అవంతీ వర్ణనము
బ్రహ్మ యిట్టనియె
విప్రులారా! మున్ను కృతయుగమునందు” ఇంద్రద్యుమ్నుడు” అనురాజుండెను. అతడింద్రతుల్య పరాక్రముడు. సత్యవాది శుచి సమర్థుడు సర్వశాస్త్ర విశారదుడు. రూపవంతుడు,శుభగుడు, శూరుడు,దాత,భోక్త,ప్రియభాషి. యజ్వ బ్రహ్మజ్ఞాని, సత్యప్రతిజ్ఞుడు,ధనుర్వేదమందు వేదమందు శాస్త్రమునందు నిపుణుడు స్త్రీపురుషులకు పున్నమచంద్రుడిలా ఆనందకరుడు. ప్రతాపమున సూర్యుడట్లు తేరిపారజూడ అలవికానివాడు. శత్రుకూటమునకు భయంకరుడు విష్ణుభక్తుడు. సత్త్వశాలి. జితక్రోథుడు జితేంద్రియుడు. యోగశాస్త్ర సాంఖ్య (జ్ఞాన) శాస్త్రముల అధ్యయనము చేసినవాడు. మోక్షేచ్ఛగలవాడు. ధర్మనిష్ఠుడు. ఇట్లు సర్వలక్షణనిధియైన ఆ రాజు భూమిని పాలించుచుండ నతనికి హరి నారాధింపవలెనను నిశ్చయము గల్గినది.
దేవేశ్వరుడు జనార్ధనుని ఎట్లారాధింపగలను! ఏ క్షేత్రము తీర్థము నదీతీరము ఆశ్రమము నిందుల కనువయినది! అని తలచి పృథివినెల్ల మనసుచే పరికించి అన్ని తీర్థక్షేత్రపుర సముదాయమునెల్ల వదలి పురుషోత్తమక్షేత్రమందున్న ఆలయమున కేగెను. అతనిని బలము(సేన) వాహనములు వెంబడించినవి. అక్కడ భూరిదక్షిణలొసంగి యథావిదిగ అశ్వమేధము చేసెను. స్వామికి మహోన్నత ప్రాసాదము గట్టించి అందు సంకర్షణుని (బలరాముని) కృష్ణుని సుభద్రను ప్రతిష్ఠించి పంచతీర్థములేర్పరచి స్నానదాన తపోహోమాదులు ఆచరించి దేవతా దర్శనముచేసి భక్తితో ప్రతిదినము హరి నారాధించి ఆ స్వామి అనుగ్రహముచే మోక్షముల బొందెను. మార్కండేయుని కృష్ణుని బలరామునిం దర్శించి ఇంద్రద్యుమ్న సాగరమున స్నానముసేసిన మోక్షమును దప్పక మానవుడు పొందును.
మునులడిగిరి
ఇంద్రద్యుమ్న ప్రభువు మున్నా ముక్తి క్షేత్రమున కెందులకు వెళ్ళెను. వెళ్ళి ఆ స్వామిని అశ్వమేధము చేసి ఎట్లారాధించెను? త్రిలోక ప్రఖ్యాతమైన ఆలయమునక్కడ ఎట్లు నిర్మించెను? సుభద్రా బలరామకృష్ణుల మూర్తులనెట్లు నిర్మించెను? ఆ క్షేత్రరక్షణమెట్లు చేసెను? ఆలయమందు కృష్ణాదుల ప్రతిష్ఠ యెట్లుజరిగెను? ఇదంతయు జరిగినది జరిగినట్లు విపులముగ నానతిమ్ము నీవాగమృతము వినిన కొలది మాకింకను నది గ్రోలవలయును అనిపించుచున్నది. వినవలెనని మిక్కిలి కూతూహలము అగుచున్నది.
ఇట్లు మునులడుగ బ్రహ్మ బాగు బాగు! పురాతన కథ నడిగితిరి. ఇది సర్వపాపహరము. భుక్తి ముక్తిదము. శుభకరము. కృతయుగమందు జరిగినచరిత్ర ఇదే చెప్పుచున్నాను. శ్రద్ధగా ఇంద్రియములను అదుపుననుంచి కొని వినుడు.
మాళవదేశమునందు అవంతియను నగరమున్నది. అది భూమండలమను ఋషభమునకు మూపురమా అన్నట్లు తలమనికమై యుండెను.
క్రిందటి అధ్యాయము విరజక్షేత్రవర్ణన సందర్భమున నిట్లే వర్ణనమున్నది. కావున ఇక్కడ అది పునరుక్తముగ తాత్పర్యము వ్రాయలేదు.
అక్కడి త్రిపురవైరి (శివుడు)’మహాకాలుడు’ అనుపేర వెలసియున్నాడు. ఆయన సర్వాభీష్ట ప్రదాత. అటు పాపహరమైన శివకుండమున స్నానముసేసి దేవర్షిపితృతర్పణాదులు చేసి శివలాయముకేగి ప్రదక్షిణముసేసి ధ్యానావాహనాది ఉపచారములు స్వామి అర్చించిన నరుడు అశ్వమేధ యాగఫలమునందును. దివ్య విమానములో శివలోకమునకేగును. అట దివ్యరూపాంబర ఆభరణాదులతో గూడి మహాభోగములను అనుభవించి ఇక్కడికివచ్చి బ్రాహ్మణుడై జనించి నాల్గు వేదములు సర్వశాస్త్రములు నేర్చి పాశుపత యోగములబొంది ముక్తినందును.
అక్కడ శిప్రా అను నదిగలదు. అట స్నాన తర్పణాదులు చేసిన యతడు విమానమున స్వర్గమేగును. అక్కడనే విష్ణువు గోవిందస్వామి యనుపేరనున్నాడు. ఆయనను సేవించిన నిరువదియొక్క తరములు తరించును. ఈ మున్ను జెప్పిన ఫలములన్నియు నటగల్గును. తిరిగి ఈ లోకమునకువచ్చి వైష్ణవయోగమున ముక్తినందును. అక్కడనే విక్రమస్వామియను పేరనున్న విష్ణువు నారాధించిన మగవాడుగాని ఆడుదిగాని మున్నుజెప్పిన ఫలమందుదురు. అక్కడ ఇంద్రాదిదేవతలు మాతృకలు గలరు. వారును కోరిన కోర్కులిత్తురు. వారిని సేవించిన స్వర్గములభించును. అవంతియను నా నగరమును రాజసింహుడను రాజుపాలించెను. అందులో పదునెన్మిదిపురములు (మహాపుర భాగములు) కలవు. అవి సువిస్తీర్ణ రాజమార్గములు. విద్మావంతులట అందఱును. వేదఘోషచే నది ప్రతిధ్వనించుచూ ఉండును. అట ఇతిహాస శాస్త్ర పురాణాదిప్రసంగములు నిత్యము వినబడును. దీనికి పరిపాలకుడు ఇంద్రద్యుమ్నుడు.
ఇది బ్రహ్మపురాణమున అవంతీవర్ణనము అను నలుబదిమూడవ యధ్యాయము
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹