Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – ఇరవై ఆరవ అధ్యాయము

ఉపాసనా ఖండము మెదటి భాగము

పరంపరా వర్ణనం

విశ్వామిత్రుడు భీమునితో ఆ తరువాత జరిగిన కధాసంగ్రహాన్ని యిలా వివరించాడు.

“ఓరాజా! ఇలా ఉండగా ఒకానొక మంచిరోజున సకలప్రజలూ సమావేశమై ఉండగా రాణియైన సులభ పట్టపుటేనుగు తొండానికి ఒక పుష్పమాలు తగిలించి, ‘ఓ పట్టపు గజమా! ఈ రాజ్యంలో నీకు ఇష్టమైన వానిని ఈ పూలమాల అతని మెడలోవైచి, పాలనకై రాజుగా ‘ఎన్నుకో!’ అని ఆదేశించగా ఆ భద్రగజము రాణి ఆజ్ఞను తలదాల్చి సింధూరంతో సర్వాంగ సుందరంగా అలకరించబడి, వేదపండితులైన బ్రాహ్మణులు, వందిమాగధులు తనను అనుసరించగా, వాద్య ఘోషములు కూడా నడవగా, ఆ పుష్పహారాన్ని తొండంతో ధరించి, జనులనందరినీ ఆఘ్రాణిస్తూ, నగరాన్ని వీడి వెలుపలికిపోయింది.

ఈ చిత్రాన్ని చూడటానికి నగరంలో స్త్రీలు తమ తమ పిల్లలతో గవాక్షముల పైకెక్కి చూడసాగారు. కొందరు ఆ గజము తమవంకకు చూడకపోవటం చేత నిరాశచెంది ఇండ్లకు వెనుదిరిగి వెళ్ళిపోయారు!అప్పుడు ఆ పట్టపుటేనుగు మందగమనంతో కమలాసుతుడైన దక్షుని వద్దకు వెళ్ళి, ఏకాగ్రమనస్కుడై, భక్తితో గణపతిని అచంచలదీక్షతో ఆరాధిస్తూన్న అతని మెడలో ఆ పుష్పహారాన్ని వైచింది. ఈ దృశ్యాన్ని అంతరిక్షంలోనుండి గమనిస్తున్న దేవతాగణములు చకితులైనారు. అప్పుడు ప్రజలందరూ రాజుగా ఎంచుకోబడ్డ ఆ దక్షునికి తమ ప్రేమాదరములు ఉట్టిపడేలా నూతనవస్త్రాలు,పుష్పమాలలు, వివిధములైన రత్నాభరణాలూ సమర్పించారు. ఆ శుభతరుణంలో భేరీ మృదంగరావాలు మారుమ్రోగాయి!

దేవతలుకూడా సంతోషించి పైనుంచి పుష్పవృష్టి కురిపించారు. మంత్రులిద్దరూ ఆ దక్షుని సమీపించి భక్తిమీర నమస్కరించి, అతడికి పరిస్థితిని వివరించి రాజుగా పట్టమును అలంకరించమని ప్రార్ధించారు. మంత్రులిరువురు చెరోపక్కా నిలువగా ప్రజలంతా ఆ దక్షప్రభువుకు నమస్కరించారు.

రాజైనాక వేదపండితులైన బ్రాహ్మణులను తాంబులాది సంభావనలతో ఆదరించి, తన తల్లిని కూడా వస్త్రాలంకారములతో పూజించి ఆమెచేత కూడా అనేక దానాలను చేయించాడు దక్షుడు. ఆతరువాత ఆమెను రాజమాతగా పల్లకీలో ఊరేగింపచేసి తానూ స్వయంగా పట్టపుటేనుగను అధిరోహించాడు!

నానావర్ణ పతాకములతో, పూలతోరణాలతో అలంకరించబడిన రాజ నగరులోకి మంత్రులిరువురూ అశ్వారూఢులై అనుసరించగా ప్రవేశించాడు.వందిమాగధులు జయజయధ్వానములతో కైవారము చేయసాగారు. అప్సరసలు నాట్యంతోనూ, గంధర్వులు తమ అమరగానంతోనూ అలరించారు! ఇక ప్రజలంతా ఒక సముద్రంలా జయజయధ్వానాలను ఉచ్ఛైస్వరంతో చేయగా సామంతులు, పురప్రముఖులతో కూడిన రాజసభలోకి ప్రభువైన దక్షుడు ప్రవేశించాడు.

ఒక పల్లకీని చక్కగా అలంకరించి ముద్దల మహర్షిని సగౌరవంగా కొనిరమ్మని దక్షుడు ఆదేశించాడు. పల్లకీకూడా మంత్రి సుమంతుడిని ఛత్రచామరాది రాజలాంఛనములతో ముద్గలుని వద్దకు పంపాడు. అప్పుడు వారు రాజాజ్ఞను అనుసరించి ముద్గలుని పల్లకీలో ఆరోహింపచేసి తమవెంట సభాస్థలికి తీసుకువచ్చారు. అది చూచిన రాజు సింహాసనము నుండి దిగ్గున లేచి, మహర్షికి సాదరంగా ఎదురెళ్ళి, తన కిరీటంతోసహా ఆయన పాదాలకు తలను భక్తితో ఆన్చి, ఆయనను రాజసింహాసనంపై కూర్చుండ చేసి, ఆయన అనుమతితో తానూ మరో ఆసనంపైన కూర్చున్నాడు. సామంతరాజుల బృందంతో పాటు ఆ ముద్గలుని యధావిధిగా సత్కరించి, భక్తితో ప్రణమిల్లాడు.అతిథి పూజను చేసి, పాడి ఆవును ఆ మహర్షికి వినయంగా సమర్పించాడు.

అప్పుడు దక్షుడు ముద్గలమునితో యిలా అన్నాడు.

‘ఓ మునిసత్తమా! తమయొక్క మహిమావిశేషం యిప్పుడే ఈ పుర జనులకు వెల్లడైంది. తమ దివ్యానుగ్రహ ప్రభావంచేతనే నాకు రోగరహిత మైన సుందర శరీరము, రాజ్యప్రాప్తియూ కలిగినవి! ఇప్పుడు పూర్వపు నా దురవస్థ తలుచుకుంటేనే వళ్ళు జలదరిస్తున్నది. అప్పటి ఆ దుస్థితికీ, తమ అనుగ్రహప్రాప్యమైన ఈనాటి స్థితికీ పోలికేలేదు! ఓమునీశ్వరా! మహాత్ముల దివ్యానుగ్రహానికి అసాధ్యమన్నదేలేదు! రోగిని నిరోగిగా, భోగిగా చేయటం దయానిధులైన మీకే చెల్లింది! తమ దివ్యహస్తాన్ని నా శిరస్సుపైన ఉంచి తమ అనుగ్రహాన్ని నాపై ప్రసరించండి! తమరే సాక్షాత్ వినాయకస్వరూపులు.”

ఆ మాటలకు ముద్గలుడు చిరునవ్వు మోముతో రాజును అనునస్తూ యిలా అన్నాడు.

‘నాయనా! దక్షా! నాయొక్క అనుగ్రహ విశేషంచేత ఇకమీదట నీకు ఎన్నడూ శత్రుభయం కలగదు! అంతేకాదు! నీవు సంకల్పించినదే తడవుగా నీ మనోకామనలన్నీ తప్పక నెరవేర్తాయి!” అంటూ ఆశీర్వ దించాడు. అనంతరం లెక్కలేనన్ని పాడి పశువులను, అగ్రహారాలను ఆ ముద్గల మహర్షికి భక్తితో సమర్పించి ప్రణమిల్లాడు దక్షుడు. ఇతర వేదపండితులకు కూడా గోవులను, వస్త్రాలను ధనధాన్యాలను బహుకరించాడు.

వారుకూడా అతడిని చిరకీర్తివి కమ్మని ఆశీర్వదించి తమతమ నెలవులకు తిరిగి వెళ్ళిపోయారు! మంత్రులనూ, పరిచారకులనుకూడా తగిన రీతిన సత్కరించి, అందరి మన్ననలనూ పొంది ప్రీతిపాత్రుడైనాడు! ఆ తరువాత కుండిన నగరంలో జీర్ణమైవున్న పాత ఆలయాన్ని ఉద్ధరించి, గజాననుని మూర్తిని ప్రతిష్ఠించాడు. అందులో సౌందర్యోపేతమైన ఒక ప్రాకారాన్నికూడా వైభవోపేతంగా నిర్మించాడు.

వల్లభుడనే రాజు ఈ వృత్తాంతాన్నంతటినీ విని, తనకు స్వప్నంలో గణేశుడు ఆదేశించిన ప్రకారం ”వీరసేన” అన్న కుమార్తెను యిచ్చి దక్షునితో వైభవంగా జరిపించాడు.

ఆ దంపతులకు బృహద్భానుడు అనే కుమారుడు జన్మించాడు. ఆ బృహద్భానుడికి ఖడ్గధరుడు, అతనికి సులభుండు, వానికి పద్మాకరుడు, పద్మాకరునకు వపుర్దీప్తి అనేవాడూ, వానికి చిత్రసేనుడూ, చిత్రసేనునికి నీవూ జన్మించారు!” అంటూ విశ్వామిత్రుడు భీమరాజుకు అతని వంశావళిని తెలియజేయగా,

“ఓ మునిపుంగవా! భక్తాభీష్టఫల ప్రదుడైన ఆ వినాయకుడు నాకు ఎలా ప్రసన్నుడౌతాడో, అతడి అనుగ్రహాన్ని పొందే విధమును దయతో నాకు తెలియజేసి నన్ను కృతార్ధుడిని చేయమంటూ భీముడు విశ్వామిత్రమహర్షిని ప్రార్ధించాడు.

ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనా ఖండములోని ‘పరంపరా వర్ణనం’ అనే 26 వ అధ్యాయం సంపూర్ణం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment