పురుషోత్తమ క్షేత్ర వర్ణనము 2
ఆ మీదికథను, అ క్షేత్రరాజమునకేగి ఇంద్రద్యుమ్న ప్రభుడేమి చేసెను? తెలుపుమని మునులడిగిరి.
బ్రహ్మ ఇట్లనియె
మునులార వినుడు. ఇంద్రద్యుమ్న మహారాజటకేగి చక్కని ప్రదేశములను, వింధ్య పాదమునుండి వెడలెడు పుణ్యనదులను దర్శించెను, సర్వపాపహారిణి గంగ కీడైనది దక్షిణ సముద్రమున సంగమించునదియగు ”స్విత్రోవల” అను నది యట గలదు. దాని కిరువైపుల తీరములందు సస్యశ్యామలములు మనోహరములు నగు గ్రామములు నగరములు కనిపించును. అందలి ప్రజలు చక్కని వలువలు నగలునుందాల్చి పుష్టియుం దుష్టియు గొనియుందురు. చతుర్వర్ణములవారు స్వన్యదర్మనిరతులై శుభలక్షణులై కనిపింతురు. నిరంతరతాంబూల చర్వణము నిరంతరపుష్పమాలాధారణము వారి ప్రత్యేక శుభచిహ్నము. విప్రులు వేద పూర్ణముఖులు – షడంగదులు. పదక్రమల జటాఘన పాఠులు. నిత్యాగ్నిహోత్రులుఉపాసకులు సర్వశాస్త్రార్థ సమర్థులు బూరి దక్షిణ లొసంగిన దీక్షితులు సోమయాజులు చయనులు.
రాజ వీథులందు నలుదారులు కలిసిన చోట మండపములందు వనములందు ఉద్యానవనములందు సభలందు మేడలందు దేవాలయములందు ఎటన్ననను ఇతిహాస పురాణ ప్రవచనము సాంగ వేదాధ్యయనము కావ్యశాస్త్రగోష్ఠులు వినిపించును.
ఆ దేశమందలి సుందరులు చక్కని రూపము వనముంగొని ఉత్తమ స్త్రీ సాముద్రిక లక్షణ లక్షితలై శరత్కాల చంద్రబింబాననలై దివ్యవస్త్రముల దాల్చి బంగారు కంకణములం ధరించి కదగర్భమున కిడగు బంగరు చాయయు ఎఱ్ఱతామర పూల పుప్పొడికెనయగు అరుణారుణ వర్ణమును గల మేనులతో ఆకర్ణాంత నేత్రములతో చక్కని నెమ్మోములతో నల్పెక్కిన వేనలితో దొండపండునకీడగు పెదవులతో హావభావ లాసములతో , కొందఱు తామరరేకుల కెనయగు నయనశోభ గలవారు కొందరు నల్లగలువరేకుల కీడగుకాటుక కండ్ల అందము గలవారునై ఉంగరాల్దిరిగిన ముంగురులతో మెఱపట్లు మెఱయు పలువరుస గల్గి పీనోన్నత స్తనభారమున సువర్ణ మణిమయకంఠ హారములు సుమమాలలుందూగ మణిమయ కుండల కాంతులు చెక్కుటద్దముల ఎఱుపగునట్లు గొన సాక్షాద్దేవ సుందరులోయన దర్శనమిత్తురు. వీణావేణు మృదంగ వాద్యములు జతసేసి భక్తిభరితములైన చక్కని పాటల ఆటలం పరమాత్మను పరవశింపజేయుదురు.
రాత్రియనక పగలనక అచట శంఖదుందుభి నిర్ఘోషము వినిపించును. కామోన్మత్తమైన అవలాసినుల నృత్య లాసము గానమాధుర్యమును ననీదృశము. భిక్షువులు వైఖానసులు స్నాతకులు బ్రహ్మచారులు సిద్ధులు వీరువారననేల మంత్రసిద్ధులు రససిద్ధులు ఘటికాపాదుకా సిద్ధులు అచట స్వామీ పరివారమై సేవింతురు.
ఇట్టి దివ్యక్షేత్రమును దర్శించి ఆ రాజు నిజముగా అదియే మానసక్షేత్రము. ఇది పురుషోత్తమము. తెలిసినది నాకిది తెలిసినదని ఉప్పొంగి మఱ్ఱి నీడకేగి ఇంద్రనీలమణిమయమగు ఈ నీలమేఘ శరీరుని మూర్తింగని ఆ కల్యాణ మూర్తి నాకు గోచరింప యత్నమొనర్తుగాక అని జన్నములొనర్చుదును. తపములాచరింతును. హోమములసేయుదును. ధ్యానింతును. ఉపవసించి అర్చనలు నొనరింతుగాక యని అనన్య మనస్కుడై విష్ణ్వాలయ నిర్మాణము గాంతునుగాకయని నిశ్చయించెను.
ఇది బ్రహ్మపురాణమున క్షేత్రవర్ణనమను నలుబదియారవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹