Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – ముప్పై నాల్గవ అధ్యాయము

ఉపాసనా ఖండము మొదటి భాగము

చింతామణి తీర్థవర్ణనం

ఆతరువాత కధను నారదమహర్షి యిలా కొనసాగించాడు.

“ఓ రుక్మాంగదా! అలా దేవగురువైన బృహస్పతి వద్ద గణపతి షడక్షర మహామంత్రాన్ని ఉపదేశంగా పొందిన దేవేంద్రుడు ఎంతో శ్రద్ధాళువై కదంబ వృక్షం క్రింద తగు ఆసనముపైన కూర్చుని నిష్టగా ఆ మంత్రాన్ని అనుష్ఠించసాగాడు. మనస్సును నిగ్రహించి, కేవలం వాయువును మాత్రమే భక్షిస్తూ అలా వేయి సంవత్సరాల కాలం గణేశునికై ఘోరతపస్సును ఆచరించాడు.

ఇలా తదేకదీక్షతో తనను ఉపాసిస్తూ ఉన్న సురలరాజైన ఇంద్రుని తపస్సుకు భక్తవరదుడైన గణేశుడు అమిత ప్రసన్నుడై సూర్య చంద్రాదులను తలదన్నే దివ్య తేజస్సుతో, కళ్ళు మిరుమిట్లు గొలిపే ప్రకాశంతో నాలుగు బాహువులకూ భుజకీర్తులనూ ధగధగాయమానంగా ప్రకాశించే రత్నకిరీటాన్నీ దాల్చి, రత్నకుండలాలతోనూ, ముత్యాలహారం తోనూ శోభిల్లుతూ, పాదాలకు సైతం దివ్యాభరణాలను ధరించి బంగారు మొలత్రాటితో పుష్పమాలాలంకృతుడై సకలారాధ్యుడు ఆద్యుడూ దేవత లందరిచేతా మొదటిగా పూజల నందుకునేవాడూ ఐన గణపతి దివ్య రూపంలో సాక్షాత్కరించాడు.

ఆ మూర్తిని చూసిన ఇంద్రుడు క్షణకాలం విభ్రాంతిచెందాడు. ‘కేవలం అస్థిపంజరంలా వున్న నేను ఇది ఎలా తట్టుకోగలను? నా తపస్సుకు విఘ్నం కల్పించటానికి ఏర్పడిందా? భయవిభ్రమాలతో ముచ్చెమటలు పట్టి నా శరీరం అశ్వద్ధపత్రంలా కంపిస్తోంది!’ ఇలా అనుకుంటూ కలవరపడుతూన్న ఇంద్రుని భయాన్ని సర్వజ్ఞుడైన గజాననుడు అతని భయం పోయేలా మృదుమధురంగా యిలా అన్నాడు.

వినాయకుని సాక్షాత్కారం

ఓ సురేంద్ర ఇంద్రా! షడక్షర మహామంత్రంతో ఎవరినైతే నీవిన్నేళ్ళుగా ఆరాధిస్తున్నావో ఆ మంత్రమూర్తినైన గణపతిని నేనే! నీ కఠోర తపోదీక్షకు కడుసంతుష్టుడనైనాను! యావత్ సృష్టి, స్థితి, లయములూ నావల్లనే జరుగుతున్నాయి!కనుక నీ మనోభీష్టము ఎలాంటిదైనా అనుగ్రహిస్తాను! సంకోచపడకుండా అడుగు!” అమృతోపమములైన ఆ వాక్కులు చెవిన పడగానే హృదయం లోంచి భక్తి పెల్లుబికిరాగా సాష్టాంగ దండప్రణామాలు ఆచరించి చేతులు మోడ్చి గద్గదస్వరంతో పులకితగాత్రుడై యిలా అన్నాడు.

“ఓ ప్రభూ! నీ గుణగణాలను త్రిమూర్తులూ,అష్టదిక్పాలకులు సైతం తెలుసుకోలేరంటే – యిక సామాన్యుల గురించి చెప్పేదేముంది?సృష్టిస్థితిలయాలు నీవల్లనే జరుగుతాయి. నూరు అశ్వమేధయాగాలు చేసి ఇంద్రపదవిని సముపార్జించుకో గలిగాను! అయినా ఆ పదమూ, దాని నిర్వహణా – అనేక అంతరాయాలతో కూడినవి! ఓ కార్యకారణ స్వరూపా! నీ మహిమ వర్ణనాతీతం! నీవెవరినైతే అనుగ్రహించదలిచావో వారికి మాత్రమే నీ లీలావిభూతి ఎరుగుట సాధ్యం! అతి దుస్సాధ్య మైన నీ అనుగ్రహం వల్లనే నీ గుణగణాలను వర్ణించగలను.

నిర్గుణ స్వరూపుడవై, ఆద్యంతాల కతీతుడవై, సకల జగదాధారుడవై, నిత్య సత్య జ్ఞానస్వరూపుడవై వెలుగొందే పరబ్రహ్మమే నీవు! సకలదేవతా స్వరూపుడవైన నిన్ను సనకాది ఋషులు తమ సుదీర్ఘ తపస్సుతో ప్రసన్నుణ్ణి కావించుకోగలిగారు!”

“ఓ దేవదేవా! షడక్షరీ మహామంత్రము యొక్క అమోఘ ప్రభావంచేతనే నీ సందర్శన భాగ్యం కలిగింది! ఇదివరలోనే చతుర్ముఖుడు నాకీ మంత్రాన్ని ఉపదేశించి, ‘ఓ ఇంద్రా! నీవెప్పుడైతే ఈ మంత్రాన్నివీడుతావో, అప్పుడు నీ స్థానం భ్రష్టమై, దుర్దశ కలుగుతుంది!’ అంటూ హెచ్చరించాడు.”

విహీనుడనై మునిపత్నిని బలాత్కరించాను! తగ్గ ఫలితాన్ని అనుభవించాను! తిరిగి బృహస్పతిచే ఉపదేశించబడిన ఈ మంత్రం చేత నిన్ను దర్శించుకు కోగలిగాను! నీ అనుగ్రహించేతనే సహస్రాక్షుడనైనాను! కోరిన వరాలను అనుగ్రహించే కామధేనువు, కల్పవృక్షముల వంటివాడవైన నిన్నొక వరం అర్ధిస్తున్నాను. ”ఈ ప్రదేశాన్ని (కదంబపురాన్ని) చింతామణి పురమని ప్రసిద్ధికెక్కేలాగున అనుగ్రహించు! ”చింతామణి వినాయకుడన్న పేరుతో వెలియుదువుగాక! ” నీ చరణార విందములపట్ల విస్మృతిలేనట్టి భక్తిని నాకనుగ్రహించు!

ఈ సరోవరానికి చింతామణీ సరోవరమన్న ఖ్యాతి, ఇక్కడ ఈ తీర్థంలో స్నానమాడి సంకల్పంచేసి ఆచరించిన దానములచే ధర్మార్ధకామములనే మూడు పురుషార్ధములూ పొందేలా, ఇక్కడ అనుష్టానాదులు చేసేవారికి సకల సిద్ధులూ లభ్యమయ్యేలా అనుగ్రహించు!”అంటూ వేడిన శచీపతి ప్రార్ధనకు అమితసంతుష్టుడైన ఆ కరివరదనుడు చిరునవ్వుతో “తథాస్తు!” (అలాగే అగుగాక!) అంటూ ఆశీర్వదించాడు.

దేవరాజైన ఇంద్రుడు దేవలోకంనుంచి స్వర్ణనదిని రప్పించి, ఆ పవిత్ర నదీజలాలతో వరదుడైన గజాననుని అభిషేకించి, అర్చనాదికాలు సమర్పించాడు! ఇలా సురరాజు యొక్క పూజలందుకొని భక్సవత్సలుడైన ఆ గజాననుడు అంతర్హితుడైనాడు. ఆ తరువాత అత్యంత సౌందర్యోపేత మైన గణేశుని స్ఫటిక విగ్రహాన్ని అక్కడ స్థాపించి, ప్రదక్షిణ నమస్కారాదు లను చేసి, తన స్థానమునకు వెళ్ళిపోయాడు.”

“ఓ రుక్మాంగదమహారాజా! ఈ ప్రకారంగా ఇంద్రునిచేత నిర్మిత మైన ఈ సరస్సే చింతామణి సరోవరమన్న ఖ్యాతిగాంచింది.

ఇంద్రుని శాసనం మేరకు యిప్పటికీ ఆ జలాలకు అనంతమైన శక్తి గలిగి వున్నాయి! ప్రతిదినమూ ఇంద్రుడు వచ్చి ఈ తీర్ధములో గణేశునికి అభిషేకార్చనలు చేసివెడతాడు! ”ఓరాజా! ఇది చింతామణి క్షేత్రమహిమ! ఈ పవిత్ర చరిత్ర చెప్పినవారికి, చదివినవారికి, విన్నవారికీ సకల దోషాలూ నివారించబడి, అన్ని అభీష్టములు నెరవేరతాయి. దీనికి ఎట్టి సందేహమూలేదు! కనుక నీవు కూడా ఆ చింతామణీ తీర్ధానికి వెళ్ళి అక్కడ స్నానాదులు చేసి సకల కల్మషాలనుంచీ విముక్తిని పొందు!” అని నారద మహర్షి రుక్మాంగదునికి ఉపదేశించి ఆశీర్వదించి వెళ్ళి పోయాడు!” అంటూ బ్రహ్మ వ్యాసమహర్షికి ఆ కధనాన్ని తెలియజేశాడు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని “చింతామణి తీర్ధవర్ణనం” అనే ముప్పై నాల్గవ అధ్యాయం.సంపూర్ణం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment