Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – ఎనభై ఎనిమిదవ భాగము

దేవకీ వాసుదేవాభ్యాం సకృష్ణసంవాదః

వ్యాసుడిట్లనియె. భగవద్విలాస దర్శనము వలన విజ్ఞానముదయించిన దేవకీవసుదేవులం జూచి హరి యాదవ సంఘము మోహములో బడుటకుదనవైష్ణవమాయను విస్తరింపజేసెను. అమ్మా!ఓయయ్యా! ఎన్నాళ్ల నుండియొ మిమ్మెప్పుడు చూచెదనా అని త్వరపడుచు కంసునికి జడిసియున్న బలరాముడు నేటికి మిమ్ముజూచినాడు. తల్లిదండ్రులు పూజింపకయే జరిగినకాలమదివ్యర్ధము. ఉత్తములకది బాధాకరమునగును. గురువుల దేవతల విప్రులను తల్లిదండ్రులు పూజించువారి జన్మము సార్థకము. ఇందనుకయిది తప్పిచేసినతప్పిదము తండ్రీ!క్షమింపుము. కంసుని బలపరాక్రమములకు జడిసి పరవశులమై ఉన్నందున అట్లు జరిగినది. అని పలికి ప్రీతితోను యదువృద్ధుల పాదములవ్రాలి యిద్దరును వసుదేవుని మనసునిండువరచిరి.

అంతట కంసుని భార్యలు వాని తల్లులు పుడమింబడియున్న కంసునిం జుట్టును జేరి దుఃఖశోకముల మునింగి (దుఃఖము=కష్టము శోకము=ఆప్తబంధు మరణాదులచే మనస్సునకు గలుగుబాధ) పెక్కురీతుల కలతవడి పశ్చాత్తాపము నెడ ఆత్రముగొని పెక్కురీతుల నేడ్చిరి. హరి తాను కన్నుల నీరుపెట్టుకొని వారలనోదార్చెను. అవ్వల ఉగ్రసేనుని బంధమునుండి విడిపించెను. మఱియు అతనిని కొడుకుం గోల్పడిన వానిని రాజ్యమునం దభిషిక్తుం జేసెను. రాజ్యాభిషిక్తుడై ఆతడు తన కొడుకునకు మఱియపుడు చచ్చిన వారికిని బ్ప్రేతకృత్యములు గావించెను. అట్లొనర్చి సింహాసనమెక్కిన ఆతనితో కృష్ణుడు శంకింపక ఇపుడు యేమిచేయవలయునో యానతిమ్ము. యయాతి శాపముచే నీ యదువంశము రాజ్యానర్హమేయైనను ఇప్పుడు నేను భృత్యుడనై యున్నాను గావున నీవు దేవతలనేని శాసింపుము. నరపాలుర లెక్కేమి అని కార్య నిమిత్తమున మానుషాకారముల ధరించిన భగవంతుడు మానవ భాషణముల ఉగ్రసేనునిం గూర్చిపలికి వాయువుంబిలిచి యిట్లనియె. నీవేగి ఇంద్రునితో నిట్లనుము. ఇంద్ర! గర్వమువలదు. నీసుధర్మసభ ఉగ్రసేనునికి సమర్పింపుము కృష్ణుడు చెప్పుచున్నాడు. అత్యుత్తమము రాజులకర్హము. ఈ సుధర్మ సభారత్నము (సర్వసభాశ్రేష్టము) ఇందు యాదువులెక్కుట యుక్తము. అనిపలుక పవనుండేగి శచీపతికదియెల్ల విన్నవించెను. ఆతడును సుధర్మసభను వాయువునకొసంగెను. వాయువు గొనివచ్చిన ఆ దివ్యసభను సర్వరత్నాఢ్యమును (సర్వవస్తువులలో నత్యుత్తమ శ్రేష్ఠవస్తువులు గలదానిని) గోవిందుని భుజముల నీడనుండి యదుశ్రేష్ఠు లనుభవించిరి.

సర్వ విజ్ఞానము లెఱింగినవారు కేవల జ్ఞానస్వరూపులయ్యు ఆ వీరులు రామకృష్ణులు శిష్యాచార మిట్లుండవలెనని లోకమునకు వెల్లడించువారై కాశీక్షేత్రమునంబుట్టి అవంతీపురమునందు (ఉజ్జయినిలో) వసించుచున్న సాందీపని సన్నిధి కస్త్ర విద్యార్థము వారరిగిరి. ఆయనకు శిష్యులై గురుశుశ్రూష చేయుచు ఎల్లజనమునకు సదాచారము గురుశిష్య భావమిట్లుండవలెనని చేసి చూపించిరి. ధనుర్వేదము సరహస్యముగ ససంగ్రహముగ అరువదినాల్గు దినములలో ఆయనతో సాధ్యయనము చేసిరి. అది వింతలకెల్ల వింతయయ్యెను. సాందీపనియు నెన్నడు ఊహింప వలనుగానిది అమానుషమునైన ఆ అధ్యయనము తీరుగని ఆలోచించి చంద్రసూర్యులిటు వచ్చినారని వారింభావించెను. ఆ యిద్దరు జెప్పినమాత్రన (ఉపదేశమాత్రమున) అస్త్రగ్రామమెల్ల పొంది తమకు గురుదక్షిణ ఏమి కావలెను అని అడిగిరి . ఆయన మతిమంతుడు గావున వారిపనిని నతీంద్రియ జ్ఞానమున గని (కేవలతపోదృష్టింజూచి) లవణసముద్రమున ప్రభాసతీర్థమందు మున్ను గతించిన పుత్రుని యాచించెను.

వారిద్దరు అస్త్రములంజేకొని సముద్రముందరిసి సాగరునితో గురుపుత్రునిమ్మని పల్కిరి. వార్ధియుం జేతులు మొగిచి నేను సాందీపని పుత్రుని హరింపలేదనియు పంచజనుడను దైత్యుడు శంఖము రూపమున నుండువాడా బాలునింగొనిపోయె. వాడు నానీటిలోనె ఉన్నాడనియె. అదివిని కృష్ణుడు నీళ్లలోనికింజొచ్చి పంచజనుంబంచత్వ మందించి వానియెమ్శులం బొడమిన యుత్తమమైన శంఖముంజేకొనియె. దానినాదముచే దైత్యులకు బలముపోవును దేవతలకు తేజస్సువృద్ధిపొందును. అధర్మము క్షయించును. అట్టి పాంచజన్యమునెత్తి హరి యొత్తి యమపురికేగి బలభద్రుడును యమునింగెల్చి యమయాతననున్న ఆ బాలునింగొని మునుపటివోలె మానవ శరీరముననున్న వానిని తండ్రికి బలరామకృష్ణులొసంగిరి.

అటనుండి ఉగ్రసేన పరిపాలనలోనున్న మధురకేతెంచిరి. మధురాపురవాసులు స్త్రీపురుషులు వారి ఆగమనమున అమితానంద భరితులైరి.

ఇది బ్రహ్మపురాణమున దేవకీవసుదేవులతో కృష్ణుడు సంభాషించు గురుదక్షిణా సమర్పణము అను ఎనభై ఎనిమిదవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment