కేశివధనిరూపణము
వ్యాసుడిట్లనియె.
అరిష్టధేనుకాదిరాక్షసులు హతులుగాగా గోవర్ధనోద్దరణము జరుగ నారదుండు చని కంసునకు యశోదాగర్భము మార్పు మొదలైన విశేషముల శేషము నివేదించెను. విని కంసుడు వసుదేవునిపై పగబట్టెను. యాదవ సభలో యాదవులను దుయ్యబట్టి తనలో నిట్లాలోచించెను.
బాలురైన బలరామ కృష్ణులను బలవంతులు కాకుండానే నేను వధింపవలయును. యవ్వనమొందిన తరువాత వారసాధ్యులయ్యెదరు. ఇక్కడ చాణూరుడు ముష్టికుడును. మంచి బలశాలురు. వీరితో నా బాలురకు మల్లయుద్దముపెట్టి ఆ దుర్మదులను జంపెదగాక! ధనుర్యాగమను మిషపెట్టి వ్రేపల్లెనుండి వారలరావించి వారు గడతేఱుట కెట్లెట్లు చేయవలెనో అట్లు చేసెదను. అని తలచి ఆ దుష్టుడొక నిశ్చయమునకువచ్చి అక్రూరునితో నిట్లనియె.
ఓ దానవేశ! నా ప్రీతి కొఱకు నీవిటనుండి రథమెక్కి గోకులమేగుము. హరి అంశమున పుట్టిన వసుదేవుని కొడుకులను గొనిరమ్ము. వారలు నా చావునకు పుట్టి పెరుగుచున్నారు. ఈ చతుర్ధశి నాడు ధనురుత్సవమను మహాయాగము జరుగగలదు. అందువల్ల యుద్ధమునకై ఏర్పాటు జరుగును. నాకడ చాణూర ముష్టికులను మల్లురు యుద్ధకుశలురు. వారలతో ఈ బలరామకృష్ణులకు జరుగు యుద్దమును సర్వలోకము జూచుగాక ! కువలయాపీడమను ఏనుగు మావటీండ్రకెల్ల మేటియైన వానిచే తోలబడి ఆ ఇద్దరు శిశువులను మట్టుపెట్టగలదు. వారిని చంపి వసుదేవుని నందుని కూల్చి నాతండ్రి దుష్టుడగు ఉగ్రసేనునిని చంపెదను. అటుపై గోపాలుర గోధనములను కొల్లగొట్టెదను. వారు నాకు శత్రువులు. నీవుతప్ప ఈ యాదవులందురు పరమదుష్టులు. నాకుగిట్టరు. ఈ అందరిని కూడ చంపుటకు క్రమముగ నీతో నేను యత్నించెద. ఆగొల్లలు గేదినెయ్యి పెరుగును కానుకగా గొని నీవెంబడి వచ్చునట్లు నీవట్లట్ల నచ్చచెప్పుము. అని ఇట్లు ఆజ్ఞాపించబడి మహా భాగవతుడు (భక్తాగ్రేసరుడు) మధుప్రియుడు(మద్యప్రియుడు) అగు అక్రూరుడట్లేయని కంసరాజునకు తెల్పి మధురావురమునుండి బయలువెడలెను.
అవ్వల కంసుని వాహనమగు గుఱ్ఱము రూపముగల కేశియనువాడు కంసప్రేరితుడై కృష్ణుని చంపనెంచి బృందావనమునకు వచ్చెను. వాడు కాలిడెక్కలం ధరణీతలమును జిమ్ముచు జూలు విదలలించి మేఘములు జెదరించుచు చంద్రసూర్యమార్గమును ఆక్రమించి గోపకులదరికి ఏతెంచెను. వాని సకిలింపును విని గోపాలురు గోపికలు భయమున బెదరిపోయి గోవిందుని త్రాహిత్రాహి (రక్షింపు రక్షింపుము) అని శరణొందిరి. హరియు అదివిని జలములతో నున్న మేఘముయొక్క గర్జనమట్లు గంభీరముగా ఇట్లు పల్కెను. గోపకులార జడియవలదు. గోపజాతి పరాక్రమము లోపమగును. అల్పబలము రాక్షస బలభారముచే చిందులు త్రోక్కుచు సకలించుచునున్న ఈ పాడు గుఱ్ఱమువలన నేమగును. అని ఓ క్రూర ! రా రా నేను కృష్ణుడను. పినాకపాణి (హరుడు) పూషుని (సూర్యుని) వలె నీ పండ్లూడగొట్టెదనని కృష్ణుడు వాని కెదురుగా నడచెను . వాడును నోరుతెరచి హరిపైకి ఎగబడెను. కృష్ణుడు తన నిండుభుజమును వాని నోటిలో దూర్చెను. దాన వాని పండ్లెల్లం దెలిమేఘవు దునుకులట్లూడి రాలిపోయెను . కృష్ణబాహువులోన కేగినకొలది బంధువులుపేక్షింప పెరిగినవ్యాధియట్లు పెరిగి దవడలు బ్రద్దలై నురుగులంతోడి రక్తముం గ్రక్కికొని వాడు సెలవులు విచ్చి కీలుకీలూడి వడి పాదములు చాచి విణ్ణూత్రములు విడుచుచు పుడమిపై బడెను. మరియు ముచ్చెమటలుపోసి చచ్చువడివాడు చేష్టలుదక్కెను. హరిబాహువుచే నోరు విచ్చిపోవ మహరౌద్రాకారియగు వాడు పిడుగు మీద పడిన చెట్టువలె బెండై రెండై కూలెను. రెండు పాదములు పిరుదు తోక రెండుగానై చెవి కన్ను ముక్కు నొక్కటి వంతుననై మొత్తము శరీరము రెండు ముక్కలై వాడు కూలబడెను. కృష్ణుడిట్లు కేశిసంహరము చేయ సంతోషబడిన గోపకులతో గూడుకొని శరీరమించుకయు ఆయాస పడకుండ స్వస్థుడై నవ్వుచు అచ్చటనే యుందెను. గోపికలును గోపకులును కేశి హతుడగుట జూచి వింతబడి అనురాగ మనోహరముగ పుండరీకాక్షుని కొనియాడిరి. కేశి హతుడగుట చూచి నారదుడంత మేఘములనుండి వెలువడి వెవేగ వచ్చి మనసానందభరితము కాగా కృష్ణునిట్లు గొనియాడెను.
బాగు బాగు జగన్నాథ స్వర్గవాసులకు పీడకల్గించు కేశిని లీలామాత్రముగా చంపితివి. ఈ అవతారమున నీవు చేసిన లీలలు ఆద్భుతములు. దీన నా మనసు అశ్చర్యమును ఆనందమును జెందినది. ఈ హయాసురునకు ఇంద్రుడు దేవతలును హడలిపోవుదురు. వీడు విదిలించి సకలించుచు ఆకసము వంకకు జూచిన వానిని చూచి దేవతలు హడలెత్తి పోవుదురు. కేశివధ చేసినందున లోకమందు నీవు కేశవ నామమున కీర్తింపబడుదువు. నీకు మంగళమగుగాక. వెళ్లుచున్నాను. కంసునితోడి యుద్దమున ఎల్లుండి నిన్ను గలిసికొందును. ఉగ్రసేనుని కొడుకు కంసుడు సపరివారముగ గూలగనే నీవు పృథివీభారహర్తవగుదువు. అక్కడ రాజులతోడి యుద్దములనేకములు నాకు దర్శనీయము కాగలవు. ఓ జనార్దన గోవింద నేను వెళ్లివచ్చెదను. దేవకార్యము చాలా గొప్పగ జరుపబడినది. నీచే నేను గారవింపబడితిని. నీకు శుభమగుగాక అని నారదుడేగ కృష్ణుడు గోపకులతో గోపికలు తమ నయనములచే తనలీలా సౌందర్యపానము చేయు గోకులమున బ్రవేశము చేసెను.
ఇది బ్రహ్మపురాణమున కేశివధ నిరూపణమును ఎనభై నాల్గవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹