అనిరుద్ధ వివాహమందు రుక్మివధ
వ్యాసులిట్లనియె.
చారుదేష్ణుడు సుదేష్ణుడు చారుదేహుడు సుషేణుడు చారుగుప్తుడు భద్రచారుడు, చారుబిందుడు (చంద్రుడు), సుచారుడు. అనువారు రుక్మిణికుమారులు. చారుమతి అనునామె కుమార్తె. కృష్ణునకు మఱి ఏడుగురు భార్యలు కాళింది, మిత్రవింద, సత్య, నాగ్నజితి, జాంబవతి, నిత్యసంతుష్టయగు రోహిణి, మద్రరాజకుమార్తె ఉత్తమ శీలముగలది యగు శీలమండల.
వీరుకాక పదహారువేలమంది భార్యలు హరికిగలరు. ప్రద్యుమ్నుడు రుక్మికూతురుని స్వయంవరమున గ్రహించెను. ఆమె అతనిని స్వయంవరమందే స్వీకరించెను. అతనికి ఆమెయందు ”అనిరుద్ధుడ”ను కుమారుడు కలిగెను. యుద్ధములందు నిరోధించుటకు శక్యముగాని బలసమృద్ధుడగుట వలన అతనికాపేరువచ్చెను. వానికి రుక్మి పౌత్రినిమ్మని కోరెను. అతడును కృష్ణునితో స్పర్థబెట్టుకొన్నను దౌహిత్రునకిచ్చెను. ఆవివాహమందు బలరామాది యాదవులు రుక్మిరాజధానియగు ”భోజకటము”నకు కృష్ణునితో తరలివెళ్ళిరి. ప్రద్యుమ్నకుమారుని వివాహమచటనైన తరువాత కళింగరాజు మొదలైనవారు రుక్మింగని బలరాముడు పాచిక లాట నెరుగడు. కావున నతనిని జూదములోనే యోడింతమన రుక్మియారాజులం బిలిచి బలగము గూర్చుకొని సభయందు బలరామునితో జూదమాడెను. ఆ ఆటలో రుక్మి వెయ్యినిష్కముల పందెము గెలిచెను. రెండవరోజున మఱి వేయినిష్కములను గెలుచుకొనెను. ఆమీద పదివేల నిష్కములను పందెము గాసెను. అత్తఱి కళింగరాజు బలరాముని జూచి పండ్లు బయలుపడ పరిహాసపూర్వముగ నవ్వెను. అయ్యెడ రుక్మి చెలరేగి బలభద్రుడు జూదమాడుట నెరుగడు. కావున లేని అహంభావముతో నేను ఆటగాడనని జూదమునకు సిద్ధపడినాడని గేలిచేసెను. హలాయుధుడు పండ్లుపైబడ ఇకిలించిన కళింగరాజును పరిహసించుచు పేలిన రుక్మింజూచి కుపితుడై కోటినిష్కములను పందెమొడ్డి గెలిచెను. రుక్మి పాచికలను విసరిపారవేసెను. బలరాముడట్లు గెలిచి”గెలుపు నాదియని” బిగ్గరగా పలికెను. ”గెలుపునాదని ఆబద్ధమాడకుమని” అరచెను. నీవొడ్డిన పందెమునకు నేనామోదింపలేదు. ”ఇట్లు గెలుపు నీదగునేని నాదెందులకు గాదు” అని రగడసేయుచుండ ఆకాశవాణి గంభీరముగా బెద్దపెట్టున మహాత్ముడగు బలరాముని కోపమును పెంచుచు ”బలరాముడే గెలిచినాడు రుక్మిమాట అబద్ధము. ఏమియు బలుకక చేసినదియే చేసినట్లగును” అనెను.
అంత బలరాముడు కోపముచే కన్నులెర్రబడ రుక్మిని కొట్టెను. ఎగిరెగిరి పడుచున్న కళింగరాజును కూడ బలుడు బలముచే బట్టి, వేనిందెరచి నవ్వెనో ఆ పండ్లనూడగొట్టెను. మఱియు ఆ జూదమందికమందున్న బంగారుస్తంభమునులాగి వాని పక్షముననున్న రాజులను వైచెను. అంతట సభయంతటను హాహాకారము పుట్టి ఆ రాజమండలమెల్ల పలాయనమయ్యెను. బలరాముడు కోపోద్రిక్తుడయ్యెను. రుక్మిబలునిచే హతుడగుట విని రుక్మిణికి బలరామునకు జడిసి మధువైరి యేమియు బలుక కుండెను. అవ్వల యదుసంఘము పెండ్లికుమారుని అనిరుద్ధునింగొని కేశవునితో గూడ ద్వారకకు వచ్చెను.
ఇది బ్రహ్మపురాణమున ననిరుద్ధవివాహమున రుక్మివధయను తొంబై ఐదవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹