మార్కండేయ వట దర్శనము
బ్రహ్మయనియె :- ఓ మునివరలారా ! కల్పాంతమందు ప్రళయమైన తఱి సూర్యచంద్రులు వాయువు చరాచర ప్రపంచము నశించి ప్రచండ ప్రళయ ఆదిత్యుడు ఉదయింప మేఘములు ఉరుమును.విద్యుదుత్పామున పిడుగులు పడి చెట్లు గుట్టలు భగ్నమై ఎల్లలోకము ఉల్కలుపడి నశింప ఎల్లనదులు సరస్సు లింకిపోవ సంవర్తకాగ్ని వాయువుతో గూడ ఆదిత్య శోభితమైన లోకమున ప్రవేశించును. అవ్వల భూమిం బ్రద్దలుగొట్టి పాతాళమున ప్రవేశించి దేవదానవ యక్షాదులకు భయము కూర్చెను. అది నాగలోకమును దహించి ఈ మేదిని ఏ కొంచెమేని లేకుండా గాల్చి ఈ క్రిందనంతయు క్షణములో నశింపజేయును. అవ్వల నూరువేల యోజనములమేర వాయువు విజృంభించిన ప్రళయాగ్ని దేవ అసుర గంధర్వ నాగ రాక్షసము సర్వమును దహించును. భయంకర జ్వాలలతో మహాధ్వనితో ప్రజ్వలించు ఈ రౌద్రాగ్ని కల్పాగ్ని యని శ్రుతుల వినబడును. ఇది కోటిసూర్య ప్రభతో విజృభించును. ముల్లోకములం దహించును.
ఇట్టి మహాదారుణ ప్రళయమందు మార్కండేయుడను పరమధర్మాత్ముడు ఋషి ధ్యానయోగనిష్ఠనుండెను. ఆయన ఒక్కడే ఇప్పుడుండునని శ్రుతి దెల్పును. ఆయన మోహపాశములకు కట్టువడి ఆకలిదప్పులకు ఇంద్రియములు చెదర ఆ మహా అగ్నిని కని కంఠము పెదవులు నాలుకయు ఎండగా భయమొంది తడపడుచు నెల్ల భూమిం గాందిశీకుడై తిరుగాడుచు విశ్రమించుటకు ఇంచుక చోటుగానక ఏమి చేయుదును,ఎవ్వని శరణందవలయునో తెలియకున్నాను. అననాతమని పురుషోత్తము నెట్లు కనుగొందునని ఏకాగ్ర మనస్కుడై ధ్యానించి ఆ దివ్యమైన పరమపదమును మహాప్రళయ కారణమైన దాని పురుషోత్తమ నామకమైన సుప్రసిద్ధ వటరాజమును జేరెను. తొందరతో నమ్మని ఆ మఱ్ఱి దరికేగి దాని మొదలున గూర్చుండెను. అక్కడ కాలాగ్ని భయములేదు. అక్కడ నిప్పులు గురియవు. సంవర్తాగ్ని ఇక్కడకు జొరదు. అచ్చట పిడుగులు పడవు. అట్టి అభయస్థానము నందు సనాతన ఋషి విశ్రమించెను.
ఇది శ్రీబ్రహ్మ మహాపురాణమున స్వయంభూ ఋషి సంవాదమున మార్కేండేయ కృతవట దర్శనమను ఏబదిరెండవ అధ్యాయము
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹