కండూపాఖ్యానము
వ్యాసులు ఇట్లనిరి
ఓ మునీశ్వరులారా! సర్వజీవి సుఖకరమైనది సర్వపురుషార్థము లిచ్చునదియునైన ఆ పురుషోత్తమ క్షేత్రమున ”కండువు” అను నొకఋషి పరమ ధర్మాత్ముడు,తేజస్వి, సత్యవాది,శుచి ఇంద్రియముల నిగ్రహించినవాడు, సర్వభూత హితువు కోరువాడు, క్రోధములేనివాడు,వేదవేదాంగ పారంగదుడునై వసించుచుండెను. అతడు పురుషోత్తమునారాధించి పరమ సిద్ధి నందెను. అట్టి వారే మఱిపెక్కుమంది మునులు అతనివలె ముక్తినందిరి. అనమునులు ఈ కండువెవరు? అచట పరమగతి నెట్లందెను? ఆచరిత్ర వినదలతుమన వ్యాసులిట్లనిరి.
మునులారా! ఇదె వినుండు. పవిత్రమైన గొమతీ నదీతీరమందు కందమూల ఫల సమృద్ధము సమిత్పుష్ట కుశ సంపూర్ణమునైన పుణ్యాశ్రమము కండుమును నివాసమయ్యెను. అది సర్వర్తు ఫలపుష్ప శోభితము. అందాయన యమనియమాదులతో మౌనముతో తపమాచరించు చుందెను. గ్రీష్మఋతువున పంచాగ్ని మధ్యమున వర్షాకాలమున ఆవరణము లేని ఎడ దడ బట్టలతో చలికాలములో మహా తపమాచరించెను. అదిచూచి ఈయన తపస్సు వేడిమికి భూమి అంతరిక్షము స్వర్గముగూడ నుడికేత్తినవి. ఆహా! ఈయన ధైర్యమేమి ఈ తపస్సేమి అని దేవతలు వెరగంది అందరు నాయన తపము భంగము గావింతమని నిశ్చయించిరి. వారి తల పెఱింగి యింద్రుడు ప్రవ్లూెచ యను అప్సరసను పరమసుందరిని జూచి భామినీ! కండుముని తపమాచరించు తావున కిప్పుడు చనుము. ఆతని తపమ్ము చెరచి క్షోభింప జేయుమనియె. ఆమె ప్రభూ! నీయాజ్ఞ తప్పక సేసెదను కాని యిక్కడ నాకు జీవిత సంశయమేర్పడినది. బ్రహ్మచర్యనిష్ఠుడగు ఆ మునిని మహ్రోగ్ర తపస్విని అగ్ని నూర్యులట్లు వెలుగు వానినిగా ఎఱిగిన దానను గావున జడియుచున్నాను. అతడు దుస్సహమయిన శాపమీయగలడు. ఏలినవారి యానలో ఊర్వశ్యాదులెందరో యప్సరసలు న్నారు. వారు సుందరులు నెఱజాణలు. ఎవ్వనినేని మోహింపజేయగల నేర్పరులు. వారి నాపనిలో నియోగింపుమనెను.
ఆమె మాటవిని యింద్రుడు—-
ఎందరో ఉందురుగాక! ఇక్కడ నీవే నేర్పరివి. నీకు మన్మథుని వాయువును గూడ తోడొసంగెద నీవేగుమను నా ప్రవ్లూెచ ఆకసమున నమ్ము న్యాశ్రయమునకు జనియె. అచ్చట నొక సుందర వనమీక్షించెను.
అందాశ్రమమందున్న యమ్మునింజూచెను. అ ఆశ్రమ ప్రాంతమందలి ఆ వనము శోభ నిరుపమానము, సర్వ పుష్ప ఫలభరితము సర్వర్తుశోభనము. అందలి పావురములు కోవెలలయొక్క కలకూజితములు శ్రవణ మనోహరములు ఆ విశాలనయన ఆ అందమును చేరి పాఱజూచి ఆ మధుర నాదములు విని ప్రసన్న నలిలములైన కొలనులం జూచి వసంతాదులతో మీరందరూ నాకు తోడ్పడుడని హెచ్చరించెను.
ఇట్లని వారిచే ఔననిపించుకొని ఇప్పుడు ఆ మునిచెంత కేగెదను. శరీర రథనమును ఇంద్రియములను గుఱ్ఱముచే నిగ్రహించిన ఆతని వూవిలుతునమ్ములచే పగ్గముల బిగువు సడలింజేసి జేతగాని సారథిం గలవానిబోలె జేసెదను. బ్రహ్మ జనార్దనుడు శివుడయినను నగుగాక నీక్షణములో కామ బాణక్షతుని గావించెదనని ఆ ముని ప్రశాంతాశ్రమమందు నిలిచి యల్లల్లన సంగీతము పాడనారంభించెను. అంతట అనంగుడు తన బలగముల గూర్చి కొని అకాలిక మధుర కోకిలారావము మేళవింపజేసెను. గంధవహుడు (వాయువు) మలయాద్రి నుండి యల్లల్లన వీవందొడంగె. అంతియ కాదవ్వనసీమ నల్గడల నాచెట్లునుం పూవులం జలజల రాల్చెను. మదనుడు వూవుటమ్ముల నమ్ముని మనస్సును గలగుండు పరచెను. అంత కండువా సంగీత ధ్వని నాలకించి వింతగొని ఆవిడయున్న తావునకేగి ఆ సొగనులాడి సోయగమున కచ్చెరువడి తేఱిపాఱ జూచి పై వలువ జార మేను గగుర్బోడవ మది చెదరి అల్లన నిట్లు పలుకరించె. ఓ సుందరి ! నీవెటనుండుదానవు ఎవరిదానవు నామనను జూరగొనుచున్నావు. నిజము తెల్పుమన ఆమె నీదాస్యము సేసెదను. పూవులకోఱకు వచ్చితిని. నావలన పనిగొనుము నీ యాజ్ఞనిప్పుడు నిర్వహింతును. అన విని ముని మోహము గొని ధైర్యమొడలి ఆమెంజేత పట్టుకొని తన ఆశ్రమముంజొచ్చెను. అవ్వల పువ్విలుకాడు వాయువు వనంతుడు ఇట్లు తమ పని చక్కబెట్టుకొని వచ్చిన దారి సమరపురి కరిగిరి. అతని యొక్కయు ఆమెయొక్కయు సమావేశ వృత్తాంతము ఇంద్రున కేరింగించిరి. సురపతియు సురలు అది విని ప్రీతిచెందిరి.
కండుముని యవ్వన వతితో ఆశ్రమముంజొచ్చి మనోహర రూపము నిండు యవ్వనముందనకు సంతరించుకొనియె. దివ్యవస్త్రములు దివ్యాభరణములు దాల్చి పదునారేండ్ల ఈడుననున్న ఆ అందగానింగాంచి కేవల తపశ్శక్తిచే దివ్యకుసుమాలు దాల్చి సుగంధము పూసుకొని సర్వభోగ సంపన్నుడై అప్పటికప్పుడు తోచిన ఆ తపస్వి ప్రభావమును గని అచ్చెరువుపడి ఆవ్వేల్పుపడతి, ఓహో! ఈయన తపస్సు ఈయన వీర్యమద్భుతమని కడుంగడు సంబరపడెను. స్నానసంధ్యలు జపము హోమము బ్రహ్మయజ్ఞము దేవతార్చనము ధ్యానము వ్రతోపవాస నియమములను వదలి ఆముదితతో రేయింబవళ్ళు మదనవశుడై క్రీడించెను. తపస్సు క్షయమైనదని కూడా గుర్తింపడయ్యె.. విషయలంపటుడై పగలురాత్రి సంధ్య పక్ష మాస సంవత్సరము లేవోకూడ తెలియక ఆమె వలంపునంబడియె. ఆ కాంతయు పంచబాణ నిహతయై ఏకాంతముని నింపు నింపు పలుకులను లాలించుచు అతనింగోరి రమించెను. ఇట్లామేని గ్రామ్యసుఖము మఱగి వందయేండ్లా సుందరితో మందరగిరి కందరమునందుండెను. అంతనది అమ్మాహానుభావుంగని నేను స్వర్గమునకేగెద. ప్రసన్నముఖువై ఓ బ్రహ్మణ్యమూర్తీ అనుజ్ఞ దయసేయుమనియె. అతడామె యెడ నెడలని వలపుగొని కల్యాణి ! కొన్నిదినములుండుమనియె. అట్లేయని ఆ వేల్పుపడతి నూరేండ్లకు మించి ఆతని తోడి పొందుగొని ఇంపోందె. ఆ మీద మఱల అనుమతింపుమనియె. కాదుకాదు నిలునిలుమన మఱి వందసంవత్సరము లేగె. ఎడనెడ నిట్లావిడ అడుగుటయు ఆ ముని వలపుగొని వలదనుటయు జరుగుచుండ ఆతని శాపమున కడలి ఆ దేవకామిని ఇంచుక తక్కువగా రెండువందలేండ్లు ప్రణయ భంగమువలన గలుగు బాధ నెఱింగినదికావున ఆతని వదలిపోదయ్యెనుఅప్సర. మహర్షి దానితో రేయింబవళ్లు రమించుచున్న కొలది ప్రేమయెప్పటికప్పుడు క్రొత్తది కాజొచ్చెను. ఒక్కతఱి నాతడు తత్తరముగొని ఇల్లువిడిచి చనుచుండ నా సుర కాంత ఎచటికేగుచున్నారన కల్యాణి తెల్లవారినది. సంధ్యవార్చెదను. కాదేని అనుష్ఠానలోపము అన మగువ నల్లన నవ్వి ఆ మహామునింగని ఓ ధర్మజ్ఞ ! ఇప్పుడా నీకు తెల్లవారుట అనుష్ఠానమెప్పుడో గతించినది. ఇమాట యెవనికి వింత గొలువదు? అన ఆ ముని ఈ ఉదయమే నీవీ నదీతీరమునకు వచ్చితిని నాకు గనబడితివి. నా ఆశ్రమమును వచ్చితిని. సంధ్యాసమయమయినది ప్రోద్దెక్కినది ఎందుకు పరియాచకములాడెదవు? ఉన్నదున్నట్లు పలుకుము. అనవిని ప్రవ్లూెచ నేను వేకువవేళ వచ్చిన మాట ఓ బ్రహ్మణ్యా నిజమే నేనబద్దమాడుట లేదు. కాని ఇప్పుడా కాలము కొన్ని వందలేండ్లు గడిచిపోయినదనియె. అంతట నా విప్రుడు వెఱపుగొని ఆమెంగని నీతో నేను క్రీడించిన కాలమెలతో నిజము చెప్పుము జడియకుము. పరిహాసమా? అన తొమ్మిదివందలేండ్ల ఆరుమాసాల మూడు రోజులయినది అబద్దమాడను బ్రహ్మణ్యుడవగు నీ సన్నిధినా అబద్దములాడుట దారియించుకయుందప్పని మహానుబావులగు తమరడుగుచుండ అనృతమెట్లు పలుకగలను అనందాని పలుకులాలించి యా ముని ఛీఛీ ఎంత అనాచార మెంత అపచారము గావించితిని అని తనను తాను నిందించుకొని నా తపస్సునెల్ల నీటగలిసినవి. బ్రహ్మవేత్తలధనమెల్ల చెఱచినట్లయినది నావివేక మెవ్వడో కాజేసినట్లయినది ఈ ఆడుది నన్ను మోహపెట్టుటకు పుట్టింపబడినది.
షడూర్ముల (కవ్వలిదాబ్రహ్మవస్తువు)
1. బుభుక్ష 2. తృష్ణ 3. శోకము 4. మోహము 5.జర 6. మరణము) ఆత్మ నిగ్రహముచే ఎరుగ వలసినది. ఛీఛీ ఆ కామ మహాగ్రహము నన్ను పట్టుకొని నాకీగతి తెచ్చిపెట్టినది నా వ్రతములు సర్వవేదములు మరి ఎల్ల ఉత్తమ కారణములు నరక గ్రామమునకు మార్గమైన కామముచే నిహతములయినవి. అని ఇట్లు తన్ను తాను దనిందించుకొని ఆ ధర్మజ్ఞుడు తనయందు కూర్చున్న ఆ అప్సరసను చూచి ఇట్లనియె.
పోమ్మో పాపాత్మురాలా ! నీ హావ భావములచే నామదిం గెలచి ఇంద్రునికై చేయవలసిన అంతయు చేసితివి. సత్పురుషుల తోడి మైత్రి సాప్తపదము (అనగా ఏడలుగులు కలిసి వేయుట లేక ఏడు మాటలు మాటలాడుకొనుట వలన నేర్పడునది) కావున నీతో కలిసి కొన్నాళ్లుంటిని గావున నిన్ను భస్మముచేయను. అదిగాక ఇందు నీ తప్పిదమేమున్నది! నీకేదైన శాస్తిచేయుటకు, ఇంద్రియ నిగ్రహము లేనివాడనగుట ఈ తప్పు నాదే . సురవతి ప్రీతికొరకై నీ వాల్చూపను సమ్మోహన మంత్రముచే నేనీయవరమునకు గుఱియైతిని. అని ఇట్లా బ్రహ్మర్షి ఆ రమణితో అని నంతట నది ముచ్చెటములు పోసి ఎదలెల్ల దడియ నెడనెడ వణుకుచున్న ఆ వేల్పు పడతింగని పోపోమ్మని యమ్మని యలుకగొని జడిపింప అది ఆ ఆశ్రమము వెడలి ఆకసమువెంట నేగుచు ఆ చెట్ల చిగుళ్లతో చెమట తుడుచుకునెను . అట్లు చెట్టునుండి చెట్టునకు అడుగువెట్టుచు ఆ చిన్నది ఎరఎఱ్ఱని క్రొందలిరుటాకులం చెమట తడులోత్తుకొనుచున్నంత ఆ ఇంతికి పులకలయ్యెను.అప్పుడా పులకలతో మేనువెడలి స్వేదరూపమున గర్భము కలిలమయి జాలు వారెను. దానిని వృక్షములు చేకొనియె. వాయువు దానిని ఏకము చేసెను. అమృతాంశుడు తన కిరణముల దానిని ఆప్యాయ మొనరింప అది దినదినాభివృద్ది నొందెను. అ గర్భమే మారిషయను పేర వృక్షములకు కన్య అయ్యెను.ఆమె ప్రాచేతసులభార్య దక్షునికి తల్లి.
ఆ కండుముని సత్తముండును తనను క్షమింప పురుషోత్తమమను ఆ విష్ణు క్షేత్రమునకు అరిగెను. ముక్తిదము దుర్లభమునై దక్షిణ సముద్ర తీరమందున్న సర్వకామదమయిన ఆ దివ్యక్షేత్రమును దర్శించెను. భృగువు ఆది మహా మునులు నిరంతరము సేవించు ఆ వైకుంఠాయతనమును కని సర్వదేవతలు కొలువ ఇంపుగులుకు హరిని పురుషోత్తము వైకుంఠుని దర్శించి కృతార్థుడనైతిని అనుకొనెను. మరియు ఏకాగ్రచిత్తుడై ఆ స్వామిని ఆరాధించెను. ఆ యోగి ఊర్ద్వబాహువై అచట నిలువబడి ”బ్రహ్మపారము” అను మహామంత్రమును జపించెను. అది విని మునులు వ్యాసుని గని ఓ మునీ ఆ బ్రహ్మపారము పరమ శుభమంత్రము కండుముని జపించి విష్ణునారాధించిన అది మేము వినదలతుము అన వ్యాసభగవానుడు ఇట్లానతిచ్చెను.
కండుకృత బ్రహ్మ పారస్తవము
పారం పరం విష్ణుః
శ్రీహరి సంసార మార్గమునకు సర్వోత్కృష్టము పునవావృత్తి రహితమునగు అవిధి లేక గురుపరంపరచే తెలియదగిన రహస్య వస్తువు. అపారపారః – తెలియలేని అంతముగలవాడు లేక ఆపరిమిత శక్తిగలవాడు. పరేభ్యః పరః – ఉత్కృష్టముగా నెంచబడు ఆకాశాదుల కంటె గొప్పవాడు. (మహతో మహీయాన్ ) పరమాత్మ రూపః -పర – బ్రహ్మరూపుడు. బ్రహ్మపారః – బృహద్రూపమగు ప్రధానమునకు అవసానమైనవాడు. లేక సబ్రహ్మపారః – వేదములు తపస్సులతో కూడికొనిన వారు సబ్రహ్మలు అట్టివారికి గంతవ్యుడు, పరపారభూతః – ఆత్మేతరమగు ఆనాత్మ ప్రపంచమునకు అవధియైనవాడు పరాణామపి పరః – ఆత్మగా ప్రతీయమానములగుచున్న ఇంద్రియాదులకు అతీతుడు. పారపారః – వూరకములు పోషకములునైన ఆకాశాదులకు లేక ఇంద్రాదులకు కూడ వూరకుడు పోషకుడునైనవాడు అయిన ఆ విష్ణువు అన్నిటికి కారణము. సమస్తకార్యములకు కారణమైన విపంచ మహాభూతములు తన్మాత్రలు వానికి కూడా కారణమైనవాడు. ఆహంకారమునకు మహత్తత్వము హేతువు. దానికి కూడా హేతువైనవాడు,అనగా ఉపాదాన కారణభూతుడు. ఆతడే క్రియాకారక రూపముతో సమస్తమునకు రక్షకుడునై ఉన్నాడు. అతడు వేదనిర్వాహకుడు. అతడే వేదము. వేదాంగాదులు కూడ ఆతడే. వేదార్థ స్మర్తలగు మన్వాదులకు కూడా ప్రభువైనవాడు, అవ్యయుడు, నిత్యుడు,పుట్టుకలేనివాడు. షడ్భావ వికారములతో సంబంధము లేనివాడు, పుట్టుక లేనివాడు,నాశన రహితుడు, నిత్యుడునైనట్లు ఈ పురుషోత్తముడును అట్లే అని స్తుతించుచున్న నాయొక్క రాగద్వేషాదులు శమించుగాక!
అని ఇట్లు ఆ ముని జపించు బ్రహ్మ పారమును విని ఆతని అచంచల భక్తి పారమ్యమెఱింగి పురుషోత్తస్వామి పరమప్రీతితో భర్తవత్సలుండు గావున,అతని దగ్గరకేగి మేఘగంభీరమగు వచనము దిక్కుల ప్రతిధ్వనింపజేయుచు వినతాకులనందనుడైన గరుడునిపై గూర్చుండి యిట్లనియె.
ఓ మునీ నీ మదినున్న పని తెలుపుము. వరమీయ వచ్చితిని. అడుగుమన కండుముని కనులు తెరిచి ఎదుటనున్న కమలాక్షుని, అతనీకుసుమసంకాశుని, శంఖచక్ర గదాహస్తుని, కిరీటాంగదధారిని,పీతాంబరుని, శ్రీవత్సవక్షుని,వనమాలా భూషితుని,చతుర్భాహువును, దివ్యగంధానులిప్తుని, దివ్యమాలాభూషితుని, సమున్నతమూర్తిని చూచి వెఱగంది తనువు పులకరింప సాష్టాంగ దండప్రణామమొనరించెను. ఇపుడు నా జన్మ సఫలమైనది. నా తపస్సు ఫలించినదని ఆ మునివరుడిట్లు వినుతింపనారంభించెను.
నారాయణాది నామములతో ఆరంభించి శ్రీహరికళ్యాణ నామసంకీర్తనము జేసి పాలసముద్రమందున్న మహా సర్పమందునిద్రించు కనకరత్న కుండలాలంకృతుడగు పరమాత్మకు నమస్కారము అని చేసిన ఈ స్తుతి పారాయణ ప్రధానము సులభార్ధము గావున అనువాదము చేయబడలేదు.
ఇట్లు స్తుతింపబడి సంప్రీతుడై మాధవుడు మునివరా ! నావలన నీ కోరునదేమో త్వరగా చెప్పుమన కండుమని……. జగన్నాథా! తలచుకొన్నంత మేను గగుర్పొడుచు నీ దాటరాని అనిత్య సంసారమందు బహుదుఃఖకరమై అరిటాకువలె పేలవమై నశించు స్వభావముగల నీటిబుడగ వంటి నిరాశ్రయము నిరాలంబమునగు భయంకర సంసారమున మాయామోహితుడనై తిరుగుచున్నాను. విషయ వాసనలచేత చెడిన మనసుతో దీని అంతుదరి కానలేకున్నాను. దీనికి జడిసి ఇపుడు నిన్ను దిక్కంటిని కృష్ణా నన్నుద్దరింపుము. నీ ప్రసాదమున పునరావృత్తిలేని దుర్లభమైన సనాతన ముక్తిపదము నంద గోరుచున్నాను. అన భగవంతుడిట్లనియె.
ఓమునిశిరోమణి ! నీవు నా భక్తుడవు. నిత్యము నన్నారాధింపుము. నా అనుగ్రహమున నిశ్చలమైన మోక్షమును పొందగలవు. నా భక్తులు ఏ కులమువారైన స్త్రీలైన పరమసిద్ధినందుదురు. నీవందుటలో ఆశ్చర్యమేమి. కుక్క మాంసము తినువాడైన మిక్కిలి శ్రద్ధగొని నాయెడ భక్తికలవాడు అభీష్టసిద్ది పొందును. మరి ఇతరుల మాట చెప్పనేల? అనిపలికి భక్తవత్సలుడగు హరి అంతర్థానమయ్యెను.
విష్ణువట్లు జనినంతట కండువు ముదమంది నిష్కాముడై స్వస్థచిత్తుడై ఇంద్రియముల నియమించుకొని అహంకారమువాసి మది నిలకడగొన నిర్లేపుడు,నిర్గుణుడు, శాంతుడు, సత్తామాత్రుడునైన పురుషోత్తమ దేవుని ధ్యానించి అమర దుర్లభమైన పరమపదమందెను. మహాత్ముడగు కండువుయొక్క కథనెవ్వరు చదువునో వినునో అతడఘములను బాసి స్వర్గలోకమందును. ఓ ముని తల్లజులార! కర్మభూమియగు భారతవర్షమును గుఱించిమోక్ష క్షేత్రములగురించి పరమాత్మ పురుషోత్తముని గుఱించి చెప్పితిని. అవరదుని ప్రభుని భక్తితో ఎవ్వరు ధ్యానింతురొ, దర్శింతురొ,స్తుతింతురొ వారు పవిత్రులై రాజ్యభోగముల ననుభవించి స్వర్గసుఖము జూరలాడి అవ్యయమగు ముక్తినందుదురు.
ఇది బ్రహ్మపురాణమున కండూపాఖ్యానమును డెబ్బది రెండవ అధ్యాయము
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹