Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశపురాణం 🌹🌹🌹 – మొదటి అధ్యాయము

ఉపాసనా ఖండము మొదటి భాగము

భృగు సోమకాంత సంవాదం

శబ్దబ్రహ్మయై – వాక్కులకు ఛందోగణాలకూ అధిపతి గణపతి స్వరూపియైన బ్రహ్మణస్పతి కి భక్తిపూర్వక నమస్కారము/ సమస్త కార్యములకూ విఘ్నభయం నివారించే విఘ్నపతి కి నమస్కారము. మాకు సమస్త సంపదలనూఇచ్చే లక్ష్మీగణపతి కి, లక్ష్మిని కటాక్షించే మహా గజమునకు నమస్సులు/ సిద్ధి’ని కలిగించే యోగ జ్ఞానస్వరూపమైన బుద్ధీశునకు నమస్సులు. సమస్త దేవతాగణములకూ ప్రధముడైన వాడూ అక్షర, బీజాక్షర, మంత్రరూపదేవతా గణాలకు ప్రధమఆరాధ్యుడైన ఓంకార స్వరూపియైన గణనాధున కు నమస్సులు/ ఓ బ్రహ్మరూపీ! జ్ఞానప్రదుడవు! ఓ విష్ణురూపీ సంపత్ప్రదుడవు! ఓ రుద్రరూపీ ‘కర్మ’లను భస్మంచేసే వైరాగ్య స్వరూపుడవు! నీవే పరబ్రహ్మవు! సమస్త వేదరాశికి అక్షరరూపియైన ఓఛందస్వరుడా! నీకివే నా నమోవాకములు ప్రసన్నుడవుకమ్ము! వేదవ్యాసకృత గణపతి ప్రార్ధన.

బ్రహ్మవిద్యాప్రదాయకుడు అయినటువంటి గణేశునకు నమస్కారము. విఘ్నములనే సాగరములను అగస్త్య ఋషివలే శోషింపచేయు గణపతికి మనసా నమస్కరించుచున్నాను.

పూర్వం నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు లోకకళ్యాణార్ధం పన్నెండు సంవత్సరాలపాటు జరిగే సత్రయాగాన్ని తలపెట్టారు. అందులోభాగంగా ప్రతిరోజూ సాయంసమయంలో సత్కధాశ్రవణంచేసేవారు!ఒకనాడు సత్కాలక్షేపం చేసే సంకల్పంతో ఆ యజ్ఞస్థలానికి విచ్చేసిన సూతమహామునితో ఇలా అన్నారు.

ఓ సూతమహామునీ! నీవు సకల శాస్త్రాల పురాణాల సారం ఎరిగినవాడవు! సకల విద్యలకూ నిధివైన నీవంటి వక్త లభించటం జన్మ జన్మాంతరములలో చేసిన మహాపుణ్యంవలన గాని జరుగదు! మేమంతా అటువంటి నీ దర్శనమాత్రం చేత ధన్యులమైనాము! మా మనస్సులను పావన మొనరించే భగవత్కధలను నీనుండి వినాలన్న ఉత్సాహంతో వున్నాము. కనుక అట్టి పరమ కమనీయములూ, పావనకరములూ మంగళమయములైన భగవత్కధలను మాకు శ్రవణానందముగా వినిపించి మమ్మల్ని కృతార్ధులను చేయవలసింది! అమోఘ తపస్సంపన్నులూ, నిగ్రహానుగ్రహ సమర్థులూ అయిన ఆ ఋషుల ప్రశ్నను విన్న సూతుడిలా బదులిచ్చాడు.

ఓ పరమపావనులైన మునిసత్తములారా! పావనమైన మీయొక్క. ప్రశ్న సకల లోకాలకూ ఉపకరించేదీ, నన్నూ తరింపచేసేదీను! కనుక మీరు కోరినవిధంగా సత్కధా కాలక్షేపం చేయాలని నాకూ ఉత్సాహంగానే ఉన్నది!

ఓ పావనులారా! మద్గురువరేణ్యులైన వ్యాసమునీంద్రుల వారిచే రచింపబడిన అష్టాదశ పురాణాలనూ, అష్టాదశ ఉపపురాణాలను కూడా మా గురుదేవుల అనుగ్రహంతో ఆసాంతం నేర్చుకున్నాను. వీటిలో ముఖ్యమైన ఉప పురాణంగా చెప్పతగిన శ్రీ గణేశ పురాణాన్ని మీకు వినిపిస్తాను. ఈ పురాణంయొక్క విశేషమేమిటంటే ఇది అంతతేలికగా లభించేదికాదు! ఈ గణేశుడిని స్మరణ మాత్రం చేతనే విఘ్నములనే మంచు తెరలు ఆయన అనుగ్రహమనే సూర్యోదయంతో పటాపంచలై పోతాయి. విఘ్నపతి భక్తులకు తమ మనోభీష్టసిద్ధి, సకల కార్యసిద్ధి కలుగుతుంది.ఎన్నో జన్మజన్మాంతరాల పుణ్యం వల్లనే ఇటువంటి కధాప్రసంగం వినడం, చెప్పడం లభిస్తుంది. ఐతే నాస్తికులైనవారూ, శ్రద్ధరహితులూ ఎంతమాత్రం ఈ పురాణశ్రవణానికి అర్హులు కారు! ఈ గజాననుడు భక్త వత్సలుడు! అనంత మహిమోపేతుడు! నిత్యసత్య స్వరూపుడు.ఈయన నిర్గుణతత్త్వంగానూ, సగుణమూర్తిగా కూడా ఆరాధించబడుతున్నాడు. సకల వేదాలకూ, మంత్రాలకూ ఆదిలో వెలువడిన ప్రణవ స్వరూపుడే గజాననుడు. ఈ వినాయకుని అట్టి ప్రణవ స్వరూపునిగానే ఇంద్రాది సకలదేవతలూ తమ హృదయాలలో నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు. ఈతడే అఖిల జగములకూ కారణమైనటువంటివాడు. ఆది మధ్యాంతరహితుడు , త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమతమ కార్యభారాన్ని (సృష్టి స్థితి లయాలను) ఈ గణేశుని అనుజ్ఞమేరకే నిర్వర్తిస్తున్నారు. ఈయన ఆజ్ఞవల్లనే వాయువు వీస్తున్నాడు, అగ్ని ప్రజ్వరిల్లు తున్నాడు, జలములూ ప్రవహిస్తున్నాయి!

అట్టి సర్వేశ్వరుడు సకల జగన్నియామకుడైన గణేశుని చరిత్రను మీకుతెలియచేస్తాను.ఎంతో రహస్య మైనటువంటిదీ, అమోఘమైనట్టి ఈ పావన చరితాన్ని భక్తిశ్రద్ధలతో ఆలకించండి! ఈ గణేశ పురాణాన్ని ముందుగా బ్రహ్మ వ్యాసమహర్షికి ఉపదేశించాడు. ఆయన భృగువుకూ, ఆ భృగుమహర్షి తరువాతికాలంలో సోమకాంత మహారాజుకూ ఉపదేశించారు.ఈ పురాణాన్ని భృగుమహర్షికీ సోమకాంత మహారాజుకూ మధ్య జరిగిన సంవాదంగా తెలియజేస్తాను. సావధానమనస్కులై ఆలకించండి!

కథాప్రారంభము :-

పూర్వం సౌరాష్ట్ర దేశంలో దేవనగరమనే రాజ్యం ఉండేది! ఈ రాజ్యాన్ని సోమకాంతుడనే మహారాజు పరిపాలించేవాడు. ఎంతో పరాక్రమవంతుడై, జనరంజకంగానూ, ధర్మబద్ధంగాను ప్రజలను కన్నబిడ్డలవలే ప్రేమగా పాలించేవాడు. సౌందర్యంలో మన్మధుడిని తలదన్నేలా సార్ధక నామధేయుడిగా (చంద్రుని వెన్నెలవంటి శరీరకాంతి కలిగి) ప్రకాశించేవాడు. ధర్మబద్ధంగా పరిపాలన చేయటంవల్ల అతడి రాజ్యం సుభిక్షంగా, సస్యశ్యామలమై, ధనధాన్యాలతోనూ పాడిపంటలతోనూ అలరారుతూ, శత్రువులకు కన్నెత్తి చూడరానిదై ఉండేది! ఈరాజుగారి కొలువులో నీతికోవిదులు, సకల శాస్త్ర పారంగతులూ,ప్రభుభక్తి పరాయణులూ ఐన ఐదుగురు మంత్రులుండేవారు. వారు రాజుకు సరైన సలహాలనిస్తూ, వ్యూహరచనచేస్తూ సమర్ధవంతంగా పరిపాలన నిర్వహిస్తూండేవారు!

సోమకాంతుడు తన భుజపరాక్రమం అనేక దేశాల రాజులను సామంతులను చేసుకొని వారినుంచి కప్పము తీసుకునేవాడు. ఆమంత్రులు వరుసగా

1) రూపవంతుడు,
2) విద్యాధీశుడు,
3) క్షేమంకరుడు,
4) జ్ఞానగమ్యుడు,
5) సుబలుడు అన్న పేర్లతో పిలువబడేవారు.

ఆరాజుకు సుధర్మ అనే భార్య ఉండేది. అమిత సౌందర్యవతి, సకలసద్గుణ సంపన్నయైన ఆ మహాపతివ్రత రాజుకు తలలో నాల్కలాగా ఆతడు చేసే దేవతాది పూజలలో తోడ్పడుతూ సర్వ అలంకారములతోనూ శోభిల్లుతూ మంగళ స్వరూపిణిగా ఉండేది. వారికి అమిత బలపరాక్రమోపేతుడూ, గుణవంతుడూ బద్ధిశాలియైన హేమకంఠుడనే కుమారుడుండేవాడు. ఇలా సకల సిరిసంపదలతో, కీర్తిప్రతిష్టలతో ప్రకాశించే సోమకాంత మహారాజు లోక కల్యాణార్ధం ఎన్నో యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ, దాతయై తన రాజ్నాన్ని నిష్కంటకంగా పరిపాలించేవాడు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని
భృగు సోమకాంత సంవాదం అనే మొదటి అధ్యాయం సంపూర్ణం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment