ప్రతిమావిర్భావ నిరూపణము
బ్రహ్మ యిట్లనియె :-
ఓమునివరులార! అమ్మహీపతి యిట్లు జగన్నాధుని మ్రొక్కి వినుతించి ఆలోచనలో మునిగి దర్బలు పరచుకొని ఆ మీద బట్టపరచుకొని ఆ దేవునిపై మనసునిల్పి ఆ బాధను హరించు దేవదేవుదేవుడు ప్రత్యక్షమగునని అనుకొనుచు నేలపై నిదురించెను.
జగద్గురువు ఆ నిదురించిన అతనికి స్వరూపదర్శనము అనుగ్రహించెను. శంఖ చక్ర గదా శార్జములను దాల్చి చుట్టును ఒకవెలుగు గుడిగట్ట యుగాంతాదిత్య ప్రభతో గరుడుని మూపుపైనెక్కి ఎనిమిది బాహువులతో దర్శనమిచ్చిన ఆ దేవదేవుని అతడు దర్శించెను.
అట్లు పొడసూపిన ఆ స్వామి రాజుతో ఇట్లనియె. ఈ క్రతువుచేత నీభక్తి శ్రధ్దలచేత సంతుష్టుడనైతిని. ఊరకయేల పరితపింతువు. ఈ ప్రతిమ జగత్పూజ్యము. సనాతనము. (ఈనాటిదిగాదు) ఇది నీవు వడయుటకు ఉపాయము తెలిపెదను. ఈ రాత్రి గడచి సూర్యోదయము కాగానే సముద్ర జలముల కల్లంత చివర పలుచెట్ల గుబురులతో చెలియలికట్టను ఆనుకొని సముద్రజలము కెరటములతో గానవచ్చును. అంతకు ఆవలి గట్టన ఒకచెట్టు నీళ్ళను నేలను గూడ దాకుచు ఉండును. తరంగఘాతమున నేని అది కంపింపదు. గొడ్డలిగొని నీవు ఆ నీటిలో ఏకాకివై ఎట్టి జడువుగొనక అటు ఇటు తిఱిగి చూచి ఇట్టి చిహ్నలుగల ఆ తరువును గని శంకింపక నఱకుము. ఆ అద్భుత వృక్షమును గని దానిలోంచి ఆ దివ్యమూర్తిని గావింపుము. నిన్ను తబ్బిబ్బుపరచునే మఱియే ఆలోచననైన సేయకుము.
ఇట్లా హరి మహానుభావుడు ఆనతిచ్చి అంతర్ధానమందెను. రాజు తనకలను గమనించి యెంతో యాశ్చర్యపడెను. అదియెల్ల మనసునిడి విష్ణుదేవతాకములైన మంత్రములను విష్ణుసూక్తమును పారాయణము చేయుచు వేకువను లేచి యొండు తలంపుగొనక చక్కగ సాగర స్నానము చేసి గుఱ్ఱములేదు, వెంటకాలిబంటులేడు,ఏనుగు లేదు,సారథియు లేడు ఒంటరిగ నాకడలి చెలియకట్టు దిగి తేజోమయమైన పెను మొదలు గట్టిన సువిస్తృతమైన ఆ పుణ్యవృక్షమును గాంచెను. మిక్కిలి ఎత్తుగ మిక్కిలి బోదెగల్గి జలముదరి నిద్రలోనున్న దట్టని మంజిష్టివర్ణము (ఎఱుపు) గలిగిన ఆతరువు ఏ జాతిదో ఏ పేరిదో తెలియరాదయ్యెను. నరనాథుడు అదిగని ఆనందపడి పదునైన గొడ్డలిచే దానిని రెండు తునకలు గావింపనెంచి కొట్టెను. అదిచూడ ఆశ్చర్యము గొల్పుచుండెను. అంతట విశ్వకర్మయు (దేవశిల్పి) విష్ణువును విప్రరూపముదాల్చి వచ్చిరి. ఇద్దరు ఒకేరూపున తేజరిల్లుచుండిరి. దివ్యమాలలు ధరించిరి. దివ్యగంధము వూసికొనిరి. ఇంద్రునకు మిత్రుడైన ఆ రాజును కలిసికొని మహారాజా ! నీవిచట నేమి చేయుచున్నావు? ఈ మహావృక్షము నెందులకు నఱికితివి? ఈ నిర్జనమైనకాఱడవిలో నీవు తోడులేక మహోదధి యొడ్డున నొంటరిగ నీవెట్లి చెట్టును నఱకితివి?
అ ఇరువురి మాటవిని ఆ రాజు ముదమంది చంద్ర సూర్యులు అట కరుదెంచిన ఆ బ్రాహ్మాణుల ఆనంద భరితుండై గని నమస్కరించి ఆ జగన్నాథుల సన్నిధి తల వంచి నిలువబడి ఇట్లనియె.
అది అంతము లేని అనంతమూర్తిని జగత్పతిని ఆరాధించుట కొక ప్రతిమను గావించుకొనవలెనని తలంపు గల్గినది కలలో ఆ దేవునిచేత నేను భావింపబడితిని. అసంగతి మీకు తెల్పితిని.
బాగుబాగునృప నీ తలంపు మేలైనది. అంతులేని ఈ ఘోర సంసారము అరటాకు పగిది నిస్సారము. బహుదుఃఖ నిలయము. కామక్రోథాకులము. ఇంద్రియములిందు సుడులు, నానా వ్యాధులు. నీటిబుడగ వంటిది. విష్ణునారాధింప నీకు దలపు గలుగుటచే నీవు ధన్యుడవు. సద్గుణ భూషణుడవు. నీ ప్రజలు పురగ్రామ శైలకాననములతో నాల్గువర్ణములతో నీ పాలించు పృథ్వియు ధన్యులు. రారమ్ము చల్లని యీ చెట్టుదరి నీవు మాతో గూడ మాటలాడుకుందాము ఇట వచ్చి నిలువుము. ఈతడు నాతోడ వచ్చినాడు మహాశిల్పి. విశ్వకర్మతో సాటియైనవాడు. ఎల్లపనుల నెంతో నేర్పరి. నేనుద్దేశించిన ప్రతిమ నీతడు చేయును. ఒడ్డు దిగుము. అన నాద్విజుని మాటవిని సముద్రము నొడ్డునుండి జని యా చెట్టునీడను నిలిచెను. అ వ్విశ్వరూపుడు విష్ణువు ఆ శిల్పివరునకు ప్రతిమ చెక్కుమని ఆనతిచ్చెను.
తామరఆకుల వంటి కన్నులు ఉరమున శ్రీవత్సకౌస్తుభములు హస్తములందు శంఖచక్రగదాశార్జములు గలిగినదొకటి
అచ్చము పాలవలె తెల్లనై స్వస్తికముద్ర నాగలి చేతనుపూనిన అనంతమూర్తి ఇంకోకటి వాసుదేవుని చెలియలు బంగారుచాయగల పరమశోభనము సర్వలక్షణ లక్షితమునగు సుభద్రామూర్తి మూడవది. ఇట్లు మూడు ప్రతిమలు గావింపుమనెను.
విశ్వకర్మ ఆ మాట విని ఆ క్షణమున ఆ శుభలక్షణములతో ముమ్మూర్తులను గావించెను. ఒకటి శరత్కాల చంద్రబింబమట్లచ్చము తెల్లది. ఎఱ్ఱనికనులు పెద్ద శరీరము పాముపడగంబోలు మస్తకము నల్లని వలువయు గల బలరామమూర్తి. ఒక్కటే కుండలము , దివ్యగదా ముసలాయుధము బూనినది. తెల్ల తామరల బోలు కన్నులు. నల్లని మేఘము అతసీకుసుమము లా నిగనిగలాడు నీలతనువు, పీతాంబరము నురము శ్రీవత్సలక్షణము చేతం చక్రాయుధము గల్గిన సర్వపాపహరమైన శ్రీహరిమూర్తి రెండవది. మూడవది. స్వర్ణఛ్చాయశరీరము రత్నహార కేయూరాది విచిత్ర భూషణములు కమల నయనములు విచిత్ర వస్త్రములతో నొప్పి పీనోన్నస్తనియైన సుభద్రమూర్తి. అరాజాయద్భుత శిల్పముంగని క్షణములో నిర్మించిన ఆ దివ్యమూర్తుల వీక్షించి మిక్కిలి వింతవడి యిట్లనియె.
ఇంద్రద్యుమ్నుడు పలికెను :-
ద్విజమూర్తులందాల్చి ఏతెంచిన మీరిద్దరు దేవతలు అద్భుత కర్ములు దేవవర్తనులు అమానుషకర్ములునగు మీరు వేల్పులా యక్షులా విద్యాధరులా బ్రహ్మయు విష్ణువునా? వసువులా ! కాక అశ్వినీకుమారులా! ఎఱుగ నైతిని.మాయా రూపమున నున్నారు మిమ్ము శరణు పోందుచున్నాము. మీ స్వరూపమును నాకు వెలువరింపుడు. అని ఇంద్రిచ్యుమ్నుడనియె.
ఇది బ్రహ్మపురాణమున ప్రతిమోత్పత్తికథనము అను యాబయ్యవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹