Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మపురాణం 🌹🌹🌹 – నాల్గవ భాగము

పృథుప్రభృతి సర్వదేవాదీనాం రాజ్యాభిషేక వర్ణనమ్‌

మహదేత దధిష్ఠానం పురాణ తదధిష్ఠితమ్‌

లోమహర్షుడు ఇట్లనియె.

బ్రహ్మ వేనుని కుమారుని పృథుని చక్రవర్తిగా నభిషేకించి క్రమముగా వారివారికి రాజ్యములను నిర్ణయించియిచ్చెను. ద్విజులు ధాన్యములు నక్షత్రములు గ్రహములు యజ్ఞములు తపస్సులు అను వాని రాజ్యాధికారమందు సోమునకు పట్టాభిషేకము చేసెను. అప్పులకు వరుణుని, రాజులకు రాజరాజును, (కుబేరుని) అదిత్యులకు విష్ణుని, వసువుల కగ్నిని, ప్రజాపతులకు దక్షుని, మరుత్తలకు వాసవుని, దైత్యదానవులకు ప్రహ్లాదుని, పితరులకు వైవస్వతుని, (యముని) యక్ష రాక్షస పార్థివ సర్వ భూత పిశాచములకు శూలపాణియైన గిరీశుని, (శివుని) శైలమునకు హిమవంతుని, నదులకు సాగరుని, గంధర్వులకు చిత్రరథుని, నాగులకు వాసుకిని, సర్పములకు తక్షకుని, ఏనుగులకు ఐరావతుని, అశ్వములకు ఉచ్చైఃశ్రవమును, పక్షులకు గరుడుని, మృగములకు శార్దూలమును, గోవులకు గోవృషమును, వనస్పతులకు జువ్విచెట్టును, రాజు గావించెను.

తూర్పు దిశకు వైరాజ ప్రజాపతి కుమారుని సుధన్వుని, దక్షిణ దిశకు కర్దమ ప్రజాపతి కొడుకు శంఖపదుని, పడమటిదిశకు రజస్సు కుమారుని (అచ్యుతుని) కేతుమంతుని, ఉత్తర దిశకు వర్జన్య ప్రజాపతి తనయిని హిరణ్యరోముని అధిపతులనుగానభిషేకించెను.

సప్తద్వీప పరివృతమయిన యీ పృథ్వి పట్టణములతో గూడి వారివారిచేత నిపుడును ధర్మముతో పాలించబడుచున్నది. ఈ నరపతులచే వేదవిహితముగ రాజసూయాభిషిక్తుడునై – రాజ్యాభిషిక్తుడవై పృథువు చక్రవర్తియై యిమ్మేదినినేలను, చాక్షుషమన్వంతరము గడచి వైవస్వంతమన్వంతర మారంభమయ్యెను. అమ్మన్వంతర వృత్తాంతము వినిపింతును వినుండు.

మునులనిరి

లోమహర్షణ! పృథు చక్రవర్తి మహానుభావుడు. ఇవ్వసుంధరను గోవునొనరించి వస్తుసారమును పిదికెనందురు. నర నరాసుర నాగ యక్ష ద్రుమ శైల పిశాచ గంధర్వ ద్విజ రాక్షసాది మహాసత్వ జాతులచే నీభూమి ఎట్లు పిదుకబడినది. వారువారు పిదికిన పాత్ర విశేషములేవి? దూడలెవరు? దోగ్ధ ఎవరు? దుగ్ధము (పాలు) ఎట్టిది? ఆనతిమ్ము. కుపితులైన మహర్షులెట్లు వేనుని హస్తము మథించిరి? దానికి కారణమేమి? అదియుం గీర్తింపుము. ఆన –

లోమహర్షణుడిట్లనియె

ఏకాగ్ర మనస్కులై యాలింపుడు. అశుచికి నీచ మనస్కునకు శిష్యుడుకాని వానికి వ్రతదూరునికి కృతఘ్నునికి అహితునకు నిది నేను తెలుపను. ఇక్కడ స్వర్గప్రదము, కీర్తిదము, ఆయుష్యము, ధన్యము, వేదసమ్మితము, ఋషులు రహస్యముగా నానతిచ్చినది. వినుండు. బ్రాహ్మణులకు నమస్కరించినచో నిది కార్యము. ఇది అకార్యమునని విచారింపబని యుండదు.

మున్ను అత్రి వంశమున ధర్మ ప్రభువు అత్రిసమానుడు. అంగుడను ప్రజాపతియుదయించెను. వాని సుతుండు వేనుడు. మృత్యువు కూతురగు నీధయందు కలిగినవాడు. మాతామహ దోషముచే నాతడు స్వధర్మమును వెనుకబెట్టి కామలోభియై ప్రవర్తించెను. ధర్మము యొక్క హద్దులను తారుమారు చేసెను. వేదధర్మమును అతిక్రమించెను. వాని రాజ్యమున స్వాధ్యాయము వషట్కారమును వినరాదయ్యెను. దేవతలు యజ్ఞములందు సోమముం ద్రావిమెఱుంగరు. హవిస్సుల నారగింపరు. ఆ నరపతికి వినాశకాలము దాపురించె గావలయు దేవతలు యజ్ఞము వలదు హోమములు వలదని శాసించెను. క్రూర ప్రతిజ్ఞ చేసెను. నేను యజ్ఞేశ్వరుడను యజ్ఞకర్తను, యజ్ఞమును నన్ను గూర్చి యజింపనగును. నాకై హోమములాచరింపవలెనని వాడు శాసించెను. మర్యాదనతిక్రమించి ఉత్పధగామియైయున్న వానింగని మరీచిప్రముఖులైన ఋషులు వేన మేము పెక్కు సంవత్సరములు దీక్షా ప్రవేశము గావించెదను. అధర్మము సేయకు, ఇది సనాతన ధర్మము. అత్రి తరువాత నీవు ప్రజాపతియను నవతరించినాడవు. ప్రజలను పాలింతునని ప్రతిజ్ఞ చేసికదా రాజైతివి. అన విని వాడు వారలను పరిహసించి దుర్బుద్ధి యనర్ధపరుడుగాన యిట్లనియె.

వేనుడు పలికెను

ధర్మమునకు నాకంటే కర్తయెవ్వడు? నేనెవ్వనిమాట వినవలయును? శ్రుతమున (పాండిత్యమున) వీర్యమందు తపస్సులో సత్యములో నాతో సముడెవ్వరు? సర్వభూతముల యొక్కయు,ధర్మముయొక్కయు మొదలుతుదియ తెలియనిమూర్ఖులుమీరు. నిజముగా నన్నెఱుగరు. తలచితినేని యీ ఇలాతలమునంతను దహించి వేయగలను. నీటి వెల్లువల ముంచెత్త వేయగలను. భూమ్యాకాశముల దారులను బంధించగలను. అనవిని పొగరెక్కి మూర్ఖుడైయున్న వానిని సరిచేయుట అసంభమని మహర్షులు క్రుద్ధులైరి.

వానిని బట్టి కట్టివైచి వాని యెడమ తొడను మథించిరి. అందుండి నల్లనివాడు, పొట్టివాడు జనించి భయపడుచు దోసిలొగ్గి నిలువబడెను. బెదురుచున్న వానిని జూచి అత్రి మహర్షి ”నిషీద” (గూర్చుండుము) అనెను. అందుచే వాడు నిషాద వంశమునకు (బోయలకు) మూలపురుషుడయ్యెను. ఆ మీదట ”ధీవరులు” చేపలుపట్టు వారిని మేనికల్మషమున వాడుకనెను. వానివలన కోయలు మొదలగు కొండజాతులవాండ్రు జనించిరి. వేనుని కల్మషముచే బొడమిన వారందరూ అధర్మప్రియులైరి.

ఆ మీదట వేనుని కుడిచేయిని అరణినట్లు మథింపగా నందుండి ”అజగవమ” ను ధనువును దివ్యబాణములనుగొని కవచముల దాల్చి పృథువు అగ్నివోలె వెలుంగుచు నుదయించెను. అయ్యెడ సర్వభూతములు సంతుష్టములయ్యెను. వేనుడాక్షణము స్వర్గ మలంకరించెను. మహానుభావుడయిన పుత్రునివలన పుంనామనరకము నుండి రక్షింప బడెను. ఆ పృథుని సన్నిధికి రత్నములుగొని సముద్రము నదులు వచ్చి పవిత్రోదకముల నభిషేకించినవి. బ్రహ్మయు నంగిరసుడు మొదలగు దేవతలతో నేతెంచెను. స్థావరజంగమములయిన భూతములు గూడవచ్చినవి, అందరు నతనికి పట్టాభిషేకము గావించిరి. యధావిధిగా ధర్మ నిపుణులచే నభిషిక్తుడయిన ఆ చక్రవర్తి తండ్రిచే బాధితులయిన ప్రజల అనురాగముచే రంజింపజేసెను. దాననతడు ‘రాజు’ యను పేరంచెను. అతడు సముద్రమున కరుగ నుదకములు స్థంభించి నడక కనుకూలమయ్యెను. పర్వతములాతని టెక్కెమునకు భంగమురాకుండా దారి యిచ్చెను. తలచుకొన్న మాత్రమున ధరణి దున్నకయే సర్వసస్యములను బండెను. గోవులు కామధేనువులయ్యెను. పట్టుపట్టునం దేనియులు కురిసెను. ఈ సమయమందొక యజ్ఞమున సుత్యాహస్సునందు సూచియందు మహా మేధావి సూతుడవతరించెను. అయజ్ఞమందు ప్రాజ్ఞుడయిన మాగధుడును కలిగెను. వారిర్వురును పృథుచక్రవర్తిని స్తుతించుటకై మునులు బిలువగా నేతెంచిన మహానుభావులు. ఋషులు పృథు చక్రవర్తిని మీరిద్దరు స్తుతింపుడని యాదేశించిరి. అప్పుడు సర్వఋషులనుగూర్చి యా సూతమాగధులిట్లు పలికిరి.

అనూతమాగధులు మేము దేవతలను ఋషులను కీర్తించి సంతుష్టుల నొనరించువారము. ఇతడెవడో ఇతని పేరేమో చేసిన చేతయేమో లక్షణమెట్టిదో కీర్తి యెలాటిదో యెఱుంగుము. చూచుటకు మహా తేజస్వియై కనిపించుచున్నాడు. కాని ఏమని యీతని నుతింతుము. అన మునులు జరుగబోవునీతని సత్కార్యములను భావించి గానము సేయుమనిరి. వారు నాతని పిమ్మటి చరితమునూహించి కొనియాడిరి. అది మొదలు లోకమునందు జరుగున్తవములు ఆశీర్వాద ప్రధానములయి సూతమాగధవందిజన ముఖమున ప్రవర్తింపజొచ్చెను. వారి స్తుతికి మిక్కిలి సంతసించి పృథుచక్రవర్తి సూతునకు (అనూపదేశము) సముద్రతీర ప్రాంతమును మాగధునకు మగధదేశమును బహుమానమిచ్చెను. అవ్వల మహర్షులందరు పరమ ప్రీతులయి ప్రజలనుద్దేశించి ఈ రేడు మీకందరకు వృత్తుల నొసంగ గలడనిరి. అది విని ప్రజలు వేదసుతుని దరికి పరుగులెత్తిరి.

అత్తఱి నా రాజు విల్లు నమ్ములుదాల్చి భూమింగూర్చి బరువెత్తిన నామె పెఱగంది పారిపోయిన నాతడు వెంబడించి యామెం దఱుమజొచ్చెను. ఆమె పృథునికిం జడిసి లోకములవెంట బరువులు వెట్టి వెట్టి తానేగిన చోటనెల్ల యెట్టయెదుట ధనుర్భాణపాణియై జ్వతితాగ్నివలెనున్న యాఱనింగని అమరులకేని ఓర్వరాని వాడనికని దిక్కుతోపక యాతనినే శరణందెను. త్రిభువనపూజ్యయైన వసుంధర యంజలించి ”స్త్రీ”వధ ఆధర్మమని కానవే? నేను లేకుండ ప్రజానెట్లు ధరింతువు ? లోకములెల్ల నాయందున్నవి. నా చేతన యీ జగము ధరింపబడుచున్నది. నేనుపోయిన ప్రజలెల్లరు పొదురు. అది యెఱుంగుము. నీవు ప్రజా శ్రేయస్సు చేయనెంతువేని నను తుదముట్టింపదగదు. మరియు నొకమాటయు వినుము. నిరపాయమైన యుపాయమున సర్వ కార్యములు సిద్దించును. ఈ ప్రజల ధరింప నేనొక యుపాయము సెప్పెద వినుము. నన్ను సంహరించిన నీవు ప్రజలను బోషింపజాలవు. నేను నీకనుకూలనయ్యెద. కోపము ఉపసంహరింపుము. పశుపక్షులందేని అడుది అవధ్యురాలని యందురు. నీవు ధర్మమును వీడుటతగదు. అని పెక్కు విధముల పలికిన ధరిత్రి పలుకులాలించి మహామతి కావున యానృపతి కోపమును నిగ్రహించి వసుమతిం జూచి యిట్టనియె.

తనకుగాని యితరునికి గాని యెక్కనికి మాత్రము క్షేమముగల్గుటకు పెక్కుప్రాణులను సంహరించినవానికంతులేని పాపము గల్గును. ఏ యొక దుష్టుడు సంహరింపబడుట వలన పెక్కుమంది జీవుల సుఖమునందుదురో అట్టివాని సంహరించుటవలన పాతకము ఉపపాతకముననునేవియు గలుగవు. వసుంధరా ! నే చెప్పినట్లు జగద్ధితము సేయవేని నిన్ను పెక్కుమంది ప్రజలసేమము నిమిత్తమై ఇదిగో ఇపుడు సంహరించను. నాశాసనమునకు పెడమొగమయిన నిన్ను నాబాణముచే నిప్పుడు గూల్చి మెప్పుcగౌని ప్రజల గాపాడెదను. ధర్మశీలురకెల్ల నుత్తమురాలవు నీవు నా శాసనమునకు గట్టువడి ప్రజల బ్రతికింపుము. ప్రజాధారణమందు నీవు సమర్థురాలవు గద ! నాకు కుమార్తెవు గమ్ము. అపుడీభయంకరమైన బాణము నుపసంహరించెదను. అని రాజనెను.

అన వసుధ యిట్లనియె

ఇది యెల్ల నేనొనరించెదను. సంశయము లేదు. కాని నాకొక దూడను సంపాదించ యత్నింపుము. దాని మూలమున నేను పాలుచేపెదను. ఆదిగాక నన్ను మెట్టవల్లములు లేనట్లొనరింపుము. అపుడు నా చేపిన క్షీరము నలుమూలల సమముగా జాల్వారును. నావిని పృథుచక్రవర్తి ధనుష్కోటిచే వేలకొలది కొండలను మీదికి లేవగొట్టెను. ఇంతకుముందటి సృష్టియందు భూతలము విషమముగనుండెను. ఆయెగుడుదిగుడు నేలయందు పురములు గ్రామములను, విభాగమే లేకుండెను. పంటలు లేవు. గోరక్షణ లేదు. కృషి లేదు. వర్తకముదారి లేదు. సత్యానృతము (వాణిజ్యము) లేదు. లోభము లేదు. మత్సరము లేదు. వైవస్వతమనువు తరమట్లునడిచినది. ఇప్పుడు పృథుచక్రవర్తి మొదిలిదియెల్ల యేర్పడినది. ఎక్కడెక్కడ యీ ధరిత్రి సమముగ నుండిన నక్కడ ప్రజలు నివాసమేర్పరచcగొన గోరిరి. ఆనాటికి కందమూలము లాహారము. అది మిగుల కష్టజీవనమని విందుము. పృథువు స్వాయంభువ మనుపును దూడనొసరించి తన హస్తమే పాత్రముగ భూమిని పిదికెను. ఆపిదికిన క్షీరము సర్వసస్యస్వరూపము ఆ అన్నము చేతనే యీ నాటికిని ప్రజలు నుఖజీవనులగుచున్నారు. ఋష్యాదులు తమ తమ యాహారరూపమైన క్షీరమును తమతమ కభిమతమైన పాత్రములందు పిదుకుకొనిరి.

ఆక్రమ మిట్టిది

ఋషులకు సోముడు వత్సము (దూడ) దోగ్ధ(పిదుకువాడు) బృహస్పతి. క్షీరము తపోబ్రహ్మము పాత్రము ఛందోమయము దేవతల కింద్రుడు దూడ దోగ్ధ రవి, పాలు ఓజస్సు (తేజస్సు) పాత్రము కాంచనము. పితృదేవతలకు దూడ యముడు, దోగ్ధ అంతకుడు. పాలు సుధ (స్వధ). పాత్రము రాజతము (వెండిగిన్నె) నాగులకు తక్షకుడు దూడ దోగ్ధ ఐరావతుడను నాగుడు. క్షీరము విషము పాత్రము సొరకాయ. అసురులకు విరోచనుడు వత్సము (దూడ) దోగ్ధ మధువు. పాలు మాయామయము. పాత్ర ఆయసము ఇనుపగిన్నె (అయోమయము) యక్షులకు దూడ వైశ్రవణుడు. దోగ్ధ రజతనాభుడు. పాలు అంతర్ధానము పాత్ర. మట్టికుండ రాక్షసేంద్రులకు దూడ సుమాలి దోగ్ధ రజతనాభుడు, పాలు శోణితము (రక్తము) పాత్ర కపాలము. గంధర్వులకు దూడ చిత్రరథుడు పిదుకువాడు సురుచి పాలు సుగంధము. పాత్రపద్మము పర్వతములకు దూడ హిమనంతుడు దోగ్ధ మేరువు పాలు రత్నౌషధులు పాత్రము శైలము వృక్షములకు దూడ ప్లక్షము (జువ్వి) దోగ్ధ పుష్పించిన శాలము. వృద్ధి పాలు తెగిన కాలిన చోట మొలపించుశక్తియనునది. పాత్రము మోదుగాకుల దొన్నె (పాలాశ పత్రము) ఈ విధముగ నీధాత్రి నిజముగ ధాత్రియో (పాలిచ్చి పెంచెడి దాదియే) విధాత్రి (జీవనవిధాత్రి బ్రతుకుతెఱవు చూపెడి తల్లి) పావని. చరారచభూతములకు నిలుచు నాదరుపు. (యోని కారణము) సర్వ కామ దోగ్థ్రి సర్వసస్య ప్రరోహణి. ఆసముద్రపర్యంతయైన యీభూమి మధుకైటభుల మేదస్సుచే (మెదడుచే) మేదిని యన ప్రఖాతి గొన్నది. ఈ పేరు వేదవాదులు పెట్టినది. ఈ వల నీమె పృథునృపతికి కన్నకూతురయ్యెను గావున పృథివియను ఖ్యాతి గన్నది.

అతనిచే వసుంధర సువిభక్త యయినది సువిశోధిత యయి సస్యములుగనులు గల్గి, పురపట్టణ గ్రామాదులచే నిండుదనము సంతరించుకొన్నది. వైన్యరాజస్య చూడామణి యిట్టి అసామాన్య ప్రభావుడు రాజసత్తముడు, భూత – గ్రామములకెల్ల నమస్కరింపదగినవాడు.పూజింపనర్హుడు. వేదవేదాంగపారగులైన బ్రాహ్మణులకు గూడ పృథుచక్రవర్తి నమస్కార్యుడు. పార్థివత్వమును గోరు రాజుకు మహానుభావులకు ఆదిరాజుగ నభివంద్యుడు. ప్రతాపశాలి శ్రీపృథువు. విక్రమశీలురైన యోధులకు జయాక్షాంక్షలయిన వారికి యోధులకెల్ల ప్రథముడైన పృథువు వంద్యుడు. పృథుని ధ్యానించి – కీర్తించిన యోధుడు ఘోరమయిన సంగ్రామరంగము నుండి క్షేమముగ మరలి రాగల్గును వాణిజ్య వృత్తినను సరించు వైశ్యులకు విత్తసమృద్ధికై వృత్తిదాతయైన పృథువు వందనీయుడు. శుచివర్తనులై త్రివర్ణముల నుపచరించు శూద్రులకును పృథుచక్రవర్తి నమస్కారార్హుడు. దానవారు పరమ శ్రేయస్సు నందగలరు మహర్షులార ! మహానుభావులార! మఱియేమి వినదలతురు? సెలవిండు.

ఇది శ్రీ బ్రహ్మ మహాపురాణమునందు పృథుజన్మ మాహాత్మ్యకథన మను నాలుగవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment