Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – ఎనభై ఒకటవ భాగము

రామకృష్ణకృత బహువిధ లీలావర్ణనము

వ్యాసులిట్లనిరి :- గర్దభాసురుడు తమ్ములతో హతుడైన తరువాత గోపీ గోపాల బృందమునకు దాళవనము చక్కని విహారస్థానమయ్యెను. బలరాములు లేగొమ్ములుగల వృషభములట్లా గోప సమాజమున రాణించిరి. ఆలమందలను దూర దూరములకు తోలుకొనిపోయి వానిని రకరకములైన పేర్లతో పిలుచుచుండిరి. లేగల పలుపులను భుజములందు వైచుకొని వనమాలలు దాల్చి సువర్ణాంజనచూర్ణములచేత మెకయువలువలందాల్చి యింద్రధనస్సులట్లు తెలుపు నలుపు మోఘములట్లు గనవచ్చుచు విచిత్రములైన జాతీయములయిన ఆటలాడుచు విహరింపజొచ్చిరి. సర్వలోకనాథులు నందరకు దిక్కై అవనింజొచ్చి మనుష్య ధర్మాభిరతులై మానవత్వమును సన్మానించుచు మానవజాతి కనుగుణమైన ఆటలాడుచు ఆ వనమున క్రీడించిరి. మరియు తూగుటుయ్యాలలూగుచు కుస్తీ మొదలైన చిన్నచిన్న యుద్దములందు తలపడుచు నుండీలబద్దలుగొని మీదికి రాళ్ళు విసరుట మొదలగు విచిత్ర వ్యాయామములను వినోదించుచుండిరి.

అంతట ప్రలంబాసురుడు గోప వేషమున మాటువడి ఆ గోపకుల నడుమ ప్రవేశించెను. అవకాశము వెదకుచు ఆ బలరామకృష్ణులను అప్పట్టున సంహరింపదలచెను. ఒండొరులను భుజముల నెక్కించుకొని మోయుటయనునొక వింత ఆటకుజొచ్చి బలరాములతో తలపడెను. శ్రీదాముడను గోపకునితో కృష్ణుడు ప్రలంబునితో బలరాముడు మరి గోపకులతో గోపకులు ఎగిరి ఎగిరి ఆ ఆటలో వినోదించిరి. కృష్ణుడు శ్రీదాముని బలరాముడు ప్రలంబుని ఓడించిరి. కృష్ణుని వైపు గొల్లలెదిరి గొల్లలను గెలిచిరి. ఓడినవారు ఓడనివారిని భాండీర స్కందము దాక మోసికొనిపోయి తీసికొని రావలెనను పందెమువెట్టి ఆడుకొనజొచ్చిరి. ఆ దానవుడు తానే ఓడినట్లు నటించి మబ్బులోనున్న చంద్రునట్లు తాను బలరామునెత్తుకొని పోవుచు ఆ బరువు మోయలేనట్లు వర్షమేఘమట్టి తన కాయమును పెంచెను. బలరాముడు కార్చిచ్చు పర్వతమట్లు పూలమాలలు వ్రేలదలపై కిరీటముదాల్చి బండిచక్రముల బట్టి మిడి గ్రుడ్లతో రౌద్రకారుడై పాదముల తాకిడిచే భూమియదర దనను మోసికొనిపోవుచున్న వానిని గని కృష్ణా! పెద్దకొండ వలె మాయాగోపాల రూపముతో రాక్షసుడు ఒకడు నన్ను మోసికొని పోవుచున్నాడు. వీడు పరమ దుర్మార్గుడు. ఇప్పుడు నేనేమి చేయవలెనో తెలుపు మన గోవిందుడు చిరునవ్వున పెదవులు తెరువబడ బలరాముని బలపరాక్రమము లెరిగినవాడు కావున నిట్లనియె.

సర్వాత్మకుడు సర్వ రహస్యములకు రహస్యమునైన నీవు మానవ రూపము ధరించుట వినోదార్థము. ఒకానొక కారణమున నాకు అన్నవై అశేష జగత్ర్పభువైన నీవు సర్వకారణమైన నీ స్వరూపమును తలచుకొనుము. జగమెల్ల ఏకార్ణవమైనపుడు నీవును నేనును కలిసి ఏకైక పరబ్రహ్మమగుటయు, నీజగము నిలుపుటకు వేరగుటయు సత్యము. కావున తన్నుతానెరిగి ఈ దానవుని సంహరింపుము. మానుష భావమిట్లుపూని మనవారికీ బంధువులకు హితవుజేయుము.

ఇట్లు కృష్ణభగవానునిచే జ్ఞప్తిచేయబడి హలి అల్లన నవ్వి ప్రలంబుని పట్టియెత్తి కోపముచే కన్నులెర్రబడ పిడికిలి తో వాని నడినెత్తిపై గ్రుద్దెను. ఆ దెబ్బతో వాడు కనుగ్రుడ్లు వెలికిజన తలపగిలి నోట రక్తము గ్రక్కికొని భూమిపై బడి మృతినొందెను. అద్భుతమైన బలముచే బలుడట్లు ప్రలంబుని గూల్చ గోపకులు బాగుబాగని ఆనంద భరితులై రామునిస్తుతించిరి. అవ్వల గోపకులతో కృష్ణునితో బలరాముడు గోకులమున కేతెంచెను.

రామకేశవులట్లు విహరించుచుండగ వర్షఋతువు గడచి తామరపూలె వికసింప శరద్దృతువు వచ్చెను. ఆకాశము స్వచ్ఛమై నక్షత్రములు కాంతులంజిమ్మ చక్కని ఆ సమయమందు వ్రేపల్లెజనము ఇంద్రోత్సవారంభము చేయ కుతూహలపడుట చూచి కృష్ణుడు పెద్దవాండ్రతో ముచ్చటగా ఈ ఇంద్రోత్సవ మనగానేమి? దీనికి మీరింత ఆనందపడుటకు కారణమేమి అని అడుగ నందుడు తనతో నిట్లనియె.

మేఘములకును జలములకును దేవేంద్రుడధిపతి. అతని ప్రేరణముచే జలరూపమున సర్వప్రాణధారకమయిన రసము నవి వర్షించును. ఆవర్షముచే పండినపంటను మనము మఱి ఇతర ప్రాణులు తిని బ్రతుకుదుము. దేవతలను దానిచే తృప్తిపరుతుము. ఆవులు పాలిచ్చును. లేగలతో అవి వాన వలన కల్గిన సస్యము సంతృప్తివడును. సస్య సమృద్ధి పచ్చిక (మేత) సమృద్ధి మేఘనిమిత్తమే. సకాలమున వర్షించుమేఘములు గలచోట ఆకలి కలమటించు జనముండరు. సూర్యకిరణముల చేత మేఘమీభూమియందలి ఉదకమును చేకొని ధరించును. సర్వలోక జీవనమునకు భూమిపైనది వర్షించును. అందువలన వర్షఋతువునందు ఎల్ల రాజులు సంతోషముతో ఈ ఉత్పవమునందు దేవేంద్రుని కొలుతురు. మనము మరి ఎల్ల జీవులు అమరపతిని కొలుచుటయు అందులకే. అని తెలుప నందుని మాటవిని ఇంద్రుని పూజించు విషయమేన కృష్ణుడు దేవేంద్రునకు కోపము గలుగ ఇట్లనియె.

మనము కర్షకులము గాము. వర్తకమును చేసి జీవించువారము కాము. గోవులే మనకు దైవము. వనమునందు సంచరించుము. ఆన్వీక్షకి త్రయీ వార్తా (వర్తకము) దండనీతి అని విద్య నాల్గువిధములు. వీనిలో వార్తయనగ వ్యవసాయము వాణిజ్యము పశుపాలనము ననుపేర మూడు వృత్తులు చెప్పబడినవి.

కర్షకులకు కృషి పణ్యజీవులకు(వర్తకులకు) వర్తకము వృత్తులు మనకన్న గోపాలనము ముఖ్యవృత్తి. ఈవిధముగ వార్తయనునది మూడే తెఱంగుల చెప్పయడినద ఎవ్వడే విద్యను నేర్చునో ఆదే వానికి పరమదైవము. అదే పూజింనదగినది, ఆరాధింపదగినదియు, అదేవాని కుపకారముకూడ. ఒకదాని ఫలమునుభవించుచు వేరొకవిద్యను పూజించువాడు ఇహపరములందు శుభమందడు. ప్రసిద్ధమైన మన హద్దులను (ఆవులదొడ్లను) బూజింతుము. వానికన్నిటికి హద్దుగానున్న వనమును పూజింతము. వనములకు పరమావధులైన కొండలు మనకు పరమదైవములు. కావున గిరియజ్ఞము, (కొండదేవతలపూజ) గోయజ్ఞము,(గోపూజ) మనము కావింతము. ఇంద్రునితో మనకేమిపని? గోవులు కొండలు మనకు దేవతలు. విప్రులు మంత్రయజ్ఞపరులు. మంత్రానుష్ఠానమే వారికి యజ్ఞము. కర్షకులకు యజ్ఞము నాగలి. కొండలందును అడవులందు నుంవడు మనకు కొండలను గోవులను గొలుచుటేయజ్ఞము (పూజ). కావున తామందరు రకరకములైన పూజాద్రవ్యములచే పశువును బలియిచ్చి యథావిధిగ గోవర్ధనగిరినర్చింపుడు. వ్రేపల్లెలోనున్న సర్వసంభారములను జేకొనుడు ఆలోచింపవలదు. ఆసామాగ్రిచే విప్రులకు మఱియు అన్నార్దులకు సంతర్పణము జేయుదుముగాక! ఆ అర్చింప బడిన కొండనుద్ధేశించి హోమములు చేసి ద్విజులకు సంతర్పణము చేసిన తరువాత శరద్దృతువునందలి పూలను శిరములదాల్చి మన ఆవులమందలె వ్రేపల్లెకు మరలునుగాక! ఇది నా మతము. దీనిని ప్రీతితో చేసిన ఎడల గోవులకు బ్రీతి గల్గును. గోవర్ధన గిరికిని నాకును కూడ సంతోషమగును. అని తెలుప కృష్ణుని పలుకులువిని నందాదులందరు సంతోషముచే మోములు విప్పార బాగుబాగని వత్సా!నీయభిప్రాయము పరమశోభనము. నీవు చెప్పిన మాట మేమనుసరింతుము.ఈ గిరియజ్ఞము సాగింపబడుగాక! అని ప్రజవాసులెల్లరు పెరుగు పాయసము మాంసములతో కొండకు బలియిచ్చిరి. నూర్లు వేలుగ విప్రులకు విందులు సేసిరి. అట్లు కొలువబడిన ఆ గిరికి గోవులు ప్రదక్షిణము చేసినవి. నజలజలదములట్లు వృషభములు రంకెలు వేయుచు గిరిప్రదక్షిణము చేసెను. గోవిందుడు కొండనెత్తమున గూర్చుండి నేనే మూర్తి ధరించిన కొండదేవతనని ఆ గోపశ్రేష్టులు గొనివచ్చి నివేదించిన పలుతెరంగులైన అన్నముల నారంగించెను. మఱియు అదేరూపమున కృష్ణుడు గిరి శిఖరమున కెక్కి అది తన రెండవ మూర్తిగ బూజించెను. తరువాత నతడు అంతర్థానము కాగ అతనివనల గోపకులు వరములం బొంది ఇట్లు గోవర్ధనోత్సవము చేసి తమతమ గోష్ఠములకు(గోశాలలకు) తరలి వచ్చిరి.

ఇతి శ్రీబ్రహ్మపురాణమున శ్రీకృష్ణబాలచరితమున గోవర్ధనగిరి యజ్ఞప్రవర్తరమను నూటయెనుబదియేడవ యధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment