Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – తొంబై ఒకటవ భాగము

గోకులే బల ప్రత్యాగము వర్ణనము

వ్యాసులిట్లనిరి.

ఇట్లు ముచుకుందునిచే పోగడబడి సర్వభూతేశ్వరుండగు హరిని కోరిన దివ్యలోకములనందుమని ఆ రాజునకు దెల్పెను. నా సాకతము అవ్యాహతైశ్వర్యముతో దివ్యభోగములచట అనుభవించి పూర్వజన్మ స్మృతి బడసి ఉత్తమ కులమందు పుట్టి అవ్వల ముక్తి నందుదువు. అన ఆ రాజు పరమేశ్వరునకు మ్రొక్కి గుహనుండి వెలువడి వచ్చి వెలినున్న అల్పాల్ప శరీరులను నరులం జూచును. దానిచే కలియుగము వచ్చెనని గ్రహించి నరనారాయణస్థానమైన గంధమాదనమున (బదరికాశ్రమమున) తపముసేయ నేగెను.

కృష్ణుడు ఉపాయముచే శత్రువును కాలయవనుని గూర్చి వాని సేననెల్ల గొనివచ్చి ద్వారకయందు ఉగ్రసేనునికి సమర్పించెను. అవ్వల యదుకులము శత్రుభయశంకవోయి స్వస్థత నందెను. బలరాముడును యుద్ధములెల్ల శాంతింప తన జ్ఞాతులను దర్శించు వేడుకతో నంద గోకులమున కేగెను. గోపికలు గోపకులును ముందటియట్ల సబహుమానముగ ప్రేమతో కలిసికొని అచ్చట నుండెను. కొందఱు వచ్చి కౌగిలింప కౌగలించుకొనెను. కొందఱితో నవ్వెను. కొందఱితో ముచ్చటలాడెను. వారు ఎన్నో ప్రియ వాక్యములను బలరాముని పలుకరించిరి. కొందఱు గోపికలు ప్రేమతో కొందరు ఈర్ష్యతోడను కూడ ప్రశ్నలేసిరి.

నాగరిక కామినులకు ప్రాణమైనవాడు నిలకడలేని వలపు తీపులను దొలకు కృష్ణుడు సుఖముగ నున్నాడుగదా! ఆ క్షణమాత్రసౌహృదుడు (నిమిషమాత్రము వట్టి మెఱపువలె మెరమిచ్చులు గొలుపువాడు) నైన చెలిమిగల హరి వారికడ మాచైదముల యెడ బరిహాసము వారి సౌభాగ్య గర్వాతిశయము చేయుటలేదుగదా! బృందావనమున వేణుగానమును విని అనుసరించి వచ్చిన మా రాకను తలంచుచున్నాడా? కన్నతల్లిని జూడ నొకమాటైన నితడు ఇటకు వచ్చునా! ఐనను వాని ప్రసంగము లెందుకు? వేరుమాటలు చెప్పుకొందుము, మనము లేకుండ ఆతనికి, అతడు లేకుండ మనకు సాగదు. అతనికై మేము తండ్రి, తల్లి సోదరుడు భర్త బంధుజనము అను వీరిలో వదలిపెట్టని వారెవరు? అనగా తనకొఱకిందరను గాదని వచ్చినారము. అట్టి మమ్ములను వదలియున్న ఆతడు కృతఘ్నుడు గదా! ఐన నటకు తిరిగి తాను రాదగిన ఆత్మీకమగు నేదో వస్తువునుద్దేశించి ఉండును. లేదా అట్టివారెవరికో తన సందేశమిచ్చి యుండవలెను. అతని వచనామృతము నీవు తెలుపదగును. ఈ దామోదరుడు గోవిందుడు పురస్త్రీలపై నంటిన మనస్సుచే నాయెడల ప్రీతి తొలగినాడు. ఇక మాకు కనపడడని తోచుచున్నది.

ఇట్లు గోపికలు బలరామునితో పలుకుచునే మైమరచి కృష్ణా దామోదరా యని సుస్వరముగ బిలుచుచు గలకలనవ్విరి. అవ్వల కృష్ణుని సందేశమును మంచిగ మధురముగ నిండుప్రేమ దొలుక స్వాతిశయ మించుకయు గనపడకుండ మధురస్వరసరసముగ కృష్ణుడు పంపిన సందేశము వినిపించి బలకామునిచే నా గొల్లభామలోదార్చబడిరి. అవ్వల బలభద్రుడు మునుపటియట్ల పరిహాస సుందరులగు గోపకులతో నా వ్రేపల్లెయందు ప్రేమపూర్వకముగా సంభాషణములు నెఱపెను.

ఇది బ్రహ్మపురాణమందు బలరాముడు గోకులమునకు తిరిగి వచ్చుట యను తొంబది ఒకటవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment