కుబ్జోద్ధార వర్ణనము
అవ్వల కృష్ణుడు రాజమార్గము వెంట సుగంధ ద్రవ్యపాత్రను జేకొని వచ్చుచున్న నవవనశాలనియగు కుబ్జను జూచెను. ఇందీవరాక్షి! ఈ అనులేపనము ఎవఱికొఱకు గొంపోవుచున్నావు. నిజము చెప్పుమని పలుకరించెను. సాభిలాషముగ హరి ముచ్చటింప అదియు అనురక్తిగొని ఆ సుందరుని జూచినంత వివశమైన మనస్సును బలిమియై నిలిపి హరితో సొంపుగ నిట్లు పలికెను. కాంత!నీవేల యెరుగవు. నేను సుగంధద్రవ్యానులేపన కార్యక్రమమున కంసునిచే నియోగింపబడిన దానను. లనేకవక్ర యను బ్రసిద్ది గన్నదానను. కంసునికి నాకూర్చిన కలపము దప్ప ఇతరము ప్రియము కాదు. అతని యనుగహ సంపదకు నేను పాత్రమును”
అన కృష్ణుడు ”సుందరముఖి ; రాజున కర్హమైన ఈ మంచి గంధము మేమిద్దరము పూసికొనదగినది. అది మాకిమ్ము”. అన నది వెనువెంటన ”తీసికొమ్మ”ని ఆదరముతో వారికిచ్చెను. వారు చిత్ర చిత్ర రచనలుగా ఆ గంధమును పూసికొని ఇంద్రధనస్సుతో శోభించు తెల్లని నల్లని మేఘములట్ల భాసించిరి. అంతట హరి ఉల్లాపన నిపుణుడు గావున (మధుర హాస్యవచన రచనా నిపుణుడు గావున) దాని గడ్డముక్రింద జేయిజేర్చి దాని పాదములందన యదుగులం ద్రొక్కిపట్టి (భక్రుల నుద్ధరించు నెరజాణ గావున) ఆమెను మీదికెత్తి లీలగ నిట్టట్టులూచెను. దాననయ్యింతి మేని మంద్రముగ మాయింటికి రమ్మని పలికి సవిలాసముగ నతని పైవలువ గొని ఆకర్షించెను. స్వామి తప్పక వచ్చెదననెను. ఆ విలాసిని బలభద్రునివంక నల్లనం గనుచు బిట్టు నవ్వి కృష్ణుని వదలెను. ఆమె ఇచ్చిన ఆ మంచి గంధము నయ్యిద్దరు బూసికొని రంగు రంగుల పూలమాలలం దాల్చి నీలాంబర పీతాంబర ధారులై ధనుశ్శాలకుం జనిరి. ధనుర్యాగమునకు నిర్దిష్టమైన ధనుశ్రేష్ఠమెక్కడ నున్నదని శాలారక్షకుల నడిగి తెలిసికొని హరి అపుడు దానిం గొని ఎక్కుపెట్టెను. ఎక్కిడినది తడవుగ నది విరుగ నెడలిన చప్పుడు మధుర నలుమూలల నలమెను. అ విల్లు విరుగుట జూచి శాలా రక్షకులు మీరెవ్వరని ప్రశ్నింప బదులు వలుకకయే యా యన్నదమ్ములు ధనుశ్శాల నుండి వెడలిరి.
కంసుడక్రూరుని రాకను, రామకృష్ణులు ధనస్సును విరచుటను విని,చాణూర ముష్ఠికులను జూచి గోపాల బాలకులిద్దరు వచ్చినారు. మల్లయుద్దమున నా ప్రాణమును హరించు వారిని మీరు సంహరింపుడు. అందువలన నేను సంతోషించెదను. న్యాయాన్యాయ విచక్షణ లేకుండ నెట్లైనను మీరు వాండ్రసు గడతేర్పవలెను. దాన మీకోరినదెల్ల దీర్చగలను. వారి వధవలన నీ రాజ్యము నాకును మీకును ఉమ్మడిసొత్తు కాగలదు” అని ఆ మల్లుర కాజ్ఞ యిడి మావటి వానింబిలిచి ”నీవు మదపుటేనుగును సమాజ ద్వారమున నిలుపుము. కువలయాపీడమను ఆ మదగజము చేత మల్లరంగ ద్వారమునకు వచ్చిన ఆ గొల్లపిల్లలను ద్రొక్కింపుము. అని ఆన యిచ్చి కంసుడు పోగాలము దాపురించిన ఆ దుష్టుడు సూర్యోదయమున కెదురు చూచుచుంచెను.
పౌరులు మంచెములందును రాజులు భృత్యులతో నేగి రాజుల కుచితములగు మంచెములం దధిష్ఠించిరి. మల్లురు ప్రాశ్నికులు (మధ్యవర్తులు) అ సభారంగమున నడిమి భాగమున వసించిరి. కంసుడు అందరికంటె నెత్తైన మంచెమునందు (సోఫా) ఆసీనుడయ్యెను. అంతఃపుర జనము వసింప వేర్వేర మంచెములమర్పబడెను. వారస్త్రీలకు నొకచో నగరాంగనల కొకచో నందాది గోపకులొకచో నాసీనులయ్యిరి. అక్రూర వాసుదేవులు ఆ మంచె ప్రాంతమున నుండిరి. పౌరాంగనల నడుమ పుత్రవాత్సల్య భరితయగు దేవకి నాబిడ్డ నెమ్మోము తుది గడియలోనైన జూతును గాకయని కూర్చుండెను.
ఉత్సవ వాద్యములు మ్రోయ చాణూరుడెగిరెగిరి గంతులిడుచుండ ముష్ఠికుడు బాహువులు చరచ లోకము హాహాకార మొనరింప మావటీడు తమ మీదికి దోలిన కువలయా పీడమును జంపి దాని మదముచే రక్తముచే శరీరములు పూతవడ దాని దంతములు పెరికి ఆయుధములుగ ధరించి సగర్వ విలాసమున జూచుచు మృగముల నడుమ మృగరాజులట్లు బలరామకృష్ణులు మల్లరంగమును బ్రవేశించిరి. అంతట అన్ని రంగములందు ఇతడే కృష్ణుడు ఇడుగో బలభద్రుడని వింతగొని జనము చేయు ఆహాకారము మిన్నంటెను. ఘోర రాక్షసిని పూతనను జంపిన అతడే ఇతడు. శకటాసుర భంజనము యమలార్జునోన్మూలనము జేసిన యతడు కాళియ ఫణి ఫణాగ్రమన నర్తనము జేసిన ఆ బాలుడితడే. గోవర్థన మహాగిరిని ఏడురోజులు ఎత్తిపట్టిన బలుదిట్ట యాతడు. అరిష్ట, ధేనుకులను కేశి యను హయమును విలాసముగ జంపిన మహాత్ముడు అచ్యుతుడీతడే. ఇతని ముందు సవిలాసముగ నీ మల్లరంగమున పచారు చేయుచున్న సుందరీ నయనానందనుడు యదునందనుండిడుగో! బలరాముడు. ఈ స్వామి హరి పురాణార్ధములను లెస్సగ చూచిన ప్రాజ్ఞులు. గోపాలమూర్తియై కంసునిచే దిగబడియున్న యదువంశము నుద్ధరింపగలడని పొగడొందిన బాలుడిడుగొ. ఇతడు సర్వసృష్టిహేతువు సర్వము దానైన విష్ణువు నంశమున నవతరించి భూభారము హరింపనున్నాడు.” అని యిట్లు బలరామ కృష్ణులను పౌరులు కొనియాడుచుండ దేవకి పాలుచేపుకొన నాబిడ్డలంగని మనసుసందాపము వొందెను. మహోత్సవము చూచుచున్న నెపమున తన పుత్రులనే చూచుచు పై గదిసిన ముదిమిని (వార్ధక్యము) బాసి యువకుడట్లై వసుదేవుడు తనిసెను. శుద్ధాంతః స్త్రీలు నగర స్త్రీసమాజము కనుగవలల్లార్చి అవిరామముగ నా రామకృష్ణులను తిలకించిరి- మఱియు నిట్లొండొరులతో మురిసి ముచ్చటింప జొచ్చిరి.
సఖులార! కమలము లట్లింపు గొలుపు కృష్ణుని నెమ్మోము గనుడు. ఏనుగుతోడి పెనుగులాట నొడవిన శ్రమచే గ్రమ్మిన చెమటబిందువులతో హరివదనము మంచుబిందువులు పైబడిన వికసిత నవాంబుజమట్లు సొపు గులుకు చున్నది. అల్లదే చూడుడు. అక్షరము (ఆవినాశి) అయిన పరబ్రహ్మమును మరచి వినశ్వరమగు నీ జగద్దృశ్యమును మరిగిన మన ఈ జన్మమును మన కన్నులను సఫలములను జేసుకొందము. శ్రీవత్సలాంచితమై సర్వజగదావాసమై వివక్షక్షపణమైన (శత్రువులను మట్టువెట్టు) ఈవీరుని పెడదయురంబును విశాల భుజయుగమును సఖీ!కన్గొనవె. గంతులిడు ముష్ఠికునితో రంతులుచేయి చాణూరునితో తక్కుంగల మల్లురతో వీరాలాపముల మేలమాడు బలరాముని నెమ్మోము గనరె! సఖులారా. బలుదిట్టయగు చాణూరునితో పసిబాలుడు గోపాలుడు తలపడుచున్నాడు. అన్యాయమిది అని చెప్పగల పెద్దలెవ్వర నిక్కడలేరా? ఇపుడిప్పుడే అంకురించు యవ్వనమున కున్ముఖుడై సుకుమార శరీరుడైయున్న ఈ హరి ఎక్కడ వజ్రకఠినమై నిండు మదమెక్కి ఉక్కుమిగులు నెమ్మేనయున్న ఈ మహారాక్షసుడెక్కడ? పరమసుకుమారులు చిరుతప్రాయమువారు గోపాలురీకంగమందున్నవారు. వీరితో నుజ్జీగ పరమరాక్షసులు నతిదారుణులు చాణూరాదులు మల్లులెదురనున్నారు. ఈవిపర్యయము నీమర్యాదను ఇటనున్న మధ్యపర్తులుల్లంగించుట కడు విపరీతము. మధ్యస్థులిదిచూచి ఉపేక్షించుచున్నారు. అని ఇట్లూరక పౌరసుందరులు పరితపించుటగని పుడమిగంపింప హరి చూపరుల కానందోత్కర్షమును వర్షించుచు సమరసన్నద్దుడయ్యెను. బలరాముడును బాహువులు చరచి చక్కగ నిటునిటు దూకినంతట నడుగడుగున నవని పగులుపడవలసిన దట్లుగాకుండుట అదియు నొకయద్భుతమయ్యెను.
అంతట చాణూరునితో కృష్ణుడును మల్లయుద్ధ విశారదుడైన ముష్టికుడు బలదేవునితోను తలవడిరి. ఒండొరులం దూరముగా విసరుట గ్రుద్దుట పట్టుగ దచినంతచేబట్టి దిగనడచుట బాదములందన్నుట మర్దించుట మొదలగు మల్లయుద్దభంగిములచే వారి కస్త్రములులేని అతిధారుణమైన సమరమయ్యెను ధనుర్యాగోత్సవమందు తన బల ప్రాణములచే నెంతెంత సేయగలదో అంతకు చుట్టరికమని లేకుండ బోరెను. జగదంతర్యామియైన కృష్ణుడును వానితో విలాసమాత్రముగనే పోరెను.
అంతట కంనుడు ఖేదాత్=ఖేదమువలన నిజ=తనయొక్క శేష=పధను కరం= చేయనున్న కరం= చేతిని చాలయతా= చలింపజయుచున్న కృష్ణుచేగల్గిన కోపాత్=కోపమువలనను (అనగా కృష్ణుడు వజృంభించిచేయు భీషణమైన యుద్ధముచూచి నందువలన గల్గిన బాధవలనను తనను జంపనున్న హస్తమును పాముపడగనట్లోడించుచున్న కృష్ణుని యెడల నుడుకుమోతు తనమువలన గల్గిన క్రోథమువలనను) చాణూరుని యందు బలక్షయమును కృష్ణుని యందు బలవృద్దినింజూచి యుద్ధవాద్యముల నాపు చేసెను. మృదంగాది వాద్యములు అట్లాపబడినంత ఆ క్షణము ఆకసమందలి దేవవాద్యములు (దుందుభులు మొదలయినవి) భోరన మ్రోసినవి.
జయింపుము గోవింద! చాణూరుని సంహరింపుము కేశవ ఈ దానవుని అని అంతర్థానగతులై వేల్పులానందమంది హరిని స్తుతించిరి. మధుసూదనుడు చాలసేపు చాణూరునితో ఆడికొని తుదముట్టింపదలచి వానిలేవనెత్తి అంతకు నూఱఱట్లు యూపున గిరగిరం ద్రిప్పి గగనమంద ప్రాణములు వాసిన వానిం బుడమిపై విసరివేసెను. ఆవ్రేటునవాడు నూరువ్రక్కలై రక్తస్రావము చేసికొని ఆ నేలనెల్లం బెనుబెందడి గావించెను.
బలదేవుండును చాణూరునితో హరియట్ల ముష్టికునితో బోరెను. అతడును వీని ముష్టిచే నడితల నడచి మోకాలను ఱొమ్మునంబొడిచి పుడమిపై బడవేసి ప్రాణములు వోవ గాలఱాచెను. కృష్ణుడెడమ పిడికిలింగ్రుద్ది మల్లవీరుని మహాబలుని నవ్విధమున భూతలమునం బడనేసెను. చాణూరుడు నిహతుడు కాగా ముష్టికుడు గూల్పబడగా నెల్ల మల్లురును పారిపోయిరి. అపుడు కృష్ణ సంకర్షణు లిద్దరు నవ్వీరవిహారమున తమ ఈడు వారలను బలాత్కారముగ ఆకర్షించి ఆ రంగభూమిపై గుప్పించి గంతులు వెట్టిరి. అంతట కంసుడు కినుకచే కనులెఱ్ఱవడ అటచెదఱియున్న తన మనుజులతో ఈ గోపకులనిద్దరినీ సమాజము గుంపు నుండి బలత్కారమున గెంటివేయుడు. పాపాత్ము నందుని నిప్పుడే సంకెళ్ళంబంధింపుడు వృద్ధుల కుచితముగాని దండనమున వసుదేవుం గూడ గట్టివేయుడు? కృష్ణునితో నెగిరెగిరి గంతులునెట్టు నీగొల్లల గోధనములను గొల్లగొట్టుడనియె.
ఇట్లాజ్ఞయిచ్చు నాకంసుని గని అల్లన నవ్వి మధుసూదనుడు మీదికి దూకి యమ్మంచ మెక్కి కంసునింబట్టి జుట్టువట్టిలాగి కిరీటము తొలగియిలపై బడ వానిం బడవైచి వానిపై బడెను. ఎల్లజగముల కాధారమైన బరువుచే మీద బడిన కృష్ణునిచే నయ్యుగ్రసేని (ఉగ్రసేనునికొడుకు) కంసరాజు ప్రాణములం బాసెను. చచ్చినవాని కేశములంబట్టి కేశవుడు వానిదేహము ఆ రంగమధ్య మందు బరబర యీడ్చివైచెను. సహజముగ నది పెద్దది బరువైనది క్రోధముచే మఱియు బరువెక్కినది అగు కంసుని శరీరము మహాత్ముడగు కృష్ణునిచే గూల్పబడి కడువేగమున నీడ్వబడినది కూడ. అది చూచి వాని తమ్ముడు సునిముడెత్తి రాగ బలభద్రుడు లీలగవానిబడగొట్టెను. హరిచే నవమాసమునకు గురియై మధురాధీశ్వరుడు కంసుడు హతుడౌటగని ఆ రంగ మండపమెల్ల హాహాకారముల నిండిపోయెను. కృష్ణుడును వెనువెంటనే బలరామునిలో చని దేవకీ వసుదేవుల పాదములం బట్టుకొనెను. వసుదేవుడు దేవకియుం జనార్ధనునెత్తి జన్మసమయమున (పురిటింట) స్వామిపల్కిన పల్కులం దలచికొని వారే వారికి ప్రణతులై నిలిచిరి. అయ్యెడ వసుదేవుడా ప్రభువు నిట్లు వినుతించెను.
వసుదేవకృత కృష్ణ స్తుతి
స్వామి! ప్రసన్నుడౌము సురవంద్య సురేశ్వర! మాకునై కదా
యీమహి నుద్ధరింప భజియింపగ నేము ననుగ్రహింపగా
దామఱి నిగ్రహింప ఖలులందఱ మాగృహమందుబుట్టినా
వో మహనీయ! మాకుల మహో! యిది పావనమయ్యెరా హరీ!
భూతములన్నిటం గలవు భూతములన్నిట నంతరాత్మవున్
భూత భవిష్య మిప్పుడు ప్రభూ! జఱుగుంగదనీదు చేతనే
నేతవునీవు యజ్ఞమును నీవ యజించుట నీవ యజ్ఞమం
దాతతమైన ద్రవ్యనుదియైనను నీవ పరాత్పరా! హరీ!
నామనసేని దేవకి మనన్ముదియున్ నిను బిడ్డవంచు న
జ్ఞానమునం బడెన్ నిజము చాటెద! కర్తవు నీదభర్తవున్
దేనికి మొదల్తుదయు దేవరకుం గనరావు మానుష
మ్మౌనొక నాల్క పుత్రియని యర్భక యంచిది పిల్చు నంతియే
జగములకెల్లనుం బ్రభువ! సర్వజగమ్మిది మాయగాక వే
రగు మఱియేమియు క్తినిది యైనది అయ్యెడనీవు మాకుcగ
ల్గగ సబబేమి! సృష్టిసక లమ్మిటచుట్టినదున్న చట్టిసౌ
భగముమనుష్య కోష్ఠమున బావురె యయ్యొడినుంట యెట్లనే
ఇట్టడ వీవు పాహి పరమేశ్వర విశ్వము; విష్ణునంశమై
పట్టివి గావునాకు విను బ్రహ్మమొదల్మఱి చెట్టుపుట్టదా
కట్టిమమున్ విమోహమున నర్భకుడం చనిపించుమాయ యా
కట్టిడిచేత చిట్టులికిగాసిలితిం డయజూడవే హరీ!
కన్నులగ్రమ్ము మాయ ననుగన్నయ వీవని కంసభీతి నా
పన్నత చెంది వారిపరివారముచే నట జేరినాడ నో
యన్న యట్లైన నాతలపునం దొకయించుకయేని దొలంగ కీ
పున్నదినిక్క మీశ్వర! ఆహో! జగదీశ్వర! గోకులేశ్వరా!
రుద్రమరుత్తు లశ్వినులు రూఢిశతక్రతుముఖ్యులేని ని
ర్నిద్రులు సేయలేని కననేరని వింతలు సేసినావు సా
ముద్రికమేటికిం దడవ భూమిపయిం దిగినావు విశ్వమున్
భద్రమొనర్ప విష్ణువవు పాహి హరీ! తలగెన్ విమోహమున్
ఇది బ్రహ్మపురాణమున బాల చరితమన కంసవధయను ఎనభై ఏడవ అధ్యాయము
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹