ఉపాసనా ఖండము మెదటి భాగము
మంత్ర కథనం
శాప వృత్తాంతాన్ని తెలుసుకున్న దేవతలు గౌతముని సన్నిధికిచేరి ఇంద్రాపరాధాన్ని క్షమింపమని వేడుకొనుట!
ఇలా ఇంద్రుని శాప వృత్తాంతాన్ని రుక్మాంగదుడికి వివరిస్తూన్న నారదమహర్షి ఇలా అన్నాడు.
‘ఓ రుక్మాంగద మహారాజా! అలా దేవేంద్రుడు కీటకరూపంలోతామరతూడులో దాక్కునివున్న సంగతిని. నేను స్వర్గంచేరి అక్కడవున్న దేవతల గురువైన బృహస్పతి, అగ్ని, వరుణ, యమ, వాయు, కుబేరులు మొదలైన దిక్పాలకులకీ తెలియ జేసాను. మాయారూపంలో శచీపతి అహల్యను కూడటం, ఋషి ఆగ్రహా నికి గురై శాపాన్ని పొందటమూ చెప్పి, సహస్రభగుడైన తన వికృతరూపం ప్రదర్శించటానికి యిష్టపడని ఇంద్రునిగురించి, శిలారూపంలోవున్న అహల్యగురించీ తెలిపాను! నానుండి ఈ వివరాలన్నీ విన్న దేవప్రముఖులంతా విచారంలో మునిగిపోయారు! నిటూర్పులు దీర్ఘంగా విడుస్తూ దుఃఖపడసాగారు.
‘నూరు అశ్వమేధ క్రతువులు పుణ్యం ఫలితంగా స్వర్గాధిపత్యాన్నీ ముల్లోకాధిపత్యాన్నీ సంపాదించుకొని, దానవులనందరినీ తన శౌర్య పరాక్రమాలతో అణిచివేసి నిష్కంటకంగా మమ్మల్నందరినీ పాలించే మా ప్రియతమ ప్రభువు వియోగం దుస్సహం! దుర్భరం! మాకింక దిక్కెవ్వరు? ఎవరిని ఆశ్రయించి మా మనుగడ కొనసాగించేది? స్వర్గ భోగాలనుభవించే మా ప్రభువు యిప్పుడెక్కడున్నాడో? ఎన్ని యిక్కట్లు పడుతున్నాడో? ఇప్పుడీ అమరావతీనగరము, రాణియైన శచీ కూడా అనాధలైనారే? ఏ ఉపాయం చేత క్రోధోద్దీపితుడైన గౌతముని ప్రసన్నుణ్ణి చేసుకోగలం? ఆయన అనుగ్రహాన్ని పొందే మార్గమేమిటి?’ యిలా పరిపరివిధాల విచారించి, నన్నుకూడా వెంట తీసుకొని ‘గౌతమమునిని శాంతింపచేయటానికి వెడదాము రమ్మని’ గౌతముని సన్నిధిని చేరు కున్నారు.
అప్పుడు ఆ దేవతలందరూ అంజలియొగ్గి తపస్సంపన్నుడూ, అగ్నివంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నవాడూ, నిండుచంద్రునివంటి ప్రశాంత తనూ, ప్రసన్నతను కలిగిన గౌతమమహర్షిని వివిధరీతుల్లో స్తుతిస్తూ శరణువేడారు.
దేవతలు గౌతమమునిని కీర్తించటం
అప్పుడు అంజలిబద్ధులైన దేవతాగణాలు గౌతమమునిని యిలా స్తుతించారు.
“ఓ పరమపావనుడవూ, తపోనిధివీ ఐన మునిసత్తమా! మేరు పర్వతం యొక్క, హిమవత్పర్వతముయొక్క ఎత్తూ వర్షధారల సంఖ్యా, ఇసుకరేణువులనూ, లోకరక్షకుడైన విష్ణుమూర్తి గుణగణాలనూ లెక్కించటం ఎవరితరం? అలాగే ప్రాతఃకాలమున ధ్యానం చల్లి, తపః శక్తిచేత మధ్యాహ్నానికల్లా సస్యసంపదను తయారుచేసి తీవ్రమైన క్షామంలో కూడా ఋషీశ్వరులకు ఆశ్రయమిచ్చిన ఘనుడవు! వాలఖిల్యులచేత యాగం చేయించి మరో ఇంద్రుడిని తయారుచేసిన అసమాన ప్రతిభా శాలివి! పూర్వం అగస్త్యునిచేత సముద్రాలే ఆపోశన పట్టబడ్డాయి! బుద్ధి శాలియైన విశ్వామిత్రుడిచే బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి కావించబడింది! చ్యవన మహర్షివల్ల ఇంద్రుడి భుజమే స్థంభింప చేయబడింది!
ఓమహాత్మా! శ్రేయస్సు కోరేవారికి సర్వదా మీ దర్శనం, వందనం,ఆశీర్వచనం అభిలషించతగినది! మీకు ఒనర్చే సేవ, పూజ సమస్త పాపములనూ క్షయం చేయగలవు! మీనుంచి ఉపకారం కోరివచ్చాము! దీనులమైన మమ్మల్ని మీరే అనుగ్రహించాలి! మిమ్మల్నే నమ్ముకొని శరణుజొచ్చాము! మేము మారాజైన ఇంద్రుడిని కోరివచ్చాము. దయతో మమ్ము అనుగ్ర హించు!”
అంటూ ప్రార్ధించిన దేవతలందరిని ఎంతో ఆదరంగా ఆహ్వానించి, వారందరినీ ఉచితాసనాసీనులను గావించి ఎంతో మధురంగా చిరునవ్వు నవ్వుతూ గౌతమమహర్షి యిలా అన్నాడు.
“పరమ పావనులూ, శుభప్రదులైన ఓ దేవతలారా! మీ దివ్య మంగళరూపం దర్శించటం చర్మచక్షువులకు అలవికాని పని! ఐనా అనేక జన్మార్జిత పుణ్యం ఫలంగా మీ సందర్శనం నాకు లభించింది. ఇందు వల్ల, నాజన్మ, మీరాకతో నా ఆశ్రమమూ, తపస్సూ, దేహమూ, ఆత్మ, నే ఆచరించిన వ్రతాదులూ సార్ధకమైనాయి. ఇప్పుడు మీ అభీష్టమేమిటో నా ఎదుట చెప్పండి! నావల్ల శక్యమైతే – మీయొక్క అనుగ్రహంతో మీకార్యం నెరవేరుస్తాను!” అన్నాడు.
‘ఓ రుక్మాంగద మహారాజా! గౌతమముని పలుకులు విన్న దేవతల మనస్సులు మేఘాన్ని చూసి పురివిప్పి ఆడే నెమళ్ళే ఐనాయి! చంద్రోదయమవగానే సముద్రం ఉప్పొంగినట్లుగా వారంతా సంతోషంతో ఉప్పొంగినారు! వారిలా అన్నారు:-
“ఓ మహర్షీ! శివుని తపస్సు భంగం చేయబోయిన మన్మధుడిని శంకరుడు మూడోకంట క్రోధాగ్నిలో బుగ్గిచేశాడు. కానీ నీవలా ఇంద్రుని నీ క్రోధాగ్నికి దగ్ధం చేయలేదు! ఘోర అపరాధం చేసిన ఇంద్రుడి ప్రాణాలను తీయకుండా నీ దయను వెల్లడించావు!
ఓ దయానిధీ! మేము నిన్ను కోరేదల్లా ఇప్పుడు నీ అనుగ్రహం వల్ల ఇంద్రుడు తన యధాస్థానాన్ని పొందాలని! మా ప్రార్ధనలను అనుసరించి అతని దోషాలను క్షమించు! నీవతనిని అనుగ్రహిస్తే మాకు మా అభీష్టం సిద్ధించినట్లే!” వారి మాటలకు తపోవ్రతుడైన గౌతముడిలా బదులిచ్చాడు.
‘ఓ దేవతలారా! పతితుడు, మహాపాపి ఐన ఆ ఇంద్రుడి పేరును స్మరించటం కూడా దోషమే! చాలా కపటుడు, శరుడు, దుష్టుడు, యుక్తాయుక్త విచక్షణ కోల్పోయిన అవివేకి! అటువంటి పశ్చాత్తాప రహితుడికి నిష్కృతి లేదు! ఐనా మీ కోరికమేరకు వానికి ప్రియంచేస్తాను! మీవంటి మహనీ యుల మాటను నిరాకరించను! మీ అగ్రహానికి గురి కాదల్చు కొనటంలేదు! మీ అందరిచేత అనుగ్రహించబడటం వల్ల, ప్రశంసించ బడటంచేత అట్టి దుష్టుడు కూడా పవిత్రుడౌతాడు! కనుక ఓ దేవతలారా! నేను మీకో మంత్రాన్నిస్తాను! అది ఆ ఇంద్రునికి ఉపదేశించండి!”
గౌతముడు ఇంద్రునికి శాపవిమోచన ఉపాయం చెప్పుట :-
“ఓ మహామహులారా! త్రిమూర్తి స్వరూపుడూ, ఆద్యంతాలు లేని వాడూ, సకల శుభప్రదుడూ, విఘ్నములను నివారించువాడైన ఆ గణేశుని షడక్షర మహామంత్రం సర్వసిద్ధిదాయకమైనది. ఈ మంత్రాన్ని మీరు సాంగోపాంగంగా ఇంద్రునికి ఉపదేశిస్తే అతడు అనుష్టించి గణేశానుగ్రహంతో దివ్యశరీరాన్ని ధరిస్తాడు. అతని శరీరం పైన భగములన్నీ నేత్రములు కాగలవు! తిరిగి స్వర్గలోకాన్నీ పొందగలడు! ఇది ముమ్మాటికీ సత్యం!” అని కరుణాభరిత ధృక్కులతో దేవతాగణాలను సమాధానపరిచి మౌనం వహించాడు. అప్పుడు ఆ సకల దేవతలూ గౌతమముని అను గ్రహానికి పరమానందభరితులై, పూజించి, అతడికి ప్రదక్షిణ నమస్కారములను సమర్పించి మూర్తీభవించిన శాంతంలా ఉన్న ఆ తపోనిధివద్ద అనుజ్ఞ గైకొని ఇంద్రుడిని వెతుకుతూ, అతడు దాగివున్న సరస్సువద్దకు చేరుకున్నాడు.
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ‘మంత్రకథనం’ అనే 32-వ అధ్యాయం.సంపూర్ణం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹