Skip to content Skip to footer

శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – ఎనభై మూడవ భాగము

రాసక్రీడావిలాసము. అరిష్టవధ

అరిష్టవధ నిరూపణము

వ్యాసులిట్లనిరి.

గోపాలురింద్రుడేగిన తరువాత గోవర్ధనగిరి నవలీలగా నెత్తిన కృష్ణుంగని ప్రీతితో నిట్లనిరి. ”కృష్ణా! కొండ నెత్తిన అద్భుతలీలచే నీవు గోవులను మమ్ములను మహాభయము నుండి కాచితివి. ఈ బాలలీల అనుపమము. ఆల కాపరి అగుట నింద్యము. నీవు చేసిన పనియో దివ్యము. ఇదెట్లు జరిగినో తెలుపుము. మడువులో కాళియుడు అణగద్రొక్కబడెను. ప్రలంబుడు గూల్పబడెను. ఈ గోవర్ధన మెత్తబడెను. ఇవిచూడ మానసములు సంశయ గ్రస్తములగుచున్నవి. శ్రీహరి నీపాదములే మాశ్రయించెదము. నీ బలిమి చూచి నిన్ను నరమాత్రునిగా భావింపలేకున్నాము. సత్యము! సత్యము. నీవు దేవుడవో దానవుడవో యక్షుడవో గంధర్వుడవో. ఆ విమర్శ మాకేల? మాకు బంధువుడవు. నీకు నమస్కారము. ఆబాల గోపాలమునకు నీయెడల ప్రీతి కల్గినది. నీ చేసిన పని ఎల్లదేవతలు ఒక్కటైనను జేయజాలరు. ఒకవంక బాల్యము వేఱొక వంక అద్భుత వీర్యము నివియన్నియు నిట్లుండ గొల్లలమగు మాలో సామాన్యులలో నీవు జన్మించుట విమర్శింప మాకు సంశయము గల్గించుచున్నది అనవిని కృష్ణుడు క్షణమాత్రము పలుకకుండ నిలిచి ప్రణయకోపమున నటించి ఇట్లు వారికి బదులు పలికెను. నా సంబంధముచే మీకు సిగ్గు గలుగదేని నేను శ్లాఘ్యడనేగద! అందువలన కార్యాకార్యవిమర్శ యెందులకు? మీకు నాయందు ప్రీతియున్నయెడల మీమెప్పు నేను బొందదగినవాడనయిన యెడల బంధుసమానమైన గౌరవము మీరుచూపుడు. నేను దేవుడనుగాను గంధర్వుడను యక్షుడను దానవుడను గాను నేను మీకు చుట్టమునై పుట్టితిని. ఇందు వలన వేఱొక విధముగ మీరాలోచింప పనిలేదు అన శ్రీహరి వాక్యము విని గోపకులు మహానుభావులు మౌనమువట్టి పొలయలుక గన్న ఆతని నుండి బలరాముని దరి కేగిరి.

రాసక్రీడారంభము

ఆకాశము స్వచ్ఛమై శారదచంద్ర చంద్రికా మనోహరమై కలువ తీగలు వికసింప దిగంతములు సువాసనల ఘుమఘుమలాడ తుమ్మెదల ఝంకారములచే ఇంపు గొలుపు వనపాళిం జూచి కృష్ణుడు గోపికలతో క్రీడింప మనసు పడెను. బలరామునితో కృష్ణుడు పద్మమువంటి పాదములతో ఆ వనమున విహరించుచు గోపాంగనలకు మిగుల ఇంపు గూర్చును. వేణుగానము ఒనరించెను. రమ్యమైన ఆ గీత ధ్వనిని విని గోపికలు ఇండ్లు వెడలి సత్వరము కృష్ణుని దరికి ఏతెంచిరి. ఒక గోపిక అతని అడుగుల మెల్లమెల్లన అనుగమించెను. వేణుగానము విన కుతూహలముగొని వేఱొకతె అతనినే స్మరించెను. మఱొకతె కృష్ణా ! కృష్ణాయని పలికి అంతలో సిగ్గుపడెను. వేఱొకతె ప్రేమ కనులుగప్ప సిగ్గువిడిచి అతని చెంత నిలిచెను.

మఱియొక గోపిక ఇంటనే నిలిచి వెలినున్న పెద్దల(మామగారిని) గని బృందావనమునకు వెళ్ళుటకు సాహసము చేయలేక తన్మయతను చెంది కనులు మూసికొని గోవిందునే ధ్యానించెను.

శరచ్ఛంద్రమనోహరమైన ఒక రాత్రివేళ గోపికలు వెంబడింప గోవిందుడు రాసక్రీడారంభర ఉల్లాసియై వారల ఆదరించెను. గోపికలు గుంపులుగ కృష్ణవిలాసవివశులై అతుడు చాటువడ విరహాతరలై కృష్ణ దర్శనాపేక్షతో బృందావన మెల్లను వెదకుచు తిరిగిరి. రాత్రి కృష్ణుని అడుగుజాడలను చూచి అతని వివిధ శృంగారాను భావములకు మురిసి మైమరిచి పరిపరి విధముల ఆ వనమున పరిభ్రమించిరి. కృష్ణుడు కనిపించక నిరాశజెంది మరలి యమునా తీరమునకు వచ్చి కృష్ణ చరిత్రమును మధురముగ స్వర సమ్మేళనము ఒనరించి పాడిరి. అంతలో హరిముఖ పంకజము వికసింప తటాలున ఎదురు పడగ గోపికలు ముల్లోకములను రక్షింపగల పుణ్యశీలురు గావున ఆ మూర్తిని దర్శించిరి.

ఏతెంచుచున్న గోవిందుని ఒకసుందరి చూచి కనుదుమ్ములు విప్పార ఆనందభరితయై కృష్ణా ! కృష్ణా! అని ఆలాపనము చేసెను. ఒకతె కనుబొమలు ముడిపడ హరింజూచి ఆ ముఖపంకజమును తన నయనములను తుమ్మెదలచే ఆస్వాదించెను. మఱియొకతె కనులల్లన మూసికొని అతనిరూపమును ధ్యానంచుచు యోగారూఢయైనట్లు భాసించెను. అవ్వల ప్రియభాషణములచే ఒక్కతెను. భ్రూభంగ విలాసములచే ఒక్కతెను కరస్పర్శముచే ఇంకొకతెను అనునయించ, మాధవుడు వారినందరిని నన్నిలీలలంగలకదేర్చి వారితో రాసక్రీడా విలాస వైభవమున రమించెను.

గోపికా జనము వర్తులాకారముగా తీరి రాసక్రీడ యందిమిడి ఉన్నను ఒకే లక్ష్యమందు స్థిరపడిన మనస్సుతో కృష్ణుని యందే ఏకాగ్రత చెందిన మనస్సుతో సుస్థిరమైన సమాధియోగము చేత కృష్ణుని పార్శ్వభాగమును విడవకుండ నిరంతర సాన్నిధ్యానందమును అనుభవించెను. శ్రీహరి ఒక గోపికచేయి పట్టుకొని తన కరస్పర్శచే గల్గినయానంద పారవశ్యముచేత అరమోడ్పువెట్టిన కన్నులు కలదానినిగా నొనరించెను. అవ్వల చలించు ఒడ్డాణముల చిరుగంటల స్వనములచే గ్రమగ్రమముగ శరద్దృతుసమయ కావ్యగీతము ననుసరించి లయానుగుణముగ గోపికా కృష్ణుల నృత్య మారంభమయ్యెను.

ఒక గోపిక బాహులతలు సాచి కృష్ణుని గౌగింలించుకొని గోపికలసంగీతమాధుర్యమును స్తుతించు నెపమున దోచు నైపుణ్యమున స్వామిని ముద్దుపెట్టుకొనెను. ఆగోపి చెక్కిళ్లకలయిక (నంశయమును) నొంది కృష్ణుని భుజములు ఒడలు పులకరించుటయను బంటనుజ్జీవకమగు స్వేదమనెడి జలమును వర్షించుటలో జలధరభావమును బొందినది. (అనగా నొక సస్యమునకు వర్షముగురియు మేఘము జ్జీవకమైనట్లు కపోల స్పర్శము వలన కల్గిన శృంగారానుభవముచే గోపికలు మైమరపుజెంద వారి తనువల్లరి పులకరించినదని భావము) కృష్ణుడు తారస్థాయిలో రాసక్రీడాగేయమాలపించినంతట భేష్‌ భేష్‌ కృష్ణా! యని రెట్టించి వంతపాడిరి. హరి ముందడుగువేయ నావెంబడిని వారడుగు వేసిరి. అతడు వెనుతిరిగిన వారతనికి సమ్ముఖమైరి (ఎదరైరి) ఇట్లు లయానుగుణమైన బాదవిన్యాసమున గోపాంగనలు ప్రతిలోమానులోమముగ హరిని దారిసిల్లిరి. ఇట్లాగోపసుందరులతో గృష్ణుడు రమింప నతనితోనగుక్షణమెడబాటు వారికి గోటిసంవత్సరముల వియోగముతో సమానమై తోచెను.

తండ్రులు భర్తలు అన్నదమ్ములు నెంతవారించినను నత్యుల్లానమున వ్రజసుందరులు రాత్రులందు గృష్ణునితో గ్రీడించిరి. అతడును గైశోరకవయస్సున వారినాదరించుచు ననేకరాత్రులు రమించెను. వారిపతులందు గోపికలందు సర్వభూతములందు సర్వేశ్వరుడు గావున నాత్మస్వరూపమై సర్వమున వ్యాపించి హరియుండెను. సమస్తభూతములందు బృథివ్యాపస్తేజోవాయురాకాశములను పంచభూతములు నెట్లు వ్యాపించియున్నవో యట్లే కృష్ణపరబ్రహ్మ మయ్యెడ సర్వవ్యాపకమై యుండెను.

” అరిష్టవధ ”

ఒకతరి నర్థాన్తమయ సమయమున (ప్రదోషకాలము సగముగడచిన తరువాత) జనార్ధనుడు రాసక్రీడా వినోదము నందానక్తుడైయుండ నరిష్టుడను రక్కసుడు మదమెక్కి హడలగొట్టుచు గోశాల కరుదెంచెను. కారుమబ్బువలె నల్లగ నుండి పదునైన కొమ్ములుగల్గి సూర్యునట్లు జ్వలించు చూపులతో డెక్కలతాకున భూతలము జీల్చుచు నాలికచే బెదవులను నొరయించి నాకుచు దోకలువ్వెత్తున బైకెత్తి మిగుల కఠినమగుస్కంధబంధమున మిగులవెడదయగుమూపుతో నొడ్డుపొడువులను మిగులగడువరానివాడై మూత్రపురీషములంబూత పడిన పిరుదులతో నొడలితో గోవులకువెరపుగొల్పుచు మెడవ్రేల నెదురై చెట్లతాకిడివడినముఖముతో వృషభరూపముగొని గోవులకుగర్భపాతము చేయుచు నెల్లయడవులం గూల్చుచు నొకదైత్యు డచట నెల్లపుడు సంచరించువాడెదుట బడెను. భయంకరమగుకన్నులతోనున్న వానినిగని గోపకులు గోపికలు కృష్ణా! కృష్ణా! యని యాక్రందించిరి. అంతట కేశవుడు సింహగర్జనముచేసి చప్పట్లుజరచెను. వీడా సడివిని దామోదరున కెదురుగజని కొమ్ములు ముందునకు నిగిడించి కృష్ణుని కడుపునెడ చూపు నిలిపి యాదుష్టుడు పరువులు వెట్టెను. అట్లు వచ్చుచున్న వృషభాసురునిగని కృష్ణుడు వానినీసడించు సూచనగ నొదవిన చిరునవ్వుసొగసు జూపి తా నిలిచిన చోటనుండి కదలక నిలుచుండెను. మఱియు దాపునకు పచ్చినవానిని హరి మొసలి పట్టినట్లుపట్టి కొమ్ములుచేకొని కడుపునందు మోకాళ్లంబొడిచెను. వాని గొమ్ముపట్టి వాని దర్పమును బలమునుంగోట్టి తడిబట్టను బిండినట్లు వాని కంఠమును మెలిపెట్టెను. మరియు వాని కొమ్మొకటి పెరకి దానిచేతనే వానింగొట్టెను. అమ్మహాదైత్యుడు నోట నెత్తురు గ్రక్కుచు మరణించెను. వాడట్లు హతుడైనంత గోపకులవుడు జంభాసురుడీల్గినపుడు దేవతలింద్రునట్లు జనార్దనుని స్తుతించిరి.

ఇది బ్రహ్మపురాణమున శ్రీకృష్ణబాలచరితమున రాసక్రీడ అరిష్టవధ నిరూపణమును ఎనభై మూడవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment