Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మపురాణం 🌹🌹🌹 – నలబయ్యవ భాగము

దక్షకృత శివస్తుతిః

దక్షకృత శివస్తవము

బ్రహ్మ యిట్లనియె:- దక్షప్రజాపతి శంభు ప్రభావముగని ప్రాంజలియై ప్రణతుడై ఇట్లు స్తుతింప నారంభించెను. ఈ దక్షకృత శివస్తుతి శివసహస్రనామావళి రూపము. పారాయణ ప్రథానము కావున 2-81 శ్లోకముదాక తాత్పర్యము వ్రాయబడలేదు శివుని విరాడ్రూపమున వినుతించిన ఘట్టము

ఓ సదాశివా ! నీ కన్నులు చంద్రాదిత్యులు. హృదయము బ్రహ్మ. ధర్మకర్మ సంపాదితమైన అగ్నిష్టోమము శరీరము. నీ యథార్థమైన మహిమ బ్రహ్మహరి ఋషులు గూడ ఎఱుంగలేరు. నీ శివమూర్తులు (మంగళకరములయిన యాకారములు) సూక్ష్మములు. అవి నాకు దర్శనమిచ్చుగాక ! తండ్రి కన్నకొడుకునట్లు మూర్తులతో నన్ను రక్షింపుము. నీ సంరక్షణలో ఉండదగిన నన్ను రక్షింపుము. నీవు భక్తానుగ్రాహకుడవు. నేను నీ భక్తుడను. ఏ మూర్తి వేలకొలది పురుషుల నావరించి సముద్రమవ్వల నుండునో ఆమూర్తి నాకు రక్షకమగుగాక ! నిద్ర జయించి శ్వాసనరికట్టి సత్త్వ గుణస్థాయినంది సమదర్శనులై పరంజ్యోతిని (భ్రూమధ్యస్థానమున) సంయొజన చేసి చూతురో అట్టి యోగాత్మకుడపైన నీకు నమస్కారము. ప్రళయమందెల్ల భూతముల భక్షించి జలమధ్యమున శయనించు ఆ శివునకు నమస్కారము. రాహుముఖముజొచ్చి రాత్రి సోముని త్రావును. పగలు సూర్యుని గ్రసించును. అట్టి నీమూర్తికి నమస్కారము. సోముడు అగ్ని అంగుష్ఠ మాత్రులై సర్వదేవరుల దేహమందండు పురుషులు (శివమూర్తులు) నన్నెల్లపుడు రక్షింతురుగాక నన్నాప్యాయనము సేయుదురుగాక సంతృప్తుని గావింతురుగాక యని భావము. ఎవ్వరివలన పిండోత్పత్తి(గర్భోత్పత్తి) జరుగునో యెవరు జలగర్భముందుందురో,స్వాహా స్వధాకారమున హవిర్భాగముల నందుకొందురో,అరగింతురో, ఎవనివలన దేహధారులు పుట్టుదురో,ఏ మూర్తులు జీవుల నేడిపింతురో, (రుద్రరూవులన్నమాట) ఆనందపెట్టుదురో,క్లేశము గల్గించరో అట్టి నీ మూర్తులకు నమస్కారము. సముద్రమందు, నదీదుర్గమందు, పర్వతములందు,గుహలందు, వృక్షమూలమందు, గోశాలలందు, అడవులలో గహనములలో చతుష్పథములందు (నాలుగుదార్లు కలిసినచోట) వీధులందు (రాచబాటలందు) చత్వరములందు, (సంస్కృతభూమి) సభలలో, ఏనుగు,గుఱ్ఱములశాలలందు పాడువడిన యుద్యానవనములందు, ఆలయములందు, పంచభూతములలో, దిక్కులలో,విదిక్కులలో, ఇంద్రసూర్యుల నడుమ, సూర్యచంద్ర కిరణములందు, పాతాళమందు అంతకంటెను మీదను నే నీ మూర్తులు గలవో వానికి నమస్కారము. సత్వము నీవే,సర్వత్ర వీవే, సర్వభూతపతివి, సర్వభూతాంతరాత్మవు నీవు, అందుచే నీవు నిమంత్రితుడవుగావు. (పిలువబడువాడు) వివిధముల దక్షిణలుగల యజ్ఞములచే నీవేయజింపబడుదువు. అంతకును నీవేకర్తవు. అందుచే నీవునిమంత్రితుడవుగావు సూక్ష్మమైన మాయయునీవే. దానిచే నేనును మోహింపబడితిని. (పోరబడితినన్నమాట) అందుచేతగూడ నిన్ను నేను నియంత్రింపలేను. నిన్ను పేర్కోనలేదనిభావము. నాయెడల బ్రసన్నుడవగుము. నాకు నీవే దిక్కు. నీవే నాగతివి. నీవే నాప్రతిష్ఠయు(ఉనికిలేక ఆధారమన్నమాట). నీకంటె మఱియెక్కడు లేడని నా తలంపు. అని యిట్లు మహేశ్వరుని దక్షుడు స్తుతించి ఊరుకొనెను. భగవంతుడు ప్రీతుడై దక్షునింగని మఱియు నిట్లనియె. నీ చేసినస్తవముచే సంతుష్టుడనైతిని. నీవు ఉత్తమ వ్రతనిష్ఠుడవు. ఎక్కువమాట లెందులకు? నీవు నాసన్నిధికి వత్తువు అని త్రిలోకేశుడు భవుడు సర్వజ్ఞుడు దక్షుని కాశ్వాసకరముగ (ఓదార్పుగ) పలికి! దక్షా! యజ్ఞధ్వంసమునకు దుఃఖపడవలదు. చూచితివిగదా. యజ్ఞహననము సేసినది నేనే. ఇదిగో నీ యజ్ఞఫలము ఉత్తమమైన దానిని నావలన మఱుల బడయుము . ప్రసన్న సుముఖుడవు ఏకాగ్రమనస్కుడవై నామాట వినుము. వేయి ఆశ్వమేధములు నూరు వాజపేయములు చేసిన ఫలము నా ప్రసాదముచే నీవిప్పుడందగలవు. షడంగ వేదములను సమగ్రసాంఖ్య యోగములను (జ్ఞానయోగములను) నీవు తెలిసి కొనుము. పండ్రెండేండ్లు దేవదానవులు చేయలేని ప్రజ్ఞాహీనులు (అజ్ఞానులు) నిందించునట్టిదియు వర్ణాశ్రమ ధర్మములతో గూడినదియు లొంగనిదియు వ్యవసితమును (వ్యవస్థ చేయబనదియు) పశుపాశ విమోచనము సేయునది. (జీవుల యజ్ఞానపాశముల ద్రెంచునది) సర్వాశ్రమస్థులకు అనువైనదిగా నేను సర్వపశుపాప విమోచన మంత్రమును రూపొందించితిని. ఇది లెస్సగ నాచరించిన యెడల పుష్కలమైన ఫలము గల్గును. ఆది నీకు అనుష్టేయమగుగాక ! మహానుభావా ! మానసిక జ్వరమును(తాపమును) విడువుము. ఇట్లు దేవేశుండు పలికి ఉమాదేవితో పరివారముతో అంతర్థానమయ్యెను. మఱియు ఆ భవుడు సర్వధర్మజ్ఞుడు గావుస సర్వభూతశాంతి కొఱకు దక్షయజ్ఞ ధ్వంసమునకు తానావిర్భవింప జేసిన జ్వరము నీ క్రిందివిధముగా విభజించెను. ఈ వివరము ఓ విప్రోత్తములారా వినుండు.

ఆజ్వరము గజములలో శిరోతాపముగను, పర్వతములలో శిలాజితముగను, నీటిలో నీలిక (అనుపేరుతోను) పాములలో కుబుసముగను అవులలో ఖోరకము భూమియందు ఊషరము(చవిటినేల) కుక్కలకు నేత్రావరోధము (గ్రుడ్డితనము) గుఱ్ఱములకు రంధ్రాగతము నెమళ్లకు పించెములూడిపోవుట కోకిలలకు నేత్రరాగముగను మహాత్ములకు ద్వేషము సర్వజనులకు భేదము(ఒంటెత్తు తనము. ఒకరి కొకరికి బడకపోవుట) చిలుకలకు ఎక్కిళ్లు పులులకు శ్రమ(అలసట) మనుష్యులకు కేవలము జ్వరరూపమైన వ్యాధియే ఇది నరులకు పుట్టునపుడు గిట్టునపుడు ఆరెంటికి నడుమను గూడ, ఉంచబడినది. ఇది మాహేశ్వర తేజస్సే. జ్వరము (శివజ్వరము) అనుపేర మిక్కిలి దారుణమై యున్నది. సర్వప్రాణులకును ఈశ్వరుడు నమస్కరింప వలసినవాడు మాన్యుడు (పూజనీయుడు) ఈ జ్వరోత్పత్తి నిండుమనసుతో చదివినవాడు రోగముక్తుడై సంతోషముతో గూడి సర్వాభీష్టములనందును.

ఫలశ్రుతి

దక్షుడు సేసిన ఈ శివస్తవమును పారాయణము చేసిన వాడెన్నడును అశుభము నందడు. దీర్ఘాయువందును సర్వదేవులందు మహాదేవుడు భగవంతుడు శ్రేష్ఠుడయినట్లు దక్షకృతమైన ఈ శివస్తుతికూడ సర్వస్తుతివరిష్ఠము. కీర్తి,స్వర్గము,దేవైశ్వర్యము, ధనము, జయము గోరువారును విద్యాకాములను,ఈ స్తవమును భక్తితో పఠింపవలయును. వ్యాధి, దుఃఖము,భయమునకు గురియైనవాడు రాజకార్య నియుక్తుడును, నీస్తుతి పఠించిన భయవిముక్తుడగును. అతడీదేహముతోనే శివగణములనుభవించు మహేశ్వరసుఖమును ( పరమేశ్వర విభూతిని) ఇహమందనుభవించి, గణాధిపతియగును. యక్షులు పిశాచులు నాగులు వినాయకులును ఆభక్తునికెట్టి విఘ్నములు గల్గింపరు. ఈస్తుతిని భక్తితో శివునిపై భావమునిల్పి విన్నచో పుట్టింటను అత్తింటను పూజ్యురాలగును. దీనిని విన్నను కీర్తించినను వానికి నిర్విఘ్నముగ సర్వకార్వసిద్దియగును . ఇది కీర్తించుటచే మనసుచేత సంకల్పించినది మాటచేనన్నది ఎల్లపనులు నెరవేరును. కుమారస్వామికి గౌరికి నందీశ్వరునికి ఇంద్రియనిగ్రహముతో నియమముతో వేర్వేరు బలిని (పూజను) నోనరించి ఆ మీద ఈ శివనామములను క్రమముగా పారాయణకు గ్రహింపవలెను. అందువలన మానవుడిష్టార్థములను భోగములను పురుషార్థములను బడయును. మరణించి అప్సరః స్త్రీ సహస్రముతో స్వర్గమునకేగును. కోరికలతో పాతకములతో నున్నవాడైన ఈ దక్షకృత శివస్తుతి పఠించి సర్వపాపముక్తుడగును. దేహపాతానంతరము గణసాయజ్యమందును. సురాసురలపుడు వానిని పూజింతురు. అతడు భూత ప్రళయముదాక వృషభవాహనమెక్కి, విమానమెక్కి రుద్రానుచరుడగును.

ఈ విధముగా పరాశరనూనుడు వ్యాసభగవానుడు పలికినాడు. ఇది యెవ్వడు నెఱుగడు. దీనినెవ్వనికి వినిపింపరాదు. ఇది గుహ్యమైన (మంత్రసమ్మితమైన) స్తవము. పాపజన్ములయినను వైశ్యులు స్త్రీలు శూద్రులు నీస్తుతి పఠించి విని రుద్రలోకమందుదురు. విప్రులకు ప్రతిపర్వమందు దీనిని వినిపింపవలెను. అందుచే ద్విజుడు రుద్రలోకమందును సందియుము లేదు.

ఇది బ్రహ్మపురాణమందు ”దక్షకృతశివస్తవము” అను నలుబదియవ యధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment