మార్కండేయాఖ్యానము
బ్రహ్మ ఇట్లనియె.
మార్కండేయుడు ఆ పాపని కడుపునందుండి వెడలి వెలుపల ఒక్కటే సముద్రమయిన భూమిని నిర్జనమయిన దానిని దర్శించెను. మున్ను చూచిన ఆ బాలుని కూడా మర్రికొమ్మపై వటపత్ర పర్యంకమున నున్న శిశువును గాంచెను. శ్రీవత్స చిహ్నము ఉరమున దీపింప పీతాంబరము ధరించి ఆ పద్మపత్రలోచనుడు జగత్తును చేకొనియున్నట్లు దర్శించెను. ఆ బాలుడు కూడా తన ముఖము నుండి వెడలి యా మహార్ణవమున తేలి చేష్టలు దక్కియున్న ఆ మునిని జూచి ”వత్సా! నాకడుపునందు ప్రవేశించి విశ్రమించితివా? అందిటునటు పరిభ్రమించి ఏమి వింత జూచితివి? ఓ మునిశ్రేష్ఠ! నాకు భక్తుడవు. నా అండ చేరితివి. అలసితివి. కావున నీకు ఉపకారము చేయ సంభాషించుచున్నాను. నావంక చూడుమని అల్లన నవ్వుచు భగవంతుడనియె.
ఆమాట విని ఉప్పొంగి ఒడలు గగుర్పొడ నీ కన్నుల కనరాని దివ్య రత్నాలంకృతుడయిన అమ్మేటి వేల్పుని మార్కండేయుడు దర్శించెను. అంతనా ముని తదనుగ్రహమున మిగుల నిర్మలమై ప్రసన్నమై మరల క్రొత్త సొగసునొంది ఆవిర్భవించెను. ఎఱ్ఱని వ్రేళ్ళు గల ఆ మేటివేల్పు అడుగుల తలవాల్చి వ్రాలి సువంద్యములయిన ఆ పాదద్వందమునకు ప్రణమిల్లి హర్ష గద్గదములయిన మాటలతో కృతాంజలియై ఆనంద భరితుడై అచ్చెరువొందుచు మరిమరి జూచి ఆ పరమాత్మను స్తుతించుట కారంభించెను.
మార్కండేయ కృతస్తవము.
దేవదేవ ! మాయాబాల మూర్తిధర ! పద్మాక్ష ! దుఃఖితుడనై శరణొందిన నన్ను రక్షింపుము. ప్రళయకాలాగ్నికి ఉడికిపోయితిని, నిప్పుల వర్షమునకు జడిసిపోతిని. ప్రళయ ప్రచండ వాయువునకు నారిపోతిని. అలసి విహ్వలుడనై ప్రథయాపర్తమునకు అదిరిపోయి శాంతగనజాలకున్నాను. ఆకలి దప్పులకు వశుడనైతిని. పురుషోత్తమా ! నేనొక రక్షనిందు గననైతిని . రక్షింపుము. ఈ ఏకార్ణవ ప్రళయమందు చరాచరము సురిగిపోయిన యీ ఘోరదశ యందు – అంతుదరి గనలేకున్నాను. దేవేశ! నీ యుదనగోళమున చరాచర ప్రపంచమును గంటిని. ఆశ్చర్య విషాదములందుచున్నాను. దిక్కులేని ఈ సంసారమున – పరమేశ ! ప్రసన్నుడవు కమ్ము. ఓ వేల్పుమేటి! ప్రసాద ముంజూపుము. దేవనాధ! అనుగ్రహింపుము అనుగ్రహింపుము. జగత్కారణులకు కారణుడవు. నీవ పంచభూతములు. అహంకారము నీవు. మహత్తత్వము బుద్ధినీవు. ప్రకృతివి. సత్వాది గుణత్రయము నీవు. నీవే దిక్పాలురవు. అష్టవసువులు నీవు. ఏకాదశరుద్రులు, ద్వాదశాదిత్యులు, గంధర్వులు, దేవదానవులు, మరుత్తులు, పితృదేవతలు, వాలఖిల్యాదులు, ప్రజావతులు, సప్తఋషులు, అశ్వినులు, మఱి మనసుకు మాటకునందని అశేష జీవ సంతతి బ్రహ్మాదిస్తంబ పర్యంత బూత భవ్య భవిష్యజ్ఞాలము నీ రూపము. అంతకును మీదనున్న కూటస్థుడవు నీవు. బ్రహ్మాదులు నిన్నెరుగరు. అల్పమేధసులు నీజాడ నెట్లరుగుదురు. నీవు నిత్య శుద్ద బుద్ధ ముక్తస్వభావుడవు. ప్రకృతి కవ్వల వాడవు. అవ్యక్తుదవు. అనంతుడవు. అంతట నున్నవాడవు. ఆకాశమువలె శాంతుడవు.
ఇట్లు నిర్గుణుడు, నిరంజనుడు అయిన నిన్ను ఎవ్వరు. స్తుతింపగలరు. మనసు చెదిరిన అల్పమతినయిన నేను నిన్ను స్తుతించితిని . ఇదెల్ల క్షమింప నర్హుడవు. ఓ అవ్యయ ! దేవదేవేశ ! వందనము.
ఇది బ్రహ్మపురాణమునందు మార్కండేయాఖ్యానమను ఏబదిఐదవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹