Skip to content Skip to footer

శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – తొంబై నాల్గవ అధ్యాయము

ప్రద్యుమ్నా ఖ్యానము

మునులనగా శంబరునిచే ప్రద్యుమ్నుడెట్లుహరింపబడెను. ప్రద్యుమ్నుడా శంబరుని సంహరించిన విధమేమి? తెలుపుడని కోరగా వ్యాసుండిట్లనియె. ప్రద్యుమ్నుడు పుట్టిన ఆరవనాడు కాలశంబరుడు. తనకీతడు హంతకుడని తలచి ఆ శిశువును పురిటింటనుండి కొంపోయి మొసళ్లచే భయంకరమైన సముద్రమున విసరివేసెను. ఆ పడిన శిశువును ఒక చేప పట్టుకొనెను. దానిజఠరాగ్నికి గురి అయినా ఆ బాలుడు చావలేదు. జాలరులు వలవేయ ఇతర చేపలతో బాటు ఆ చెప్పాలి కూడా పట్టుబడి శంబరునికి సమర్పింపబడియె. వాని భార్య మాయావతి అను గృహయజమానురాలు చేపను వంటవానికీయ వాడది చీల్చి ఆ చేప కడుపున మున్ను దగ్ధుడైన మన్మథుడను వృక్షముయొక్క మొదటి మొలకను, పరమ సుందరుడగు శిశువును జూచెను. ఎవడునీవు? చేప కడుపున కెట్లువచ్చెను! అని వెడుక పడుచున్న శంబరుని భార్యంగని నారదుడు; ఈ శిశువు సర్వసృష్టి సంహారములు చేయగల శంబరునిచే పురిటింట నుండి అపహరింపబడినవాడు. కృష్ణుని కుమారుడు సముద్రమున విసరబడి చేపమ్రింగగా నీకు దక్కినాడు. ఇది మానవరత్నము. శ్రద్ధగ కాపాడుమని తెల్పెను. ఆమె అట్లే ఆ బాలుని సౌందర్యాతిశయమునకు మోహపడి అనురక్తితో బెంచెను.

ఆ బాలుడు నిండు యవ్వనము గని ఆమె వానికి తన మాయనంతను చెప్పెను. వానియందు హృదయము చూపులు నిలిపి ప్రవర్తించుండ ప్రద్యుమ్నుడు, మాతృభావము విడిచి మరొక తీరున నా యెడల నీవేల ప్రవర్తించున్నావని అడిగెను. ఆమెయు నీవు నాకు కుమారుడవు కావు. విష్ణుకుమారుడవైన నిన్ను కాలశంబరుడు అపహరించి సముద్రమున విసరగా ఒక చేప కడుపునుండి నాకు లభించితివి. నిన్నుగన్న తల్లి నీకొరకు ఇప్పుడును ఏడ్చుచున్నది.

అది విని కోపముగని మనసు వికలమై ప్రద్యుమ్నుడు శంబరుని యుధ్ధమునకు పిలిచెను, మరియు వానిసైన్యమును ఎల్ల గూల్చి ఏడురకముల మాయలను దాటి ఎనిమిదవ విధమైన మాయను ప్రయోగించి ఆ శంబరాసురుని చంపెను. ఆ మాయావతితో ఎగిరి తండ్రి పురమునకు వచ్చెను. అంతఃపురమందు వ్రాలి మాయావతితో కూడియున్న ఆతనిని చూచి కృష్ణపత్నులు సంతోషించిరి. రుక్మిణియును ప్రీతితో అతనిపై చూపు నిలువ ఇట్లనియె.

ఏ ధన్యురాలి తనయుడో ఈతడు నవయవ్వనమందున్నాడు. నా కుమారుడు ప్రద్యుమ్నుడే కనుక జీవించి ఉండిన ఈ వయసులో నుండెడివాడు. నాయనా! నీచేత సొంపుగన్న ఆ కన్నతల్లి అదృష్టవంతురాలు. అదిగాక నీ ప్రేమ నీ శరీరము నీ అకారము సరిగా నన్ను పోలియున్నది. స్పష్టముగ నీవు హరి కుమారుడవే అగుదువు అనెను. ఇంతలో కృష్ణునితో గూడ నారదుడేతెంచి అంతఃపురాంగనల కెల్ల మిన్నయైన రుక్మిణీదేవిని చూచి హర్షముతో కల్యాణీ! మున్ను పురిటింటనుండి హరించిన ఆ శంబరాసురుని చంపి వచ్చిన ఈతడు మన బిడ్డడే. ఈ మాయావతి పతివ్రత. ఆ నీకుమారుని భార్య. శంబరుని భార్య కాదు. దానికి కారణమిదిగో వినుము. మన్మథుడు పోయిన తరువాత ఆతని పునర్జన్మ కోరుచు మాయారూపమున వివాహాది భోగములందు శంబరుని ఈమె తబ్బిబ్బు సేసెను. మన్మథుని పత్నియే ఈమె. ఆ దైత్యునికి మాయారూపమును జూపినది. నీ కుమారుడు మన్మథుడు తిరిగి అవతరించినాడు. ఆతని ప్రాణప్రియ రతియే ఈమె. శంకింపకుము ఈ పరమ కల్యాణి నీ కొడలు. అన రుక్మిణీకృష్ణులు ఆనందభరితులైరి. ద్వారకా నగరమెల్ల బాగుబాగని హర్షించినది. చిరకాలము క్రిందట పోయిన కుమారునితో కూడుకొనిన రుక్మిణిని చూచి ద్వారకానగర జనమెల్ల విస్మయము జెందెను.

ఇది శ్రీ బ్రహ్మపురాణమున శంబరుడు హరించిన ప్రద్యుమ్నుని పునరాగమనమను తొంబై నాల్గవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment