Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – ఇరవై మూడవ అధ్యాయము

ఉపాసనా ఖండము మెదటి

భాగము కళ్యాణవైశ్య – ‘’భవిష్యకథనం”

భృగుమహర్షి సోమకాంత మహారాజుకు ఆతరువాత జరిగిన వృత్తాంతాన్నిలా చెప్పసాగాడు.

‘ఓ రాజా! కళ్యాణ సంజ్ఞకుడిగా దక్షునియొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని విశ్వామిత్ర మహర్షియొక్క అమృతోపమమైన మృదుమధుర వాక్కులతో తెలుసుకున్న భీముడన్న ఆ రాజు – దక్షుని చరిత్రలో ఆ తరువాత జరిగిన కధను తెలుసుకొనగోరి విశ్వామిత్రుడిని యింకా సవినయంగా ఇలా ప్రార్ధించాడు.

“ఓ మహర్షీ! నీవు చెప్పిన దక్షుని చరిత్ర అంతా విన్నాక నా మనస్సుకు ఒక అనిర్వచనీయమైన ప్రశాంతి కల్గింది! ఆ తరువాత కళ్యాణ సంజ్ఞకుని గతి ఏమైందో ఆ వివరం దయతోతెలియజేయి!” అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆతరువాత జరిగిన కళ్యాణ సంజ్ఞకుని గాధను ఇలా వివరించాడు. నీవుకూడా శ్రద్ధాళువై విను!” అంటూ సోమకాంతుడితో ఇలా చెప్పసాగాడు.

“ఓ భీమరాజా! ఇలా భల్లాలుని శాపంవల్ల కళ్యాణ వైశ్యునికి శరీరమంతా రోగభూయిష్టమై, అనేక గాయాలతో రక్తం స్రవించసాగింది! భరించరాని దుర్వాసనతోపాటూ, ఆతడికి మూగత్వం, చెముడు కూడా కలిగాయి. అతని భార్యయైన ఇందుమతి తన భర్తకు సంప్రాప్తించిన ఈ దుస్థితికి ఎంతో దుఃఖించింది. ”ఏ పాపకర్మ ఫలంగా నా భర్త యింతటి దురవస్థ పాలైనాడో కదా! స్వాభావితంగా ధర్మపరుడు, దేవ బ్రాహ్మణ పూజలయందనురక్తికలవాడు, ధర్మశాస్త్రార్ధమునంతటినీ క్షుణ్ణంగా ఎరిగినవాడు, కేవలం స్వభార్యనైన నాయందే అనురక్తిక వాడు, అట్టి ఈతనికి ఈ దుస్థితి ఎట్లువచ్చిందో?” అని పలువిధాలుగా విచారిస్తూ, మాటిమాటికీ దుఃఖపు భారంతో నిట్టూరుస్తూ, ఆ జనంవల్ల తన కుమారుడైన భల్లాలుడు అడవిలో అతడి తండ్రిచేత బంధించబడటం, హింసించబడ్డాడనీ తెలుసుకున్నది. ఇక ఉండబట్టలేక తన కుమారుణ్ణి వెతుక్కుంటూ, అతడు బంధింపబడ్డ చోటుకి అరణ్యానికి వెళ్ళింది.

తీరా, ఆమె ఆ ఆలయానికి వెళ్ళిచూస్తే, అక్కడ బంగారువర్ణ దేహంతో పరిపూర్ణ ఆరోగ్యంతో నవయవ్వనవంతుడైన ఒక యువకుని చూసి తనకళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆశ్చర్యంతో అది కలకాదు కదా అని కళ్ళు నులుముకుని మరీచూసింది! అక్కడఉన్న దేవాలయంలో ఏకాగ్రచిత్తంతో గజాననుని చతుర్భాహువులు, మూడు నేత్రాలు గలవానిని, సిందూరవర్ణ దేహంతో ప్రకాశిస్తూన్న వక్రతుండముగల గణేశుని ఏకమనస్కుడై అర్చిస్తున్న కుమారుణ్ణి చూసి, ”ఈ ఊళ్ళోవాళ్ళు తిన్నమైన వాళ్ళుకాదు! లేకపోతే ఏ బాధాలేకుండా ప్రశాంతచిత్తంతో గణేశుని అర్చించుకుంటూన్న నా ముద్దుకుమారుడి గురించి లేనిపోనివన్నీకల్పించిచెప్పారు.

వాళ్ళమాట పట్టుకుని యిక్కడికివచ్చాను! తీరా చూద్దును కదా,వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ ప్రత్యక్షమైన దానికీ పూర్తి వ్యతిరేకంగా వున్నదే?” అనుకుంటూ ఆ ఆనందంతో తన మనస్సు ఉప్పొంగగా తన కుమారుని సమీపించి, ఆప్యాయంగా అతనిని తనకు అక్కున చేర్చుకుని, తలనిమిరి ప్రేమతో ముద్దాడింది.

“నాయనా! మనం యిక మనయింటికి వెడదాం! పద! నీతండ్రి గొప్ప అస్వస్థతకు లోనై, శరీరమంతా ప్రణాలతోనూ, గాయాలతోనూ, బాధపడుతూన్నాడు. మాట మారుపలుకలేడు, చెవులు ఏమాత్రం వినబడవుకూడా! అతని బాధానివారణకై ప్రయత్నించి కొడుకుగా నీధర్మము నెరవేర్చుదువు గాని నీవంటి యోగ్యుడు, గుణవంతుడూ మాయింట్లో పుట్టడంవల్ల నా కడుపు పండింది! మన వంశం యావత్తూ చరితార్ధ మైంది! మీ తండ్రి ఆవేశంలో ఆచరించింది తండ్రిగా తన కర్తవ్యాన్నేగాని, నీకు ఏమాత్రం అపకారం తలపెట్టాలన్న ఉద్దేశ్యంతో ఎంతమాత్రంకాదు!

కనుక నీవూ నాతో వచ్చి, నీ తండ్రియొక్క బాధానివారణకై కుమారుడిగా నీ కర్తవ్యం నెరవేర్చు!” అంటూ అనునయ వాక్యాలు పలికింది. వికలమైన మనస్సుతో తీవ్రమైన నిర్లిప్తత చోటుచేసుకునగా భల్లాలుడు యిలా బదులిచ్చాడు.

” తల్లి ఎవరు? తండ్రి ఎవరు? పుత్రుడెవరు? ఈ ప్రకృతీ, దాని స్వాభావిక లక్షణాలవల్ల కలిగే సకల సంకల్పవికల్పాలన్నీ కూడా భగవంతుడైన గజానుని సంకల్పానుసారమే జరుగుతాయి! జీవులమధ్య పరస్పరం కలిగే రాగద్వేషాలన్నీ కూడా వారివారికర్మానుసారమే సంభ విస్తాయి. అందుకనే ఎట్టివానికైనా వాడు చేసిన కర్మయొక్క ఫలంఅనుభవించక తప్పదు; కనుక ఓ మంగళ ప్రదురాలా! యిక నాకు తల్లీ తండ్రీ, గురువు, దైవం సమస్తమూ వినాయకుడే! ఆతని దివ్య చరణాలవద్దే నా సర్వస్వమూ సమర్పించాను. ఆయనయొక్క అనుగ్రహ విశేషం చేతనే ఈనాడు నాశరీరానికి జవజీవాలూ, ఆత్మజ్ఞానమూ లభించినాయి. పవిత్రమైన గణేశుని ఆలయాన్ని ధ్వంసం చేయటం, దైవాపచారం చేయటమే!

అందలి మూర్తిని విసరివేయటం, దురహంకారంతో గజాననునికి భక్తిచేస్తున్న నన్ను చావమోదటం వంటి దుష్కార్యాల వల్లనే దేవతాగ్రహంతో అతనికి ఇట్టి దారుణమైన స్థితి సంప్రాప్తమైంది! జాగ్రత్తగా తత్త్వవిచారణ చేసినట్లయితే ఓ మంగళప్రదురాలా, నిజానికి నీవు తల్లివీ కావు! ఆతడు నాతండ్రీకాదు! సకల జగాలకూకూడా తల్లీతండ్రీ దేవదేవుడైన గజాననుడే! ఆయనే జన్మ మృత్యువుల కతీతమైన ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు.

సృష్టి, స్థితి, లయాలు మూడూ అతని లీలాకృత్యములే! ఆ ప్రభువే సకల దేవతాస్వరూపుడూ, త్రిమూర్తి స్వరూపుడూ కూడా! ఎట్టి అపరాధము లేకుండానే బాలుడనైన నన్ను దారుణంగా హింసించాడు! అంతేకాదు నీభర్త దైవదూషణనూ, ఘోరమైన దైవాపరాధాన్నీ ఏమాత్రం జంకూగొంకూ లేకుండా నిర్వర్తించాడు.

అందుకు తగ్గ ప్రతిఫలాన్నే అతడు అనుభవిస్తున్నాడు. ఇక అటువంటి మహాపాపిని నేను దర్శించను. ఎందుకంటే పతితుడైనవాడిని దర్శించటం వల్లనే అనేక దోషాలు సంప్రాప్తమౌతాయి! కనుక నీవు నాయందు మమకారాన్ని వీడి, నీకు తగిన సతీధర్మాన్ని అనుసరించి ఆతనిని శ్రద్ధగా సేవించుకో!”ఈమాటలు విన్న ఇందుమతి దీనంగా యిలా ప్రార్ధించింది.

“నాయనా! కరుణను వహించీ, బంధుత్వమును అనుసరించీ, దయతో అనుగ్రహంతో నీతండ్రికిచ్చిన శాపాన్ని ఉపసంహరించు!” అంటూ వేడుకోగా అప్పుడు శాంతచిత్తుడైన భల్లాలుడిలా ఆమెకు బదు లిచ్చాడు.

‘ఓ పతివ్రతా! జన్మాంతరంలో ఈతడు నీకు కుమారుడై జన్మి స్తాడు! పైనచెప్పిన సకల దుర్లక్షణాలతోనూ ఇతడు దక్షుడన్న పేరుతో జన్మిస్తాడు. నీవు కమల అన్న పేరుతో ప్రఖ్యాతురాలవౌతావు! దక్షుడి బాధానివారణకై నీ వల్లభుడు పన్నెండు సంవత్సరాలు ఘోరతపస్సు చేసినా ఫలితం కనిపించక, పుత్రసహితంగా నిన్ను ఇల్లు వెళ్ళగొడతాడు. అప్పుడు దేశాంతరాలలో తిరుగుతూ, భిక్షాటనమొనరిస్తూ అలమటిస్తూన్న మీకు దైవవశాన ఒక వినాయక భక్తునితో పరిచయ మేర్పడుతుంది. ఆతని అనుగ్రహ విశేషం చేతనే నీ సకల కష్టాలూ తీరాయి! అప్పుడు నీ కుమారునికి స్వస్థతకూడా చేకూరుతుంది! అందుకని నీభర్తయొక్క శాపవిమోచనాన్ని నీకోరిక మేరకు తెలిపాను! నీవింక వెళ్ళు!” అంటూ ఆమెను వీడ్కొలిపాడు.

ఓ రాజా! ఈవిధంగా భల్లాలునిచే అతని తల్లి నిరాకరించబడి, మనస్సు దుఃఖంతోనూ, సంతోషంతోనూ సమ్మిళితమై ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు దివ్యసుందరమైన విమానం వచ్చింది. ఆ విమానాన్ని అధిరోహించి భల్లాలుడు వినాయకలోకాన్ని చేరుకున్నాడు. ఓ భీమరాజా! కళ్యాణవైశ్యుని వృత్తాంతాన్నంతటినీ నీకోరిక మేర వివరించాను. భల్లాలుడు చెప్పినట్లుగానే అక్షరంకూడా పొల్లుపోకుండా తరువాతి జన్మంలో జరిగింది. ఆమె కమల అన్నపేరుతోనూ జన్మించి అతడు వల్లభుడు అన్నపేరుతో జన్మించగా – ఆ రాజును వరించి దక్షుడిని కుమారుడిగా ప్రసవించింది.” అంటూ ముగించాడు మహర్షి!

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ‘కళ్యాణవైశ్య-భవిష్యకథనం’ అనే 23 వ అధ్యాయం. సంపూర్ణం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment