Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మపురాణం 🌹🌹🌹 – తొమ్మిదవ అధ్యాయము

సోమోత్పత్తి వర్ణనం

సూతుండిట్లనియె : – ఓ విప్రులార ! సోముని అత్రి భగవానుడు ఋషి అయన బ్రహ్మమానస పుత్రుడు. అతడు గొప్ప తపమొనరించినవాడు. అతడు మూడువేల దివ్య సంవత్సరములు తపమాచరించెనని ప్రసిద్ధి. ఆయనయొక్క తేజస్సు మీదికి జిమ్ముకొనెను. అదియె సోమరూపము దాల్చెను. అయన కళ్ళ నుండి నీరు దిక్కుల ప్రకాశింపజేయుచు. పది తెఱంగుల స్రవించెను. దశదిశాధిదేవతలేకమై విధియానతి నా తేజస్సును ధరింపబోయు శక్యముగాక జారవిడిచిరి. వసుధవై బడిన యా సోమరూపముయిన వీర్యమును జూచి లోకపితామహుడైన బ్రహ్మ లోకహితమునకై తన రథమెక్కించుకొనెను. అత్రి కుమారుడట్లుబడుట చూచి బ్రహ్మకుమారులు దేవతలు మరి మునివరులు పొగడిరి. అట్లు స్తుతింపబడు సోముని తేజస్సు లోకముల నాప్యాయనము సేయనెల్లడల నలముకొనియె. అ సోముడు బ్రహ్మ యొక్క రథమునందధష్టించి సాగర పరీవృతయైన ఈ వసుంధర నిరువదియొక్కమారులు బ్రదక్షణము సేసెను. అయన తేజస్సు భూమియందు బ్రవేశించెను. అందుండి సర్వౌషధులు సర్వజగదాధార భూతములై మొలచినవి. ఆ సోముడు స్తుతులచే స్వకీయ సత్క్రుతులచే తేజస్సు వడసి పద్మ దర్శనమునకై తపమొనరించెను. బ్రహ్మవిదగ్రగణ్యుడగు బ్రహ్మ యతనికి బీజౌషధుల యొక్కయు విప్రుల యొక్కయు జలముయొక్కయు సామ్రాజ్యమొసంగెను.

సౌమ్యులకెల్ల సౌమ్యుడగు నాతడది వడసి, సహస్ర శతదక్షిణముగ రాజసూయము చేసెను. ముల్లోకములను నాకైరవబంధువు దక్షిణ యిచ్చెనని వినబడినది . ఆ రాజసూయాధ్వరమున సదస్యులై బ్రహ్మర్షులు దక్షిణల నందుకొనిరట. హిరణ్యగర్భుడు (బ్రహ్మ) అత్రి భృగువు నందు ఋత్విజులైరి. బహుముని పరివృతుడై హరియందు సదస్యుడయ్యెను. అ సోముని సినీకుహువు. ద్యుతి. పుష్టి, వ్రభ, వసువు. కీర్తి. ధృతి, లక్ష్మియను తొమ్మండుగురు దేవతానుందరీమణులు సేవించిరి. అవబృథస్నాతుడై సర్వదేవర్షిపూజితుడై పదివిధముల దిక్కులనుద్భాసింపజేయుచు సోమరాజేంద్రుడు వెలుగొందెను. ఏరికి బడయరాని ఐశ్వర్య మంది ఋషి సత్కార సంభృతమై దనకు లభించెనని యుప్పొంగి అవినయము ననయమునకు (అనీతి) లోబడి యాతని మతిపోయినంత నతడు అమితెశ్వర్య మదమోహితుడై కానక బృహస్పతి భార్యను తారను బలాత్కారమున హరించెను.

దేవతలు దేవర్షులు మఱిమఱి యాచించినను నతడు వినక తార నాంగిరనునికి అప్పగింపక యపోయెను. అపుడు యంగిరసు మడమలం ద్రొక్కికొని ఉశనసుడు (శుక్రుడు) వచ్చెను. రుద్రుడు అజగవమ్మను విల్లుకొని పార్షి గ్రాహుడయ్యెను. అతడు బ్రహ్మశిరోనామకాస్త్రము గొని దేవతలపైకి విసరెను. దానిచే నవ్వేల్పుల కీర్తి కళంకితమయ్యెను. తారకామయమును ప్రఖ్యాతమయ్యుద్ధమక్కడ దేవదానవలోక క్షయకరమయ్యెను. బ్రాహ్మణులారా ! అందు మిగిలిన దేవతలు తుషితులనుదేవతలు సనాతనుడును నాదిదేవుడునగు బ్రహ్మను శరణుజొచ్చిరి.

పితామహుడంతట శుక్రుని రుద్రుని (శంకరుని) వారించి న్వయముగ తారను అంగిరసుని కప్పగించెను. బృహస్పతి. యా యిల్లాలి నంతః ప్రసవగ గమనించి (గర్భిణియగుట గ్రహించి) క్రుద్ధుడై నాకు హక్కయిన ఈయోనియందు గర్భముదాల్చుట నీకు చితము గాదనిన నామె ముంజ గడ్డియందుంచెను. ఈ శిశువు పుట్టినంతనే దివ్య శరీరము నొందెను. సురవరులంతట నంశయమంది తారంగని నిజము చెప్పుము. ఈ బాలుడు సోముని కొడుకా లేకా బృహస్పతి బిడ్డడా యనగా నామె వేల్పులకు బదులుపలకదయ్యె. అపుడు చోర హస్తకుడగు నా మారుడామెను శపింప బూనిన వారించి బ్రహ్మ తారా ! ఇందు నిజమేది చెప్పుము. వీడెవ్వని కొడుకు ? అననామె ప్రాంజలియై సోముని వాడని యనెను. అయ్యడ సోముడాపావని శిరంబు మూర్కొని వానికి బుధుడని నామకరణ మొనరించెను. అ బుధుడు గగనమున ప్రతికూలముగ నుదయించుచుండును. అతడు వైరాజమనువు పుత్రిక యందు పుత్రుని గనెను. అ పుత్రునకు పురూరవుడను పుత్రుడు జనించెను. పురూరువున కూర్వశియందేడ్గురు మహాత్ములైన కుమారులుదయించిరి. ఇది సోముని జన్మవృత్తాంతము. ఇది కీర్తంపకీర్తికలుగును. ఈ సోమవంశ సంకీర్తనము ధన్యతను అయుష్యము – ఆరోగ్యము -పుణ్యము గూర్చును. సంకల్పసాఫల్యము గూర్చును. సోమజన్మవృత్తాంతము విన్న యతడు పాపవిముక్తి నందుగల్గును.

శ్రీ బ్రహ్మ మహాపురాణము నందు సోమోత్పత్తి కథనమను తొమ్మిదవ అధ్యాయము సమాప్తము

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment