ని నీకు అనుగ్రహించాను. నీవు ‘గణానాంత్వా’ అన్న ఋగ్మంత్రాన్ని జపించావు గనుక ఆ ‘మంత్రానికి నీవే ఋషి’వి కాగలవు! బ్రహ్మాది దేవగణాలలోనూ, వశిష్టాది మునిగణాలలోనూ నీవు పరమోత్కృష్టత్వం పొందగలవు. కార్యార్థులైన సర్వులూ యికనుంచి సకల కార్యారంభ – ములలోనూ ముందుగా నిన్ను స్మరించాకనే, నన్ను స్మరింతురుగాక!
ఈ రకంగా చేసినవారికి సకల కార్యాలూ సిద్ధించగలవు! ఋషి, దేవతా ఛందస్సులను ఎరుగని దేవతాకార్యాలేవీ ఫలితాన్నివ్వవు!సకల దేవతలకు భయాన్ని గొలిపేవాడూ,ముల్లోకాలలోనూ విఖ్యాతుడైన మహా పరాక్రమవంతుడైన పుత్రుడు నీకు జన్మిస్తాడు!. రుద్రుడు తప్ప అతడు ఎవరివల్లా జయింపబడని శక్తిసంపన్నుడు ! నాయందు అనన్యభక్తి గలవాడౌతాడు!
నీవు తపమాచరించిన ఈ వనము కృతయుగంలో ‘పుష్పక’మనీ, త్రేతాయుగంలో ‘మణిపుర’మనీ, ద్వాపరయుగములో ‘భానక’మనీ కలి యుగంలో ‘భద్రక’మన్న పేర్లతో విఖ్యాతమౌతుంది! ఇచట స్నానాదికాలు చేయటంవల్ల సర్వులకూ సకల మనోభీష్టాలు సిద్ధించగలవు.”
“ఓ వ్యాసమునీంద్రా! ఇట్లా వరదుడైన గజవదనుడు ఆ మునికి విశేష వరాలను దయతో అనుగ్రహించి అంతర్హితుడైనాడు. ఆ తరువాత అక్కడ ఒక చక్కని గణేశప్రాసాదాన్ని నిర్మించి, అక్కడ ‘వరదగణపతి’ మూర్తిని ప్రతిష్టచేశాడు గృత్సమదుడు. గణేశుని అనుగ్రహంవల్ల దీనికి ”సిద్ధిస్థానము” అన్న ఖ్యాతి గల్గింది! అప్పుడాముని భక్తిభావ సమన్వితుడై, ఆ వరద గణపతిని చక్కగా పూజించాడు!
“ఓ మునీంద్రా! విఘ్నరాజు యొక్క ఈ వరదాఖ్యానాన్ని ఎవరైతే వింటారో, పఠిస్తారో, అట్టివారు సకలాభీష్టాలనూ పొంది గణేశానుగ్రహం వల్ల మోక్షం పొందగలరు!”
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనా ఖండంలోని”వరదాఖ్యానం” అనే ముప్పై ఏడవ అధ్యాయం.సంపూర్ణం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹